Home వ్యాసాలు ఓ బాటసారి ఇది జీవిత రహదారి – పాట విశ్లేషణ

ఓ బాటసారి ఇది జీవిత రహదారి – పాట విశ్లేషణ

by Padmasri Chennojwala

(మే నెల రెండవ ఆదివారం ‘మదర్స్ డే ‘ ని పురస్కరించుకుని)

తాతినేని రామారావు
దర్శకత్వం వహించి, జి . బాబు నిర్మాతలుగా వ్యవహరించి ,1981 లో విడుదలైన ఇల్లాలు చిత్రం లోని పాట ఇది . ఆత్రేయ రచించి , జేసుదాస్ , శైలజ గార్లు గానం చేశారు .ముఖ్య తారాగణం శోభన్ బాబు జయసుధ శ్రీదేవి.

సద్గుణ సంపన్నుడైన భర్త ,ముద్దులొలికే బిడ్డ ,జీవితం సాఫీగా సాగడానికి అవసరమైనంత డబ్బు ఉన్నప్పటికీ ,ఆమె మనసు ఎండమావుల వెంట పరుగులు తీస్తుంది . ఫలితంగా ముగ్గురి జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి.

పల్లవి:

ఓ బాటసారి ఇది జీవిత రహదారి
ఎంత దూరమో ఏది అంతమో
ఎవరూ ఎరుగని దారి ఇది ఒకరికి సొంతం కాదు ఇది

ఆది అంతం తెలియని ఈ రహదారి పయనంలో ఎవ్వరికీ ఏది సొంతం కాదు . దీని లోతులు కనుగొనడం ఎవరివల్లా కాదు అని ఒకింత వైరాగ్యాన్ని వ్యక్తపరుస్తుంది (పల్లవి)

చరణం 1.
ఎవరు ఎవరికి తోడవుతారో ఎప్పుడెందుకు విడిపోతారో మమతను కాదని వెళతారో మనసే చాలని ఉంటారో ఎవ్వరి పయనం ఎందాకో అడగదు ఎవ్వరినీ బదులే దొరకదనీ

కలిసి ఉండటానికైనా , విడిపోవటానికైనా ఒక్క కారణం చాలు. ఆ కారణం వారి వారి ఆలోచనా విధానంపై , వారి వారి మనస్తత్వాలపై ఆధారపడి ఉంటుంది. ప్రేమాభిమానాల విలువ తెలియక ఒకరు వదులుకుంటే , ప్రపంచంలో అన్నిటికన్నా విలువైన సంపద ఏదైనా ఉందంటే అది ఒక్క ప్రేమే అని ఇంకొక స్త్రీ అతని జీవితంలోకి అడుగెట్టి శూన్యమైన అతని జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది. ఏ నిర్ణయానికైనా కారణం ఏమిటని ఈ రహదారి ప్రయాణం అడగక పోవడానికి కారణం ఆలోచించే కోణాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి. దీనికి ప్రయాణమే తప్ప కారణాలతో సంబంధం ఉండదు అని అభిప్రాయపడుతున్నారు.
చరణం 2:
కడుపు తీపికి రుజువేముంది అంతకుమించిన నిజమేముం
ది
కాయే చెట్టుకు బరువైతే చెట్టును భూమి మోస్తుందా ఇప్పుడు తప్పును తెలుసుకుని జరిగేదేమిటనీ క్షమించదెవ్వ రినీ

శుష్కమైన ఆనందాల వేటలో పడి మాతృత్వాన్ని కాలదన్నకున్న నిన్ను భూమాత క్షమిస్తుందా ? చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం ప్రయోజనం అని ప్రశ్నిస్తున్నారు.

మనిషి పూర్తి సుఖంగా బ్రతకలేక పోవడానికి కారణం తనకున్న దానిపై నిర్లక్ష్యం , లేని దానికోసం ఆరాటం అంటారు ప్రఖ్యాత తత్వవేత్త రియో

కథానాయిక తనకున్న పచ్చని పైరు లాంటి జీవితం విలువ తెలియక జీవితాన్ని చేజేతులా పాడు చేసుకుంటుంది.
పేగు బంధాన్ని బరువు అని తలచిన నిన్ను భూమాత ఎలా మోస్తుంది అనీ,జరగకూడని నష్టమంతా జరిగిపోయాక తప్పును తెలుసుకోవడం వల్ల ఫలితం శూన్యం అని వివరిస్తున్నారు.

చరణం 3:
తెంచుకుంటివి అనుబంధాన్ని పెంచుకున్నదొక హృదయం దాన్ని
అమ్మలిద్దరూ ఉంటారని అనుకోలేని పసివాణ్ణి బలవంతంగా తెచ్చుకుని తల్లివి కాగలవా తనయుడు కాగలడా

నవ మాసాల ఫలాన్ని నువ్వు కర్కశంగా , నిర్దాక్షిణ్యంగా వదులుకొని వెళితే ఆ అనుభూతి పరిమళాలేవీ ఆస్వాదించకపోయినా, కేవలం హృదయౌన్నత్యంతో ఆ పసిబిడ్డను గుండెకు హత్తుకున్న స్త్రీ ఎంతటి ప్రేమ మూర్తో , ఎంతటి అనురాగమూర్తో ఒకే ఒక పదంతో చెబుతున్నారు.

ప్రేమించే మనసు నీటి చెలిమి వంటిది . ఎన్ని నీళ్లు తోడుకున్నా ఇంకా ఇంకా ఊరుతూనే ఉంటాయి. నువ్వు ప్రేమను పంచినప్పుడే అవతలి వైపు నుండి పొందగలవు . అమ్మతనం గుండె లోతుల్లోంచి ఉప్పొంగాలే తప్ప బలవంతంగా తీసుకోవాలనుకుంటే దానివల్ల ప్రయోజనం శూన్యం అని చెబుతున్నారు.

చరణం 4 :

అడ్డదారిలో వచ్చావమ్మా అనుకోకుండా కలిశావమ్మా నెత్తురు పంచి ఇచ్చావు నిప్పును నువ్వే మింగావు ఆడదాని ఐశ్వర్యంమేమిటో ఇప్పుడు తెలిసిందీ కథ ముగిసే పోయింది.

జీవితం విలువ తెలియని నాడు , స్త్రీ యొక్క ఆనందం ఎందులో ఉంటుందనే విషయం అర్థం కాని రోజుల్లో, వదులుకున్న ఆనందాలని తిరిగి సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేసే నాటికే సమయం మించిపోయింది అని చెబుతున్నారు.

కథ మొత్తం ఈ ఒక్క పాటలోనే ఆవిష్కరింపబడిందా అన్నంతగా పదం పదం లో ఒదిగిన ఆర్ద్రత , నటీనటుల హావభావ వ్యక్తీకరణ ,శ్రోతలను అలరించగలిగిన అనేకంటే కదిలించగలిగిన గాయనీ గాయకుల ప్రతిభ, కాచి వడబోసిన జీవిత సత్యాలు , కుటుంబ విలువల గూర్చిన వివరణ , వాటిని భద్రంగా కాపాడుకోవాల్సిన అవసరం గూర్చి ఒక చక్కని సందేశాన్ని అందించారు. కథను ఆవిష్కరించడానికి రహదారిని వస్తువుగా ఎంచుకోవడం బస్సు ప్రయాణంలోసాగే నేపథ్యగానం అత్యంత వైవిద్యభరితంగా ఉంది.
చక్కని పాటను మనకందించిన అందరికీ అభినందనలు.

             పద్మశ్రీ చెన్నోజ్వల

You may also like

1 comment

Sreerekha Bakaraju June 20, 2023 - 6:26 pm

పద్మశ్రీగారు ఇల్లాలు చిత్రంలోని ఓ బాటసారి పాట ను చక్కగా విశ్లేషించారు. పాటలోని భావాన్ని స్పష్టంగా సంక్షిప్తంగా తెలియజేసారు. ఇలాంటి పాటల సమీక్షలు మీ నుండి కోరుతున్నాను.

Reply

Leave a Comment