Home కథలు కంచికి చేరని కథ

కంచికి చేరని కథ

by Sudharshan Chintapatla

బెంచీల మీదనుంచి లేచి వెళ్ళిపోయిన జంటల వెచ్చదనం ఇంకా అలాగే ఉంది. పొదలు తమ పక్కనే కూచుని మాట్లాడుకున్న ప్రేమికుల గుసగుసలు మననం చేసుకుంటున్నవి. పచ్చిక తన మీద నడచిన సున్నితమైన పాదాల స్పర్శను ఇంకా అనుభవిస్తూనే ఉంది.

చిల్లు బడ్డ డబ్బాలోంచి కారుతున్న తారులా చీకటి క్రమక్రమంగా వ్యాపిస్తున్నది. మసక వెలుతురులో బూరు మిఠాయి చుట్టిన కర్రల్లా కనిపించసాగాయి చెట్లు.

‘ఇంక వెళ్దామా?’ అన్నాడు ఐదడుగుల పది అంగుళాల పొడవైన బలమైన శరీరమూ, రింగుల జుట్టూ సన్నటి మీసం, వెడల్పాటి నుదురు ఓనర్.

‘అప్పుడేనా?’ అన్నది అతని కంటే నాలుగు ఇంచీలు పొడవు తక్కువ సున్నితమైన బంగారు రంగు దేహమూ, సన్నటి ముక్కు, అక్వేరియంలో కదిలే చేపల్లాంటి కళ్లు ధనుస్సులా తీర్చి దిద్దినట్టున్న పెదాల స్వంతదారు.

పోలీసు వ్యాన్ సైరన్ శబ్దానికి పారిపోయిన దొంగల్లా మాయమై పోయేయి నక్షత్రాలు. ఉన్నట్టుండి ఆకాశంలోకి తొండాలు ఎత్తి పట్టుకున్న ఏనుగుల గుంపు ఒకటి వచ్చి చేరింది.

‘లే…. లే… పార్కు మొత్తం ఖాళీ అయింది మనమే ఉన్నట్టున్నాం’ అన్నాడతను తన చేయి ఆమెకు అందిస్తూ.

అతని చేయి అందుకుని  పైకి లేచింది ఆమె. ఇద్దరూ పార్కు గేటు దాటారు. వీళ్ళు పార్కుకు రావడం మొదలు పెట్టి రెండేళ్ళాయింది అనుకుంది. గేటు పక్కన ఉన్నా బోగన్ విల్లా కాసిని ఎర్రపూలు ఆమె తలమీద రాలుస్తూ.

పార్క్ చేసిన బైక్ దగ్గరికి నడిచాడతను. ఆమె పరుగెత్తింది. ఇద్దరూ ఎక్కాక బైక్ చక్రాలు పరుగెత్తేయి.

*   *   *

గోడమీద గడియారంలో జంట ముళ్ళు తిరుగుతున్నాయి. దానికింద జంటగా ఓ టేబిలూ కుర్చీ ఉన్నాయి. కుర్చీలో ఎందరినో జంటలుగా కలిపిన సుదీర్ఘమైన అనుభవం వల్ల ఒక్క వెంట్రుకా మిగలక మైదానంగా మారిన బట్ట తల మోస్తున్న రిజిస్ట్రార్ ఉన్నాడు.

ఆయనకు ఎదురుగా కొత్త జంటలో ఒకడవ బోతున్న శంకర్ ఉన్నాడు. అతనికి ఎదురుగా పంచదార బొమ్మలాంటి రమ్య ఉంది. శంకర్ రమ్యల రిజిస్ట్రేషన్ పెళ్ళికి పదిమంది మిత్రులొచ్చారు. వాళ్ళల్లో ముగ్గురు అమ్మాయిలూ ఉన్నారు. జెయింట్ సైజు బౌండు రిజిష్టర్లో తెర్చుకున్న పేజీ వుంది. ఆ పేజీలో శంకర్ సంతకం చేశాడు. రమ్య సంతకం చేసింది. సాక్షులు సంతకం చేశారు. రెండు జతల సంతకాలతో ఒక జత జత అయింది. ఇద్దరూ మార్చుకున్న దండల్లో చిక్కుకున్న పూలు పరిమళాలు వెదజల్తాయి. స్నేహితులు అభినందించారు.

*   *   *

పార్కులో కల్సుకునే శంకర్ రమ్యలు అద్దె యింట్లో అడుగుపెట్టారు. కుడికాలు ముందు పెట్టి లోపలికి రామ్మా అనే వారు లేకపోయేరు. రెండు కుడి కాళ్ళు ముందుపెట్టి ఇద్దరూ అద్దె స్వర్గసీమలో అడుగుపెట్టారు. హాల్లో వెలిగిన ట్యూబ్ లైట్ వాళ్ళకు స్వాగతం పలికింది. వాళ్లు కన్న కలల్ని నిజం చెయ్యడానికి జీరోబల్బు వెలిగింది.

*   *   *

ప్రభాకరరావు ఒక బిజినెస్ మాగ్నెట్. ఆస్తీ అంతస్తూ డబ్బూ అన్నీ ఎక్కువే కనుక ఆయనకు మమకారం కన్నా అహంకారం ఎక్కవ. ఈ అహానికి అతని గొప్ప కులం కూడా ఓ కారణమే. ప్రభాకరరావుకి ఇద్దరు కూతుర్లు ఓ కొడుకు. కూతుర్లలో ఒకరి పేరు రమ్య.

రమ్య తక్కువ కులంవాడిని ఇష్టపడ్డం రహస్యంగా పెళ్ళాడ్డం తన దారి తను చూసుకోవడంతో ప్రభాకరరావు పరువు ప్రతిష్ట ప్రమాదంలో పడ్డవి. ఆస్తీ అంతస్తూ అడ్రసూ లేనివాడు అల్లుడవడం భరించలేకపోయేడు.  చీలిన పాము నాలుకల్లా ఎగసి పడుతున్న ఆగ్రహజ్వాలలు తనని దహిస్తుంటే ప్రతీకారం కోసం నిరీక్షణలో ఉన్నాడు. ఇంట్లోనే పట్టు చీరల షోరూము, జూయల్రీ షాపు ఉన్న తల్లి తల ఎక్కడ పెట్టుకోవాలా, నలుగురికీ మేం సమాధానం చెప్పుకోవాలా అని నిత్యం విచారించసాగింది.

*   *   *

శంకర్ తప్ప తనకు లోకంలో ఇంకెవ్వరూ లేరు అనుకుంది రమ్య. మొట్టమొదటిసారి శంకర్ ను చూసినప్పుడు ఆమె గుండ యిదివరకటి లయను వదిలేసి కొత్త రిథమ్ ను అందుకుంది. అది శంకర్ నే కోరుకుంది. ఆమెకు అతని మాట తీరు నచ్చింది. అభిప్రాయాలూ ఆలోచన్లూ బాగున్నాయనుకుంది. అతని సెన్నాఫ్ హ్యూమర్ కు ఫిదా అయింది.  అతనిలోని ప్రేమికుడు అయస్కాంతంలా ఆమెను తన దగ్గరికి లాక్కున్నాడు. అప్పుడామెకు ఆస్తీ అంతస్తూ కులమూ ఏవీ గుర్తుకు రాలేదు. పరువు కోసమే బ్రతికే తండ్రి మాటే మర్చిపోయింది. తను తన ఇంట్లో అనుభవించిన సుఖాల్ని, రిచ్ లైఫ్ ని ఆమె ప్రేమ కోసం త్యాగం చెయ్యవచ్చు ననుకుంది.

ఇప్పుడు రమ్యకు జీవితం అంటే యిదే అనిపిస్తున్నది.  ఒకటీ ఒకటీ కలిస్తే రెండు కాదు ఒకటే అనుకుంది. తన కాళ్ళకి బంగారు పట్టీల కంటే శంకర్ ఇష్టపడే గజ్జెల వెండి పట్టేలే విలువైన వనుకుంది. తన తండ్రి ఇంట్లో తోటలోని రకరకాల రంగురంగుల పూలకంటే కిటికీ అవతల పూలకుండీలోని పూలే అందంగా ఉన్నాయని ఫిక్సయిపోయింది.

శంకర్ రమ్యలు నెలల్ని రోజులుగా రోజుల్ని గంటలుగా గంటల్ని మధుర క్షణాలుగా ఒకరికి ఒకరుగా ఒకరి కళ్ళల్లో మరొకర్ని చూసుకుంటూ లైఫ్ ఈజ్ బ్యూటిఫులం అనుకుంటున్నారు.

కొడుకు తమకు చెప్పకపోతేనేం పట్నంలో ఉద్యోగం చేస్తూ తనకు నచ్చిన అమ్మాయిని  పెళ్లి చేసుకోవడం శంకర్ తల్లీ దండ్రులకు సంతోషాన్నే కలిగించింది.

కొడుకు సంసారాన్ని చూడటానికి సిటీకి వచ్చారిద్దరూ. వాళ్లను చూశాక కానీ రమ్యకు శంకర్ కులం గుర్తుకు రాలేదు. అతని కుటుంబ స్థాయి అర్థం కాలేదు. వాళ్లు వచ్చిననాడు రాత్రి తండ్రి కోసం ‘మందు’ అందులోకి చికెనూ తీసుకువచ్చాడు శంకర్. అప్పుడు తెలిసి వచ్చింది రమ్యకు శంకర్ ‘నాన్ వెజ్జీ’ అని మందు రుచి తెల్సినవాడని ఇన్నాళ్ళూ తన కోసం అదేమిటో ఎరుగని వాడిలా ఉన్నాడని.

గదిలో శంకర్ తల్లీ తండ్రీతో ఉన్న సమయంలో రమ్య బయట హాల్లో నుదుటి మీద మొలుచుకు వస్తున్న మూడవ కంటితో అసహనంగా కూచుంది. ఈ అసహనం, కోపం రమ్యలో అత్తామామ ఉన్నంతకాలమూ పెరుగుతూ పోయి వాళ్ళు వెల్ళిపోయాక ‘కంటిన్యూ’ అయింది.

ఇదివరకు శంకర్లో కనిపించని చెడ్డ లక్షణాలన్నీ ఇప్పుడు రమ్యకు ఒక్కటొక్కటిగా కనిపించసాగాయి. అతను మాట్లాడే భాషలో, తిండి తినే పద్ధతిలో శుచీ శుభ్రత పాటించే తీరులో తేడాలు ఆమెకు తన కళ్ళకు బిగించుకున్న భూతద్దంలో చాలా పెద్ద సైజులో కనిపించసాగాయి.

ఇద్దరూ కల్సి బయటకు వెళ్ళినప్పుడు డబ్బు ఖర్చు చేసేప్పుడు అతనిలో పిసినారి కనిపించాడు. తను ఔనన్నది కాదనడంలో అతనిలోని అజ్ఞాని దర్శనమిచ్చాడు. తక్కువ మార్కులతో డిగ్రీ పాసయినా అతనికి ప్రభుత్వ ఉద్యోగం రావడానికి రిజర్వేషన్ తప్ప మెరిట్ కారణం కాదని ఆమె అనుకోసాగింది.

కాలం గడుస్తున్న కొద్దీ ఆమెలో ప్రేమ గ్లోబల్ వార్మింగ్కి కరగి నీరైపోతున్న హిమాలయంగా మారింది. వెట్రోల్ కి మ్యాచ్ బాక్స్ మేచ్ అయినట్టు ఒకటి రెండు సార్లు శంకర్ ఫ్రెండ్స్ తో డ్రింక్ చేసి రావడంవల్ల జరిగిన వేడి వాదోపవాదాల కారణంగా ఆమెను తను శంకర్ ని చూడ్డానికి ముందు ఉన్న రమ్య క్రమక్రమంగా ఆక్రమించసాగింది.

*   *   *

ఒక సాయంత్రం శంకర్ ఆఫీసు నుంచి ఇంటికి రాగానే నవ్వుతూ ఎదురొచ్చింది రమ్య. అమావాస్యనాడు పొరపాటున చంద్రుడు ఆకాశంలోకి వచ్చాడే అనుకున్నాడు శంకర్. కాఫీ అందిస్తూ దేవతలకు అమృతం పంచిన మోహినిలా కనిపించింది.

ఇక నుండి తను జాగ్రత్తగా ఉండాలని రమ్యకు కోపం తెప్పించకూడదని అనుకున్నాడు శంకర్.

ఇద్దరూ భోజనం చేస్తున్నప్పుడు అంది రమ్య.

‘మా అక్కయ్య ఫోన్ చేసింది’ ఉలిక్కి పడ్డాడు శంకర్. ఉలిక్కి పడ్డ శంకర్ మాట్లాడకుండా రమ్యవైపు చూశాడు.

‘అమ్మ కూడా మాట్లాడింది’

అవునా అన్నట్టు చూశాడు కళ్ళు ఎత్తి మనసులో రకరకాల ఆలోచన్లు ముళ్ళల్లా గుచ్చుకుంటుటే.

‘తమ్ముడి పెళ్లి వారం రోజుల్లో మనిద్దర్నీ రమ్మన్నారు. వాళ్లకు మన మీద కోపం పోయినట్టుంది. డాడీ కూడా చెప్పమన్నారట. వెళ్దాం ప్లీజ్ అంది రమ్య చేతిలో ఉన్న అన్నం ముద్దని అలాగే పట్టుకుని తాము పార్కులో కలిసే రోజుల్లో అతనివైపు చూసిన చూపుల్ని రిపీట్ చేస్తూ అంత సడన్ గా ఆమె చెప్పింది వినడానికి అతను సిద్ధంగా లేడు. కానీ ఆమె అడిగింది కాదన లేడు. కాసేపు సీలింగ్ ఫ్యాన్ కేసి చూశాడు. అది తనలోపల జొరబడి గిర్రున తిరుగుతున్నట్టు అనిపించింది. ఇన్నాళ్లకు వాళ్లు ఫోన్ చెయ్యడం ఏమిటో అర్థం కాలేదు. కులం కన్నా కూతురు  ముఖ్యం  అనుకున్నారేమో. ఆస్తికన్నా అమ్మాయి మీది ప్రేమ ఎక్కువనిపించిందేమో అనుకున్నాడు.

‘నీకు వెళ్లాలని ఉందా?’ అన్నాడు చివరికి కంచం అంచుమీద చేయి ఆనించి.

‘చెప్పాను కదా. వాళ్ళ కోపం పోయింది. మనల్ని తమ వాళ్ళు అనుకుంటున్నారు. ఇంతకంటే కావల్సిందేముంది’ అందామె ఎడమచేతిని సుతారంగా అతని భుజం మీద వేస్తూ.

ఆ వేళ్ళ కొసలు భుజంలోకి ట్రాన్స్ ఫామ్ చేస్తున్న విద్యుత్ షాక్ ను తట్టుకుంటూ

సరే! నీ ఇష్టం వెళ్ళాలనుకుంటే నువ్వు రేపే వెళ్ళు. నన్ను రమ్మని ఫోర్స్ చెయ్యకు అన్నాడు. ఇద్దరి మధ్య ఈ విషయం మీద సుహృద్భావ చర్చ జరిగింది. రమ్య తను వెళ్తానని ముందు ముందు అతనూ రావల్సి ఉంటుందని అన్నది.

*   *   *

తమ్ముడి పెళ్ళికి వారం రోజుల ముందే తను  దాటిపోయిన గడపలోకి మళ్ళీ వచ్చింది రమ్య. అక్కడ ఎవ్వరిలోనూ ఏదో జరిగి పోయిందనే భావన కనిపించలేదు. ఎప్పటి లాగానే మాట్లాడారందరు. తండ్రి ఎదుట పడలేదు కానీ చిన్నాన్న మాటి మాటికీ ఎదుట పడసాగాడు. కొందరు యే విషయాన్నైనా సరదాగా ప్రస్తావిస్తారు. గుచ్చినట్టు తెలీకుండానే సూది గుచ్చేస్తారు. అలాంటి వాడే రమ్య చిన్నాన్న. రమ్యకు తెలీకుండానే ఆమె బ్రెయిన్ వాష్ చేసే పని మొదలు పెట్టాడు. అనుకోకుండా అన్నట్టుగా వివిధ కులాల మనుషుల మనస్తత్వం మ్యాపుగీశాడు. కులాంతర వివాహాల వల్ల వచ్చే కష్టనష్టాల్ని తూకం వేసి చెప్పాడు. ఒకసారి దేశంలో పెరుగుతున్న పరువు హత్యల గురించి, మరోసారి రాష్ట్రంలో జరుగుతున్న దుస్సంఘటనల గురించి వివరించాడు.

అసలు డబ్బు ఉన్న వాళ్లందరిదీ కులరహిత సమాజమని డబ్బు మాత్రమే కులాల ఎక్కువతక్కువల్ని బ్యాలెన్సు చేసే మహామంత్రమని సెలవిచ్చాడు. విన్నా వినకపోయినా చెబుతూనే వుంటాడని చిన్నాన్న మనస్తత్త్వం తెల్సిన రమ్య కొన్నిసార్లు విన్నది. కొన్నిమార్లు విన్నట్టు నటించింది. ఏది ఏమైనా చిన్నాన్న మాటల్లో కొన్ని రమ్య మెదడు అడుగు భాగం దాకా వెళ్లి పోయేయి.

పొగ త్రాగడం ఆరోగ్యానికి ఎంత హానికరమో పోలిక కూడా అంత హానికరమైనదే. అది రమ్య తన ఇంటికి వచ్చిన రెండవ నాటి నుంచే చాపకింద నీరులా మొదలైంది. గదిలో కప్ బోర్డులో తన దుస్తులు, బాక్స్ లో తండ్రి తన కోసం అపురూపంగా చేయించిన నగలు చూస్తున్నప్పుడు ఆమె మనోసముద్రంలో వాయుగుండం ఏర్పడింది. తమ్ముడి పెళ్లి సందర్భంగా జరుగుతున్న సెలిబ్రేషన్స్, విందు వినోదాల వల్ల, పడవ కారులో వెళ్లి తను చేస్తున్న షాపింగ్ల వల్ల అది మరింత బలపడింది. రమ్య తను శంకర్ తో గడుపుతున్న జీవితాన్ని ఇక్కడి జీవితాన్ని పోల్చి చూసుకోవడంతో తుపానుగా మారింది. ఎన్ని సంవత్సరాలయినా తాము ఇలాంటి జీవనం గడపలేము అని అనుకుంది. మొట్టమొదటిసారి తను లోతు తెలియని నీటిలో దిగేశానా అని ‘బ్లైండ్ ఎండ్’ ఉన్న రోడ్డులో నడిచానా అని అనుకుంది.

పెళ్లికి వచ్చిన చుట్టాల్లో మేనత్త కూతురు నళిని రమ్యకు పెళ్లి పట్ల ఉన్న నిబద్ధత వెన్ను విరిచేసింది. ప్రేమించిన వాడితో వెళ్లిపోయి ఈ మధ్యే ఇంటికి తిరిగి వచ్చి తమ స్టేటస్ కు తగినవాణ్ణి మళ్లీ పెళ్లి చేసుకున్న నళిని భర్తతో కలసి పెళ్ళికి వచ్చింది. తండ్రి తలుచుకుంటే షాపులో ఖరీదయిన బొమ్మని కొనిచ్చినట్టు తనకు ఓ కుర్రాణ్ణి కొనియివ్వగలడు అన్న వేరు పురుగు ఆమె ఒంట్లో ప్రవేశించింది.

*   *   *

పెళ్లి అయిన మర్నాడు రమ్యకు ఫోన్ చేశాడు శంకర్. ఇన్నాళ్ళూ ఆమె బిజీగా ఉంటుందని గొంతుక విన వస్తుందని అనుకున్నాడు, చెవులు రిక్కించాడు కాని ఆమె ఫోన్ ఎత్త లేదు. మరో గంట ఆగి మళ్ళీ ఫోన్ చేశాడు. ఈసారి కూడా అతని చెవి నిరాశ పడాల్సి వచ్చింది. రమ్య ఫోన్ స్పిచ్ ఆఫ్ అని తెల్సింది.

రెండు గంటల తర్వాత మరో నాలుగు సార్లు ఫోన్ చేసిన తర్వాత పరిస్థితిలో మార్పు లేకపోవడంతో దిగులు పడ్డాడు. ఏం జరిగిందోనని భయపడ్డాడు.

పెళ్లి హడావిడి తగ్గాక రమ్య గదిలోకి వచ్చి తల్లీ దండ్రీ చాలాసేపు మాట్లాడారు. తండ్రి అంత ప్రేమగా మాటాడ్డం రమ్యకు ఎంతో ధైర్యాన్ని కలిగించింది. వాళ్ళు గదిలోంచి వెళ్ళిపోయాక రమ్య సెల్ ఫోన్ లో ఉన్న సిమ్ కార్డు కిటికీలోంచి బయటకు విసిరేయబడింది.

మళ్లీ మళ్లీ ఫోన్ చేశాడు శంకర్. ఈ నంబర్ తో యే ఫోనూ పనిచేయడం లేదు అని అనేకసార్లు విన్నాక ఒక నిశ్చయానికి వచ్చాడు శంకర్.

*   *   *

సెక్యూరిటీ వాళ్లు అరగంట గేటు దగ్గర ఆపి లోపలికి పంపించారు శంకర్ ని. ఇంటి ముందు లాన్ లో కూర్చోమన్నారెవరో.

ఏ వైపు నించైనా రమ్య కనిపిస్తుందేమో నన్న ఆశతో భవనం వైపు చూస్తూ కూచోవడం వల్ల తన ఎదురుగ్గా వచ్చి కూచున్న మనిషిని చూడలేదు శంకర్.

తను రమ్య చిన్నాన్నానని పరిచయం చేసుకున్నాడు ప్రకాశ్ రావు. రమ్య నాన్నగారు బిజీగా ఉండటంవల్ల తను రావాల్సి వచ్చింది అన్నాడు. ఆయనకు కాస్త దూరంలో నలుగురు బౌన్సర్లు నిలబడి ఉండటం గమనించాడు శంకర్.

శంకర్ ముఖం కొద్దిగా ఎర్రబడింది. ప్రకాశ్ రావు చిరునవ్వు విసిరాడు.

అన్నయ్య నీ మీద చాలా కోపంగా ఉన్నాడు.  కులం తక్కువవాడివైనా మా స్థాయికి యే మాత్రం సరిపోనివాడివైనా అన్నయ్య మంచివాడు కనక నిన్ను క్షమించాడు…. లేకపోతే… వాక్యాన్ని అసంపూర్ణంగా వదిలేశాడు ప్రకాశరావు.

శంకర్ కు కోపం లోపల్నించి తన్నుకు వస్తున్నది. రమ్య ఒక్కసారి బయటకు వస్తే బాగుండేది. ఏమైనా చేసి ఉండేవాడిని అనుకున్నాడు.

ఆ మాటే అన్నాడు.

‘ఒకసారి రమ్యను పిలుస్తారా మాట్లాడాలి’

రమ్య నీతో మాట్లాడదు. నువ్వు జరిగిందంతా మరచిపోవటం మంచిది.

‘మాకు ఇలాంటివి కొత్తేం కాదు. మా పరువునీ, ప్రతిష్టనీ ఎలా నిలబెట్టుకోవాలో మాకు తెలుసు’ అంటూ వెనక్కి తిరిగి ఇంటివైపు నడిచాడు ప్రకాశంరావు.

మొదలు నరికిన చెట్టులా కూలి పోయాడు శంకర్.

శంకర్ దీనస్థితిని చూడలేక ఆకాశంలో నక్షత్రాలు కనపడకుండా పోయాయి.

చిల్లు పడ్డ డబ్బాలోంచి కారుతున్న తారులాంటి చీకటి శంకర్ ముఖాన్ని కప్పేసింది.

You may also like

Leave a Comment