కథాపంచకం

by Dr. Lakshmanacharyulu M
  1. వైమనస్యం

సామాన్యంగా నేను చాలా తక్కువగానే మాట్లడతాను. చెడు మంచి గురించి వాటిని ఎత్తి చూపడం గురించీ మాట్లాడను. నలుగురితో కలివిడిగా కూడా ఉండను. అలా దూరం దూరంగా ఉండడంలోనే నాకానందం కలుగుతంది.

నిన్ననే జరిగిన సంఘటన. మా ఆవిడతో కలసి జమునాదాస్ గారింటికి వెళ్ళా. పలకరింపులయ్యాయి. కొద్దిసేపయ్యాక, ఆ వీధిలో ఎవరున్నారు, వారెలాంటివారు అనే విషయంపై మా చర్చ నడిచింది. ఇదిగో, ఇదే నాకు చిరాకు తెప్పించే విషయం. ఎలాగో, ముళ్ళమీద కూర్చున్నట్టుగా అలా కూర్చుని వాళ్ల మాటలు వింటున్నా.

మాటల్లో ఓ పెద్ద మనిషి బిహారీ బాబు గురించిన ప్రసక్తి వచ్చింది. జమునాదాస్ ఆయన్ని జోడింపచేస్తూ, నానా మాటలూ అన్నాడు. చివరికి…. “మర్యాద – మన్నన, సత్ప్రవర్తన లాంటివేమీ ఆయనకి తెలీవు. ఎప్పుడు పలకరించినా మేం తెలియనట్టుగానే మొహం పెడతాడు. ‘నమస్తే’కి జవాబు కూడా ఇవ్వడు. రాత్రిళ్ళైతే మనిషే కనబడదు. బహుశా ఇంట్లో ‘ముందు’ సేవిస్తూ ఉంటాడేమో మరి.”

తర్వాత నావైపు తిరిగి – “మీరేమంటారు, డాక్టరుగారూ!” అని అన్నాడు.

ఇక నాకు మాట్లాడడం తప్పనిసరై. “బిహారీబాబు ఓ పెద్ద మనిషి, మంచి మనిషి. రాత్రిళ్లు ఆయనకి సరిగ్గా కనపడదు. ఆయనకి విటమిన్ ‘ఏ’ లోపం ఉంది. నా దగ్గర వైద్యం చేయించుకుంటూ ఉన్నాడు. కొద్దిరోజుల్లో నయం అవుతుంది” అని అన్నాను. అంతే!! అక్కడివారి కబుర్లు మరొకరిని విమర్శించడంవైపుకి మళ్ళాయి.

2. ఏరుదాటాక….

ప్రొఫెసర్ మనోహర్ గారి ప్రక్క నుండి అలా వెళ్ళిపోయింది రేణు. ఓ ‘నమస్తే’ లేదు, ఓ ‘హలో’ లేదు. ప్రొఫెసర్ కి ఇది నచ్చలేదు. బాధ కూడా కలిగింది. ఆమె ఆయన విషయానికే చెందిన ఒక పరిశోధక విద్యార్థిని. ఆయన దగ్గరకు పరిశోధనకి సంబంధించి అవసరం ఏర్పడితే వస్తూ ఉండేది. బహుశా తను నన్ను గమనించలేదేమో అని అనుకున్నాడు. సరే అనుకుని లేచి ఆమె దగ్గరకు వెళ్లి – “నమస్తే! రేణూ! ఎలా ఉన్నావ్?” ప్రశ్నించాడాయన.

రేణు నమస్కరిస్తూ – “క్షమించండి! నాక్కొంచెం పని ఉంది” అని చెప్పి ఆమె జారుకుంది. అయినా ప్రొఫెసర్ గారు తన పట్టు వదల్లేదు. ఆయన రేణు వెనకే వెళ్ళాడు. అసలు ఈ రేణు, ఆ రేణేనా? “సర్! మీరు జీనియస్!” అంటూ తెగపగడుతూ ఉండేది. ఇవాళ అదే రేణు ఇలా ప్రవర్తిస్తున్నది. ఇలా అనుకుంటూ ప్రొఫెసర్ నడుస్తూ ఉంటే ఓ గది లోంచి రేణు తన స్నేహితురాల్తో – “ఆ ముసలోడు నా వెంట పడుతూ ఉన్నాడే? వదల్టంలేదు. నా మంచి ఏంకోరుకుంటున్నాడో మరి?”

“ఒకప్పుడు నువ్వాయిన్ని తెగ పొగిడేదానివి కదే!” అడిగింది స్నేహితురాలు.

“అప్పటిసంగతే వేరు.  అప్పుడు నాకు పరిశోధనలో సహాయం అవసరం. ఇప్పుడా థీసిస్ చాలావరకూ పూర్తి అయింది. ఇక ఆయనతో నాకేం పని?”

3. వ్యామోహం

ఇవ్వాళ బహుశా అన్నిటికన్నా క్రికెట్ కే చాలా పేరు, ఆకర్షణా ఉన్నాయి. ఆట అర్థం అయినా కాకపోయినా, ఆ ఆటలో ఆసక్తి చూపించటమే ఒక ఆకర్షణ, అభిరుచి. సందులు – గొందుల్లోను, ఆఫీసులోను, అంతెందుకు, స్నానం చేసేటప్పుడూ ఆ ఆటంటే చెవి కోసుకునేవాళ్ళు కామెంట్రీ వింటూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. అయితే రామ్ దయాళ్ గారు వీటన్నిటికీ మినహాయింపు అనే చెప్పాలి.  ఆయనకి ఈ వ్యామోహం అంటే అస్సలు పడదు. “క్రికెట్ మన కాలాన్ని వృథా చేస్తే, ఈ కామెంట్రీ అనేది ఇంకా, ఇంకా మన సమయాన్ని నష్టపరుస్తుందని” ఆయన ఎప్పుడూ అంటూ ఉంటాడు.

ఒక రోజున ఏమైందంటే…. రామ్ దయాళ్ గారు తన ఆఫీసుకి వెళ్లే హడావుడిలో ఉన్నారు. ఇంతలో ట్రాన్సిస్టర్ రొద వినబడింది. అంతే! ఆయనగారి ‘మోడ్’ ఖరాబైపోయింది. “ఇదేమన్నా కామెట్రి వినే టైమా? చదువూ సంధ్యా ఉండదు. రేడియో మాత్రం తప్పకుండా ఉండాలి. ఆ పిచ్చి కామెంట్రీ కట్టెయ్!”

ఆ రోజున ఆయన అందరిమీద ‘అక్షింత వేసాడు’. పిల్లల్ని కూడా ఆయన వదల్లేదు. అందరూ పాపం బిక్క మొహాలతో తమ చదువు సంధ్యల్లో మునిగిపోయారు.

దడదడా రామదయాళ్ గారు ఇంట్లోంచి బయటకు వచ్చేసారు. తరువాత స్కూటరెక్కి బయటికి వచ్చేసి, ఎవ్వరూ లేని ఒక మారుమూల ప్రదేశంలో బండి పార్క్ చేసి, తన జేబులోంచి ప్యాకెట్ సైజ్ ట్రాన్సిస్టర్ బయటకు తీసి, స్కూటర్ పైన విశ్రాంతిగా కూర్చొని ఎంతో ఆసక్తితో క్రికెట్ కామెంట్రీ వినసాగారు.

4. మత్తు – చిత్తు

“ఎన్నోసార్లు నేను వద్దని చెప్పా, వేలసార్లు నచ్చ చెప్పా, కాని వాడి బుర్రలో ఏమన్నా ఎక్కితేగా? అసలు ఇలా చేసే వయసా వాడిది.”

దీనానాథ్ నాకో సెంటర్లో కనబడ్డారు. ‘కొత్త బజారు’ లోని ఆ సెంటరు ఇలాంటివాటికి బాగా పేరుపడింది. ఇక్కడ ఒక హెయిర్ కటింగ్ సెలూన్, హల్వా దుకాణం, పూలదుకాణం ఇలా అన్ని రకాల దుకాణాలు ఉన్నాయి. జనం తమకి కావల్సిన సామాన్లు కొనుక్కోడానికి వస్తూ ఉంటారు. అలాల వచ్చినవాళ్ళ పరస్పరం పిచ్చాపాటీ మాట్లాడుకుంటారు, కుశల ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు.

దీనానాథ్ నిట్టూరుస్తూ – “ఆ దేవుడి లాంటి కొడుకుని ఎవరికీ ఇవ్వకూడదు. పట్టుమని పదిహేడేళ్ళుంటాయేమో! కాని, చేపలా మందు తాగుతూ ఉంటాడు. ఎంతగా చెప్పినా వినడం లేదు. నేను మందు త్రాగొద్దని చెప్పను. కాని ఇంత చిన్న వయసులో ఇంతలా త్రాగడం అనేది బుద్ధుండి చేసే పనేనా?”

చిట్టచివరి వాక్యం వినగానే నాకెందుకో అనుమానం వచ్చింది. నేను దీనానాథుణ్ణి పరీక్షగా చూస్తా, కొంచెం దగ్గరగా జరిగి వాసన పీల్చా. అంతే!! ఆయన మత్తులో బాగా చిత్తై ఉన్నాడు.

5. బేరం

ఈ కథ ఏ కాలానికి చెందినదైనా కావచ్చు. అంటే జరిగిపోయిన కాలానికి, జరుగుతున్న కాలానికి, అలాగే జరగబోయే కాలానికి కూడా సంబంధించినది కావచ్చు.

ప్రతిదేశానికి రక్షణ వ్యవస్థ అంటూ ఉంటుంది. ఈ కథలోని కాల్పనిక దేశానికి కూడా ఒక రక్షణ వ్యవస్థ ఉన్నది. ప్రతి దేశంలో పెద్ద పెద్ద అధికారులున్నట్టే ఈ దేశంలో కూడా నేరాలు జరుగుతాయి.

మన కాల్పనిక దేశానికి చెందిన ఒక సజ్జనుడు నేరాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఆయన కూతుర్ని ఎవరో అపహరించుకుపోయారు. నేరం చాలా తీవ్రమైనది. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా సన్నద్ధమైంది.

ఎలాగో అలా చివరికి అమ్మాయి దొరికింది. కాని…అపహరించినవారు దొరకలేదు. చివరికి రక్షణ యంత్రాంగం ఒక వ్యక్తిని అరెస్టు చేసింది. పోలీసు అధికారి అతణ్ణి చూస్తూ – “నీకు రోజుకి యాభై రూపాయలు దొరుకుతాయి. ఏడు రోజుల్లో ఈ వ్యవహారమంతా చల్లబడిపోయింది. నిన్ను విడిపించే బాధ్యత మాది సరేనా?” అని అన్నాడు.

ఆ వ్యక్తి పేదవాడు, నవ్వుతూ – “అయ్యా! నన్నువిడిపించొద్దు. ఈ యాభై రూపాయల రేటుమీద నేను జీవితాంతం జైల్లో ఉండగలను. నేనిలా లోపల ఉన్నా నా కుటుంబం బయట హాయిగా ఉండగలుగుతుంది” అని అన్నాడు.

You may also like

Leave a Comment