మార్పు
నూతనంగా నిర్మించబడిన ఆ దేవాలయం దగ్గర భక్తులు చాలామందే ఉన్నారు. అంతా ఎంతో భక్తిభావంతో దేవుడికి వంగి వంగి నమస్కారాలు చేస్తూ తమ అభీష్టాలు తీర్చమంటూ వేడుకుంటున్నారు. ప్రతిరోజూ అక్కడ భక్తులంతా పెద్ద సంఖ్యలో చేరుకుంటూ అర్చనలు, ఆరాధనలు చేస్తున్నారు.
సేఠ్ దీనదయాళ్ గారు ఈ దేవాలయం నిర్మించారు. ఆయన లాంటి మహా పిసినారి, పాపాత్ముడు అసలు ఒక దేవాలయం నిర్మించడమే ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. “ఇక నా స్థానం భగవంతుని చరణాల చెంతనే. రోజూ రాత్రి 7 గంటల తర్వాత దేవాలయంలోనే కూర్చుంటా” అని ఆయన అందరితో చెప్పాడు.
సేఠ్ తో నాకున్న పరిచయం ఇప్పటిది కాదు. ఆయన నాకు పాత స్నేహితుడే. అతనిలో మార్పుని చూసిన నేను ఉండబట్టలేక ఓ రోజున అతనిలోని ఈ మార్పుకి కారణం అడిగా – దానికి ఆయన గంభీర స్వరంతో – “జీవితమంతా నా ఇష్టమొచ్చినట్టు బ్రతికాను. ప్రజల్ని ఇష్టమొచ్చినట్టుగా త్రొక్కుకుంటూ పోయా. ఈ మధ్య కొన్ని రోజులుగా జనం ఎందుకో నాకు దూరం అవుతున్నట్టు, నన్ను దూరం పెడుతున్నట్టనిపించింది. ఆలోచించాను. ఇదిగో! ఇలా చేశాను. పగలంతా పూర్వంలాగానే వ్యాపారం ద్వారా సొమ్ములు పాత పద్ధతిలోనే సంపాదించుకుంటూ ఇక రాత్రి వెళ్ళి గుళ్ళో కూర్చుంటా. అప్పుడు ప్రజలు కేవలం దేవుడికే కాదు, నాకూ – అంటే ఈ సేఠ్ దీనదయాళంకి కూడా – వంగి, దణ్ణాలు పెడతాడు. ఇలా ప్రాణాల్తో ఉండగానే నేను స్వర్గసుఖాల్ని అనుభవిస్తా” అని అంటంటే విని నేను తెల్లబోయాను.
***
విగ్రహం
నేనొక శిల్పిని. ఒకరోజున సీతారామ్ నా దగ్గరకొచ్చి తన మనసులో ఉన్న మాట చెప్పాడు. సరే, నేను నా మిత్రుడి కోర్కె తీర్చాలని అనుకున్న, సీతారాముణ్ణి అభిమానించ వారితో మాట్లాడాను. సరే, మాటలు చేతల రూపం దాల్చాయి. ఆయన విగ్రహం ఒకటి పెట్టాలని నిర్ణయించడం జరిగింది. శిల్పం చెక్కించే పని మొదలైంది.
చివరికి సీతారామం తను బ్రతికుండగానే తన కోరిక – అదేనండీ – తన విగ్రహ నిర్మాణం, స్థాపన – రెండూ చూసుకున్నాడు. ఆనందించాడు. ఇది జరిగిన కొద్దిరోజుల తర్వాత ఆయన కాలధర్మం చెందాడు.
ఓ రోజున సీతారామ్ నా కలలోకి వచ్చి ఎంతో బాధపడుతూ – “మిత్రమా! ఆ విగ్రహం కారణంగా నేను చాలా బాధపడుతూన్నానోయ్! విగ్రహం ఏర్పాటైన కొద్దిరోజులు బాగానే ఉంది కాని… ఇప్పుడే చాలా బాధగా, అవమానంగా ఉందోయ్! ఎంతైనా బొమ్మ, బొమ్మే కద! అది ఎప్పటికీ ప్రాణం పోసుకోలేదు. అవునా! ప్రస్తుతం కేవలం అది పశువులకి, పక్షులకీ ఆశ్రయం కలిపిస్తోంది, ఆనందం అందిస్తోంది! ప్చ్’’
అదిగో! అప్పట్నించే నాకూ చాలా బాధ కలిగింది. నా మిత్రుడి శిలావిగ్రహం చూసి చూసి బాధపడుతున్నా. ఇలా విగ్రహస్థాపన జరగడం అతడికీ అవమానమే, నా కళకి కూడా అవమానమే. కాని….ఏం చేస్తాం! ఆ విగ్రహం లాగా నేను కూడా వివశుణ్ణే, మరో దారి లేదు మరి!
* *
చీవాట్లు
గోపాల్ గోపాలస్వామి పరువు ఇవాళ గంగలో కలిసిపోయింది. జూదం ఆడుతూ వాడు పట్టుబడ్డాడు. వాళ్ళమ్మ నాన్నలు వాడి ముందు కూర్చుని గద్దిస్తున్నారు, చీవాట్లు పెడుతున్నారు.
డా. హరీష్ గోపాల్ వాళ్ళ నాన్నగారు. నగరంలో ఆయన ఒక గొప్ప పేరున్న డాక్టరు. సామాన్యంగా ఆయన మౌనంగానే ఉంటారు. కాని తిట్టవలసిన, చీవాట్లు పెట్టవలసిన అవసరం పడితే, ఇక అంతే! అలా తిడుతూనే ఉంటారు. ఓసారి గోపాలంతో – “చూడు! గోపాల్! నీ సంగతేంటో నాకేమీ అర్థం కావడం లేదు. నీ చదువేంటో నాకేమీ బోధపడడం లేదు. ఎప్పుడూ ఏదో గొడవ చేస్తూనే ఉంటావ్. మా తరంలో ఇలా ఉండేది కాదురా! వళ్ళోంచి చదివేవాళ్ళం. చదువు తప్ప నువ్వు చెయ్యడానికి మరో పని ఏముంటుందసలు? దాంట్లో నువ్వు జీరోవే కదా! పైగా… ఇలాంటి చెడు వ్యసనాలు, దురలవాట్లు….”
ఇప్పుడు గోపాల్ వాళ్ళమ్మ వంతు వచ్చింది. ఆమె కూడా నగరంలో బాగా పేరున్న స్త్రీల వ్యాధుల నిపుణురాలు. శ్రీమతి మాల అంటే చాలామందికి తెలుసు. గొప్ప మాట కారి, తిట్టడంలోనైతే చాలా నైపుణ్యం ఉంది. ఇక ఆమె మొదలుపెట్టంది – “చూడు! నువ్వు మాకు ఒకే ఒక్క సంతానం. నీ కోసమని నేను మీ నాన్నగారు ఎన్నో త్యాగాలు చేసాం. ఎన్నో వదులుకున్నాం. ఈ భవనం, ఈ డబ్బు, వైభోగం, అంతా నీదే కద! పొద్దుట్నుంచీ రాత్రివరకూ మేం పడుతున్న శ్రమ కేవలం నీ కోసమే కద! మరెందుకని నువ్విలా జూదం ఆడడం లాంటి చెడు వ్యసనాలు మరిగావ్?” అని అన్నది.
గోపాల్ మౌనంగా వింటున్నాడు వాళ్ల మాటల్ని. అసలేం మాట్లాడతాడు వాడు? అమ్మా నాన్న లంటే చచ్చేంత భయం. అలా తలొంచుకుని మౌనంగా వింటూనే ఉన్నాడు. అటు వాళ్ళమ్మా నాన్నల తిట్లూ చీవాట్లు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇక వాళ్ళిద్దరూ కలిసి ఒక్కసారిగా అందుకున్నారు –
“చెప్పరా! నీకేం తక్కువైందని ఇలా జూదం, పేకాటలు మొదలుపెట్టావ్? అసలు జీవితంలో నీకేం తక్కువైందిరా? మేం నీకివ్వనిదంటూ ఏముందిరా? చెప్పు ఇంకా ఏం కావాలి?”
ఇక గోపాల్ ఉండబట్టలేక ఏదన్నా మాట్లాడాలనుకున్నాడు. మెల్లగా నోరు తెరిచి – “అవును! నాకు జీవితంలో అన్నీ ఇచ్చారు. అయితే మీ తీరికలేని జీవితంలో నాకు కేవలం రెండే రెండు కావాలి? ఇస్తారా?”
అమ్మ నాన్నలిద్దరూ ఒక్కసారిగా – “ఏం కావాలి నీకు?” అని అన్నారు ఆశ్చర్యంగా.
నాకు – – నాకు కావాల్సినవి…. ఒకటి నాతో గడపడానికి కొంత సమయం… అలాగే కొంచెం ప్రేమ. అంతే!” అని అన్నాడు. గోపాల్ కళ్ళంలో కన్నీళ్ళు చిప్పిల్లాయి.
ఫ్రేమ్
రోజులాగానే ఇవాళ కూడా శివచరణ్ పనిలోకి వెళ్తుండగా హఠాత్తుగా గుండెలో తీవ్రంగా నొప్పి వచ్చింది. ఆయన్ని వెంటనే పక్కమీద పడుకోబెట్టి ఏవో ఉపచారాలు, చేసినా ఫలితం లభించలేదు. పదిహేను నిముషాల్లోనే పాపం! ఆయన ఆ బాధ పట్టుకోలేక కన్నుమూసాడు.
అంతే! అప్పటిదాకా నవ్వుల్తో నిండి ఉన్న ఆ ఇల్లు ఏడుపులు, పెడబొబ్బలతో ప్రతిధ్వనించింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆయన ముగ్గురూ కొడుకులూ కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చారు, ఒక ముఖ్యమైన విషయంలో. అదేమంటే… ఇవాళ్టి నుంచి మనం నాన్నగారి ఫోటోకి నమస్కారం పెట్టాకే మనం, మన మన పనులకి వెళ్దాం. నాన్నగారు వాళ్ళ నాన్నకి అంటే తాతగారికి ఏం చేసేవాడో అదే మనమూ ఈయన విషయంలో చేద్దాం” అని అనుకున్నారు. శివచరణ్ జీవించి ఉన్నప్పుడు ఎప్పుడు బయటకు వెళ్ళాల్సి వచ్చినా, వాళ్ల నాన్నగారీ ఫోటోకి దణ్ణం పెట్టుకునేవాడు.
“అది సరే! పూజా గృహంలో స్థలం ఏదీ ఖాళీగా లేదు కదా? నాన్నగారి ఫోటో ఎక్కడ పెడతాడు?” అడిగింది పెద్ద కోడలు.
మళ్ళీ ముగ్గురు ‘సుపుత్రులూ’ ఆలోచించి ఓ రెండు నిముషాల్లోనే ఒక నిర్ణయానికి వచ్చేసారు. “ఆఁ దానిదేవుంది? తాతగారి ఫోటో తీసేసి, అదే ఫ్రేంలో నాన్నగారి ఫోటో పెడదాం. మళ్ళీ క్రొత్త ఫ్రెం కొనాల్సిన అవసరం ఉండదు. పాత ఫ్రేంతోనే మనం పని కానిచ్చేద్దాం. ఏమంటారు” అని అన్నాడు పెద్ద కుమారుడు.
నేత్రదానం
ఆ కాలేజి స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఆ వూళ్ళోని ప్రముఖ నేత్ర వైద్యుడు డా. శుక్లాగారిని ఆహ్వానించగా ఆయన వచ్చి తన ఉపన్యాసంలో – “అసలు నేత్రదానానికి ఉన్న గొప్పదనమే వేరు. దీన్ని మించిన దానమే లేదు నిజానికి. మీరంతా మీ మీ పేర్లను నేత్రదానం చేసే పవిత్రమైన కార్యానికి నమోదు చేసుకోండి” అని అన్నాడు.
విద్యార్థులంతా చాలా ఆసక్తిగా ఆయన మాటలు వింటున్నారు. అక్కడే ఉన్న జ్ఞాన్ ఆహుబా తన కుర్చీలో చాలా అసహనంగా అటూ ఇటూ కదలసాగాడు. చివరికి ఉండబట్ట లేక డాక్టర్ గారి మాటలకు అడ్డొస్తూ –“ ఆపండి ఇంక! మీ డాక్టర్లు అందరూ కపటులే. చెప్పాల్సిన నిజానికి కూడా మీరు ఏవేవో చిలవలు – పలవలు కలిపించి చెప్తారు. ఉన్నదొకటైతే మరొకటి చెప్తారు. నాటకీయంగా చెప్తారు. అలా చేసి ఆనందం పొందుతారు. నా చెల్లెలి అంధత్వాన్ని మీలో ఎవ్వరూ పోగొట్టలేకపోయారు. పైగా నేత్రదానం నేత్రదానం అంటూ మాటలు చెప్తాడు. ఇక్కడున్న వాళ్ళంతా మీ మాటల ప్రభావంతో తప్పట్లు కొడతారు, కాని ఎవ్వరూ కూడా నా చెల్లెల్ని గ్రుడ్డితనం పోగొట్టాలనే విషయం గురించే ఆలోచించరు” అని అన్నాడు.
“అంతే! ఆ మాటలకి అక్కడి వాతావరణం మౌనం వహించింది. అంతా తలొంచుకుని ఏం ఆలోచించుకున్నారో ఏమో?” కొన్ని క్షణాలు గడిచాయో లేదో ఆ సభలో ఒక మూల నుండి ఒక చెయ్యి పైకి లేచింది. తరువాత ఇంకో మూలం నుండి మరో చెయ్యి లేచింది పైకి. అంతే!! ఆ హాల్ మొత్తం పైకెత్తిన చేతులతో నిండిపోయింది. అంతా కలిసి ఒకే స్వరంతో మేమంతా జ్ఞాన్ సోదరి నేత్రాలకు చికిత్స చేసి చూపు తిరిగి ఇప్పించాలనుకుంటున్నాను” అని అన్నాడు.
విస్మితుడై జ్ఞాన్ ఆహుజా అలా కూర్చుండి పోయాడు.
నేత్రదానం అంటే ఏమిటో, అతనికి అర్థమైంది. అతని కళ్ళలో కన్నీళ్ళు ఉబికి వచ్చాయి. తన చిన్నారి చెల్లెలు ఇక చూడగలదనే నమ్మకం అతనికి కలిగింది. అంతే! వెంటనే తను కూడా తన చెయ్యెత్తి, “నేను కూడా నా కళ్ళని దానం చేస్తా ఎవరి తల్లిగాని, చెల్లెలుగాని, ఎవరి బంధువైనాగాని చూపు పోగొట్టుకుని ఉంటే వాళ్ళకి నా నేత్రాలు అంకితం చేస్తున్నా” అని అన్నాడు ఆవేశంతో, అందరికీ వినబడేట్టుగా-