నిశిరాత్రి మినుకు మినుకు మనే తారల నడుమ నిండు చందమామ
తన పున్నమి వెన్నెలతో పుడమిని ముద్దాడుతుండగా
ఆ దృశ్యాన్ని గాంచిన నా మనసుకి
ఎందుకో ఆవేళ ఆరుబయట మల్లెపందిరి చెంత
పవళించాలనే కలిగె కోరిక
కొబ్బరిచెట్టు తన కొమ్మలతో వింజమారాలు విసరగా
కొబ్బరాకుల చాటునుండి ఆ నెలరేడు దోబూచులాడుచుండగా
పిల్లగాలికి మల్లెతీగలు నాట్యమాడుతుంటే
మల్లెల సౌరభాలు సుందరలోకంలో విహరింపజేయగా
ఏ నడిరేయికో నిదుర పట్టిన నాకు
దిశానిర్దేశం లేకుండా తెగిన గాలిపటంలా తిరుగుతున్న నాకు
ఉదయభానుడి లేలేత నులివెచ్చని కిరణాలు
నా మోముపై పడగానే చప్పున మెలకువ వచ్చిన నాకు
రంగులు మారుతూ పరుగులెత్తుతున్న రవి
జీవనగమనంలో కర్తవ్యోన్ముఖుడవు కమ్మని
గీతోపదేశం చేస్తున్నట్లుగా ఉంది ఆ దృశ్యం..
కర్తవ్యోన్ముఖం
previous post