తెలుగు భాషపైన మక్కువ ఈ యువతరాన్ని ఏకం చేసింది . తెలుగు రాష్ట్రాల వెలుగులు వీళ్ళు . అన్ని ఊళ్ళ నుండి , హైదరాబాద్, తిరుపతి, వైజాగ్ ఇలా ప్రాంతాలు వేరైనా నవతరం ప్రాబ్లమ్ ఒక్కటే తమవైన ఆలోచనలను పంచుకునే తెలుగుభాష స్నేహ బృందం కావాలి . కవిత్వ సొగసులద్దడానికి ఒక వేదిక కావాలి -ఇది వారి తొలి అడుగు గా Wattsap సంఘాన్ని ఏర్పరుచుకున్నారు . కథలు , కవితలు , గల్పకలు , గేయాలు ఇలా అన్ని ప్రక్రియలలో వారికి తోచినరీతిలో చక్కని తెలుగులో కవితాత్మకంగా రాస్తున్నారు . సమాజంలో కనిపించే వింతతత్వాలకు సెటైర్స్ లాగా రాయడమైనా , నిత్య జీవన విధానంలో గమనించే అంశాలను సున్నితంగా స్పృశించడమైనా ఇలాంటివి రచిస్తూ యవతరానికేకాదు మనతరానికీ స్ఫూర్తిదాయకంగా అడుగులేస్తున్నఈ”కలం కనే కలలు” కు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నది ‘ మయూఖ’
ఇలా వాళ్ళను మయూఖ లో పరిచయం చేస్తున్నాను ‘ నవతరం ‘ గా
*********************************************************
పలకడానికి మనిషి లేనప్పుడు, బ్రతకడానికి తోడు లేనప్పుడు పదం పదం పేర్చి మనసు కట్టుకున్న బొమ్మరిల్లు కదా కవిత్వం. మా కలలను కలాలతో పంచుకుంటూ కవిత్వం అనే సముద్రంలో ఈదుతున్న కాలం అది.
రేపటి పరీక్షకు సిద్ధం అవుతున్న విద్యార్థి ఒకడు, రాత్రి కంప్యూటర్ తో కుస్తీ పడుతున్న ఒక యువతి, తీవ్రమైన గాయాలకు చికిత్స చేస్తున్న వైద్యుడు, ఉద్యోగ అవకాశాల వేటలో నిద్ర రాక మరో నిరుద్యోగి, వెన్నెల వైపు చూస్తూ గతంలోకి పయనిస్తున్న ఓ అందమైన యువతి, పొద్దంతా తీరిక లేకుండా పని చేసి వచ్చి అలసిపోయిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని, ఇలా ఇంకా కొందరు.. ఎక్కడెక్కడో ఎవరికీ ఎవరితో సంబంధం లేని కొందరు యువతీ యువకులు.. అనగనగా ఒక రోజు, అనుకోకుండా ఒక చోట కలిశారు ఒక వాట్సప్ గ్రూప్ లో.
కలం కాగితంతో కలిసే వరకు ఎన్నో కలలు కంటుంది. ఒక అందమైన కవి ఆలోచనలు ఆ కలానికి తోడైతే, అద్భుతమైన కవితలను సృష్టిస్తుంది. అందుకేనేమో మా వాట్సప్ గ్రూప్ కి “కలం కనే కలలు” అని పేరు పెట్టుకున్నాము. మా వాట్సప్ గ్రూప్ నింపిన స్ఫూర్తి తో, తెలుగు భాష పట్ల అభిమానంతో మాలో ఒకరికి అనుకోకుండా వచ్చిన ఆలోచనని ఆచరణలో పెట్టి, ఎన్నో ఆటుపోట్లని ఓర్చుకుని, 44 మంది యువతీయువకులు కలిసి రాసిన పుస్తక సంకలనమే మా ‘కలం కనే కలలు’.
28 మే 2020 లో “శ్రీ నందమూరి తారక రామారావు” గారి జయంతి సందర్భంగా ప్రచురించడం జరిగింది.
అక్షరానికి అక్షరం కూర్చి
పదానికి పదం జోడించి
ఎద మోయలేని భావాలను సిరా లో నింపి కలం అంచునుంచి జాలువారిన
పదకుసుమాలను ఈ పుస్తకం లో పొందుపరిచాము.
అనుకోని ప్రమాదం లో మాకు దూరమైన మా సన్నిహితుడు హేమంత్ కు ఈ పుస్తకాన్ని అంకితం చేశాము. పది పదకొండు మందితో మొదలైన సమూహం ఇప్పుడు ఎనభై మంది యువ రచయితలకు స్థానం చేకూర్చింది. అన్న – తమ్ముళ్ళుగా, అక్కా – చెల్లెళ్ళుగా, మంచి స్నేహితులుగా మా ఈ పయనాన్ని కొనసాగిస్తున్నాము. చిన్నగా ఒక్క అడుగుతో మొదలైన మా ప్రయాణం ఇప్పటికి రెండు వార్షికోత్సవాలు జరుపుకుని, తన మూడవ వసంతం లోకి అడుగు పెట్టింది. ఒకరికి ఒకరం తెలియకుండానే పరిచయం అయ్యాము, అనుకోకుండానే ఆప్తులమయ్యాము.
“కలం కనే కలలు”
– మా కళలతో నిండిన కలలు
1 comment
మాకు ఇది ఇంకో కుటుంబం, ఒకరికి ఇంకొకరితో రక్త సంబంధం లేకపోయినా, కలం ఇచ్చిన కుటుంబం ఇది.
ఇంకా ఎన్నో మరెన్నో కలిసే చేస్తాం,
భాష పైన మాకు ఉన్న ప్రేమకు పుస్తక రూపం ఇచ్చి ఇంకెన్నో పుస్తకాలు రాస్తాం