ఒకానొకప్పుడు ఓ ముగ్గురు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్లు మంచి పెయింటర్లు. వాళ్లలో ఒకతను మంచి మనిషి బొమ్మలు వేసేవాడు. రెండవతను వాటికి మంచి ముఖాలు చేసేవాడు. మూడవ తమ ఆ బొమ్మల్లో ని ఇళ్ళూ , చెట్లు అందంగా పెయింట్ చేసేవాడు. అలా వాళ్ళు ముగ్గురూ కలిసి పెయింట్ చేసిన పటాలు చాలా అందంగా ఉండేవి. ఎంతో మంది ఆ పటాలను చూసి సంతోషంతో కొనుక్కొని వెళ్లేవారు. దాంతో ఆ సోదరులు తృప్తిగా ఉంటుండేవాళ్ళు.
కానీ కొన్నాళ్ల తర్వాత పెద్దతను తను వేస్తున్న మనిషి బొమ్మలు చాలా అందంగా ఉండడం వల్లనే ఈ పటాలన్నీ అమ్ముడుపోతున్నాయి అనుకుంటూ…
“నేను అనవసరంగా నాకు వచ్చే డబ్బులు ఇద్దరు సోదరులకు ఇస్తున్నాను కదా ! కాబట్టి నేను వేరుగా బొమ్మలు వేసి పెయింటింగ్ లను తయారు చేయడం మంచిది’ అనుకొని అలా మొదలుపెట్టాడు.
రెండవతను ఆ బొమ్మలకు తను పెయింట్ చేసిన అందమైన ముఖాల వల్లనే పెయింటింగ్స్ అందంగా ఉండి అవన్నీ బాగా అమ్ముడుపోతున్నాయనుకొంటూ,
” నేను ఒక గొప్ప పెయింటర్ను !నాకు అర్థం అవడం లేదు…. నేను ఇద్దరు సోదరులకు ఎందుకు డబ్బు ఇస్తున్నానో !! ఇప్పటినుండి నేనే స్వయంగా ముఖాలు పెయింట్ చేస్తే సరి. ముఖాలు మనిషిలోని భావాలను తెలిపేవి. ఆ పెయింటింగ్ లకు మంచి గిరాకీ ఉంటుంది” అనుకొని తను విడిగా పెయింటింగ్ వేయడం మొదలుపెట్టాడు.
ఇక మూడవ తను కూడా తను పెయింటింగ్ చేసే ఇల్లు చెట్లు ఉండడంతోనే ఆ పెయింటింగ్ లకు సంపూర్ణత వచ్చి ఎంతో అందంగా ఉంటున్నాయి, ఆదర్శనీయంగా ఉంటున్నాయి, దాని వల్లనే ఎక్కువగా అమ్ముడుపోతున్నాయని అనుకొని, తను విడిగా ఇల్లు చెట్లు వేస్తూ పెయింటింగులు వేయడం మొదలుపెట్టాడు.” తన గొప్పతనానికి వచ్చే డబ్బు అనవసరంగా ఇద్దరు సోదరులకు ఇవ్వడం మూర్ఖత్వం” అని అనుకున్నాడు
ఇలా విడివిడిగా ఉన్న పెయింటింగ్ లను చూసి ఎవ్వరు ఇష్టపడక కొనేవాళ్లు రాలేదు. ఇట్లా ముగ్గురు అన్నదమ్ములు విడివిడిగా ఉండి అసంపూర్ణమైన పెయింటింగులను వేయడం వల్ల రాబడి లేక ముగ్గురికీ ఇల్లు గడవడమే ఇబ్బంది అయిపోయింది .
కొన్నాళ్ల తర్వాత ఈ పద్ధతి ఏమీ బాగోలేదు ముగ్గురం కలిసే ముందు లాగే ఒక్క పెయింటింగ్ లో ముగ్గురి నైపుణ్యత చూపించడమే మంచిదని నిర్ణయానికి వచ్చారు. అప్పటినుండి మళ్లీ వాళ్ల పెయింటింగులు బాగా అమ్ముడుపోవడం మొదలై రాబడి పెరిగింది.
అప్పుడు వాళ్లకు అర్థమైంది కలిసి ఉంటే కలదు సుఖం అని,
United we stand, divided we fall అని!!