ఈ వేకువ చిన్నబోయి
పంద్రాగస్టు వేడుకకు రాని
బడిపిల్లల పాదముద్రలకోసం ఎదురు చూస్తున్నది
నిద్రలేచి అందంగా
ముస్తాబై ముందస్తు ప్రణాళికతో
అందరికన్నా ముందుగా
బడిలో ఉండాలనే
ఉత్సాహంతో
ఆనందంతో
ఒకరితో ఒకరు పోటీపడిన పచ్చని జ్ఞాపకాలు మదిలో తారాడుతున్నవి
సాంస్కృతిక కార్యక్రమాల సందడిలో తానొక తేజం కావాలని
పాటలో పాటగా పాల్గొనాలని,బడి అంతా
తమని మెచ్చుకోవాలనే ఉబలాటం మూడు రంగుల తోరణం లా తొందరిస్తుండేది
టీచర్ల సూచనలు , దోస్తుల ప్రోత్సాహం
స్పీచ్ లు రాసుకొని
స్టేజి పై చెప్పాలన్న కోరిక తెల్లని ఇస్త్రీ దుస్తుల్లా మెరుస్తుండేది
కాలం చేసే వింతలలో కననివెన్నో
విననివెన్నో నిత్యం తారసపడుతున్న ఈ వేళ
పాఠశాల ప్రాంగణాన్ని
తరగతి గదులను,
అందంగా అలంకరించుకొని
వేడుకను నిర్వహించాలనుకొనే
విద్యార్థుల సంతోషాల జాడనెత్తుకెళ్ళిన విపరీతమిది
కోవిడ్ మహమ్మారి కనుసైగ
కారణంగా టీచర్లు మౌన ఋషులయ్యారు
మూతికి మాస్కులతో
పాటించే భౌతికదూరం తో
కొత్త గీతాలేవో ఆలపిస్తున్నారు.
విద్యార్థులులేక
బోసిపోయిన బడి నిశ్శబ్దాన్ని మోస్తున్న తల్లిలా ఉన్నది
బాధగా,
భారంగా
తప్పనిసరిగా జెండాను
ఎగురవేసి జనగణమణ
గీతాలాపన వేళలో
స్వాతంత్య్ర పోరాటాలను కాదు విద్యార్థులను
గుర్తుతెచ్చుకొంటు కోరేదొక్కటే
త్వరగా
వరంగా
ఈస్థితి మారగా
మునుపటిలా
మల్లెలు నవ్వినట్టు
పక్షులు ఎగిరినట్టు
విద్యార్థుల గలగలలతో
కిలకిలలతో
ఆనందంగా
ఈ స్వాతంత్ర్యదిన వేడుకను
ఎప్పటిలా
కళ తప్పని కళగా
విద్యార్థుల సందళ్ల సజీవత్వం ఉట్టిపడేట్టు
ఉల్లాసపరిచేట్టు
ఉర్వి మురిసేట్టు
జెండావందనం కళ తప్పిన వేడుక కావద్దనే అందరి కాంక్ష
____________