జీవితం ఒక పరిమళ
భరిత పుష్పమని
జీవితం ఒక హరిత హరిత గానమని
నిరూపించిన మహామనిషి
నడకలో లయ ,
మాటలో లయ,
నడతలో లయ
వెరసి సకలమూ కవిత్వలయగా
మలచిన మహా స్రష్టా,
హనుమాజీపేట
శుక్తి ముక్తి ముక్తాఫలం
కరీంనగర్ శిరసున
ఙ్ఞాన పీఠ కిరీటం ,
కవితా కస్తూరి వనంలో
ఎన్ని పదసుందరులు
నీ గంటంలో నూతన నాట్యం
చేయడానికి వేచి చూసేవో
ఎన్ని నదీమాతృకలు
నీలో ఆవాహన చెంది
అక్షర గవాక్షాలు
చీల్చుకొని ప్రవహించేవో
సి.నా.రే….
తెలంగాణ పల్లెతల్లి చీకటికంటిలో
వెలుగుపుంతా
తెలుగు జీవన సంగీతానికి
వైదుష్యపు హస్తన్యాసమా,
ఎలా నిన్ను మాతరం
మాగాణం విస్మరించగలదు?
కవితా జలఫాతానివైన
నీ అస్తిత్వం స్మరించకుండా
ఎట్లా కొనసాగగలదు ?