డాక్టర్ బి.దామోదర్ రావు రచించిన నా కవిత సమత కవిత.
ప్రముఖ కవి,రిటైర్డ్ తెలుగు భాషోపన్యాసకుడు, డాక్టర్ బి. దామోదర్ రావు కలం నుండి జాలువారిన నా కవిత సమత పై విశ్లేషణా వ్యాసం.
“నా కవిత నందనవనంలో సుందర ప్రతిమ కాదు/ అంటున్నారు.నందనవనం అనగా పూలతో అలరారుతూ ఆనందాన్ని పంచే వనం.నందనవనం పిల్లలు ఆడుకునే అందమైన పూల చెట్లతో ఆహ్లాదాన్ని కలిగించు ప్రదేశం.దేవలోకంలోని వనం నందనవనం.సత్యభామ కోసం కృష్ణుడు స్వర్గమునకు పోయి నందనవనం నందలి పారిజాత వృక్షమును భూమికి తెచ్చినట్లు పురాణాల్లో ఉంది.కవి తాను రాసే కవిత అందమైన ప్రతిమను వర్ణించడం కాదు.తాను రాసే కవిత శ్రామికుని నిజమైన శ్రమ జీవిత సత్యాలపై ఆధారపడి ఉంది.నా కవిత భావ ప్రపంచానికి చెందినది కాదు అని కవి స్పష్టం చేస్తున్నాడు.కవి తాను రాసిన కవిత కేవలం అలంకారమైన సౌందర్యానికి బదులు జీవన పాఠాన్ని ప్రతిబింబించే ప్రకృతిని చూపిస్తుందని తెలుపుతున్నారు.
“శ్రమైక జీవుల కర్మజల బిందువు/అంటున్నారు.శ్రామికుల శ్రమ,కష్టం,అంకితభావం,జీవితానికి ప్రాణం అని కవితలో చెప్పబడింది.మానవ జీవితం శ్రమ పూర్వకమైనదిగా ఉండాలన్న సందేశం ఇక్కడ కనిపిస్తుంది.శ్రామికుని శ్రమతో నిండిన జీవితం మాత్రమే నిజమైన జీవిత లక్ష్యం అని ప్రతిపాదిస్తుంది.
“శాంతి,సమతల సింధువు/అంటున్నారు. న్యాయం,శాంతి,సమానత్వం అద్భుతమైన సముద్రం లాంటివి. శాంతి,న్యాయం సమాజంలో అత్యంత ముఖ్యమైనవి. శాంతి,సమానత్వం సముద్రంలా విస్తరించాలి.శాంతి,సమానత్వం అందరికీ అందుబాటులో ఉండాలి అనేది కవి ఆకాంక్షగా వ్యక్తం అవుతుంది.
“అన్యాయానికి,అవినీతికి బలిగా మారిన/దైన్య జీవాల,హృదిని హత్తుకుని ఓదార్చే/అంటున్నారు. సమాజంలో అన్యాయం, అవినీతి పెచ్చు పెరిగి పోయింది.సమాజంలో అన్యాయం,అవినీతి కారణంగా బాధపడుతున్న ప్రజల కోసం చింతిస్తూ వారి బాధలను అర్థం చేసుకుని వారికి ఓదార్పును ఇవ్వడం కవితలోని ముఖ్యమైన భావంగా తోస్తుంది.
“శాంతి మాత/న్యాయనేత/సౌమ్య చరిత/ అంటున్నారు.శాంతి,న్యాయం,దయ అనే సుగుణాలు,విలువలతో నడిచే వ్యక్తుల గొప్పతనాన్ని కొనియాడాలి.సమాజంలో గొప్ప నాయకుల విధానాలు,వ్యవహారాలు అందరికీ ఆచరణీయం.అట్లాంటి వారిని ఆదర్శంగా చూపిస్తుంది.ఈ ప్రపంచాన్ని న్యాయం,శాంతి ప్రేమతో నింపే మాతృ రూపం లాంటి నాయకత్వం అవసరం అని ప్రతిపాదించారు.శ్రామికులు,దయనీయ జీవులు,సమత మరియు శాంతి అనేవి ఈ కవితలోని ప్రధాన అంశాలు.అవి నేటి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయి.ఈ కవి తన మనసులోని ఆవేదనను తెలుపుతూ సమాజంలో ఉండాల్సిన సమభావాన్ని చక్కగా వ్యక్తపరిచారు.ఈ కవితా పంక్తులలో ఆత్మ స్ఫూర్తి,న్యాయం, సమానత్వం,శాంతి వంటి అంశాలపై దృష్టిని సారించారు.ఇందులో శ్రామికుల జీవితాలు వారు పడుతున్న కష్టాలు,కన్నీళ్ళు,వేదనలు,న్యాయం, సమానత్వం వంటి అంశాలను కవి దామోదర్ రావు చాలా చక్కగా ప్రస్తావించారుఈ కవిత చదవగానే పాఠకులకు ఒక విధమైన గొప్ప భావం మరియు ఆనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. “పొగడ్తల పొగడ దండలై/పెత్తందారి గుండెల పై వాలేది కాదు/ అంటున్నారు.ఈ పంక్తిలో కవి తన కవిత పొగడ్తల పొగడ దండల కోసం నిర్దేశించింది కాదు.తన కవిత అధికారం లేదా ప్రతిష్ఠ కోసం రాయబడింది కాదని కవి తన కవిత్వం యొక్క లక్ష్యాన్ని వివరించారు.తాను రాసే కవిత కేవలం యశస్సు కోసం రాయబడినది కాదు అని,అధికారం గల వారి ప్రాపకం కొరకు మరియు వారి దృష్టిని ఆకర్షించడానికి కాదు అని వ్యక్తం చేసిన తీరు అద్భుతంగా ఉంది.
“నిత్యం,మిత్తి సన్నిధిలో/తైలం లేని వత్తిలా వాడిన జీవితాల/అంటున్నారు.ఈ కవితా పంక్తిలో తన కవిత సాధారణ ప్రజల జీవితాలకు వారి కష్టాలకు దగ్గరగా ఉంది అని చెప్పబడింది.తన కవిత నిత్యం మృత్యువు సన్నిధిలో నూనె లేని వత్తి వలె కొడిగట్టిన జీవితాలు గల శ్రామికులతో మమేకం కావడాన్ని చూపిస్తుంది.ఇక్కడ తైలం లేని వత్తి అనేది శ్రమజీవుల అస్తిత్వానికి ప్రతీక.శ్రమజీవులు కార్మికులు,కర్షకులు రెక్కలు ముక్కలు చేసుకుని ఎంతగానో కష్టపడుతున్నారు.అయినప్పటికీ వారికి కడుపు నిండా తిండి దొరకడం లేదు.శ్రామికులు ఆకలితో అలమటిస్తూ అభాగ్య జీవితం గడపడం మనం ఎరిగినదే.శ్రమజీవుల జీవితాల్లో ఎలాంటి మార్పు గాన రావడం లేదు.శ్రమజీవులకు సమాజంలో తగిన స్థానం అందడం లేదు. శ్రమజీవులు తమ జీవితాలలో వెలుగును పొంద లేక పోతున్నారు అని కవి అంటున్నారు.తైలం లేని వత్తి అనే ఉపమానాన్ని ఉపయోగించి కష్టాలు పడుతున్న సామాన్యుల జీవితాల కఠోర స్థితిని కళ్ళ ముందు కట్టినట్లుగా చూపించారు.తైలం లేని వత్తి వలె ఇక్కట్లు ఎదుర్కొంటున్న సామాన్యుల జీవితాలు వెలుగు లేకుండా చీకట్లలో మగ్గడం దారుణం అని గొప్ప భావాన్ని వ్యక్తం చేశారు.
“ఆదుకునేది,అందుకునేది/అంటున్నారు.కవి కవితా లక్ష్యం అణగారిన శ్రమజీవులకు ఆదరణను అందించడం,ఆశ్రయాన్ని కల్పించడం.వారి బాధలను అర్థం చేసుకొని వారికి జీవితంలో కొంత వెలుగును ప్రసాదించే విధంగా ఉంది.కవి తన భావాలను ఆవేదనతో,నిజాయితీగా వ్యక్తపరిచారు.ఇది కేవలం కవిత కాదు ఒక న్యాయం కోసం పిలుపు ఇచ్చినట్టుగా తోస్తుంది.తాను రాసే కవిత కేవలం యశస్సు కోసం రాయబడింది కాదు అని,అధికారం గల వారి ప్రాపకం కొరకు మరియు వారి దృష్టిని ఆకర్షించడానికి కాదు అని చెప్పిన తీరు బాగుంది.
“నా కవిత/తారల వయ్యారి చిందులు/తామరల సొగసు పసందులు/వర్ణించేది,వరించేది,అసలే కాదు/చెమటోడ్చి, సాధించి,శక్తిని సృజించి/చేవతో జీవించే/కార్మిక,కర్షక సోదరుల కళ్యాణం కోరేది/నా కవిత సమత/అంటున్నారు.ఈ కవితా పంక్తుల్లో కవి సమాజంపై తనకు ఉన్న గాఢమైన చైతన్యాన్ని సామాజిక సమత్వం పట్ల తన ఆరాధనను వెల్లడిస్తున్నాడు.ఇందులో రెండు ప్రధాన అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఒకటి ప్రకృతిలోని సౌందర్యం,రెండు కార్మికులు,కర్షకులు వంటి సాధారణ ప్రజల వేదనను ప్రతిబింబించిన తీరు.తన కవిత నక్షత్రాల సొగసుల నాట్యాలను వర్ణించేది కాదు.తామరల అందచందాల పసందులను చిత్రించేది కాదు.ప్రకృతిలోని సౌందర్యం నా కవితా వస్తువు అసలే కాదు.నిత్యం కష్టపడి చెమటను చిందించి సృజించిన సంపదతో బలంగా జీవించేటటువంటి కార్మిక,కర్షక సోదరుల బాగును కోరేది నా కవిత.సమాజంలోని ప్రకృతి సౌందర్యాన్ని గాక కార్మికుల,కర్షకుల శ్రమకు మాత్రమే కవి ప్రాధాన్యతను ఇస్తున్నాడు.
“చెమటోడ్చి సాధించి,శక్తిని సృజించి,చేవతో జీవించే అనే కవితా పంక్తులు కార్మికుల కర్షకుల కష్ట సాధనను కృషిని ప్రతిబింబిస్తున్నాయి.కవిత ఒక సామాజిక సందేశాన్ని అందిస్తుంది.ఇవి కేవలం ప్రకృతి అందాలను ఆరాధించమని చెప్పడం మాత్రమే కాదు.కార్మికుల,కర్షకుల సంక్షేమం కోసం పని చేయాలి అనే గొప్ప సందేశాన్ని సూచిస్తుంది. కవితలో సమతా భావం వ్యక్తమవుతుంది.కవి సమాజంలో సమానత్వం,న్యాయం మరియు ఐకమత్యం కోసం ఆకాంక్షిస్తున్నారని తెలుస్తోంది. కవిత ప్రకృతి మరియు సమాజానికి మధ్య సమతుల్యతను గురించి తెలుపుతుంది.ప్రకృతి అంశాలు ఎంత ముఖ్యమో కార్మికుల,కర్షకుల శ్రమను గౌరవించడం కూడా అంతే ముఖ్యం. కవి సందేశం మన అందరికీ స్ఫూర్తిదాయకం.ప్రకృతిని కాపాడుకోవాలి మరియు శ్రమజీవులకు తోడ్పాటును అందించాలి అని కవి డాక్టర్ బి. దామోదర్ రావు నా కవిత సమత అనే కవిత ద్వారా ప్రబోధిస్తున్నాడు.