Home వ్యాసాలు కవిత్వాస్వాదన – ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

కవిత్వాస్వాదన – ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni

అనిశెట్టి రజిత కవిత్వం కొత్త సొబగులతో శోభిస్తున్నది.
*ప్రయాణం కవిత.
*మా నాన్నే విశాల ప్రపంచం కవిత.
*ఊరు బంధం కవిత.
అనిశెట్టి రజిత ప్రయాణం కవిత పై విశ్లేషణా వ్యాసం.

కవయిత్రి, అనిశెట్టి రజిత కలం నుండి జాలువారిన
కాలం కాన్వాస్ మీద కవితా సంపుటిలోని ప్రయాణం కవిత పై విశ్లేషణా వ్యాసం.ప్రయాణం కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.ఏదేని ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్లడం ప్రయాణం.సుదూర భౌగోళిక ప్రాంతాల మధ్య ప్రజల కదలిక ప్రయాణం.జీవితాన్ని ఎక్కడైనా ప్రారంభించడానికి చేసే ప్రయాణం, మతపరమైన తీర్థ యాత్రల కోసం చేసే ప్రయాణం. మిషన్ యాత్రల కోసం చేసే ప్రయాణం.ఇవి అన్ని ప్రయాణం కిందికి వస్తాయి.ఏదైనా ప్రక్రియ లేదా పురోగతి ప్రయాణంతో పోల్చబడుతుంది.ప్రయాణం ముఖ్యంగా ఇబ్బందులు లేదా వ్యక్తిగత అభివృద్ధిని కలిగి ఉంటుంది. కవయిత్రి రజిత ప్రయాణం కవిత గురించి తెలుసుకోవాలనే ఆసక్తిగా ఉందా? అయితే కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతిని సొంతం చేసుకోండి.
“నీ చేతులకు రెక్కలు తగిలించుకొని
“నీ రెక్కల్ని ముక్కలు చేసుకుంటూనే
“శకలాలను మళ్లీ బతికించుకుంటూ
“బతుకులోకి భరోసాగా ఎగిరిపోతూ ..
ఎవరి ఆందోళననైనా తగ్గించడానికి ఉద్దేశించిన సలహా ఓదార్పు మాటలు భరోసా.మనిషి జీవిత ప్రయాణంలో తన చేతులకు రెక్కలు తగిలించుకొని ఆరుగాలం తన రెక్కల్ని ముక్కలు చేసుకుంటూ కష్టపడి శ్రమిస్తాడు.మనిషి తన బతుకు పోరాటంలో తన శరీరంలోని రెక్కలతో పాటు మిగిలిన అవయవాలను కూడా బతికించుకుంటాడు.మనిషి గడుపుతున్న జీవితంలో ఎదురయ్యే కష్టాలను తట్టుకుంటూ గుండె నిబ్బరంతో తనకు తానే ఓదార్చుకుంటాడు.మనిషి తన శరీరంలో గల అన్ని అవయవాలను రెక్కలను కాపాడుకుంటూ ఆకాశంలో విహరించే పిచ్చుక వలె ఎగిరిపోతూ స్వేచ్ఛగా తన జీవిత ప్రయాణం కొనసాగిస్తాడు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“నీలోని మనో వికారాలను బయటికి చిమ్మేసి
“నీ మనో వికాసాలను ఎగదోసి నవ్వేసి ..
మనిషి మనసులో ఉత్పన్నమైన భావన మనో వికారంగా చెప్పవచ్చు.మనిషి తన మనసులో చెలరేగే భావాలను బయటికి ఊడ్చి చిమ్మేస్తేనే శుభ్రంగా ఉంటుంది.మనిషి తన మనో భావాలను నియంత్రణ చేయడం చాలా కష్టమైన పనిగా చెప్పవచ్చు.విద్య,వైద్యం,విజ్ఞానం,మనోవికాసం కోసం పుస్తక పఠనం ఎంతో ముఖ్యం.పుస్తక పఠనం వలన మనో వికాసం కలుగుతుంది.మనిషి తనలో కలిగే మనో వికాసాన్ని వ్యక్తం చేస్తూ నవ్వుతూ జీవిత ప్రయాణాన్ని సాగించాలి అంటూ కవయిత్రి స్ఫూర్తిని పొందేలా చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.
“జీవితం నిత్య ప్రయాణమే
“దారి పొడుగునా మజిలీలే ..
జీవితం అనేది మనిషి కొనసాగిస్తున్న జీవనం మరియు అతని ఉనికిని తెలియజేస్తుంది.జీవితం అనేది మనిషి సాగించే ప్రతి రోజు ప్రయాణంగా చెప్పవచ్చు.మనిషి తాను చేస్తున్న ప్రయాణంలో దారి పొడుగునా ఎన్నో అడ్డంకులు,ఆటంకాలు ఎదురైనా ధైర్యంతో ముందుకు సాగి పోవాలి.మజిలీ అంటే మార్గ మధ్యంలోని తాత్కాలిక నివాసం, మకాముగా చెప్పవచ్చు.మనిషి చేస్తున్న జీవన ప్రయాణంలో మజిలీ ముఖ్యమైనది అని వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.

“విసుగే గాని విరామం లేని అడుగులు
“తీరీ తీరని కలలకు పట్టే గొడుగులు ..
మనిషి సాగించే జీవిత ప్రయాణంలో విసుగు ఉండవచ్చు.కానీ విరామం ఉండదు.మనిషి చేస్తున్న ప్రయాణంలో తాను వేస్తున్న అడుగులు గమ్యస్థానం వైపు సాగుతూ ఉంటాయి.మనిషి తన కోర్కెలను తీర్చుకోవడానికి ఒక్కో అడుగుతో ప్రయాణం మొదలు పెడతాడు.తీరీ తీరని కలలు సాకారం చేసుకోవడానికి మనిషి తన తోటి వారితో సంయమనంతో మెలగాలి.మనిషి తోటి వారు అందించే సాయంతో తన నిరంతర ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఆనందంతో ముందుకు సాగుతుంటాడు అని చెప్పిన భావం చక్కగా ఉంది.
“కోర్కెలను పొదుముకున్న ఊహలు
“ఆ ఊహలకు మొలిచే వ్యూహాలు ..
కోరిక అనగా ఏదైనా వస్తువు,పదార్థం లేదా వ్యక్తికి కావాలని అనిపించడం.కోరిక అనేది బలమైన భావన.కోరికలను తీర్చుకోవడానికి ఏదైనా సాధించడానికి భావం తోడ్పడుతుంది.విజయం కోసం మనిషికి కోరిక అవసరం.ఆసక్తి కలిగి ఉండటం,ఇష్టం కలిగి ఉండటం కోరిక.ఏ పనినైనా చేయడానికి మనసులో కలిగే ఆశ కోరిక.దేనిపైనైనా ఏకాగ్రత చూపించడం కోరిక.ఊహ అనగా ఒక రకమైన ఆలోచన.ఊహ మనిషి మనసుకి గోచరించే ఒక దృశ్యం.ఊహ ఒక దృక్పథం,దానిని ధ్యానంతో అనుసంధానిస్తుంది.ఊహ అనేది తనకు తానుగా తెలియజేసే అనుభూతుల భావాలు మరియు ఆలోచనల ఉత్పత్తి.ఈ అనుభవాలు ఊహా జనిత మార్పులతో కూడిన స్పష్టమైన జ్ఞాపకాలు.కల్పనకు శిక్షణ ఇచ్చే మార్గం కథ చెప్పడం,వినడం.వ్యూహం అనేది ఒక కళ.వ్యూహం అనేది ఒక పనిని సాధించడానికి ఏర్పాటు చేసుకునే ప్రణాళిక.మనిషి కోరికలను తనలోకి ఆహ్వానిస్తూ స్వాగతిస్తున్న ఊహలను మనం చూడవచ్చు.అట్టి ఊహలకు రూపుదిద్దే వ్యూహాన్ని అనుసరించి నిర్దిష్టమైన ప్రణాళికలతో మనిషి ప్రయాణం ముందుకు సాగుతుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“తొడుగుల్లోని తోలుబొమ్మలాటల్లా
“రంగుల దేహాల్లోంచి నటనలు ..
తోలుబొమ్మలాట ఒక జానపద కళారూపం.తాను స్వయంగా అనుకరించలేని జానపదుడు కావ్యాల్లోను,పురాణాల్లోను వర్ణింపబడిన పాత్రల ఆహార్య విశేషాలను స్వయంగా సృష్టించుకున్నాడు. తన భాషలో ఆ మూగ చిత్రాలకు ప్రాణం పోశాడు. రక రకాల విన్యాసాలను వాటి చేత చేయించాడు. తాను స్వయంగా వెనుక నుండి ఈ పాత్రలను కదిలించాడు.కదులుతున్న ఆ జీవం లేని బొమ్మలతో జీవ నిబద్ధమైన ఒక దృశ్యాన్ని ప్రదర్శించడంలోనే జానపదుడి కళాత్మకత దాగి ఉంది.నటన అనేది నటి లేదా నటుడు చేయు పని.ఇది నటన, రంగస్థలం,సినిమా,దూరదర్శన్ లేదా కథా కాలక్షేపాలతో ఒక వ్యక్తి మరొకరిని అనుకరించడం. నటన అనేది బహుళ ప్రాచుర్యం పొందిన కళ. నటులకు ఉండవలసిన లక్షణాలు మూడు. అంగికము అందమైన రూపం.వాచకం మంచి కంఠస్వరం.అభినయం హావ భావాలతో ప్రేక్షకులను ఆకర్షించుకోగల సామర్థ్యం.తత్వవేత్తలు మనిషిని ఒక నటుడిగా ఈ ప్రపంచాన్ని ఒక రంగస్థలంగా పోలుస్తారు.నటన అనేది బాగా అభివృద్ధి చెందిన ఊహ.భావోద్వేగ సౌలభ్యం,శారీరక వ్యక్తీకరణ, ప్రసంగం యొక్క స్పష్టత,విస్తృతమైన నైపుణ్యాలను కలిగి ఉంటుంది.తొడిగించిన తోలుబొమ్మల ఆటల వలె మనిషి జీవిత ప్రయాణం కొనసాగుతున్నది. మనిషి రంగురంగుల దేహాలతో కూడిన నటనలు కొనసాగుతున్నాయి.కొంత మంది మనుషులు నిజ జీవితంలో కూడా నటిస్తుంటారు.దీని మూలంగా ఆత్మవంచనతో వీరు చాలా మానసిక ఒత్తిడికి లోనవుతారు.మనిషి జీవిత ప్రయాణంలో ఒడిదుడుకులు సహజమే.మనిషి ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు సాగాలి.నటనతో మనిషి విలక్షణంగా తన ప్రయాణం సాగిస్తున్నాడు. ఈ మూడు నాళ్ళ జీవితానికి నటనలు మనిషికి అవసరమా? అనిపిస్తుంది.నటనలు మనిషి బతుకులో భాగమయ్యాయి.కావాలని నటనలు చేయడం వల్ల జీవితం యొక్క లక్ష్యం మాయతో మోసంతో తీర్చిదిద్దబడుతుంది.నటన కొరకు మనిషి బతుకును కొనసాగించవద్దు.నటనలతో తమ తోటి వారిని మోసగించవద్దు అని చెప్పిన భావం అద్భుతంగా ఉంది. .

అనిశెట్టి రజిత

“లోలోంచి ఒక నేపథ్య సంగీతం
“అపస్వరంలోనో సప్త స్వరాల్లోనో గీతం ..
సంగీతం సుప్రసిద్ధమైన కళలలో ఒకటి.సంగీతం ప్రాథమిక లక్షణాలు శృతి, రాగం,తాళం,పల్లవి మొదలైనవి.సంగీతం శబ్దాన్ని కాలంతో మేళవించి వినసొంపుగా మార్చే విలక్షణమైన ప్రక్రియ.సంగీతం విశ్వమంతా వ్యాపించి ఉంది.ప్రకృతిలో సంగీతం మిళితమై జీవన గమనంలో భాగమైపోయింది. భారతీయ సంగీతంలో సప్త స్వరాలు స,రి,గ,మ,ప,ద,ని. వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క పక్షి కూత లేక జంతువు అరుపు నుంచి పుట్టినది. ‘స’షడ్జమము,‘రి’ రిషభం,’గ’ గాంధారం,’మ’ మధ్యమము, ’ప’పంచమం,‘ద’ దైవతం,’ని’ విషాదం అని సప్త స్వరాల పేర్లు.సప్త స్వరాలను అనేక రీతులు మేళవించడం వల్ల రాగాలు ఏర్పడతాయి. మనిషి గుండె లోతుల్లో ఒక నేపథ్య సంగీతం మేళవించి ఉంది.మనిషి పాడే పాట స్వరబద్ధంగా లేక ఒక్కోసారి అపస్వరంగా వినిపించవచ్చు.మనిషి లోపల నుండి ఒక్కోసారి సప్త స్వరాలతో కూడిన గీతం వెల్లువలా ఉబికి వస్తుంది.జీవితమన్నాక మనిషి పాడే పాట ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదు. సంతోషంగా ఉన్నప్పుడు పాడిన పాట స్వరబద్ధంగా ఉండి రంజింప చేస్తుంది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ఆగేదెక్కడో ఆగేదెప్పుడో పరుగులు
“చిక్కులు బడ్డ సహజీవన తంత్రులు ..
తంత్రులు అంటే స్ట్రింగ్స్ అనుకోవచ్చు.ముడులు వేసిన కిరణాలు అని అర్థం.కిరణాలు అంటే తంత్రులు.కిరణాలను తంత్రులతో పోల్చడం.తంత్రి అంటే తీగె,వీణ మొదలైన వాయిద్యాలు.తీగెలను తంత్రులు అంటారు.సితార్ యొక్క తీగలాగా ఉండేది తంత్రి.సహజీవనం అనేది పెళ్లి కాకుండానే యువతీ యువకులు కలిసి జీవించడం.ఇది పాశ్చాత్య దేశాల్లో కనిపిస్తుంది.సహజీవనంపై హద్దులు అనేవి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి.ఇవి స్నేహం వరకు లేదా శారీరక సంబంధం వరకు కూడా ఉంటాయి.సహజీవనం ఇరువురి అంగీకారం పై ఆధారపడి ఉంటుంది. సహజీవనం వివాహం కాని వ్యక్తులు సాధారణంగా జంటలు కలిసి జీవించే ఏర్పాటు.సహజీవనంలో వారు తరచుగా దీర్ఘకాలికంగా లేదా శాశ్వత ప్రాతిపదికన శృంగార లేదా లైంగిక సన్నిహిత సంబంధంలో పాల్గొంటారు.మనిషి కొనసాగిస్తున్న ప్రయాణంలో పరుగులు ఆగేది ఎప్పుడో,ఆగేది ఎక్కడో తెలియదు.ఆనందంగా కలిసి సహజీవనం సాగిస్తున్న జంటలు అభిప్రాయ భేదాలు ఏర్పడి తంత్రులు చిక్కుబడ్డ వీణలా బాధలకు లోనవుతారు.చిక్కుల్లో చిక్కుకున్న బంధం ఇరువురు మధ్య సాగుతున్న సహజీవన ప్రయాణంలో ఆగేది ఎక్కడో ఆగేది ఎప్పుడో అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“విధి విసిరే వియోగ గాలం
“తీరం చేరనివ్వదు తిరగబడ్డ కాలం ..
విధి తప్పకుండా జరగబోవు సంఘటన.విధిని ఎవ్వరు మార్చలేరు అంటారు.ఉద్యోగ నిర్వహణలో భాగంగా మీరు చేయవలసిన పనిని చేయడం విధి. చేపలు పట్టడానికి ఉపయోగించే సాధనం గాలం. మోసపూరితంగా ఇతరుల నుంచి లబ్ధి పొందడానికి చూపే ఆశను గాలం వేయడం అంటారు.
మనకు ఇష్టమైన వ్యక్తి దూరమైనప్పుడు అనుభవించే బాధ వియోగం.ప్రేమాభిమానాలు కలిగిన వ్యక్తులు దూరం కావడం వియోగం.తీరం అనగా సాగర తీరం,నదీ తీరం,తీర ప్రాంతం.భూమి సముద్రంలో కలిసే తీర ప్రాంతంగా నిర్వచింపబడింది. తీరాలు చుట్టుపక్కల ఉన్న ప్రకృతి దృశ్యం యొక్క స్థలాకృతి, అలల వంటి నీటి ప్రేరిత కోత ద్వారా ప్రభావితం అవుతాయి. కాలం అనగా సమయాన్ని కొలుచుటకు లేదా వ్యక్తపరుచుటకు ఉపయోగించే పదం.గడియారం తెలిపేది కాలం.ఏదైనా పని చేయుటకు ఇచ్చు సమయం కాలం.నిమిషాలు గంటల గురించి చెప్పబడేది కాలం.ఆగమన్నా ఆగనిది కాలం.విధి చేస్తున్న మాయాజాలం తప్పకుండా జరగబోవు సంఘటనను మనిషి ఎదుర్కోవాల్సి వస్తుంది. మనిషి వియోగం అనే గాలానికి చిక్కి విలవిలలాడుతాడు.సముద్రంలోని అలలు తీరం చేరాలని తహతహలాడుతుంటాయి.కాలం ఎప్పుడు ఒక్క తీరుగా ఉండదు.కాలం ఎదురు తిరిగినప్పుడు మనిషి బాధను అనుభవిస్తాడు.సముద్రంలోని అలలను తీరం చేరనివ్వకుండా ఏదో ఒక శక్తి ఆపుతున్నది.విధి రాత వల్లనే వియోగం ఏర్పడింది అని మనిషి తెలుసుకుంటాడు.ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలతో ఎడబాటు కలుగుతుంది.తీరం చేరని అలల ప్రయాణంలాగే తిరగబడ్డ కాలం వల్ల విడిపోవటాలతో ఒడిదుడుకుల ప్రయాణం అలా కొనసాగుతూ ఉంటుంది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ఒంటరి మనిషిగా సమూహంలోకి
“సమూహంలోనే ఒంటరిగా నిలిచి ..
ఏకాంతం అంటే కోరుకుని,కావాలని ఒంటరిగా ఉండటం.ఒంటరితనం అంటే ఏకాంతంగా ఉండటం. ఒంటరిగా ఉన్న వ్యక్తిని ఏకాకి అని లోకులు అంటారు.ఒక లక్ష్యం కోసం ఒక పథకం కోసం ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం జన సమూహం నుంచి ప్రవాహ వేగం యొక్క సుడుల జడుల నుంచి పక్కకు జరిగి విడిగా ఉండటాన్ని ఏకాంతం అంటారు.మనిషి లోకంలోకి పుట్టుకతో ఒక్కడిగా వస్తాడు.మనిషి పోయేటప్పుడు ఒక్కడిగానే పోతాడు.ఈ నడుమ మనిషి గడిపే జీవితమంతా పది మందితో ముడిపడి ఉంటుంది.సమాజంలోకి వచ్చాక మనిషికి ఎందరి అవసరమో సహకారమో కావాల్సి ఉంటుంది.సమాజంలో ఎంతో మందితో ఆత్మీయంగా మెలగవలసి ఉంటుంది.వెలుగు నీడల్లా మిట్టపల్లాల దారిలా ఆటుపోటుల సముద్రంలా కష్టసుఖాలను అనుభవించ వలసి వస్తుంది.కొందరు ఊహల్లో ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఒంటరిగా ఉంటే అక్కడ ఎవరు బాధపెట్టరు.ఎవరు మోసం చేయరు.ఎవరు అవమానించరు. నిజానికి ఒంటరిగా ఉండడమే మంచిది.ఒంటరిగా ఉన్నప్పుడు మనలో మనం మాట్లాడుకుంటాం.మన గురించి మనం ఆలోచించుకుంటాం.సమూహంలో అంటే అక్కడ ఎక్కువ మంది జనాలు ఉంటారు. కొంత మంది జనాలతో ఉండటానికి ఇష్టపడరు. విశాల ప్రాంగణం అయినా సరే అందులో ఊపిరి సల్పనట్లు అనిపిస్తుంది.ఒంటరితనం అనేది ఒక రకమైన అనుభూతి.ఒంటరితనం పొందిన వ్యక్తి గుంపులో నివసిస్తున్నప్పుడు కూడా ఒంటరిగా ఉన్నట్లు అనుభూతి చెందుతాడు.ఒంటరి మనిషి ఒక్కోసారి ఏమీ తోచక సమూహంలోకి వెళతాడు. సమూహంలో ఉన్నప్పటికీ కూడా అతను ఒంటరిగా ఉన్నట్లు భావిస్తాడు.జీవితం అనే ప్రయాణంలో ఒక్కోసారి మనిషికి ఏమీ తోచదు.అట్లాంటి సమయంలో కొంత సేపు ఒంటరిగా గడిపినట్లయితే స్వాంతన దొరుకుతుంది.ఒంటరితనంలో తాను ఎదుర్కొంటున్న సమస్యల గురించి సానుకూలంగా ఆలోచిస్తాడు.అనుభూతి చెందుతాడు.తాను ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలను ఒంటరిగా ఉన్నప్పుడు అందిపుచ్చుకుంటాడు. సమూహంలోని వ్యక్తుల మధ్య భిన్న అభిప్రాయాలు,భిన్న మనస్తత్వాలు చూసి సమూహంలోనే గడిపినప్పటికీ ఒంటరిగా ఉన్నట్లు అనుభూతి చెందుతాడు.మనిషి జీవిత ప్రయాణంలో ఎత్తు పల్లాలు ఉంటాయి.మనిషి జీవితంలో ఒంటరితనం ఒక భాగం అనిపిస్తుంది అని కవయిత్రి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“తన్లాట ! వెతుకులాట ! వేట !
అన్నింటా వికటించే బతుకాట ..
మెరుగైన సమాజం కోసం మనిషి పడే తపన తండ్లాట.పసి పిల్లవాని కొరకు తల్లి పడే తపన తండ్లాట.ఆరుగాలం కష్టించిన అన్నదాత పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక బతుకు కొరకు పడే తపన తండ్లాట.చదువుకున్న వ్యక్తి ఉద్యోగం కొరకు పడే తపన తండ్లాట.ఎన్నో కలలతో పెళ్లి చేసుకున్న యువతి తన భర్త వ్యసనాలకు బానిస అయితే అతని మార్చడానికి పడే తపన తండ్లాట.ప్రేమ పేరిట మోసగించిన ప్రియుడి గురించి తలుచుకొని బాధపడుతూ గడపడం తండ్లాట.ఏదేని ప్రత్యేకమైన వస్తువును పొందడానికి చేసే అన్వేషణ వెతుకులాట.మనిషి బతుకులో వెతుకులాట కూడా ఉంటుంది.మనిషి బతుకులో వేట కూడా ఉంటుంది. బతుకు గడపడం కొరకు తండ్లాట ఉంటుంది. బతుకును సాగించుట కొరకు వెతుకులాట ఉంటుంది.బతుకులో వేట కూడా ఉంటుంది. ఒక్కోసారి బతుకు పోరు సాగే ప్రయాణంలో ఎదురు తిరగడం కూడా ఉంటుంది అని కవయిత్రి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“మనిషి సంపూర్ణమయిన అల్పజీవి !
మనిషి బిక్కుబిక్కుమంటూ భయం భయంతో జీవనం సాగిస్తూ ఉంటాడు.మనిషికి అసాధారణమైన తెలివితేటలు ఉన్నప్పటికీ కొందరు మనుషులు భయస్తులుగా,పిరికితనంతో తమ జీవితాన్ని నెట్టుకు వస్తారు.భయం,పిరికితనం జాడ్యం అతనిని జీవించి ఉన్నన్ని నాళ్ళు వెంటాడుతూ వేధిస్తూ ఉంటుంది.మనిషి భయాన్ని,పిరికితనాన్ని వదిలిపెట్టాలి.ధైర్యంతో మనిషి కొండనైనా ఢీకొట్టే శక్తి తనలో ఉంది అనే జ్ఞానంతో మెదిలితే అతడు అల్పజీవి కాదు.మనిషి సంపూర్ణమైన అల్పజీవి అనేది చిత్ర విచిత్రమైన డోలాయమైన పరిస్థితిని తెలియజేస్తుంది.మనిషి సంపూర్ణమైన అల్పజీవి అని వ్యక్తం చేసిన తీరు బాగుంది.
“చెమ్మగిల్లని కన్నుల్లాంటి ఎడారి భూమి !
ఎడారి అనగా ఎటువంటి వృక్ష సంపద నీరు లేకుండా కేవలం ఇసుకతో నిండి ఉన్న విశాలమైన భూభాగం.భూమిపై ⅓ వైశాల్యాన్ని ఎడారులే ఆక్రమించి ఉన్నాయి.ఎడారుల్లో అక్కడక్కడ కనిపించే ఒయాసిస్సులు మాత్రం సారవంతమై జనావాసాలకు అనుకూలంగా ఉంటాయి. ఒయాసిస్సుల్లో నీరు లభ్యమవడమే కాకుండా భూమి కూడా మంచి సారాన్ని కలిగి ఉంటుంది. ఎడారులు జీవకోటి మనుగడకు సహకరించవని పేరుంది.ఎడారులు చాలా ఎక్కువ లేదా తక్కువ ఉష్ణోగ్రతలు తక్కువ వర్షపాతం మరియు కొరత లేదా వృక్ష సంపద లేని భూమి యొక్క బంజరు ప్రాంతాలు.ఎడారిలో పగటిపూట వేడిగా ఉంటుంది. రాత్రిపూట చల్లగా ఉంటుంది.చెమ్మగిల్లని కన్నులు ఉంటాయా? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు. మనిషికి దుఃఖం పొర్లుకు వచ్చినప్పుడు కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఎడారి భూముల్లో నీరు కనిపించదు.చెమ్మగిల్లని కన్నుల్లాంటి ఎడారి భూమిలా కన్నీళ్లు వేదనతో ఏర్పడి మనిషి సాగిస్తున్న జీవిత ప్రయాణంలో ఇంకిపోయినాయి. ఎడారి భూమిలో కళ్ళు చెమ్మగిల్ల కుండా ఉండే స్థితి వస్తుందా?అని మనలో మనకు సందేహాలు పొడచూపవచ్చు.చెమ్మగిల్లని కన్నుల్లాంటి ఎడారి భూమి అని కవయిత్రి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ప్రయాణం సుదీర్ఘం !
జీవించడానికి మనిషి చేసే ప్రయాణం సుదీర్ఘమైనది. అట్టి ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మనిషి ప్రయాణం విరామం లేకుండా నిర్విరామంగా కొనసాగుతుంది. మనిషి జీవన యానంలో సుదీర్ఘ ప్రయాణం నిరంతరం కొనసాగుతుంది అని కవయిత్రి చెప్పిన తీరు చక్కగా ఉంది.
“అనుభవం అత్యల్పం.
ఒక వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొన్న ఆటు పోటుల నుంచి లభించిన జ్ఞానమును అనుభవం అంటారు. పనులు/విషయాలు చేయడం,చూడటం లేదా అనుభూతి చెందడం ద్వారా జ్ఞానం లేదా నైపుణ్యం పొందడం,నేర్చుకోవడానికి ఉత్తమమైన మార్గం అనుభవం.పనులు చేయడం ద్వారా తెలుసుకొను భావన అనుభవం.ఏదైనా పనిని చేసి ఉన్న జ్ఞానంతో వచ్చినది అనుభవం.అనుభవం అనేది సాధారణంగా స్పృహతో కూడిన సంఘటనలను సూచిస్తుంది.మరింత ప్రత్యేకంగా అవగాహనలకు లేదా ఈ ప్రక్రియల ద్వారా ఉత్పత్తి చేయబడిన ఆచరణాత్మకమైన జ్ఞానం మరియు పరిచయాన్ని సూచిస్తుంది. విశాలమైన అర్థంలో ఒక చేతన సంఘటనగా అర్థం చేసుకోబడిన అనుభవం వివిధ అంశాలను ప్రదర్శించేదిగా ఉంటుంది.అనుభవం అత్యల్పం అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“అయినా ప్రయాణం ఎడతెగనిదే
“కడుపు నిండా కష్టాలున్న కడలి లాంటిదే ..
మనిషి చేస్తున్న జీవన ప్రయాణం ఎడతెగకుండా నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటుంది.మనిషి సాగిస్తున్న ప్రయాణంలో ఎన్నో కష్టాలు ఎదురవుతాయి.బ్రతుకులోని కష్టాలతో, సముద్రంలోని ఆటుపోటుల వలె మనిషి జీవన ప్రయాణం కొనసాగుతుంది అని వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.
“తడి లేని మనసు గుహల్లోకి చొరబడి
“తొలుచుకుంటూ పోవాల్సిందే …!
మనస్సు అంటే అంతరంగం,మెదడులో నిక్షిప్తమైన జ్ఞాపకాలు,ఆలోచనలు,విచక్షణ మొదలైన అంశాల ప్రతిరూపం.మనస్సు అనేది తరచుగా అనుభూతి, అవగాహన,ఆలోచన,తార్కికం,జ్ఞాపకశక్తి,నమ్మకం, కోరిక,భావోద్వేగం మరియు ప్రేరణ వంటి మానసిక దృగ్విషయాలతో అర్థం చేసుకోబడుతుంది.మనలో భావోద్వేగాలు,అనుభూతులు,కోరికలు కలిగించేది మనసు.ఏదైనా వస్తువు లేదా జీవరాశి పై ప్రేమ లేదా ద్వేషం కలిగించే ఒక అంతరంగం.మనిషి యొక్క భావాలు, అనుభూతులు,అభిప్రాయాలు వారి మనసు అది ఆలోచించే విధానంపై ఆధారపడి ఉంటుంది.మనిషి ప్రవర్తన,నడవడి వారి మానసిక స్థితిని తెలియజేస్తుంది.మనిషి యొక్క గ్రహణ శక్తి,ఆనందం మరియు బోధ,నమ్మకం,కోరిక,ఉద్దేశం మరియు భావోద్వేగాలను అనుభవించడంలో మనసు కూడా ముడిపడి ఉంటుంది.తడి లేని మనసు గల వ్యక్తులు ఉంటారా? అనే సందేహం మనలో పొడచూపుతుంది.మనకు ఇష్టం ఉన్నా లేకున్నా తడి లేని మనసు గుహలోకి చొరబడి తొలుచుకుంటూ మనిషి తన జీవన ప్రయాణం కొనసాగించాల్సిందే.భిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఉంటారు.తడి లేని మనసు గుహల్లోకి చొరబడి తొలుచుకుంటూ పోవాల్సిందేనని మనిషి తన ప్రయాణం కొనసాగించాల్సిందేనని కవయిత్రి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.కవయిత్రి రజిత మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
‌అనిశెట్టి రజిత మా నాన్నే విశాల ప్రపంచం కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని.
ప్రముఖ కవయిత్రి,అనిశెట్టి రజిత కలం నుండి జాలువారిన కాలం కాన్వాస్ మీద కవితా సంపుటిలోని మా నాన్నే విశాల ప్రపంచం కవిత పై విశ్లేషణా వ్యాసం.కవితను ఆసక్తితో చదివాను.కవిత నాకు నచ్చింది.కవితలోని భావాలు నన్ను ఆలోచింపజేశాయి.కవిత శీర్షిక పేరు మా నాన్నే విశాల ప్రపంచం.కవయిత్రి తండ్రిని విశాల ప్రపంచంతో పోల్చడం,ఆమెకు తండ్రి పట్ల గల అపారమైన ప్రేమను, అనురక్తిని తెలియజేస్తుంది. మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిన ఈ రోజుల్లో తండ్రిని ఎంత మంది ప్రేమిస్తున్నారు? అనే సందేహాలు మనలో పొడచూపుతాయి. కవయిత్రికి తండ్రి పట్ల గల ప్రేమను వ్యక్తీకరిస్తూ కవిత రాయడం గొప్పగా ఉంది.ప్రపంచం అనగా విశాల విశ్వంలోని భాగం,జీవులు నివసించే ప్రదేశం.సాధారణంగా ప్రపంచాన్ని భూగ్రహంగా వ్యవహరిస్తారు.మా నాన్నే విశాల ప్రపంచం కవిత గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? అయితే కవయిత్రి రజిత కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించి కవితానుభూతిని పొందండి.
“మా నాయినమ్మకు మా నాన్న
“బంగారు కొండ
“మా తాతయ్యకు మా నాన్న
“కొండంత అండ
“మా అమ్మకు మా నాన్న
“నిండైన కుండ
“మా కేమో మా నాన్న
“ప్రపంచం నిండా ..
నాన్న తల్లిని నాయనమ్మ అంటారు.మా నాయనమ్మకు తన కొడుకు అయిన మా నాన్నను పంచ ప్రాణంగా భావించేది. నాయనమ్మ నవ మాసాలు మోసి పెంచిన తన కొడుకును ఆప్యాయంగా బంగారు కొండ అని పిలుస్తుండేది.నాయనమ్మ నాన్నను బంగారు కొండ అంత విలువైన వానిగా భావించేది. నాన్న తండ్రి తాతయ్య.మా తాతయ్యకు తన కొడుకు అయిన మా నాన్న కొండంత అండగా ఉండే వాడు.మా నాన్న కూడా తాతయ్య కనుసన్నులలో మెలుగుతూ చెప్పిన పనులు చేస్తుండే వాడు.తాతయ్య అడుగుజాడల్లో నడుస్తూ ఎల్లవేళలా నాన్న అందుబాటులో ఉండే వాడు.నాకు మా చెల్లెళ్లకు ప్రపంచంలో మా నాన్నను చూసిన అనుభూతి కలిగేది.మాకేమో ప్రపంచం నిండారా నాన్న ఉన్నట్లు అగుపిస్తుండేది అని కవయిత్రి రజిత వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ఎన్ని కతలు ఎన్ని వింతలు
“విడ్డూరాలతో హాస్యపు జల్లులు
“లోకం తెలిపిన నాన్న చెప్పే
“విశేషాలు విషయాలూ వింటూనే
“లోకం పోకడలు తెలుసుకున్న వాళ్ళం.
కత అనగా సాహిత్య ప్రక్రియ.కథ అనగా ఇంచుక సత్యమైన కల్పిత ప్రబంధం.చిన్న పిల్లలు నిద్ర పుచ్చడానికి కథలు చెప్పడం అలవాటు.ఏదైనా కొత్త విషయం,వస్తువు,అపురూపమైనది వింత.ఒకింత సంబ్రమాశ్చర్యాలకు ముంచెత్తే విషయం,వస్తువు, వింత.ఆశ్చర్యం కలిగించేటటువంటిది వింత. అసాధారణ మాటలు విన్నప్పుడు చూసినప్పుడు కలిగే భావన వింత. విస్మయము కలిగించే వస్తువు వింత.లోకం పోకడ ఎప్పుడు ఒకలాగా ఉండదు. ఎప్పుడు మారుతునే ఉంటుంది.మన తాతల తరంలో ఎలాంటి సదుపాయాలు,సౌకర్యాలు లేకుండానే జీవితాన్ని గడిపారు.మన తండ్రుల తరంలో కొన్ని సదుపాయాలు,సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.మన తరంలో ఇంకా కొన్ని సదుపాయాలు,సౌకర్యాలు ఏర్పడ్డాయి. ఇప్పటి తరంలో చెప్పలేనంత మార్పు వచ్చింది.నేటి తరంలో అన్ని సౌకర్యాలు సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. మనం చిన్నప్పుడు ఉన్నట్లు ఈనాటి మనుషుల్లో ఆత్మీయత, అనురాగం ఆప్యాయతలు కనిపించడం లేదని బాధ పడుతుంటారు.పాత తరం లాగా ఇప్పుడు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు.నేటి కొత్త తరంలో మనుషులు అంతా కొత్తగా వింతగా ఉన్నారు అంటే ఎలా? కొత్త తరం కొత్తగానే ఉంటుంది.ప్రతి వారు లోకం పోకడ బాగా లేదని వాపోతుంటారు.వర్తమాన లోకంలో మనము కూడా ఒక భాగమే అని అనుకోరు.మనం కూడా లోకంలో మార్పుకు కారణం అని మనకు తెలుసు.అయినప్పటికి పాత రోజులు తలుచుకొని ఎంతో ఆనందంగా గడిపాం అంటే ఎలా? ఇప్పటి మనం నివసిస్తున్న వర్తమానాన్ని ఆహ్వానిస్తూ జీవితాన్ని ఆనందంగా గడపాలి.నాన్న నిద్ర పోయే ముందు సాహస వీరుల కథలు చెప్పే వారు.ధైర్యాన్ని నూరి పోసే వారు.నాన్న వెంట బజారుకు వెళితే లోకంలో జరిగే ఎన్నో వింతలు చూపించే వారు.నాన్న లోకంలోని విడ్డూరాలు తెలుపుతూ నవ్వుల జల్లులు కురిపించే వారు.లోకం గురించి అన్ని విషయాలు నాన్న తెలుపుతుంటే విని ఆశ్చర్యపోయేవాళ్ళం అని కవయిత్రి రజిత చెప్పిన తీరు చక్కగా ఉంది.
“నాన్నను చూసి మానవ సంస్కారం
“అలవర్చుకున్నాం
“నాన్న వల్ల సమాజాన్ని పరిచయం చేసుకున్నాం
“ఆడపిల్లలమైన మేము స్వేచ్ఛగా
“రెక్కలల్లార్చి విహంగించాం
“నాన్న ప్రజాస్వామికత వల్ల
“నిశ్చింతగా నియమబద్ధంగా ఎదిగాం …
సంస్కారములు హిందూ సంప్రదాయంలో ఆగమ సంబంధమైన క్రియలు.ఇవి ప్రతి హిందువు యొక్క జీవిత పర్యంతం వివిధ దశలలో జరుపబడతాయి. వ్యక్తుల జననము,మరణము తదనంతరం ఆత్మ పరలోక శాంతి నొందు వరకు సంస్కారములు జరుపబడును.సంస్కారములు మొత్తము పదహారు.వీనిని షోడశ సంస్కారాలు అంటారు. సమాజం అంటే మానవులు కలిసి మెలిసి పరస్పర సహకారం అందించుకుంటూ సమిష్టిగా జీవిస్తూ ఉండే నిర్దిష్ట సమూహం.ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తుల సంఘంతో కూడిన నిర్దిష్ట సమూహాలు సభ్యులుగా ఉన్న విస్తృత సమాజాన్ని సూచిస్తుంది. వ్యక్తిగా సాధ్యమయ్యే దాని కంటే సమూహంగా ఎక్కువ ప్రయోజనాలను పొందడానికి ప్రజలు సమాజాలను ఏర్పాటు చేసుకుంటారు. సమాజంలోని అందరు వ్యక్తులు మానవ కార్యకలాపాల్లో పాల్గొంటారు.సమాజంలో ప్రజలు ఒకరికొకరు పరస్పర అనురాగం,ఆప్యాయతలను కలిగి ఉంటారు.నాన్న లోని గొప్ప సంస్కారం ఏమిటంటే పెద్ద వారిని చిన్న వారిని అందరిని తన వాళ్లుగా భావించి ఆప్యాయంగా పలకరించే గొప్ప సుగుణం ఉండేది.ఎవ్వరి పట్ల కూడా నాన్నకు ద్వేష భావం ఉండేది కాదు.ఎప్పుడు నాన్న పెదాలపై చిరునవ్వు విరబూసేది.నాన్నకు శత్రువులు, మిత్రులు అని తేడాలు ఉండేవి కాదు.అందరి పట్ల ప్రేమ,సమ భావంతో ఉండే వారు.పెద్ద వాళ్లు,పేద వాళ్లు కనబడ్డా వారికి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసే వారు.నాన్న సమాజంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే వారు. నాన్న వెంట నాతో పాటు చెల్లెలు కూడా పాల్గొనేది. నాన్న మమ్ములను ఆడ పిల్లలం అని మా పట్ల ఎలాంటి భేద భావం చూప లేదు.మేము ఆడ పిల్లలం అయినప్పటికీ మమ్ములను సమ దృష్టితో చూసే వారు.నాన్న చూపించిన ప్రేమ, అనురాగం, ధైర్యం,మొక్కవోని ఆత్మవిశ్వాసం మాకు అలవడింది.నాన్న మేము ఆడపిల్లలం అయినప్పటికీ మమ్ములను బడికి పంపించారు. విద్యా వినయం నేర్పించారు.నాన్న వల్లనే మేము స్వేచ్ఛగా విహరించే పావురాలవలే ఆడుతూ పాడుతూ చదువుకున్నాం.నాన్న ఇచ్చిన ప్రేరణతో ఇప్పటికీ ధైర్యంగా జీవనాన్ని కొనసాగిస్తున్నాం.నాన్న ప్రజాస్వామ్యవాది.ప్రగతిశీల భావాలతో నిండి ఉండే వాడు.సాటి మనిషికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే వాడు కాదు.సాటి వానికి న్యాయం జరిగించే వరకు పోరాటం చేసే వాడు. నాన్న న్యాయం కోసం నిలబడే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు.సమాజ అభ్యుదయం కాంక్షించిన వ్యక్తి.పెద్ద మనుషుల పంచాయతీలో పాల్గొని నిజాయితీగా నిక్కచ్చిగా వ్యవహరించే వాడు.నాన్న అందించిన మార్గదర్శకత్వం మరియు చూపిన బాటలో మేము కొనసాగుతున్నాం.చిన్నతనం నుండి ఉగ్గుపాలతో మంచి నడవడిని,సంస్కారాన్ని పుణికి పుచ్చుకొని ఎదిగాను.ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం నారీమణులకు అండగా ఉంటున్నాను.రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం జరుగుతున్న పోరాటంలో పాల్గొంటున్నాను. సామాజిక కార్యకర్తగా నాన్న వల్లనే ఎదిగాను అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“మా నాన్న జన ప్రేమికుడు
“నిత్య చిరునవ్వుల రేడు
“తన భుజాల మీద మమ్మల్నే కాదు
“మా ఇంటిని ఎత్తుకున్న ధీరుడు
“సున్నితమైన హృదయాంతరంగుడు
“జీవనోత్సాహ రాగానికి సాక్షీభూతుడు ! సమాజంలో నివసించే వారిని జనం అని అంటారు. ఇవ్వాళ సమాజంలో స్వార్థపరులే ఎక్కువగా ఉన్నారు.నిస్వార్థపరులైన నాయకులు ఒక్కరు కూడా కాన రావడం లేదు.మా నాన్న జనాన్ని ప్రేమించే వాడు.సమాజంలో జరుగుతున్న అవినీతి, ఆశ్రిత పక్షపాతంకు వ్యతిరేకంగా పోరాడే వాడు.మా నాన్న ఎల్ల వేళలా సామాన్య జనుల హక్కుల కోసం పరితపించే నాయకుడు.మా నాన్న నిత్యం చిరునవ్వులు చిందించే రాజుగా పేర్కొనడం ఆమెకు తండ్రి పట్ల గల అవ్యాజమైన ప్రేమను తెలియజేస్తుంది.లోపల ఎంత బాధగా ఉన్నా బయటకు కనిపించకుండా చిరునవ్వులు కురిపిస్తూ అందరితో ఆప్యాయతగా మెలగడం కవయిత్రి నాన్నగారికే సాధ్యమని కవితలోని వాక్యాలు తెలియజేస్తున్నాయి.చిన్నతనంలో నాన్న మమ్మల్ని భుజాల మీద ఎత్తుకొని ప్రేమగా తిరిగేవాడు.మా ఇంటి బాధ్యతలను ఎత్తుకుని భుజాల పై మోసే ధీరుడు.ధీరుడు అంటే ధైర్యం కలవాడు.ధీరుడు అంటే ఎన్ని ఆపదలు చుట్టుముట్టినా కష్టాలు వచ్చినా చలించకుండా అత్యంత ధైర్యం కలిగి ఉండేవాడని అర్థం.నాన్న ‌సున్నితమైన హృదయం కల వాడు.నాన్న మనసులో ఏది దాచుకునే వాడు కాదు.భోళా మనస్తత్వంతో జీవితాన్ని ఉత్సాహంగా రాగాలు పలికించినట్లు నాన్న గడిపే వాడు.ప్రకృతిని ప్రపంచం యొక్క సుస్థిరతను జీవితం కోరుకుంటుంది.ఉత్సాహం అనేది ఒక వ్యక్తి ద్వారా వ్యక్తీకరించబడిన తీవ్రమైన ఆనందాన్ని సూచిస్తుంది.నాన్న ఎల్లవేళలా ఉల్లాసభరితంగా ఉండే వాడు.ఆశావాదం ఆయన ఊపిరి.సప్త స్వరాలను అనేక రీతులలో మేళవించడం వల్ల రాగాలు ఏర్పడతాయి.నాన్న జీవితాన్ని సప్త స్వరాలతో రాగాలు మేళవించినట్లుగా జీవనోత్సాహ రాగానికి సాక్షిభూతుడుగా ఉన్నట్లు వ్యక్తికరించడం చక్కగా ఉంది.
“బతుకు వ్యవసాయంలో కష్టాలతో
“అలంకృతుడైన మా నాన్న
“నిఖార్సైన కార్మికుడు కర్షకుడు !
జీవించి ఉండటానికి ఆవశ్యకమైన భావన బతుకు. వ్యవసాయం చేస్తూ రైతులు ఆరుగాలం కష్టించినా కడుపారగా తిండి దొరకక ఆకలితో మలమలలాడుతున్నారు.కార్మికులు ఎంత శ్రమించినప్పటికీ సరియైన వేతనాలు లేక అర్ధాకలితో జీవితాలు గడుపుతున్న స్థితిని చూస్తున్నాం.మా నాన్న బతుకు వ్యవసాయం చేస్తూ కష్టాలతో నిండి ఉన్నప్పటికీ ధైర్యంతో జీవనాన్ని సాగించాడు.కార్మికుని వలె కర్షకుని వలె కష్టము చేస్తూ శ్రమను నమ్ముకుని నాన్న జీవనం సాగించాడు అని కవయిత్రి రజిత చెప్పిన తీరు చక్కగా ఉంది.
“మాకు మా నాన్నే ఈ సుందర
“సువిశాల ప్రపంచం అనిపిస్తాడు.
మా నాన్న మాకు ఈ లోకం గురించి పరిచయం చేసి మాలో ఉత్సాహాన్ని శక్తిని నింపినాడు.ఈ లోకాన్ని మాకు చూపించిన మా నాన్న సువిశాల ప్రపంచం అని చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.చక్కటి కవితను రాసిన కవయిత్రి రజితను అభినందిస్తున్నాను.కవయిత్రి రజిత మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

అనిశెట్టి రజిత ఊరు బంధం కవిత పై విశ్లేషణా వ్యాసం.
ప్రముఖ కవయిత్రి,అనిశెట్టి రజిత కలం నుండి జాలువారిన కాలం కాన్వాస్ మీద కవితా సంపుటిలోని ‘ఊరు బంధం’ కవిత పై విశ్లేషణా వ్యాసం.ఊరు బంధం కవితను ఆసక్తితో చదివాను. కవిత నాకు నచ్చింది.కవిత నాలో ఆలోచనలు రేకెత్తించింది.కవిత శీర్షిక పేరు ఊరు బంధం ఏమిటి? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు.కవయిత్రి రజిత ఊరుకు బంధం ఉంటుంది అని కవితలోని భావాలు తెలియజేస్తున్నాయి.కవయిత్రి రజిత ఊరు బంధం కవిత చదవగానే మనలను మన ఊరులోకి తీసుకు వెళ్ళినట్లుగా అనిపిస్తుంది.కవయిత్రి రజిత ఊరు పట్ల గల ప్రేమను కవిత ద్వారా వ్యక్తం చేయడం చక్కగా ఉంది.ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది అని సామెత వాడుకలో ఉంది.కన్న తల్లి జన్మభూమి అయిన ఊరు బంధం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? అయితే కవయిత్రి రజిత కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి. గొప్ప అనుభూతిని పొందండి.
“ఊరంటే ఉట్టి మట్టి కాదు
మట్టీ ! మనిషి ! ఉత్పత్తీ !
ఒక ప్రాంతంలో గుర్తింపు పొందిన జనావాసాల సముదాయాన్ని ఊరు అంటారు.తెలుగులో పల్లెటూరు నుంచి మహానగరం వరకు జనావాసాన్ని ఊరు అని అంటారు.ఊరు అంటే పల్లె కన్నా పెద్దది, పట్టణము కన్నా చిన్నది.ఊరు అనగా కొద్దిమంది జనావాసాలు ఉన్న ప్రాంతం అని అర్థం.మట్టిని నేల,నేలలు అని కూడా అంటారు.మట్టిని భూమి,దూళి అని కూడా అంటారు.మట్టి జీవానికి ఆధారమైన సేంద్రీయ పదార్థం.ఖనిజాలు, వాయువులు,ద్రవాలు,జీవ పదార్థాల మిశ్రమం. భూమిలోని మట్టి భాగాన్ని పెడోస్పియర్ అని అంటారు.పెడోస్పియర్ పొర మొక్కల పెరుగుదలకు మాధ్యమంగా,నీటి నిల్వ,సరఫరా,శుద్ధీకరణ సాధనంగా,భూ వాతావరణాన్ని పరివర్తింపజేసేదిగా ఉంటుంది.మట్టి జీవులకు ఆహారం,భూమి మీద ఉండే పదార్థం.మనిషి అనగా ఒక వ్యక్తి.ఉత్పత్తి సేవ లేదా వస్తువు కావచ్చు.ప్రతి ఉత్పత్తి ఖర్చుతో కూడి ఉంటుంది. ప్రతి ఉత్పత్తి ధరకు అమ్మబడుతుంది. ఊరు అంటే ఉత్త మట్టి కాదు.ఊరులో నివసించే మనిషికి మట్టితో అనుబంధం ఉంటుంది.ఊరులో నివాసం ఏర్పరచుకొని నాటి ఆదిమానవుడు మొదలుకొని ఈనాటి నవీన మానవుడు కూడా జీవనం సాగిస్తున్నాడు.మనిషి మట్టితో పంటలు పండించి ఉత్పత్తి చేస్తాడు.ఊరిలో నివసించే రైతులు అనాదిగా మట్టిని నమ్ముకుని పంటలు పండించి జీవనం సాగిస్తున్నారు.రైతులు పండించిన పంటల వల్లనే మనం ఆహారం స్వీకరిస్తున్నాం. ఊరులో మట్టి ఉంటుంది.ఊరిలో మనిషి ఉంటాడు.ఊరిలో మనిషి పండించిన పంటల ఉత్పత్తులు కూడా ఉంటాయి.ఊరుతో మట్టి బంధం ఉంటుంది.ఊరిలో మనిషికి మట్టితో బంధం కూడా ఉంటుంది.మట్టిని నమ్ముకుని బతుకుతున్న రైతుకు ఉత్పత్తితో కూడిన బంధం ఉంటాయని కవయిత్రి వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.
“ఊరంటే జనజీవన తంత్రం.
ఊరిలో నివసించే వారిని ఊరి జనం అంటారు. ఊరిలో సబ్బండ వర్ణాల ప్రజలు నివసిస్తున్నారు. ఊరిలో వివిధ కులాలు ఉన్నాయి.వివిధ కులాలకు సంబంధించిన జనాలు ఉన్నారు.ఊరిలోని జనులు వివిధ వృత్తులు చేపట్టి జీవనం సాగిస్తున్నారు.ఊరి జనులు ఏ వృత్తి చేపట్టినప్పటికీ అందరు పరస్పర సహకారంతో తమ పనులను చక్కబెట్టుకుంటారు. ఊరి జనులు అన్నదమ్ముల వలె ఐకమత్యంతో మెలుగుతూ మనుగడ సాగిస్తున్నారు.ఊరంటే జనజీవన తంత్రం అని కవయిత్రి రజిత చెప్పిన తీరు చక్కగా ఉంది.
“సూర్యునితో కలె దిర్గే శ్రమ యంత్రం.
ఊరిలోని జనులు ప్రాతః కాలంతోనే నిద్ర లేస్తారు. సూర్యోదయం కాగానే జనులు పనులు ప్రారంభించి సూర్యాస్తమయం వరకు అలసట అనేది ఎరుగక తమ వృత్తికి సంబంధించిన పనుల్లో నిమగ్నమై కొనసాగిస్తారు.ఎండ,వాన,చలిని భరిస్తూ పనులు చేస్తారు.సూర్యుని పొద్దుపొడుపు నుంచి మొదలై సూర్యుడు పడమటి దిశకు చేరుకునే వరకు శ్రమ యంత్రాల వలె జనులు పనులు చేపడుతారు అని కవయిత్రి రజిత చెప్పిన తీరు చక్కగా ఉంది.
“మనిషికి ఊరు చిరునామా
“ఊరు బంధాల సంబంధాల కల్నేత
“ఊర పిశికెలు అల్లుకున్న గూడు
“ఊటబాయిల ఊరే తేట నీరు ..
చిరునామా లేదా అడ్రస్ అనగా భూమి మీద ఒక వ్యక్తి నివాస సంబంధమైన వివరములు ఉంటాయి. తెలుగులో కూడా చిరునామా అంటే అడ్రస్ అనే ఆంగ్ల పదమే అధికంగా వినియోగంలో ఉంది. తపాలా వ్యవస్థలో ఉత్తరాలను చేర్చడానికి అవసరమైన వివరాలను సూచిస్తూ చిరునామా పదం వాడుతారు.నివాస స్థలం తెలిపే పదం చిరునామా.ఒక నివాసాన్ని కనుగొనడానికి చిరునామా ఉపయోగపడుతుంది.మనిషిని ఏ ఊరు అని అడిగితే ఫలానా ఊరు వాడు అని చెబితే అది అతని చిరునామా అవుతుంది.ఊరితో బంధాలు ఏర్పడతాయి.ఊరులో ఏర్పడిన బంధాలు సంబంధాలు రంగురంగుల పోగులతో అల్లుకున్న వస్త్రం వలె చక్కగా పొందికగా ఉంటాయి.ఊర పిశికెలు అల్లుకున్న గూడులాగా ఊరి జనాలు పరస్పర అనుబంధాలతో చక్కగా కలిసిమెలిసి ఉంటారు.ఊర పిచ్చుకలు చూడ ముచ్చటగా ఉంటాయి.పల్లెల్లో ఊర పిచ్చుకలు ఇంటి ముందుకు వస్తాయి.పల్లె జనాలు ఊర పిచ్చుకలకు ధాన్యం వేస్తే తింటాయి.ఊట బాయిల ఊరే తేట నీరు చేదుకుని జనాలు తాగుతారు.ఊట బావి నీరు చల్లగా తీయగా ఉంటుంది.ఊట బావిల ఊరే తేట నీటిని ఊరి జనం ఎంతో ప్రీతిగా తాగుతారు అని కవయిత్రి రజిత చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ఊరంటే సేద్యగాళ్ళ రంగస్థలి
“పని చేసే చేతులు సృష్టించే
“సకల సంపదల భాండాగారం
“వాయి వరుసల కమ్మని పల్కరింపు …
నాయిక,నాయకుడు అభినయించు చోటు రంగస్థలం.నాటక ప్రదర్శనశాలను రంగస్థలం అంటారు.ధాన్యాన్ని నిలువ ఉంచు ప్రాంతాన్ని భాండాగారం అంటారు.మానవుడు సంఘజీవి.అన్ని బాగున్నప్పుడు పలకరించినా పలకరించక పోయినా పరవా లేదు.మనిషి బాధలో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా వెళ్లి పలకరించడం కనీస మానవ ధర్మం.అదే మనం అనుబంధానికి ఇచ్చే విలువ. బాగున్నావా అనే తీయని పలకరింపు కోసం మనిషి ఆరాటపడతాడు.ఈనాడు మనుషుల్లో ఆత్మీయత కరువైంది.ఒక కమ్మని పలకరింపు ద్వారా మనుషుల్లో ఆనందాన్ని కలుగజేయాలి.ఊరిలో రైతులు వ్యవసాయ భూముల్లో చేసేది సేద్యం. రైతులు సేద్యం చేసి పంటలు పండిస్తారు.రైతులు అందరు కలిసి వ్యవసాయ భూముల్లో సేద్యపు పనుల్లో రంగస్థలంలోని నటుల వలె నిమగ్నమై పనులు చేస్తారు.రైతులు ఆరుగాలం కష్టించి,శ్రమించి వ్యవసాయం ద్వారా తమ భూముల్లో పంటలు పండిస్తారు.రైతులు చెమటోడ్చడం వల్లనే పండించిన పంటలతో ధాన్యాగారాలు నిండుతాయి.ఊరిలోని రైతులు అందరు అన్నదమ్ముల వలె అక్క చెల్లెళ్ల వలె అప్యాయతతో కమ్మగా పలకరించుకుంటారు.ఊరి వారందరు అరమరికలు లేని స్నేహంతో ఆత్మీయతతో మెదులుతారు.ఊరిలోని ప్రజలంతా ఒక వసుధైక కుటుంబంలా కలిసిమెలిసి అప్యాయతగా మసులుకుంటారు.ఊరి జనాల స్నేహం,ఆత్మీయత,కమ్మని పలకరింపు గురించి కవయిత్రి రజిత వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ఊరంటే చెట్లు పనిముట్ల స్నేహం.
ప్రతి సంవత్సరం చిగురిస్తూ,పుష్పిస్తూ,కాయలు, పండ్లు అందించే వాటిని చెట్లు అంటారు.చెట్లు నేల పటుత్వాన్ని,భూసారాన్ని చక్కగా కాపాడుతాయి. ప్రకృతికి అందాలు చేకూర్చడంలోను వ్యవసాయం లోను చెట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మొలకెత్తడం,పెరిగి పెద్దవి అవటం,పుష్పించి, ఫలాలను ఇవ్వడం,కొంత కాలానికి వయస్సు ఉడిగి నశించడం,ఇవన్ని చూస్తే ప్రాణం ఉన్న మనిషిలాగే చెట్టు కూడా కనిపిస్తుంది.ప్రకృతి అందాలకు నిలయమైన ఈ భూమిపై వృక్షాలను నాటుదాం. మానవాళి మనుగడకు అవసరమైన సంపదలలో వృక్ష రక్షణ కూడా ఒక్కటి.వృక్షో రక్షతి రక్షితః చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది. పనిముట్టు అనేది సాధనం,పరికరం,ఉపకరణం. ఏదైనా పనిని త్వరగా సులభంగా చేయడానికి ఉపయోగించే వస్తువు పనిముట్టు.వ్యక్తి యొక్క సామర్థ్యం పనిముట్ల ద్వారా పెరుగుతుంది.చెట్టు యొక్క కలపతో పనిముట్లు తయారు చేస్తారు. అరక,మడక,నాగలి ఇది కొయ్యతో చేసినది. మేడి,నొగ,కాడిమాను.ఎద్దులతో భూమిని దున్నుతారు.భూమిని దున్నడానికి రెండు ఎద్దులు,ఒక మనిషి అవసరం.ఊరులో చెట్లు ఉంటాయి.చెట్ల కలపతో తయారు చేసిన పనిముట్లతో ఊరి వారికి స్నేహం ఉంటుంది అని కవయిత్రి రజిత వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“మనిషిని మనిషి పట్టించుకునే ఆరాటం
“మట్టి పువ్వుల పైరు పచ్చని యవుసం.
ఊరిలో మనిషి తోటి మనిషిని పట్టించుకునే ఆరాటం ఉంటుంది.ఊరిలో మనుషులు కలివిడితనంతో,ఆప్యాయతతో మెలగడం చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది.రైతు సాగుచేసిన వ్యవసాయం ద్వారా మట్టిలో పెరిగిన పైరు పువ్వులు పూచి పచ్చదనంతో కళకళలాడుతుంది. వ్యవసాయం అనేది ఒక్కరు చేసే పని కాదు. సమిష్టిగా ఊరి వారందరు కలిసిమెలిసి ఉండి పరస్పర సహకారంతో పనులు చేసుకుంటారు. రైతులు ఒకరిని ఒకరు పట్టించుకునే ఆరాటం ఉంటుంది.రైతులు నారు పోసి నీరు పెట్టి పెంచి కలుపు తీసి మట్టిలో పువ్వులు పూయించి పైరును పచ్చదనంతో కళకళలాడింపజేస్తారు అని కవయిత్రి రజిత వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“భూమిని మధించి పూజించడం …
“ఊరు సబ్బండ జాతుల సంస్కృతి !
భూమిని ఆరాధించడం వల్ల శ్రేయస్సు మరియు అదృష్టం లభిస్తుంది అంటారు.భూమి పూజ తర్వాత విత్తనాలు నాటడం వంటి ఆచారాలు ఉంటాయి. మన సంస్కృతిలో ప్రజలు ఏదైనా ముఖ్య కార్యాన్ని లేదా పనిని పూజతో అంటే దేవతలను ఆరాధించడంతో ప్రారంభిస్తారు.ఏదైనా కొత్త ఇల్లు నిర్మాణాన్ని ప్రారంభించేటప్పుడు ప్రజలు భూమి పూజ చేస్తారు.ఎప్పుడు మనిషి నేను అనే భావన కన్నా నలుగురితో మనం అనే భావన ఆనందాన్ని ఇస్తుంది.మన దగ్గర ఉన్న దాన్ని నలుగురితో పంచుకోవడమే అసలైన పండుగగా భావిస్తారు. పంటలు పండి ధాన్యం ఇళ్లకు చేరుకున్న సమయంలో సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.పొలాల నుంచి ఇంటికి వచ్చిన పంటను చూసి రైతులు ఆనందంతో చిరునవ్వులు చిందిస్తారు.ప్రకృతిని పూజించడంతో పాటు పశువులను కూడా పూజిస్తారు.సమాజంలో ముఖ్యమైన పద్ధతులు,నిర్మాణాలు, వ్యవస్థలు,సమాజం యొక్క సంస్కృతిని సూచిస్తాయి.సంస్కృతిని సూచించే సంకేతాలు, నిర్మాణాలు,వ్యవస్థలు,ఆచారాలు,వ్యవహారాలు. అవి నిరంతరాయంగా మారుతుంటాయి.ఒక దానితో ఒకటి కలుస్తూ విడిపోతూ పరిణామం చెందుతూ ఉంటాయి.ఒక సమాజ జీవనంలో మిళితమైన కళలు,నమ్మకాలు,సంస్థలు,తరాలలో జరిగే మార్పులు,తరాల మధ్య వారసత్వంగా కొనసాగే విధానాలు అన్ని కలిపి సంస్కృతి అంటారు.గతించిన కాలం గురించి భవిష్యత్తు తరాలకు అందించే వారధి సంస్కృతి.ఊరిలో భూమిని పూజించే ఆచారాలు,వ్యవహారాలు అనాదిగా కొనసాగుతున్నాయి.ఊరిలో సకల జాతులు,సబ్బండ వర్ణాల ప్రజలు సంస్కృతిని కాపాడుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు అని కవయిత్రి రజిత వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“మనిషి ప్రకృతితో జత కట్టే నియతి.
భూమి,నీరు,అగ్ని,గాలి,ఆకాశం పంచభూతాలు. వీటికి ప్రకృతి మూలం.ప్రకృతి అనగా మనం కళ్ళతో చూడగలిగే,మనసుతో భావించే,శరీరంతో గుర్తించే వాస్తవ ప్రపంచం.ప్రకృతి మన చుట్టూ ఉన్న మొత్తం భౌతిక ప్రపంచం,విస్తృత కోణంలో ఉంది. వాతావరణం,పర్యావరణ వ్యవస్థ,వృక్షజాలం, జంతుజాలం మరియు ఎంతో ఆహ్లాదాన్నిచ్చి అబ్బురపరిచే ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి.ప్రకృతి మన చుట్టూ ఉన్న అందమైన వాతావరణం, జీవరాశికి తల్లి,మనల్ని పోషిస్తుంది.మనకు మనుగడ కోసం అన్ని అవసరాలను అందిస్తుంది. మనం తినే ఆహారం,మనం పీల్చే గాలి,మనం ధరించే బట్టలు,మనం నివసించే ఇల్లు అన్ని ప్రకృతి మాత అందించిన బహుమతులు.ప్రకృతి పట్ల మనం కృతజ్ఞతతో ఉండాలి.ప్రకృతి మన భౌతిక అవసరాలకు మాత్రమే కాకుండా మనశ్శాంతికి, ఆనందం,ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది.ప్రకృతిని పరిరక్షించడానికి మనం కృషి చేయాలి.ప్రకృతిలో ఉన్న అనేక చెట్లు రోజు వారి ఉపయోగాలతో పాటు ఔషధ ప్రయోజనాల కోసం సహాయపడుతాయి.ఊరు బంధంలో నివసించే మనిషి ప్రకృతితో జతకట్టి నియతిగా జీవనం కొనసాగిస్తున్నాడు అని కవయిత్రి రజిత చెప్పిన తీరు చక్కగా ఉంది.
“మౌఖిక కథన కావ్యాల గుమ్మి.
మౌఖికంగా కథ చెప్పుతున్న కథకుడు మరియు శ్రోతల మధ్య ఒక పురాతన సన్నిహిత సాంప్రదాయం కొనసాగుతున్నది.కథకుడు,శ్రోతలు శారీరకంగా దగ్గరగా ఉంటారు.మౌఖిక కథన సౌలభ్యం ద్వారా సాన్నిహిత్యం,సంబంధం హాయిగా ఉంటుంది.మౌఖిక కథా కథనాలను అనేక రూపాల్లో ప్రదర్శించవచ్చు.పాటగా,నృత్యంతో పాటు ఒక రకమైన నాటక ప్రదర్శనం.మౌఖిక కథ మానవ భాష ఉన్నంత కాలం ఉండి ఉండవచ్చు.తోలుబొమ్మలాట ఒక జానపద కళారూపం.తాను స్వయంగా అనుకరించలేని జానపద కావ్యాల్లోనూ పురాణాల్లోనూ వర్ణింపబడిన పాత్రల ఆహార్య విశేషాలను స్వయంగా సృష్టించుకున్నాడు.తన భాషలో మూగ చిత్రాలకు ప్రాణం పోశాడు.రకరకాల విన్యాసాలు వాటిచేత చేయించాడు.తాను స్వయంగా వెనక నుండి ఈ పాత్రలను కదిలించాడు. కదులుతున్న జీవం లేని బొమ్మలతో జీవనిబద్ధమైన ఒక దృశ్యాన్ని ప్రదర్శించడంలోనే జానపదుడి కళాత్మకత దాగి ఉంది.నృత్య దశ నుండి మానవుడు నాటక దశలోకి ఎదిగే పరిణామ క్రమంలో తోలు బొమ్మలాట ప్రముఖ పాత్ర వహిస్తుంది.జానపదుని మొదటి రంగస్థలం ప్రదర్శన కళగా ఈ కళారూపాన్ని చెప్పవచ్చు.తెలుగు వారికి అపూర్వమైన జానపద కళా వారసత్వం ఉన్నది. జానపద కళా సాహిత్యం ద్వారా జాతి సంస్కృతి తెలుస్తుంది.జానపద ప్రదర్శన కళలు,తెలుగు నేలను సుసంపన్నం చేశాయి.ప్రజలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించినవి,జానపద ప్రదర్శన కళలే. వృత్తి జానపద కళారూపాలు ఒగ్గు కథలు,హరి కథలు,నాటకాలు,యక్షగానాలు,చిందు బాగోతం, కోలాటం,తోలుబొమ్మలాటలు మొదలైనవి,ఊరులో ప్రదర్శించే వారు.మౌఖిక కథన కావ్యాల గుమ్మి అని ఊరు గురించి ఊరు బంధం కవిత ద్వారా కవయిత్రి రజిత చెప్పిన తీరు చక్కగా ఉంది.
“పాల గోకులు పంచె అమ్మి !
పాలు శ్రేష్టమైన బలవర్ధక ఆహారం.ఇందులో అన్ని రకాలైన పోషక విలువలు ఉన్నాయి.పాలు అన్ని వయసులవారు తీసుకోదగ్గ ఉత్తమ ఆహార పదార్థం.పాలను ఉత్పత్తి చేసే జంతువులు ఆవులు,బర్రెలు,మేకలు,గొర్రెలు.టీ,కాఫీలను పాలను ఉపయోగించి తయారు చేస్తారు.పాలు తోడబెట్టినచో పెరుగు తయారవుతుంది.పెరుగును పల్చగా నీటితో బాగా కలిపితే మజ్జిగ తయారవుతుంది.పెరుగును బాగా చిలికితే వెన్న తయారవుతుంది.వెన్నను మరగబెట్టినచో నెయ్యి వస్తుంది.పాలతో పాలకోవా,మిఠాయిలు తయారు చేస్తారు.బిస్కెట్లు,చాక్లెట్లు,ఐస్ క్రీములు,రొట్టెలు మొదలైన వాటి తయారీలో పాలను ఉపయోగిస్తారు.ఊరులో ఏ ఇంట చూసినా పాడి పోషణ ఉంటుంది.ఊరిలో పాలు,పెరుగు అమ్ముకోవడం నామోషిగా భావించేవారు.ఊరిలో పాలగోకులు ఉచితంగా అందరికీ పంచే అమ్మిని గురించి కవయిత్రి రజిత వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ఊరు అప్యాయతలు పొంగే అవ్వ !
ఊరు అప్యాయతలు పంచే అవ్వ.మనం నివసించే ఊరు కన్నతల్లి లాంటిది.కన్నతల్లి నవమాసాలు మోసి మనలను కంటుంది.ఊరు మనకు నిలువ నీడను చోటును ప్రసాదించి జీవితాంతం తోడుగా ఉంటుంది.ఊరులో నివసించే జనులు అప్యాయత, అనురాగాలతో కలిసిమెలిసి ఉంటారు.కష్టం వచ్చినా సుఖం వచ్చిన తోడుగా ఉంటారు.ఊరు తల్లి అప్యాయత వల్లనే మన మనుగడ చక్కగా సాగుతుంది.ఊరులో తెల్లవారు జామున కను విందు చేసే మధురానుభూతులు జీవితాంతం నిలిచిపోతాయి.పక్షుల కిలకిలారావాలు,కోయిలల‌ కుహు కుహు రాగాలు మధుర మనోహరంగా ఉంటాయి.మమతలు పంచే బాల్య స్నేహితుల పలకరింపులు మనసును కట్టి పడవేస్తాయి. బంధువులు,స్నేహితులు,అత్తయ్యలు, మామయ్యలు,బాబాయి,పిన్ని,అక్క,చెల్లి, ఇరుగుపొరుగు వాళ్ళ మాటలు,మమకారాలతో ఆనందాల సందడిగా ఉంటుంది.ఊరు అప్యాయతలు పొంగే అవ్వ అని కవయిత్రి రజిత చెప్పిన తీరు చక్కగా ఉంది
“ప్రాణాలు నిలిపే కమ్మని బువ్వ !
ఊరిలోని రైతులు పండించిన పంట వల్లనే కమ్మని ఆహారం తింటున్నాం.ఊరు మనకు ఉనికిని ఇచ్చింది.ఊరు లేకుంటే ఉనికి లేదు.ఊరు లేకుంటే ఊరులోని జనం లేరు.ఊరు మనకు సకలం ప్రసాదించిన తల్లి.ఊరు తల్లి ఉనికి వల్లనే మన ప్రాణాలు నిలుస్తున్నాయి.ఊరు తల్లి ఉనికి వల్లనే మనం మనుగడ సాగిస్తున్నాం.ఊరు ప్రాణాలు నిలిపే కమ్మని బువ్వ అని కవయిత్రి రజిత వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.ఊరు బంధం కవిత ద్వారా ఎన్నో విషయాలు పంచుకున్న తీరు అద్భుతంగా ఉంది.ఊరు బంధం కవితను రాసిన కవయిత్రి రజితను అభినందిస్తున్నాను.కవయిత్రి రజిత మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

You may also like

Leave a Comment