Home వ్యాసాలు కవిత్వాస్వాదన — ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

కవిత్వాస్వాదన — ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni

మాదాడి నారాయణ రెడ్డి (మానారె) *ఊహా సుందరి కవిత..
*ఏకతకు పరిష్కారం కవిత.
*ఏదీ కొత్తదనం కవిత.
కవిత్వం ఓ విశ్లేషణ. ‌. ప్రముఖ కవి,ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాల సేకరణ కర్త,రిటైర్డ్ ప్రిన్సిపల్,ఎస్.ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల,కరీంనగర్,మాదాడి నారాయణ రెడ్డి (మానారె) కలం నుండి జాలువారిన ఊహా సుందరి కవిత పై విశ్లేషణా వ్యాసం.ఊహా సుందరి కవితను ఆసక్తితో చదివాను.చదవగానే కవితలోని భావం నన్ను కదిలించింది.నాలో ఆలోచనలను రేకెత్తించింది.వ్యక్తి మనసుకి గోచరించే దృశ్యాలు ఊహలు.వ్యక్తి కల్పనలు చేయడం,చూడని వాటిని చూచినట్టు వినని మాటలను వినినట్టు మనసులో అనుకోవడం,భావించడం ఊహ. వాస్తవమైనదిగా గుర్తింపబడని,ఇంద్రియాలకు గోచరించని దాని యొక్క చిత్రం మనసులో ఏర్పడటం ఊహ లేక కల్పనగా చెప్పవచ్చు.ఊహా సుందరి ఉంటుందా? అని మనకు ఆశ్చర్యం కలుగవచ్చు.నిద్రలో మనం కలలు కంటాం.కలలో కనిపించిన అతిలోక సుందరినే పెళ్లి చేసుకుంటాను అని ఎవరైనా చెబితే అది సాధ్యమయ్యే పనేనా?అనిపిస్తుంది.కవి నారాయణ రెడ్డి (మానారె) 1968 సంవత్సరంలో రాసిన కవిత ఇది.అట్టి ఊహా సుందరి కవిత గురించిన కథా కమామీషు ఏమిటి? అని తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా?అయితే ఊహా సుందరి కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతిని సొంతం చేసుకోండి.
“విరిగిన హృదయం చెదిరిన మనస్సు
“కదిలే కుంచె చిత్రిస్తున్నా
“వర్ణాలను మేళవించి సోయగాల నెన్నో నించి
“రేఖామయ సౌందర్యం రేకులు విచ్చిన చందం
“రాసేస్తున్నా !
మనిషి హృదయం లోతులో ఏం జరిగింది? అనేది ఎవ్వరికీ కాన రాదు.అసలు ఎవరికి తెలియదు. అతనేంటి అలా దిగులుగా ఉన్నాడు అనుకుంటారే కాని అతని గురించి అంతగా ఎవరు పట్టించుకోరు. అసలు విషయం ఏమిటి? అని అతనిని అడిగే ప్రయత్నం ఎవ్వరు చేయరు.అతని గురించి సంగతి ఏమిటో అతను చెబితేనే తెలుస్తుంది.కాని అతడు ఎందుకో నోరు విప్పడు,చెప్పడు.అతని హృదయం ఎందుకు విరిగింది? హృదయం విరగడం ఏమిటి? అని మనలో సందేహాలు పొడ చూప వచ్చు.విరిగిన హృదయం అనగా అస్తవ్యస్తమైన హృదయం అని చెప్పవచ్చు.హృదయం బాధకు గురి అయినట్లుగా తోస్తుంది.అతని మనస్సు ఎందుకు చెదిరింది? ఏదో చిత్రం అతని కళ్ళకు గోచరమైనట్టుగా తోస్తుంది. ఏదేని ప్రాణి,జీవి యొక్క మనసు కింపైన సౌందర్యాన్ని అందం అంటారు.శరీర అవయవ సౌందర్యాన్ని మనసుతో చూస్తాము.కావున ఒక మనిషి యొక్క అందం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కనిపిస్తూ ఉంటుంది.ఈ విశ్వంలో ఎన్నెన్నో జీవులు ఎన్నో వస్తువులు ఉన్నాయి.దేని అందం దానికే ప్రత్యేకం.పువ్వుల అందం అందరిని ఆనందపరుస్తుంది.చిత్రకారుడు తన కుంచెతో రేఖామయ సౌందర్యం గీస్తాడు.రేఖా చిత్రం వివిధ రకాల చిత్ర కళకి సంబంధించిన పరికరాలను ఉపయోగించి చిత్రించే ఒక దృశ్య కళ.కాన్వాసు పై చిత్రాలను గీయడం,ఆ చిత్రాలకి వివిధ రకాలైన రంగులను అద్దడమే చిత్రలేఖనం.దృశ్యపరమైన కొన్ని కళా సౌందర్య ప్రమాణాలను పాటిస్తూ భావాలను,ఆలోచనలను చిత్రము ద్వారా వ్యక్తపరచడమే చిత్రలేఖనం.కాన్వాస్ పై సాధారణంగా కుంచెలను ఉపయోగించి చిత్రలేఖనం చేస్తారు.చిత్రాలను గీసే వారిని చిత్రకారులు అంటారు.చిత్రకారుని చేతిలో కుంచె కదులుతుంది. మనసులో ఏదో తెలియని అలజడి చెలరేగింది. మనసు ఎందుకో స్పష్టత లేకుండా అస్పష్టత కొనసాగుతుంది.అటు ఇటు చంచల స్వభావంతో తిరుగుతున్న మనసును ఒక్కసారిగా అదుపులోకి తెచ్చుకొన్నాడు.కదులుతున్న కుంచెతో ఒకానొక ఊహా చిత్రాన్ని చిత్రిస్తున్నాను అని కవి అంటున్నాడు.రంగులను కలిపి సోయగాలను,సరి కొత్త అందచందాలను ఎన్నింటినో ఆ రంగులతో నింపి రేఖలతో రూపుదిద్దుకున్న అపూర్వమైన సుందర రూపాన్ని ఆవిష్కరిస్తున్నాడు.మొగ్గలుగా ఉన్న సుమాలు క్రమక్రమంగా విచ్చుకొని సౌరభాలను వెదజల్లినట్లుగా కుంచెతో నగిషిలు చెక్కినట్లుగా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నానని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ఎర్ర రంగు తన రాగాన్ని చిత్రానికి అందిస్తున్నది
“అనురాగము క్షాళితమై ఆ కాలిమ నంటిస్తున్నది
“అధరాలు నఖాంకురాలు ఆ రాగమునే పొందెను
“చెక్కిలిపై ఆరాగమె అనురాగము పొంగించెను.
రక్తం ఎరుపుగా ఉంటుంది.ఎరుపు రంగు చారిత్రాత్మకంగా త్యాగం,ప్రమాదం,ధైర్యంతో ముడిపడి ఉంటుంది.ఎరుపు రంగు సాధారణంగా వేడి,కార్యాచరణ,అభిరుచి,లైంగికత,కోపం,ప్రేమ, ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది.భారత దేశంలో ఎరుపు రంగును ఆనందాన్ని,అదృష్టాన్ని సూచించే రంగుగా చెబుతారు.ఎరుపు విప్లవపు రంగుగా మారింది. ఎరుపు రంగు ఉత్తేజాన్నిస్తుంది.ఎరుపు రంగు ఉత్సాహభరితమైనది.ఎరుపు రంగు ప్రేమ యొక్క రంగుగా పరిగణించబడుతుంది.సంధ్యా సమయం ఎరుపు రంగును తెలుపుతుంది.రోడ్డుపై సిగ్నల్ పడగానే ఎరుపు రంగుతో అప్రమత్తంగా ఉంటారు. ఎరుపు రంగు ధైర్యాన్ని ఇస్తుంది.ఎరుపు రంగు బలాన్ని శక్తిని సమకూరుస్తుంది.ఎరుపు రంగు స్థిరత్వాన్ని కలిగిస్తుంది.ఎరుపు రంగు నిశ్చింతగా నిబ్బరంగా ఉండేలా చేస్తుంది.ఎరుపు రంగు తేజస్సుకు ప్రతీక.ఎరుపు రంగు ప్రేమకు,దయకు సంకేతం.ఈ ప్రపంచమంతా అనేకమైన రంగులతో కూడి ఉంటుంది.రంగులు లేని లోకం మన ఊహలకు అందదు.మనిషి దేన్ని తలుచుకున్నా ఏదో ఒక రంగు కళ్ళ ముందు నిలుస్తుంది.కుంచె ఎరుపు రంగును తీసుకుని ఆ ఎర్ర దనాన్ని చిత్రానికి అందిస్తున్నది.కుంచెకు గల ఎర్ర రంగు కడిగి వేయబడి నల్ల రంగును చేర్చుకొని చిత్రాన్ని సరి కొత్తగా రంగులతో అద్దుతున్నది.కుంచెకు గల ఎరుపు రంగుతో పెదవులు,గోళ్లు ఎర్రగా మెరుస్తూ సహజత్వాన్ని పొందినాయి.చెంపలపైని ఎర్రని నిగారింపు తనలోని ప్రేమను పొంగింపజేసింది. ఎరుపు రంగు బుగ్గలకు నిండుదనాన్ని చేకూర్చినట్లు తోస్తోంది.

“జడ లోపల కనుపాపల లోతులలో పాతుకొనియె
“కారు నలుపు కాగిన కాలపు క్రీడలు
“కుంచె మీద క్షణికములవి చంచలాక్షి కవె నిత్యము.
వాలు జడ లోపల గడచిన కాలపు విలాసవంతమైన నలుపు రంగు శోభిస్తున్నది.కనుపాపల లోలోపల పూర్తిగా నిండిన నలుపు రంగు కాంతులు కనిపిస్తున్నాయి.జడ,కనుపాపలు నల్ల రంగుతో తీర్చబడి ఆకర్షణీయంగా కనువిందు చేస్తున్నాయి.
గడిచిన కాలపు విలాసాలైన మిక్కిలి నల్లని ఛాయలు శోభతో మెరుస్తూ వైభవాన్ని చాటుతున్నాయి.ఎరుపు రంగు గాని,నలుపు రంగు గాని ఎందుకో ఏమిటో కుంచె మీద నిలవడం లేదు. ఆ రంగులు కుంచె మీద తాత్కాలికంగా ఉంటున్నాయి.కుంచె మీద నిలవని రంగులు క్షణికములవుతున్నాయి.చంచలాక్షి చిత్రానికి అవి చెదరకుండా శాశ్వతములై ఉన్నట్లు శోభిస్తున్నాయి.
“సుఖ దుఃఖాల ప్రతీకలు సుందరతరమీ రేఖలు.
జీవితంలోని ఈ రంగుల వెలుగులు సుఖదుఃఖాలతో కూడినవి.సుఖాలకు దుఃఖాలకు ఈ రేఖల గుర్తులు చెరిగిపోనివిగా కనిపిస్తున్నాయి.ఉదయించే సూర్యుని లేలేత కిరణాలు ఎరుపు రంగులను పోలి సుఖాలకు గుర్తులుగా ఉన్నాయి.నలుపు రంగు జీవన గమ్యంలో ఎదురైన కష్టాలను,దుఃఖాలను తలపింపజేస్తున్నది.చిత్రకారుడు గీసిన రేఖలు ఎంతో సుందరతరంగా ఉన్నాయి.చిత్ర సౌందర్యపు రేఖలు మరీ మరీ చూడాలనేంత తహతహను కోరికను కలిగించేవిగా ఉన్నాయి.
“పసిపాపను చూచు తల్లి పరవశత్వమే యబ్బెను
“నా సృష్టి యలౌకికమై నా కన్నుల ముందు నిల్చె.
కాన్వాసు పై గీచిన సుందర చిత్రాన్ని చూడగానే పసిపాపను గారాబంగా అపురూపంగా చూసుకునే తల్లి పొందే పారవశ్యం,తెలియని మైమరుపు కలిగింది.సృష్టి కర్త వలె కలలో తాను గీసిన వర్ణ చిత్రం.స్వప్నంలో చిత్రించిన ఆ చిత్రం లోకంలో గాలించి వెతికినా కనిపించదు.చిత్రకారుడు గీసిన చిత్రం అలౌకికం,అపురూప కళాఖండంగా ఒక్కసారిగా నా కళ్ళ ముందు సాక్షాత్కరించింది.
“అదిగదుగో ! ఆ సుందరి కదలినట్లు,పెదవి విప్పి
“పదములనే పాడినట్లు భ్రమ చెందితి.
అదిగో కళ్ళు బాగా తెరిచి చూడు.ఆ సుందరి చైతన్యంతో కదలాడినట్లు పెదవి విప్పి మధురమైన పాటలను పాడినట్లుగా ఒక రకమైన తీయని అనుభూతి కలిగింది.
“ఎవడా పోకిరి ? ఓహో ! నాగరికత నడుమంత్రపు
“ముద్దుబిడ్డ ; గడుసరియై భారతీయ భావనకే
“గోరి” కట్టు గొప్పవాడు పర సంస్కృతి తొత్తువాడు.
ఎవడా పోకిరి ?ఎవడా దుష్టుడు ?ఓహో ! అతడా! విశృంఖలంగా వెఱ్ఱి తలలు వేసిన నేటి నడు మంత్రపు నాగరికత యొక్క ముద్దు బిడ్డ.అనాదిగా మన దేశస్తులు అనుసరిస్తున్న ఆచార వ్యవహారాలు,సంస్కృతి,సంప్రదాయాలను పరిరక్షించుకోవలసిన అవసరము,ఆవశ్యకత ఎంతైనా ఉంది.సమాజంలో నాగరికత పేరున వెర్రి తలలు వేస్తున్న దుష్ట సంస్కృతిని అనుసరిస్తున్న ప్రియాతి ప్రియమైన పుత్రుడు వీడు.గడుసరిగా పెడసరిగా మారి బండ బారిన మనసుతో మొండితనంతో భారతీయ సంస్కృతికి ముగింపు పలికే వాడు.గొప్పదైన భారతీయ ధర్మానికి సమాధి కట్టే గొప్ప వాడు.పాశ్చాత్య సంస్కృతికి బానిసగా మారినాడు.తరతరాలుగా వస్తున్న మన సంస్కృతిని మర్చిపోయినాడు.పరాయి దేశస్తుల విష సంస్కృతి వ్యామోహానికి లోను అయినాడు. పరాయి దేశస్తుల కట్టు,బొట్టు,ఆలోచనా సరళి,మాట తీరు,సంస్కృతి,ఆహార్యాలను అనుసరించి విలువలు లేని జీవన విధానాన్ని అనుసరిస్తున్న వాడు ఈ పోకిరి.
“చిత్రమునే చూచె వాడు,చిత్రముగా చూచినాడు
“సకిలించెను,ఇకిలించెను వెకిలి చూపు మకిలి చూపు
“చూపుల తూపులు రువ్వెను లేని మీసములు దువ్వెను
“ప్రేయసియని పిల్చినాడు సభ్యతనే కాల్చినాడు
“కనుల మేఘములు చేరెను అశ్రుధారలై జారెను
“సుందరి వదనాంబుజమున శోకార్తియై “స్ఫురియించెను. చిత్రించిన ఆ చిత్రాన్ని చూచి అట్టి సంస్కారహీనుడు పర స్త్రీలను తల్లుల వలె చూడక అశ్లీల భావనతో చూసే ఒక నీచుడు.ఆ మాతృత్వం ఉట్టిపడే చిత్రాన్ని చూసిన తర్వాత అతని చూపులు చిత్రాతి చిత్రములుగా కనిపిస్తున్నాయి.చిత్రం చూసిన తర్వాత అతడు గుర్రంలాగా సకిలించినాడు.నోరు తెరచి పండ్లు కనిపించే విధంగా ఇకిలించినాడు. వెకిలి చూపులతో అపవిత్రమైన చూపులతో చూపులనే బాణములను రువ్వినాడు.అతను మీసాలు లేనప్పటికీ మీసాలు ఉన్నట్లుగా లేని మీసాలు దువ్వినాడు.మీసాలు మనిషి ప్రతాపానికి పరాక్రమానికి గుర్తులు.బలహీనుడు అయిన ఆ వ్యక్తి మీసాల పై చేయి వేసి దువ్వినాడు మరియు లేని వీరత్వాన్ని చూపడానికి ప్రయత్నించాడు.ఆ చిత్రంలోని స్త్రీ మూర్తిని ప్రేయసీ అని పిలిచి మన జాతి సంస్కారానికి కళంకం తెచ్చాడు.ప్రేయసీ అనే పిలుపుతో ఆమె నయనాల్లో మేఘం వర్షించింది.ఆ స్త్రీ మూర్తి కళ్ళల్లో వేదనాభరితమైన కన్నీళ్లు కాలువలై పారినాయి.చిత్రములోని ఆ సుందరి ముఖ కమలంలో దుఃఖభరితమైన ఆవేదన కొట్టవచ్చినట్లు కనిపించింది.
“భరత భూమి పతనానికి పరులెత్తు పతాకవీడు
“కామముతో కనుగానని నేటి యువత రూపు వీడు
“భరతమాత భవితవ్యం దుష్టాన్వయమయ కావ్యం
“త్రుళ్ళిపడితి ఏదీ సుందరి?పోకిరి యువకుండెక్కడ? భ్రమయేనా ? “మనసులోని రేఖా మాత్రపు చిత్రమో !
“చిత్రమైన చాంచల్యమో ! ఏమో మరి !
భారతదేశం సరిహద్దు ఆక్రమణ కొరకు తచ్చాడుతు పొరుగు దేశపు విరోధులు ఎగరేసిన జెండా వీడు. భారతదేశం ధార్మికతకు కరుణ,దయ,జాలి,ప్రేమ, సహకారము,సోదర భావన మొదలగునవి భగ్నం చేయడానికి శత్రు దేశస్థులు మన దేశానికి పంపిన ఆటంకవాది.భారతదేశంలోని శాంతి భద్రతలకు ముప్పు కలిగించే నీచుడు వీడు.కామంతో కళ్ళు మూసుకుని పోయి వావి వరసలు మరిచిన మానవ మృగం వీడు.దయా దాక్షిణ్యం లేని నరరూప రాక్షసుడు.నేటి దుర్మార్గులైన యువత మొండి స్వరూపం వీడు.భరతమాత భవితవ్యం గురించి ఆలోచన చేయగా భారత మాత భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తున్నది.దుష్ట వంశ చరిత్ర గల మహాకావ్యంగా గోచరిస్తున్నది.ఒక్కసారిగా నిద్రలో నుంచి లేచి అకస్మాత్తుగా తుళ్ళిపడ్డాను.ఊహా లోకం నుంచి వాస్తవ ప్రపంచంలోకి వచ్చాను.ఆ పూర్ణిమ నాటి చంద్రుని వలె శోభించిన ఆ సుందరి ఏది ?ఆ ఊహా సుందరి ఎక్కడుంది ? ఆ పోకిరి యువకుడు ఎక్కడ ఉన్నాడు? మనసులో రూపొందిన రేఖలతో కూడిన ఊహా చిత్రమేనా ? తాను కల కన్నాడా ? కలా ఇది వాస్తవం కాదా? చిత్రమైన మనసు యొక్క చంచలమైన ఆలోచనా విధానమా? ఇది నిజమా ? ఇది బ్రాంతియా ? ఎటు తేల్చుకోలేని సందిగ్ధ స్థితి డోలాయమానంగా కొనసాగుతుంది.దేశ సంస్కృతిని వదిలి పెడత్రోవ పట్టిన సమాజంలోని యువత సన్మార్గంతో నడుచుకోవాలి.అప్పుడే దేశంలోని యువత భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అని ఊహా సుందరి కవితలోని భావాలు తెలియజేస్తున్నాయి.ఊహా సుందరి కవితలోని భావాలు పఠితులను ఆలోచింపజేసేవిగా ఉన్నాయి.స్వప్నంలో కూడా ఊహా సుందరి పట్ల నిజాయితీతో కూడిన భావనలు వ్యక్తం చేయడం మనలను తెలియని ఊహా లోకంలోకి తీసుకెళ్ళిన తీరు అబ్బురపరుస్తాయి.కవి నారాయణ రెడ్డి (మానారె) ప్రతిభకు ఊహ సుందరి కవిత నిదర్శనంగా నిలుస్తుంది.కవి మాదాడి నారాయణ రెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

మాదాడి నారాయణ రెడ్డి (మానారె) “ ఏకతకు పరిష్కారం “ గేయం పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని.
ప్రముఖ కవి,రిటైర్డ్ ప్రిన్సిపల్,ఎస్.ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల,కరీంనగర్,మాదాడి నారాయణ రెడ్డి (మానారె) కలం నుండి జాలువారిన ఏకతకు పరిష్కారం గేయం పై విశ్లేషణా వ్యాసం.ఏకతకు పరిష్కారం అనే గేయంను ఆసక్తితో చదివాను.ఇది నాకు నచ్చిన గేయం.గేయం చదవగానే నాలో ఆలోచనలు రేకెత్తించింది.ఏకతకు పరిష్కారం ఉంటుందా? అని మనలో సందేహాలు పొడచూపవచ్చు.ఏకత అంటే ఐక్యత,కలిసి ఉండటం.దీనికి ఆంగ్లంలో Unity అని అర్థం.దేశం బలంగా ఉండాలంటే ఆ దేశంలో నివసిస్తున్న ప్రజల్లో ఐక్యత ఉండాలి.దేశం బాగు కోరి ఏమైనా చేయాలి అంటే దాని అంతిమ ఫలితం ఐక్యత వలన సాధ్యపడుతుంది.సంఘీభావం,ఏకత మనిషిని గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి.ఇవాళ దేశంలో లేనిది ఐకమత్యం అని చెప్పవచ్చు.దేశంలో కులం పేరిట,మతం పేరిట మారణహోమం కొనసాగుతుంది.ప్రపంచంలో కూడా అగ్రరాజ్యాలు చిన్న దేశాలపై దాడులు చేస్తూ బాంబులు ప్రయోగిస్తూ ఆధిపత్యం కొరకు పోటీ పడుతున్నాయి.ప్రపంచంలో శాంతిని స్థాపించుట కొరకు ఐక్య రాజ్య సమితి అనే సంస్థ ఉన్నప్పటికీ నామమాత్రంగానే విధులు కొనసాగిస్తూ ఉంది.అగ్ర రాజ్యాల యుద్ధకాంక్షలకు అడ్డుకట్ట వేయలేక పోతున్నది.మానారెకు దేశం పట్ల అపారమైన ప్రేమ ఉంది.మానారె ఏ రాజకీయ పార్టీకి చెందని వారు. మానారె విద్యార్థిగా ఎం.ఏ. (తెలుగు) ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాదులో చదివారు.చదువు పూర్తి కాగానే ప్రభుత్వ కళాశాలలో ట్యూటర్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు.మానారె వివిధ హోదాలలో పని చేస్తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి ప్రిన్సిపల్ గా రిటైర్ అయ్యారు.ఏ సమస్యకు అయినా పరిష్కారం ఉన్నట్లుగా ఏకతకు పరిష్కారం ఉంటుంది అని మానారె తన గేయంలో పేర్కొనడం ఆనందంగా ఉంది.దేశంలో కులం పేరిట మతం పేరిట జరుగుతున్న మారణకాండ ఆవేదన కలిగిస్తుంది.దీనికి పరిష్కారం ఏమిటో తెలియదు. ఏకత సమస్యకు ఒక పరిష్కారం కనుగొనేందుకు అనేక మార్గాలు ఉన్నాయి.ఏకత సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.పరిష్కారం అంటే సమస్య చిక్కుల నుండి విముక్తి చెందే మార్గం తీర్పు అని చెప్పవచ్చు.పరిష్కారం అనేది సులువుగా దొరకని విషయం‌.సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా దేశంలో నలుగుతున్న ఏకత సమస్యను పరిష్కరించడం కొరకు దేశ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.సమస్యకు పరిష్కారం అనేది అడ్డంకులను అధిగమించడం ద్వారా లక్ష్యాన్ని సాధించే ప్రక్రియ.దేశం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్య ఏకత.దానిని ఎంతో సులభంగా పరిష్కరించవచ్చు అని మానారె తెలియజేయడం ఆశ్చర్యం కలుగుతుంది.మానారె రాసిన ఏకతకు పరిష్కారం చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారిద్దాం.దేశ భవితకు మూలమైన ఏకతకు పరిష్కారం తెలుసుకొని దానిని సాధించే ప్రయత్నం చేద్దాం.
“ భేద భావం పురులు విచ్చిన
“ స్వార్థ శక్తులు నడుము కట్టిన
“ వాని వ్యాప్తిని అణచి పెట్టిన
“ జాతి బలమును పుంజుకొనును.
ఇవ్వాళ దేశంలో పురులు విచ్చిన భేద భావం కోరలు సాచి ఎల్లెడలా విస్తరించి ఉంది.పౌరులు భేదభావంతో జీవనం సాగిస్తున్నారు.పౌరులు భేదభావం విడిచిపెట్టి సఖ్యతతో మెలిగితే విభేదాలు తొలగిపోతాయి.ఎవరికీ అందకుండా నాకే చెందాలనుకోవడం స్వార్థం.మనిషి తోటి మనిషికి ప్రతిఫలాపేక్ష లేకుండా సహకారం అందించడం నిస్వార్ధం అని చెప్పవచ్చు.జంతువుల సమూహంలో కూడా జంతువులకు పరస్పర సహకారం ఉంటుంది. పర్వాలేదు మనం సుఖంగా ఉంటే చాలు.నాది అనుకున్నది నాకే దక్కాలి.పరులది కూడా నాకే కావాలి.మరెవరికి దక్కకూడదు అనే మనస్తత్వంతో ఉండే మనుషులు మనకు సమాజంలో తారసపడుతూనే ఉంటారు.అలాంటి వారిని చూస్తే ఉద్వేగం కలుగుతుంది.అలాంటివారు స్వార్థ శక్తులకు ప్రతిరూపం అని చెప్పవచ్చు.స్వార్థం అనేది ఇతరులతో సంబంధం లేకుండా తన కోసం లేదా ఒకరి సొంత ప్రయోజనం ఆనందం లేదా సంక్షేమం కోసం అధికంగా లేదా ప్రత్యేకంగా ఆందోళన చెందడంగా చెప్పవచ్చు.ఇవ్వాళ దేశంలో స్వార్థ శక్తులు విశృంఖల విహారం చేస్తున్నాయి.స్వార్ధ శక్తులు అలజడులకు అల్లరులకు ప్రాణం పోస్తున్నాయి.స్వార్థ శక్తుల వల్ల దేశం విచ్ఛిన్నమైపోతుంది.స్వార్థ చింతన లేని పౌరులు నడుము కట్టి పూనుకొని అలాంటి వారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలి.స్వార్థ శక్తులపై ఉక్కు పాదం మోపి వాటిని అడ్డుకోవాలని మానారె అంటున్నారు. నిజమైన ఆనందం సాటి మనిషికి స్వార్థం లేకుండా సాయం చేయడంలో మాత్రమే ఉంటుంది.స్వార్థం నుండి విముక్తి పొందినప్పుడే ఆ మనిషి విలువ పెరుగుతుంది.భేదభావంతో మెలుగుతున్న స్వార్థపరులైన ప్రజల దురాగతాలను అణిచివేయాలి అని మానారె పిలుపు ఇస్తున్నారు.భేద భావంతో ప్రవర్తించే జనుల,స్వార్థ శక్తుల ఆగడాలు అరికట్టి వేసినచో జాతి బలాన్ని పుంజుకుంటుంది అని మానారె భావిస్తున్నారు.
“ సర్వమానవ సౌభ్రాతృత్వం
“ సర్వ మతాల సమానత్వం
“ అన్ని కులాల అభేద (భావం) తత్వం
“ వెల్లి విరియాలి మన జాతిలో నిత్యం.
కులం అనేది సమాజంలో ఏ వ్యక్తినైనా తేలికగా గుర్తించడానికి ఆర్యులు రూపొందించిన వ్యవస్థ. తమలో తాము వివాహాలు చేసుకుంటూ ఒక విధమైన జీవన సరళిని కొనసాగిస్తూ వచ్చిన సామాజిక వర్గాలకు కులాలు అని పేరు.వృత్తి, ఆచారాలు,సామాజిక స్థాయి వంటి అనేక అంశాలు కులాల్లో పరంపరాగతంగా కొనసాగేవి.ఇవి వంశ పారంపర్యంగా పాటించబడతాయి.సాధారణంగా కులవృత్తులు, కులవివాహాలు,సంస్కృతి,సామాజిక స్థాయి రాజకీయాలపై అత్యంత ప్రభావాన్ని చూపుతుంది.దేశంలో ఇంకా కుల వ్యవస్థ కొనసాగుతున్నది.కుల వ్యవస్థ వలన కొన్ని దురాచారాలు ఏర్పడినవి.భారత దేశంలో కులం అనే పదం జాతి లేక సామాజిక వర్గాన్ని సూచిస్తుంది.ఆకృతి,ధర్మము మొదలైన వాటిలో సమాన దృష్టితో ఆలోచించి చేసే విభాగం జాతి. వంశపారంపర్యంగా వచ్చే కుల సంప్రదాయం జాతి. పూర్వీకుల నుండి వచ్చు వర్గం లేక సమూహం జాతి.అనేక ఉపజాతులు గల వర్గం జాతి. సౌభ్రాతృత్వం అనునది సోదరత్వం.సాధారణంగా ఈ పదం సమాజంలో గల విభిన్న మతాలకు వర్గాలకు భాషలకు సంస్కృతులకు అతీతంగా మానవుల మధ్య గల ప్రేమ,గౌరవాల భావనలనే సౌభ్రాతృత్వం అని నిర్వచిస్తారు.సర్వ మానవ ప్రేమ,మానవ కల్యాణం,విశ్వమానవ సమానత్వం, వసుధైక కుటుంబం మున్నగు ఉన్నత భావనలు,సత్ – నీతి,ప్రకృతి నియమాలు,విశ్వజననీయ మానవ సూత్రాలు,సమ్మిళిత సామాజిక స్పృహలు మూల వస్తువులు కలిగిన ఓ విశాల దృక్పథమే సౌభ్రాతృత్వంగా చెప్పవచ్చు.విద్య,వృత్తి నైపుణ్యాలు,నీతి,జాతి,మతాలు,రాజకీయాలు, దానధర్మాలు,వ్యక్తిగత ఆదర్శాలు,సేవారంగం, కళలు,కుటుంబ అధికారాలు మున్నగు అనేక రంగాలలో పెంపొందించవచ్చు.సౌభ్రాతృత్వం వలన పరస్పర అవగాహన,సహకారం,ఉత్పాదకతల అభివృద్ధిని శాంతియుత జీవనాన్ని సాధించవచ్చు. సౌభ్రాతృత్వం వలన ధర్మబద్ధమైన జన జీవనం అనే కొత్త వరవడిని సృష్టించవచ్చును.సౌభ్రాతృత్వానికి ప్రపంచంలో ఏ విషయాన్ని అయినా సాధించగలిగే శక్తి ఉంది.సౌభ్రాతృత్వం మాటల్లో వర్ణించడానికి సాధ్యం కాని ఉన్నతమైన భావన.మనసు నుండి జనించే ఓ విశాల దృక్పథం.దానిని భౌతికంగాను ఆధ్యాత్మికంగాను కొలవనువచ్చు.సౌభ్రాతృత్వం వలన మానవునికి అనేక రంగాలలో దూసుకుని వెళ్లే అద్భుతమైన నైతిక స్థితి ఏర్పడుతుంది. భారతీయులం మనం అందరం ఒకటే అనే భావనతో మెలగాలి.మనం అందరం భారతమాత బిడ్డలం.కష్టసుఖాలలో అందరం కలిసి మెలిసి ఉండాలి.మనం అందరం ఒకే తల్లికి పుట్టిన బిడ్డలం. మనం అందరం అన్నదమ్ముల వలె ఐక్యతతో మెలగాలి.తల్లి బిడ్డలు ఎలా కలిసిమెలిసి ఉంటారో, సుఖదుఃఖాలను ఏ రీతిగా కలిసి పంచుకుంటారో, అదే విధంగా సర్వమానవులు సౌభ్రాతృత్వంతో సోదర సోదరీ భావంతో ప్రవర్తిల్లాలి.ఎదుటి వారికి కష్టం వస్తే వారి కష్టాలలో పాలు పంచుకొని వారి దుఃఖాన్ని దూరం చేసి సహాయపడాలి.మన భారతదేశంలో హిందూ, ఇస్లాం,క్రిస్టియన్ మొదలైన ఎన్నో మతాలు వ్యాపించి ఉన్నాయి.మన దేశ పౌరులు తమకు ఇష్టమైన మతాన్ని అవలంబిస్తారు. భారతదేశం లౌకిక దేశంగా ప్రసిద్ధి పొందింది.మన దేశ పౌరులు తమకు ఇష్టమైన దైవాలను పూజించుకుంటారు.భారతదేశంలోని పౌరులందరికీ రాజ్యాంగం ద్వారా మత స్వేచ్ఛ కల్పించబడింది. భారతదేశంలో నివసించే ప్రజలు నా మతమే గొప్పది,నా మతమే శ్రేష్టమైన మతం,నా దేవుడు గొప్పవాడు అంటే, లేదు.నా దేవుడే గొప్పవాడు అని కలహించుకోకుండా ఉండాలి.అన్ని మతాలు దేవుడు ఒక్కడే అని చెబుతున్నాయి.అన్ని మతాల పూజా విధానాలు మాత్రం వేరు వేరుగా ఉన్నాయి.అన్ని మతాలు సమానం అనే ఆలోచన భారతదేశంలో నివసిస్తున్న ప్రజల్లో నెలకొంటే శాంతియుతమైన సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. మనదేశంలో అనాదిగా అనేక రకాల కులాలు ఉన్నాయి.విభిన్న కులాలుగా శాఖోపశాఖలుగా కుల వ్యవస్థ వేళ్ళూని ఉంది.భారతదేశంలోని ప్రజలు కుల విద్వేషాలు,కుల వైష మ్యాలు తొలగి సోదర భావంతో సఖ్యతగా మెలగాలి.మా కులమే గొప్ప అనే ఆలోచనలు జనుల మనస్సులలో నాటుకుపోయినాయి.అంతే కాక ప్రతి కులంలో మరిన్ని ఉప కులాలు ఏర్పడి మనుషుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.మానవులందరిది ఒకే కులం.అన్ని కులాలు సమానం అనే భావనతో మానవ కులంగా రూపుదిద్దుకోవాలి.కులాల మధ్య చెలరేగే కులాల కుంపట్లు అనే భేద భావం తొలగిపోవాలి.మంచి అన్నది మాల అయితే మాలనే అగుదును అని మహాకవి గురజాడ అప్పారావు తన గేయంలో పేర్కొన్నారు.గురజాడ అందించిన స్ఫూర్తిని ప్రజలు అనుసరిస్తే అన్ని కులాల రూపురేఖలు మారిపోతాయి.మన అందరిది ఒకే కులం అనే భావన వస్తే గొప్ప సమాజం రూపు దాల్చుతుంది అనుటలో సందేహం లేదు. భారతదేశంలో నివసిస్తున్న పౌరులు అందరు తమది భారత కులంగా తలంచాలి.మన దేశ ప్రజలంతా ఇటు వంటి గొప్ప ఆలోచనలతో మెలగాలి.మన దేశంలోని ప్రజల్లో మార్పు వస్తే గొప్ప జాతిగా ఖ్యాతిని పొంది ప్రపంచమంతటా విస్తరిస్తుంది.మన దేశంలోని ప్రజల్లో సర్వ మానవ సౌభ్రాతృత్వం అనే భావన ఆచరణలోకి రావాలి.మన దేశ ప్రజల్లో సర్వ మతాల సమానత్వం అనే భావన ప్రోది చేసుకోవాలి. మన దేశ ప్రజల్లో నెలకొన్న భేద భావాలు తొలగిపోయి అన్ని కులాలు కలిసి మెలిసి ఉండాలి. విశాల భావాలతో నిండిన మన దేశ ప్రజల్లో సుఖసంతోషాలు వెల్లి విరిసి జాతి ఖ్యాతి ఇనుమడిస్తుంది అని కవి మానారె చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ రక్త పిపాసి రాక్షస మూకల
“ అడ్డు కొనాలి శౌర్యపు వాకల
“ లంచం కోరే నీచుల చేతుల
“ బంధించాలి నీతుల గొలుసుల.
స్వార్థపరులుగా మారి హింసా మార్గంలో పయనిస్తూ రక్త దాహానికి అలవాటు పడ్డ కనికరం లేని రాక్షసుల సముదాయాన్ని అడ్డుకోవాలి.మనిషిలోని రాక్షస ప్రవృత్తిని మానిపించాలి.స్వార్థపరులను దయాపరులుగా,పరోపకారులుగా,గొప్ప మనసున్న మనుషులుగా మార్చాలి.సరియైన చదువు, సంస్కారం లేక రాక్షసులుగా తయారయ్యారు. పెద్దలు,గురువుల శిక్షణ లేక సరైన మార్గదర్శనం లేక స్వార్థపరులుగా,అసాంఘిక శక్తులుగా తయారై సమాజానికి తీరని ద్రోహం చేస్తున్నారు. మనుషులుగా జన్మించినప్పటికి కఠిన చిత్తులుగా, కర్కోటకులుగా,కాముకులుగా,హంతకులుగా,రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారు.సమాజానికి చేటు చేస్తున్న నరహంతక రాక్షసులను శౌర్యవంతులై ఎదుర్కోవాలి.ధైర్యవంతుల శౌర్యపు ప్రవాహాలే ఇలాంటి దుర్మార్గుల పాపపు పనులకు అడ్డుకట్టగా నిలుస్తాయి.రాక్షస ప్రవృత్తి గల మనుషుల మనస్సులను మార్చడం శౌర్యవంతుల వల్లనే సాధ్యమవుతుంది.సమాజంలో విచ్చలవిడిగా లంచగొండితనం పెరిగిపోయింది.ఏ పని కావాలన్నా లంచం ఇవ్వనిదే జరగని దుస్థితి ఏర్పడింది.మంచి పూల తోటలోనికి ఒక్క గుడ్లగూబ చొరబడితే చాలు, ఆ పూల తోట అంతా నాశనం అవుతుంది. అటువంటిది కొమ్మ కొమ్మకు రెమ్మ రెమ్మకు గుడ్లగూబలు ఉంటే ఆ పూల తోట పూర్తిగా విధ్వంసం కాకుండా ఉండగలదా? పూల తోట లాంటి సమాజంలోకి కలుపు మొక్కలాంటి దుర్మార్గులు ప్రవేశిస్తే ఏమవుతుంది? పూల తోటలోకి దుర్మార్గులు ప్రవేశిస్తే తోటను విధ్వంసం చేస్తారు. పూల తోటలోనుండి కలుపు మొక్కలను ఏరివేయాలి.పూల తోటలోకి గుడ్లగూబ వచ్చి చేరినట్లయితే దానిని తరిమి వేయాలి.పూల తోట లాంటి సమాజాన్ని కాపాడుకోవాలనే సందేశం చక్కగా ఉంది.అన్నిచోట్ల సర్వత్రా ఇందు గలడు అందు లేడు అని చెప్పినట్లు అంతటా లంచగొండితనం వ్యాపించి ఉంది.సమాజంలో నెలకొన్న లంచగొండితనంను పూర్తిగా అరికట్టాలి. లంచగొండితనం ఏ రూపంలో ఉన్నా దానిని పారదోలితేనే సమాజం పూర్తిగా అభ్యుదయ పథంలో కొనసాగుతుంది.లంచం తీసుకుంటూ పట్టుబడిన వారిని అవినీతి నిరోధక శాఖ నామమాత్రంగా కేసులు పెట్టి వదిలివేస్తున్నారు. లంచం తీసుకున్న అవినీతిపరులకు ఎలాంటి శిక్షలు పడటం లేదు.అవినీతి నిరోధక శాఖ లంచగొండులపై కేసులు పెట్టినప్పటికీ సరియైన సాక్ష్యాలు చూపించకపోవడం వల్ల కేసులు వీగిపోతున్నాయి. అవినీతి నిరోధక శాఖ లంచగొండులను ఏమీ చేయదు అనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. అవినీతి నిరోధక శాఖ గుట్టు ప్రజలకు తెలిసిపోయింది.లంచగొండులను నీతిపరులుగా, ధర్మపరులుగా మార్చాలి.లంచగొండుల చేతులకు ఇనుప సంకెళ్లు వేయడం ద్వారా కాకుండా నీతులు అనే గొలుసులతో బంధించాలి.సమాజంలోని ప్రతి ఇంటిలోని వారిని నీతిపరులుగా మార్చాలి.అప్పుడు సమాజంలో లంచగొండులనే వారు ఉండరు.
“ జాతి జీవం దాని సంస్కృతి
“ జాతి చేతన దాని విస్తృతి
“ జాతి వేదన కేది నిష్కృతి
“ జాతి ఏకతయే పరిష్కృతి.
జాతి చక్కగా మనుగడ సాగించడానికి సనాతన కాలం నుండి వస్తున్న ఆచార వ్యవహారాలు,ధార్మిక అంశాలతో కూడిన ప్రవర్తన ప్రధానం.జాతి యొక్క సంస్కృతి సంప్రదాయాలే జాతిని సజీవంగా నిలుపగలుగుతాయి.జాతి చేతన జాగృతమయితే జాతి చేతనత్వాన్ని పొందితే తమదైన సంస్కృతిని తిరిగి ఆచరణలోకి పెడితే ఆ జాతి వ్యాప్తిని పొందుతుంది.ఇటువంటి లోపాల చేత మానవ జాతి అంతా ఆపదలకు కష్టాలకు లోనవుతున్నది.జాతి ఎదుర్కొంటున్న బాధలకు నిస్కృతి ఏది? భారతదేశం ఎదుర్కొంటున్న భేద భావన, కులమతాల చిచ్చు,మానవ మృగాల రాక్షస కృత్యాలు,అవినీతి కరాళ నృత్యం మొదలైన వాటి వల్ల సమాజం అనుభవిస్తున్న బాధలు అన్ని తొలగిపోవాలి.ప్రజల మేలుకోరే నీతివంతమైన సుపరిపాలన అందించే రాజ్యం రావాలి.ప్రజా శ్రేయస్సు కోరే నీతి గల,ధర్మం గల రాజ్యం రావాలి. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా సాగే దివ్యమైన మార్గానికి దేశ ప్రజల సమైక్యతే దారి చూపాలి.ప్రజలందరు కుల మత భేదాలను మరచి పోయి తాము అందరం ఒకటే.ఈ దేశం మనది.మనం అందరం మన దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడుతూ కుల మతాలకు అతీతులమై ఐక్యమత్యంతో మెలగాలి అనే ఏకాభిప్రాయానికి రావాలి.భారతదేశ ప్రజలకు కలిగే బాధలన్ని క్రమ క్రమంగా తొలగి పోతాయి. ప్రజలందరు సుఖసంతోషాలతో అలరారుతూ ప్రశాంతమైన జీవనం సాగిస్తారు.ఏకతకు పరిష్కారం అనే చక్కటి గేయం ద్వారా సమాజానికి స్ఫూర్తిని అందిస్తున్న కవి మాదాడి నారాయణరెడ్డిని (మానారెని) అభినందిస్తున్నాను.మానారె మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
మాదాడి నారాయణ రెడ్డి ” ఏదీ కొత్తదనం?”
కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన: నరేంద్ర సందినేని
ప్రముఖ కవి, ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్,మాదాడి నారాయణ రెడ్డి (మానారె) కలం నుండి జాలువారిన “ఏది కొత్తదనం? కవిత పై విశ్లేషణా వ్యాసం.కవిత
ఏమిటని ఆసక్తితో చదివాను.నాలో ఆలోచనలు
రేకెత్తించింది.కొత్తదనం యొక్క అర్థం కొత్తగా ఉండే స్థితి లేక భావము.The quality of being new and original not derived from something else.కొత్తదనం అంటే నూతనత్వం.
“తమ్ముడూ! పాత రోతగా ఉంది కదూ!
సామెత: కొత్త ఒక వింత… పాత ఒక రోత అనేది నిజం. ఎందుకంటే కొంత మందికి పరిచయం అయిన కొత్తలో మన మీద ఉన్నంత గౌరవం తర్వాత ఉండదు.కొత్తగా ఏదైనా వచ్చాక పాత దాని విలువ మర్యాద పోతుంది.అదే వస్తువు అయినా,ప్రేమ అయినా,మనిషి అయినా,కొత్త వింత…పాత ఒక రోత.ఇది నిజం.కొత్త బంధువులకు,కొత్త స్నేహితులకు,ఇచ్చే విలువ పాత బంధువులకు, పాత స్నేహితులకు,ఇవ్వరు.పాత రోత అనిపిస్తుంది. ఇది లోక నైజం.ఈనాటి నవీన మానవుడు నిత్య నూతనంగా జీవిస్తాడు.ఏదైనా కొత్త అనుకోకుండా ఆశ్చర్యపరిచేలా జరిగితే అదో వింత విడ్డూరం? కానీ ఇదంతా సహజమేగా అనిపిస్తే అది సర్వసాధారణం!!
“నీవీ క్షణంలో కొత్త అనుకుంటున్నది “మరు క్షణంలో పాత కాదా మరి
మనం ఒకసారి మనసుపెట్టి ఆలోచిస్తే ఈ క్షణంలో కొత్త అనుకుంటున్నది మరు క్షణంలో పాత అవుతుంది.నిజమే.ఒప్పుకోవాల్సిన విషయంగా తోస్తుంది.నారాయణరెడ్డి (మానారె) కవి భావన అద్భుతం…
“సూర్యుడూ చంద్రుడూ “గ్రహాలు తారలూ “వెలుగులు చీకట్లూ “ఆ ఆకాశం ఈ భూమి. “అన్నీ పాతవే గదా.
సూర్యుడు సౌర వ్యవస్థలో మధ్యలో ఉన్న నక్షత్రం. పగటిపూట వెలుగులు ఇచ్చే గ్రహం.తూర్పు నుండి సూర్యుడు ఉదయించిన వెంటనే చీకట్లు పారిపోతాయి.చంద్రుడు రాత్రి పూట నక్షత్రాలతో పాటు కనిపించేది.భూమి చుట్టూ తిరిగే ఒక గ్రహం. చంద్రుడు సూర్యుడి ప్రకాశం వలన వెలుగుని ఇస్తున్నాడు.గ్రహం అంటే అంతరిక్షంలో ఒక ఆకృతి. ఇది తన కేంద్రకమైన సూర్యుడు లేక నక్షత్రం చుట్టూ ఒక నిర్దిష్టమైన కక్ష్యలో పరిభ్రమిస్తూ ఉంటుంది. బరువును గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉంటుంది. గ్రహాలు తొమ్మిది.ఖగోళ శాస్త్రంలో సూర్యుని చుట్టూ తిరిగే తొమ్మిది గోళాలు.బుధుడు,శుక్రుడు,భూమి, కుజుడు (అంగారకుడు),బృహస్పతి (గురువు), శని,యురేనస్ (వరుణుడు),నెప్ట్యూన్. (ఇంద్రుడు), ఫ్లూటో (యముడు). తారలు అంటే ఆకాశంలో రాత్రిపూట ప్రకాశించేవి అని అర్థం.భూమి నుంచి చాలా దూరంగా ఉన్న కారణంగా చుక్కలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి.వెలుగులు అంటే కాంతులు. వెలుగు కిరణాలు పరిసరాలను కనిపించకుండా ఆవరించిన చీకట్లను పారద్రోలి వాటిని సుస్పష్టంగా కనిపింప చేస్తాయి.వెలుగు ప్రసరించడం చేత ప్రకృతి శోభాయమానంగా ఆహ్లాదకరంగా ఉంటుంది.వెలుగు ప్రశాంతమైన సుఖమయమైన జీవితానికి ప్రతీక. చీకటి అర్థం వెలుతురు లేని స్థితి.సూర్యుడు అస్తమించడంతో అంతట అంధకారం అలుముకుంటుంది.ఈ చీకటి మనం చేసే పనులకు ఆటంకం కలిగిస్తుంది.చీకటి అర్థం ఖాళీగా ఉండడం.ఉదాహరణకు భార్య మరణించిన తర్వాత అతని జీవితంలో శూన్యం ఏర్పడింది. దుఃఖమయమైన అతని బ్రతుకు అందకార బంధురమైందని చీకటిమయమైందని చెప్పుకుంటాం.అంటే సుఖాలకు వెలుగు ప్రతీక అయినట్లుగా,కష్టాలకు చీకటి ప్రతీక అని చెప్పవచ్చు.ఆకాశం ఆరు బయట నుండి పైకి చూస్తే మనకు కనిపించే నీలిరంగు ఆవరణమే ఆకాశం. ఆకాశం వికృతి పదం ఆకసము.భూమి ఉపరితలంపై ఉండే మేఘాలు నీటి ఆవిరితో కూడిన వాయు ఆవరణాలపై పడిన సూర్యకాంతి పరావర్తనం చెందడం వలన ఆకాశం మనకు నీలి రంగులో కనబడుతోంది.కానీ నిజానికి ఆకాశం ఏ రంగును కలిగి ఉండదు.అందుకే మనకు రాత్రి సమయంలో ఆకాశంలో సూర్యకాంతి లేకపోవడం వలన చీకటిగా కనిపిస్తుంది.ఆ చీకటిలో అనంత దూరంలో ఉన్న నక్షత్రాలు,గ్రహాలు,చిన్న చిన్న చుక్కలుగాకనిపిస్తాయి.ఆకాశం భూమి ఇతర గ్రహాలు మరియు నక్షత్రాలకు మధ్య ఉన్న స్థలం. నక్షత్రాలు,చంద్రుడు,సూర్యుడు మొదలైనవి ఉండే శూన్య ప్రదేశం.వెన్నెల రాత్రిలో ఆకాశం కాంతిగా కనబడుతుంది.పంచ భూతాలలో ఆకాశం ఒకటి. అంతు తెలియజాలనిది ఆకాశం.భూమి సౌర కుటుంబంలోని గ్రహాల్లో భూమి ఒకటి.మానవునికి తెలిసిన ఖగోళ వస్తువుల్లో జీవం ఉన్నది భూమి ఒక్కటే.భూమి 450 కోట్ల సంవత్సరాల కింద ఏర్పడిందని తెలుస్తోంది.భూమి గురుత్వ శక్తి అంతరిక్షంలోని ఇతర వస్తువులపై ముఖ్యంగా సూర్య చంద్రులపై ప్రభావం చూపిస్తుంది.భూమి సూర్యుని చుట్టూ 365.26 రోజులకి ఒక్కోసారి పరిభ్రమిస్తుంది.దీన్ని ఒక భూ సంవత్సరం అంటారు. ఇదే కాలంలో భూమి 366.26 సార్లు తన చుట్టూ తాను తిరుగుతుంది.దీన్ని భూ భ్రమణం అంటారు. భూమి నీరు లేకుండా ఉండే ప్రదేశం. భూమండలంలో మూడవ వంతు భాగం భూమి. ప్రాణులు ఉన్న ఒకే ఒక గ్రహం.చందమామ భూమి యొక్క ఒక ఉపగ్రహం.భూమి మనం నివసించు ప్రదేశం.అది మనకు తల్లి వంటిది.భూమిలో పండే పంటలే జీవులకు జీవనాధారం.అవును సూర్యుడు, చంద్రుడు,గ్రహాలు,తారలు,వెలుగులు,చీకట్లు,ఆ ఆకాశం,ఈ భూమి,అన్నీ పాతవే కదా అని కవి నారాయణరెడ్డి (మానారె) భావాల్లో ఎంతో బలం ఉంది.మనం ఒప్పుకోవాల్సిన విషయంగా తోస్తుంది.
“నిన్ను కన్న తల్లీదండ్రీ
“హితులూ సన్నిహితులూ
“పాత వారు కారూ?
అని నారాయణ రెడ్డి (మానారె) మనల్ని ప్రశ్నిస్తున్నారు.తల్లిదండ్రి కుటుంబంలోని సంతానానికి కారకులు తల్లిదండ్రులు.సృష్టిలో ప్రాణికి మూల కారణం అమ్మ.కన్నతల్లి బిడ్డను నవ మాసాలు గర్భాశయంలో పెంచి తర్వాత జన్మనిచ్చిన స్త్రీ మూర్తి.ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. నిజమే.కన్న తల్లిదండ్రులు,మన హితం కోరే హితులు,మన మేలు కోరే సన్నిహితులు,పాత వారే అని ఒప్పుకోవాల్సిన విషయంగా తోస్తుంది. అయినప్పటికీ కన్న తల్లిదండ్రులను,హితులను, సన్నిహితులను,పాతవారని తీసిపారేయాల్సిన వ్యక్తులు కాదని మనలను ఆలోచన తరంగాలలో తేలియాడ జేస్తున్నారు.
“ఎంతగానో నీవభిమానించే
“నిత్యం కొత్తగా ఊహించే
“నీ శరీరం పాతది కాదూ?
మనని మనం ప్రేమించుకుంటాం.మనని మనం అభిమానించుకుంటాం.మనల్ని మనం కొత్తగా ఊహించుకుంటున్న మన శరీరం పాతది కాదు అని ప్రశ్నిస్తున్నారు.అవును మన శరీరం పాతదే.మనం
అభిమానించుకుంటున్నది నిజమే.కాదనలేని సత్యం నారాయణరెడ్డి (మానారె) కవి భావన వాహ్…
” నీవు ఆడే ఆట పాడే పాట
“తినే తిండి చదివే చదువు
“ప్రియాతిప్రియంగా నీవు భావించే
“ఇల్లాలు మరి పిల్లలు
“కొత్తవారేనంటావా? మనం నిత్యం ఏదో ఒక ఆట ఆడుతుంటాం.మనం ప్రతి రోజు ఏదో ఒక పాట మనకి ఇష్టమైనది పాడుతుంటాం.మన ఇష్టంగా తినే తిండి,మనం ఇష్టంగా చదువుతున్న చదువు,మనకు ప్రియాతిప్రియంగా మనలో బాగమని భావించే ఇల్లాలు హృదయేశ్వరి,మన సంతానమైన పిల్లలు కొత్త వారేనంటావా అని కవి నారాయణ రెడ్డి (మానారె) ప్రశ్నిస్తున్నారు.కొత్త వారు కాదని మనం తెలుసుకోవాల్సిన విషయంగా తోస్తుంది.కవి భావనలో సత్యం ఉంది.
“కొత్త మాటల్లో లేదు
“మాటలకు మూలమైన భావనలో ఉంది
కొత్త అనేది మనం మాట్లాడే మాటల్లో లేదు మాటలకు మూలమైన భావనలో ఉంది అని మనకు గుర్తు చేస్తున్నారు.కవి నారాయణరెడ్డి (మానారె) చక్కటి భావం వ్యక్తం చేసిన తీరు అబ్బురపరుస్తుంది.
“ఈర్ష్యా – ద్వేషం – కసి
“నిరాశ- నిస్పృహ- నిరీహల్ని
“దూరంగా సుదూరంగా త్రోలి
“అందరికీ ఆనందం పంచు
“అందరితో కలిసి బ్రతుకు
ఓర్వలేనితనం మరియు శత్రుత్వం,పగ,కోపం,ఆశ లేనితనం,స్పృహ లేకపోవడం,తనకు తాను మరిచిపోవడం,కోరికలు లేకుండా ఉండటం, వీటినన్నిటిని దూరంగా,సుదూరంగా పంపించి మంచి మనసుతో అందరికీ ఆనందం పంచుతూ అందరితో కలిసి బ్రతుకు అని కవి ప్రబోధిస్తున్నాడు.
“అప్పుడు నీవు కోరే కొత్త
“అంతటా అన్నిటా లభిస్తుంది
నీవు ఒక మంచి మనిషిగా మారతావు.అప్పుడు నీవు కోరే కొత్తదనం అంతటా అన్నిటా లభిస్తుంది.నీ జీవితంలో వెలుగులు విరజిమ్ముతాయి.నీవు కోరుకునే కొత్తదనం నీకు లభిస్తుంది.ఏది కొత్తదనం కవిత ద్వారా చక్కని సందేశం అందించారు.కవి మాదాడి నారాయణరెడ్డి (మానారె) కలానికి వందనాలు చేస్తున్నాను.మానారె కలం నుండి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయాలని మనసారా కోరుకుంటున్నాను.

You may also like

Leave a Comment