Home వ్యాసాలు కవిత్వాస్వాదన – ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

కవిత్వాస్వాదన – ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni

గంటా మనోహర్ రెడ్డి రచించిన “అమ్మా నువ్వెవరు ? కవిత

ప్రముఖ కవి,విశ్రాంత వాణిజ్య పన్నుల అధికారి, గంటా మనోహర్ రెడ్డి,కలం నుండి జాలువారిన ఘంటా పథం కవితా సంపుటిలోని అమ్మా నువ్వెవరు?కవితపై విశ్లేషణా వ్యాసం.ఈ కవితా సంపుటి 1981 సంవత్సరంలో ముద్రించబడింది.ఈ కవిత భారతదేశం స్వాతంత్ర్యం పొంది ముప్ఫయి సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భాన ఆనాటి సామాజిక,సాంఘిక,రాజకీయ ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబిస్తున్నది. స్వాతంత్ర్యానంతరం కూడా దేశం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది.భారత దేశానికి పట్టిన దుర్గతిని,ప్రజలు ఎదుర్కొంటున్న ఈతి బాధలను,సమాజంలో పేరుకుపోయిన రాజకీయ అవినీతిని తన గాఢమైన భావాలతో వ్యక్తపరుస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఈ కవితలో కవి దేశమాతను నువ్వెవరివమ్మా?అని ప్రశ్నించడం దానికి భారత మాత సమాధానం చెబుతూ నేనో నష్టజాతకురాల్ని,స్వాతంత్ర్య భారతిని అని దిగులుతో చెప్పడం వేదన కలిగిస్తుంది.కవి మనోహర్ రెడ్డి రాసిన అమ్మా నువ్వెవరు?కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతుల లోకంలో విహరించండి.”కళ తప్పిన కళ్ళు,కాంతి లేని చెక్కిళ్ళు/అదే పనిగా వినబడుతున్న వెక్కిళ్లు/మూడు పదులకే ముసలి రూపు వచ్చేసిన నీ ఒళ్ళు/ఇంతకూ ఎవరమ్మా నువ్వు?అని అంటున్నారు.ఒక భావోద్వేగంతో రూపు దాల్చిన కవితను చదువుతుంటే దుర్భరమైన జీవితం గడుపుతున్న అమ్మ గురించి చెప్పినట్లు అనిపిస్తోంది.అమ్మ శరీరంలోని అవయవాలు అన్ని బాధలకు గురి అయి ఉన్నాయి.అమ్మ కళ్ళు కళ తప్పి పోయినట్లుగా ఉన్నాయి.అందంతో నిగనిగలాడే అమ్మ చెక్కిళ్ళు పేలవంగా,కాంతి విహీనంగా కనిపిస్తున్నాయి.ఆకలి,అనారోగ్యంతో అమ్మకు ఎడతెగకుండా వెక్కిళ్లు వస్తున్నాయి. జీవితంలో ఎన్నో బాధలు అనుభవించిన అమ్మకు ముప్పై ఏళ్ల వయసులోనే వృద్ధాప్యపు ఛాయలు ఆవరించాయి.కవితలోని భావాలు అమ్మ జీవితంలోని కష్టాలను,శారీరకంగా,మానసికంగా, సామాజికంగా ఎదుర్కొన్న దుర్భర పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయి.ఎవరమ్మా నువ్వు?అని అడుగుతున్నాడు.దేశ మాత అయిన తల్లిని మాత్రమే కాదు.ఆ కష్టాలను అనుభవించే ప్రతి మహిళను ప్రతినిధిగా చూపుతున్నట్లుగా తోస్తోంది. మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు వాటికి కారణమైన పరిస్థితులు ఏమిటి?ఇందుకు సమాజం యొక్క పాత్ర ఏమిటి?అని తెలియజేయాలన్న లక్ష్యంతో కవిత రాయబడినట్లుగా తోస్తుంది.కళ తప్పిన కళ్ళు,కాంతి లేని చెక్కిళ్ళు అనేది ఆమె శారీరక,మానసిక దుస్థితిని ప్రతిబింబిస్తోంది.అదే పనిగా వినబడుతున్న వెక్కిళ్ల ద్వారా ఆమె భావోద్వేగాలను గుండె నిండా పొంగిపొరలే బాధను వ్యక్తం చేస్తున్నారు.మూడు పదులకే ముసలి రూపు వచ్చేసిన ఒళ్ళు అంటే చిన్న వయసులోనే ఆవిడ జీవితం అనేకమైన కష్టాల సుడిగుండంలో చిక్కి కృంగి పోయిందని భావిస్తున్నారు.ఇంతకు ఎవరమ్మా నువ్వు?అని కవి ప్రశ్నించడం ద్వారా ఆమె జీవిత కథ,బాధలకు కారణాలు ఏమిటి?తెలుసుకోవాలనే ఆసక్తి గోచరమవుతుంది.ఇది కష్టాలలో ఉన్న మహిళల జీవన స్థితిగతులపై దృష్టి సారించి వారి బాధలను గుర్తించాలని హృదయగతమైన భావాలకు ప్రతీకగా నిలుస్తుంది.“వెయ్యేళ్ళ దుర్భర దారిద్ర్యాన్ని/అనుభవిస్తున్న వ్యక్తిలా విలపిస్తున్నావు/ అంటున్నారు.ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా భారతదేశం బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుండి విడివడినది.అరాచకపు పరాయి పాలన నుండి ఆగస్టు15,1947 రోజున భారతదేశం విముక్తి పొందింది.బ్రిటిష్ వారు మన దేశ సంపదను అక్రమంగా దోచుకుని వెళ్ళినారు.బ్రిటిష్ వారితో పోరాడి స్వాతంత్య్రం సాధించినప్పటికీ దేశం తన పూర్వ వైభవాన్ని కోల్పోవడం బాధను కలిగిస్తుంది. భారతదేశం ఇప్పటికీ ఆర్థికంగా,సామాజికంగా దోపిడీకి గురి అయి విలవిలలాడుతున్నది.కవి దేశ మాతను ఉద్దేశించి వెయ్యేళ్ల దుర్బర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వ్యక్తిలా విలపిస్తున్నావు అని ప్రశ్నించడం చక్కగా ఉంది.”చీకట్లోంచి చీకట్లోకే పరుగులు తీస్తున్న పిచ్చిదానిలా ఉన్నావు/ అంటున్నారు.దేశం అభివృద్ధి కోసం ఎన్ని ప్రణాళికలు రచించినప్పటికీ ఆచరణలో అమలు కావడం లేదు.ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేపడుతున్న పలు అభివృద్ధి పథకాలలో అవినీతి చోటుచేసుకున్నది.అవి సత్ఫలితాలను అందివ్వడం లేదు.దేశం ఇంకా సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయి విలవిలలాడి పోతున్నది.ఇది దేశ రాజకీయాల్లో చోటు చేసుకున్న అవినీతి పాలనకు తార్కాణంగా నిలుస్తుంది.ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర విమర్శను సంధించినట్టుగా తోస్తుంది.“నాడు నయాగరా జలపాతంలా కళకళలాడే నువ్వు/ నేడెందుకో సహారా ఎడారిలా వెలవెలబోతున్నావు/ అంటున్నారు.ఒకప్పుడు దేశం ఎంతో సమృద్ధిగా కళకళలాడేది.ఎంతో వైభవంగా అలరారిన దేశం మనది.ప్రకృతి అందాలకు పర్యాయపదంలా ఉండేది.మన దేశం పాడి పంటలతో విలసిల్లింది. ఒకప్పుడు రత్న గర్భగా పేరు పొందిన దేశం మనది. నేడు దేశం దుర్భర దారిద్ర్యం,పేదల ఆకలి కేకలు, అన్నార్తుల అలమటింపులు,నిరాశా నిస్పృహలు ఎల్లెడలా అలుముకున్నాయి అని కవి బాధను వ్యక్తం చేస్తున్నాడు.”గత కాలపు వైభవాల శిథిల శిల్ప సంకేతంలా ఉన్నావు/అంటున్నారు. స్వాతంత్ర్యం సాధించిన తర్వాత భారతదేశం తన పూర్వ వైభవాన్ని కోల్పోయింది.నేడు మన దేశం శిథిల శిల్పాల గుర్తుల రూపంలో మాత్రమే మిగిలి ఉంది.స్వాతంత్ర్యానంతరం కూడా ప్రజలు దయనీయ స్థితిలో జీవనం సాగిస్తున్నారు అనే వాస్తవాన్ని కవితా పంక్తి తెలియజేస్తున్నది.“కుత్సిత రాజకీయ విన్యాసాన్ని తలచుకొని/అదే పనిగా ఆక్రోశిస్తున్నావు/అంటున్నారు.కేవలం కుత్సిత రాజకీయ గందరగోళాల మధ్య చిక్కుకొని దేశం వినాశనాన్ని ఎదుర్కొంటున్నది.ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు కాన రావడం లేదు.దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి.కాని ఎందుకో దేశం అభివృద్ధి కుంటుపడింది అని కవి భావాల ద్వారా వ్యక్తం చేస్తున్న తీరు బాగుంది.“చచ్చిన శవంలా ఉన్నావు/అంటున్నారు.ప్రస్తుతం భారతదేశం శవం వలె చలనం లేని ఉద్దీపన రహిత పరిస్థితిలో ఉంది అని కవితలోని భావాలు తెలియజేస్తున్నాయి.ఇది ప్రజల వైపల్య భయాన్ని ప్రతిబింబిస్తుంది.”శవానికి భయం గొలిపేలా ఉన్నావు/ అంటున్నారు.శవం వలె నీ పరిస్థితి భయంకరంగా ఉంది.విపరీతంగా,అసహజంగా, భయాందోళనతో కూడిన అసహనాన్ని సూచిస్తుంది. చనిపోయిన వ్యక్తి భయానికి లోను కాడు.కానీ చనిపోయిన వ్యక్తికే భయాన్ని కలిగించేలా ఉన్నావు అని చెప్పడం బాగుంది.భయాన్ని సృష్టించడానికి చాలా తీవ్రంగా అశాంతిని కలిగించడాన్ని సూచిస్తుంది.ప్రజల చర్యలు మరియు ప్రవర్తన సహజ సిద్ధంగా ఉండక పోవడం వల్ల వారిని చూసి చనిపోయిన శవానికే భయం గొలిపేలా ఉంది అని చెప్పడం జరిగింది.వ్యంగ్యభరితమైన సమాజపు భావజాలాన్ని ప్రతిబింబించేలా ఈ కవిత ఉంది. ”భవిష్యత్తంటేనే ఎందుకో భయంతో కంపించి పోతున్నావు/అంటున్నారు.భవిష్యత్తు పట్ల ఆశ ఉంటేనే మనిషి మనుగడ కొనసాగుతుంది.మనిషి భవిష్యత్తు పట్ల ఆశను కోల్పోతే మనుగడ ప్రమాదంలో పడుతుంది.ప్రజల్లో భవిష్యత్తు పట్ల ఎడతెగని భయం,తీవ్రమైన నిరాశ నిస్పృహలు కలుగుతున్నాయని కవి స్పష్టంగా తెలియజేస్తున్నాడు.”ఎండిన పెదిమెలతో ఏదో చెప్పాలని వ్యర్థ ప్రయత్నం చేస్తున్నావు/ అంటున్నారు.దేశంలో నివసిస్తున్న ప్రజలు నిరాశ నిస్పృహలకులోనై తమ బాధలను చెప్పేందుకు ఎవరు ముందుకు రావడం లేదని,వారి బాధలు చెప్పేందుకు అవకాశం లేకుండా పోయిందనే భావన వ్యక్తం అవుతున్నది.”నీ బాధలకు నిష్కృతి లేదని అదే పనిగా ఆక్రోశిస్తున్నావు/“ఇకనైనా చెప్పు తల్లీ – నువ్వెవరివమ్మా?/అంటున్నారు.ఆవేదనతో,ఆక్రోశంతో బాధపడుతున్న ఆమెను కవి ప్రశ్నిస్తున్నారు. ఆమె ఎవరో అనేది తెలుసుకోవడమే కాకుండా మనసులో దాగి ఉన్న బాధకు మూలాన్ని కూడా తెలుసుకోవాలనే సంకల్పం వ్యక్తమవుతున్నది. సమాజంలో ఆమె ఎదుర్కొంటున్న కష్టాలు,బాధలు వాటి మూలాలు ఏమిటో తెలుసుకొని పరిష్కారం చూపాలని కవి ఆకాంక్షిస్తున్నాడు.బాధితురాలైన ఆమె గుండెల్లో నిండి ఉన్న బాధను,ఆక్రోశాన్ని తెలియజేస్తున్నాడు.ఆమె ఎదుర్కొంటున్న బాధకు ముగింపు లేకుండా కొనసాగుతున్న పరిస్థితి ఎంతటి క్లేశాన్ని కలిగిస్తుందో గ్రహించవచ్చు.

ఆమె బాధలకు కారణమేమిటో చెప్పాలని కోరుతున్నాడు. సమాజంలో పేరుకుపోయిన అన్యాయం, అసమానతలను గూర్చి ప్రశ్నిస్తున్నాడు.ఈ ప్రశ్న దేశమాత ఆత్మను ఉద్దేశిస్తూ ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకు రావడానికి చేసిన ప్రయత్నాలు ఎందుకు విఫలమయ్యాయని కవి ఆవేదన చెందుతున్నాడు.“కష్ట జీవుల నికృష్ట జీవితాలను కలం కుంచెతో/కాగితపు కాన్వాసు పైన కమనీయంగా చిత్రించాలని/వ్యర్థ ప్రయత్నం చేస్తున్న ఓ కవీ,నేనెవర్నో నీకు తెలీదా?/నేనొక నష్టజాతకురాల్ని నా దురదృష్ట నామధేయం/ స్వాతంత్ర్య భారతి/అంటున్నారు.దేశమాత తనను నష్టజాతకురాలిగా భావిస్తూ స్వాతంత్ర్యం తనకు కలిగించిన వాస్తవ పరిస్థితులపై బాధ పడుతున్నట్లు కవి చెబుతున్నాడు.ఈ కవితను భారతదేశంలోని సామాజిక,ఆర్థిక,రాజకీయ పరిస్థితులపై గాఢమైన ఆవేదనతో కూడిన ఆత్మ విమర్శగా భావించవచ్చు. స్వాతంత్ర్యం లభించిన తర్వాత సామాన్య ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు అని కవి తీరని ఆందోళనను వ్యక్తం చేస్తున్నాడు.ఇది కేవలం ఒక కవిత మాత్రమే కాదు.భారతదేశంలోని ప్రజల హృదయాల్లో నెలకొన్న ఆక్రోశానికి ప్రతీక.భారత దేశంలోని గడచిన సామాజిక, రాజకీయ,ఆర్థిక పరిస్థితులపై విమర్శల సమాహారంగా నిలుస్తుంది. స్వాతంత్ర్యం సంపాదించుకుని 75 సంవత్సరాలు అయిన సందర్భంగా అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం.అయినప్పటికీ దేశమాత పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతున్నది.కవి 43 సంవత్సరాల కింద కవిత రాసినప్పటికీ ఇప్పటికీ దేశమాత పరిస్థితి దుర్భరంగా ఉండడం ఆవేదన కలిగిస్తుంది.ఈ కవిత దేశమాత విలాపంగా చెప్పవచ్చు.కవి మనోహర్ రెడ్డిగారు ఘంటారావం అనే శీర్షికతో వాట్స్ అప్ వేదిక ద్వారా ప్రతి రోజు ఒక కవితను అందిస్తూ తెలుగులో ఘంటారావం అనే ఒక కొత్త కవితా ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వీరు నిర్విఘ్నంగా నేటి వరకు ఘంటారావంలో -1651 కవితలు రాసినారు. వీరు రచిస్తున్న ఘంటారావం కవితలు సుజల స్రవంతిలా నిరంతరం కొనసాగుతునే ఉన్నాయి.వీరు ఘంటారావం శీర్షికన 1008 కవితలతో కవితా సంపుటిని తేది 16 – 11 – 2023 నాడు ఆవిష్కరించడం జరిగింది.వీరు ధారావాహికంగా ఘంటారావం కవితలను అందిస్తున్నందుకు అభినందిస్తున్నాను‌.కవి మనోహర్ రెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
రచన : నరేంద్ర సందినేని.

You may also like

Leave a Comment