Home వ్యాసాలు కవిత్వాస్వాదన —– ధారావాహికవిశ్లేషణా వ్యాసాలు

కవిత్వాస్వాదన —– ధారావాహికవిశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni

ప్రముఖ కవయిత్రి,హిమజ కలం నుండి జాలువారిన సంచీలో దీపం కవితా సంపుటిలోని కోటు — ధోతీ కవిత పై విశ్లేషణా వ్యాసం.కోటు – ధోతీ కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.మనుషులు ధరించే కోటు – ధోతీ గురించి కవిత ఏమిటి? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు.మనుషులు చొక్కా పై కోటును ధరించడం గురించి మనకు అవగాహన ఉంది.ధోతీ పంచె అని పిలువబడే ఒక రకమైన వస్త్రం.ధోతీ అనేది పురుషులు ధరించే వస్త్రం.ధోతీ ఒక దీర్ఘ చతురస్రాకార రూపంలో ఉండే వస్త్రం. సాధారణంగా ధోతి సుమారు 4.5 మీటర్లు (15 అడుగులు) పొడవు,నడుము మరియు కాళ్ళ చుట్టు చుట్టబడి,ముందు లేదా వెనుక భాగంలో ముడి వేయబడి ఉంటుంది.ధోతీని మత పరమైన మరియు లౌకిక వేడుకలలో పురుషులు ధరిస్తారు.పీతాంబరం అనేది పసుపు రంగు పట్టు ధోతి.కొందరు వ్యక్తులు ధోతీని ధరిస్తారు. కొందరు పాయింట్ వేసుకుంటారు. కొందరు నిక్కర్ వేసుకుంటారు.లోకంలో భిన్నమైన మనస్తత్వాలు కలవారు ఉంటారు.భిన్నమైన రీతిలో వస్త్ర ధారణ చేస్తారు.మనుషుల అభిరుచి ఒక్క రీతిగా ఉండదు.వారు ఎవరికి ఇష్టమైన వస్త్రం వారు ధరిస్తారు. కవయిత్రి హిమజ కోటు – ధోతీ కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతిని సొంతం చేసుకొండి.

హిమజ

“ ఆ కాలపు ఆహార్యమో
“ఉద్యోగ ధర్మంగా అనివార్యమో
“ఆదివారం మినహాయించి అన్ని రోజులు
“మామయ్య గారు – కోటుతోనే కన్పించే వారు మాకు.
ఆహార్యం అంటే మేకప్.మేకప్ అంటే ఈ రోజుల్లో అందరికీ అర్థమవుతుంది.వేషానికి ధరించే సామాగ్రి ఆహార్యం తెచ్చుకొనతగినది.నాటకాలలో నటుల హావభావాలకు పాత్రకు తగిన ఆహార్యానికి ప్రాధాన్యత ఉంటుంది.వస్త్ర ఆభరణాలు ఆయా పాత్రలకు సందర్భోచితంగా ఉన్నప్పుడే ప్రేక్షకులకు ఆనందానుభూతి ఏర్పడుతుంది.వీరుడికి కాలోచితంగా కత్తి,డాలు,పిస్టల్,కవచము వంటివి ఆహార్యంలో ఒక భాగం.విషాద సన్నివేశంలో అయితే దానికి తగిన వస్త్రాలు ధరిస్తారు. రసానుగుణంగా పాత్రలు ధరించే ఆభరణాలు, అనులేపనలు అన్ని ఆహార్యంలోనివే.మామగారు ధరించే దుస్తులు అప్పటి కాలానికి సరిపోయే విధంగా ఉండేవి అని తెలుస్తుంది.అతను నిర్వర్తించే ఉద్యోగ ధర్మంలో భాగంగా వస్త్రధారణకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే వాడు అని తోస్తోంది.అతడు ప్రతి రోజు తన విద్యుక్త ధర్మమైన విధుల్లో భాగంగా చొక్కాపై కోటు వేసుకొనే వాడు.ఆదివారం నాడు సెలవు దినం కనుక అతను ఆ రోజు సాధారణంగా మామూలు దుస్తులు ధరించే వాడు.ఆ ఒక్కరోజు మాత్రమే అతను కోటు ధరించే వాడు కాదు.మిగతా రోజులలో చొక్కాపై కోటు వేసుకుని మామయ్య కనిపించే వారు అని కవయిత్రి హిమజ కవితలో చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.
“జమా బందీలు జరిగినా
“శిస్తు వసూళ్లకు సాగినా
“రెవెన్యూ దౌరాలకు కదిలినా “ఒంటినంటుపెట్టుకొని కోటు ఉండి తీరాల్సిందే.
జమాబందీ భారతదేశంలో ఒక నిర్దిష్టమైన భూమికి సంబంధించిన హక్కుల రికార్డును సూచించడానికి ఉపయోగించే హిందీ పదం.జమాబందీలో యజమానుల పేర్లు,భూమి యొక్క విస్తీర్ణం,దాని ఉపయోగం మరియు భూమిపై ఏవైనా తణఖాలు, శిస్తులు వంటి వివరాలను కలిగి ఉంటుంది. పూర్వకాలం నుంచి ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక వనరు భూమి శిస్తు.భూమి శిస్తు వసూలు చేసి ఖజానాకు జమ చేయడం జరుగుతుంది.అతను రెవెన్యూ శాఖలో తహసిల్దారుగా పని చేసే వాడు అని తెలుస్తుంది.అతను తహాసిల్దార్ హోదాలో జమా బందీలకు,సాధారణంగా సంవత్సరానికి ఒక సారి శిస్తుల వసూలు కొరకు జరిగే సమావేశాలకు హాజరయ్యే వాడు. వ్యవసాయ భూముల శిస్తు వసూళ్లకు అధికారికంగా పర్యటించే వాడు.విధి నిర్వహణలో భాగంగా అతడు రెవెన్యూ దౌరాలకు వెళ్లే వాడు.జమా బందీలకు వెళ్లినా,శిస్తు వసూళ్లకు వెళ్లినా,రెవెన్యూ దౌరాలకు వెళ్లినా అతను కోటు ధరించి వెళ్ళే వాడు.అతను వెళ్లే అధికారిక కార్యక్రమాలకు ఒంటినట్టు పెట్టుకొని కోటు ఉండి తీరాల్సిందే అని కవయిత్రి హిమజ కవితలో చెప్పిన తీరు చక్కగా ఉంది.
“పాల తెలుపు అంగీ గ్లాస్కో ధోతీ మీద
“లేత రంగు కోటు ఎంత గంభీరమో అంతే హుందాతనం
“లోపలి మెత్తటి అస్తరుతో కోటు తిర్ల మర్ల తెలియకున్నా
“మామయ్య గారి జీవితమైతే తెరిచిన పుస్తకమే.
అతను పాల తెలుపు రంగు చొక్కా ధరించే వాడు. గ్లాస్కో కంపెనీ తయారుచేసిన ధోతీని కట్టుకునే వాడు.తెల్ల చొక్కాపై లేత రంగు కోటు ధరించిన అతను ఎంతో గంభీరంగా ఉండే వాడు.అతడు హుందాగా ప్రవర్తించే వాడు.అతని నడకలో ఒక రకమైన ఠీవి కనిపించేది.అతను హుందాతనంతో మనోహరమైన అందమైన వర్చస్సుతో ఇతరులను ఇట్టే ఆకర్షించే సుగుణంతో పాటు మర్యాద, మన్ననను పొందే వాడు.అతను వేసుకున్న కోటు లోపలి మెత్తటి అస్తరుతో కూడి ఉండటం వలన కోటు తిర్ల మర్ల తెలిసేది కాదు.మామయ్య గడిపిన జీవితం తెరిచిన పుస్తకం వలె రహస్యాలు, దాపరికాలు,ఏవీ ఉండేవి కావు.అతడు అందరితోనూ ప్రేమగా సౌహార్ధంగా వ్యవహరించే వాడు.అతడు గడిపిన జీవితం ఎలాంటి భేషజాలు లేకుండా ఉండేవి.తెరచిన పుస్తకం అనే మాట మనకు అక్కడక్కడ వినిపిస్తుంది.కనిపించే మనిషి లోపల అగుపించని మనసు ఉన్నంత కాలం అంతా దాపరికం,దాగుడు మూతలు,మాయగా ఉంటుంది. సృష్టిలో జన్మించాక అవసరాలు తీరడం కోసం మనిషి ఒక్కో చోట ఒక్కో తీరుగా వ్యవహరించాలి. తప్పదు.దాన్ని లోకజ్ఞానం అంటారు పెద్దలు.

“ఉద్యోగ బాధ్యతల్లో నిక్కచ్చితనం
“అవినీతికి ఆమడ దూరం – పైస పైస కష్టార్జితం
“తాటాకు మంట కోసం పసి పిల్లల బోళాతనం
“ఆఫీసు ఇల్లు రాముల వారి పూజ
“నుదుట వెలిగే తిరునామమెంత సరళమో
“అంతే సాదా సీదాయైన జీవన సరళి.
రెవెన్యూ శాఖలో ఉద్యోగం అయినప్పటికీ అతను ఎలాంటి ప్రలోభాలకు,అవినీతికి లొంగ లేదు.ఉద్యోగ బాధ్యతలను అతడు నీతిగా,నిజాయితీగా, నిక్కచ్చితనంతో నిర్వహించే వాడు.అతడు అవినీతికి ఆమడ దూరంలో ఉండే వాడు.అతను ఉద్యోగంతో వచ్చిన జీతంతోనే బతుకు బండిని సాగించే వాడు.అతను సంపాదించిన జీతం పైస పైస కష్టార్జితం అని చెప్పవచ్చు. తాటాకు మంట కోసం ఉండే పసిపిల్లల బోళాతనం అతనిలో కనిపించేది.అందరి పట్ల సమాన దృష్టితో పసిపిల్లల వలె అతను వ్యవహరించే వాడు అని తెలుస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా అతను ఉదయం ఇంటి నుండి ఆఫీసుకు వెళ్లే వాడు.ఆఫీస్ పని పూర్తి అయిన తర్వాతనే అతను ఇంటికి చేరుకునే వాడు. అతను ఆఫీస్ బాధ్యతలను ఇంటి బాధ్యతలను సంయమనంతో నిర్వహించే వాడు.ప్రాతఃకాలంలో అతను లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని నుదుట తిరునామం ధరించి ఇంటిలోని రాముల వారిని పూజించే వాడు.అతడు నుదుట ధరించిన తిరు నామం ఎంతో సరళంగా ఉంటుంది. సాదా సీదాయైనా జీవన సరళితో అతను బతుకును సాగించాడు.సభ్యతా సంస్కారాలతో కూడిన అతని జీవన సరళి అందరికీ అనుసరణీయం అని తోస్తోంది.
“కోటు – ధోతీ ఆహార్యంలో
“ఎక్కడ ఎవరు కన్పించినా
“మామయ్య గారి రూపు – నా స్మృతిలో
“తడి మెరుపై మెరిసి మాయమవుతుంది.
ఆమె జీవిత ప్రయాణంలో ఎక్కడికి వెళ్లినా కోటు ధోతీ కట్టుకొని ఎవరు కనిపించినా మామయ్య గారి రూపం ఆమె జ్ఞాపకాల్లోకి వచ్చి కళ్ళముందు అతను ప్రత్యక్షమయ్యే వాడు.మామయ్య గారు అలా కనిపించగానే ఆమె కళ్ళలో కన్నీటి ధారలు ఒక్క సారిగా ఆకాశంలోని మెరుపులా మెరిసి మాయమయ్యేవి మామయ్యగారు చనిపోయి చాలా కాలం అయినప్పటికీ ఆమె జ్ఞాపకాలలో అతను సజీవంగా నిలిచి ఉన్నాడు.అతను ఆమె పట్ల చూపించిన అనురాగం అపారమైనది, అసాధారణమైనది.అందుకే ఆమె ఎల్లప్పుడూ అతనిని జ్ఞాపకాల ద్వారా గుర్తు చేసుకుంటున్నది అని కవయిత్రి హిమజ కవితలో వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ఉద్యోగుల బలవంతపు పదవీ విరమణతో
“ఒక్కసారిగా ఆయన డీలా పడితే
“ఒంటిమీద కోటులన్ని శుభ్రపడి
“అలమరలో దాక్కున్నాయి.
పదవీ విరమణ అనేది ఒకరి స్థానం లేదా వృత్తి నుండి లేదా ఒక చురుకైన పని జీవితం నుండి వైదొలగడంగా చెప్పవచ్చు. ఉద్యోగంలో చేరిన వారు ఒక నిర్దిష్టమైన వయసు వచ్చిన తర్వాత ఉద్యోగం నుండి పదవీ విరమణ చేస్తారు.ఇన్నాళ్లు రెవెన్యూ శాఖలో ఒక బాధ్యత గల పదవిలో నుండి పదవీ విరమణ కాగానే అతనికి ఏమీ తోచేది కాదు.పదవీ విరమణ పొందిన అనంతరం ఒక్క సారిగా ఎందుకో తెలియదు అతను ఢీలా పడి పోయాడు.అతను రోజు కోటు వేసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.అందు వల్ల అతను ధరించే కోటు దుస్తులు శుభ్రంగా ఉతికి ఆరిన తర్వాత అలమారలో దాచి పెట్టినారు.అతను ధరించిన ఒంటి మీద ఉన్న కోటులు అన్ని శుభ్రపడి అలమరలో దాక్కున్నాయి అని కవయిత్రి హిమజ చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ఆస్తుల్ని నాకిచ్చి అకాలంగా వెళ్లిపోయిన
“ఆయన ఆస్తిగా భద్రంగా
“కోటు జేబులో దాచుకున్నది
“చిన్నారి శైలు ఛాయా చిత్రం ఒక్కటే.
మనిషి జీవితంలో అన్ని రోజులు ఒక్కలా ఉండవు. అకాలం అనగా మంచిగా జరగని కాలం.అతను జీవితంలో ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తుల్ని నాకు ఇచ్చి తిరిగిరాని లోకాలకు చేరినాడు.అతను అకాలంగా వెళ్లి పోయిన రోజు గుర్తుకు వస్తే మనసుకు బాధ కలుగుతుంది.ఈ లోకాన్ని వీడిపోయిన అతను తన చేతుల్లో పెరిగిన చిన్నారి శైలు ఫోటోను ఆస్తి వలె భద్రంగా తన కోటు జేబులో దాచుకున్నాడు అని కవయిత్రి హిమజ కవితలో చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.
“యాభయేళ్ళ క్రితపు డైరీలో
“ఆయన రాసి పెట్టుకున్న ఒకే ఒక్క పేజీ
“శైలు తల్లి పుట్టిన తేది మాత్రమే !
డైరీ దినచర్య పుస్తకం.ఒక వ్యక్తి తను చూసిన లేదా విన్న దాని గురించి గాని వారు చేస్తున్న పని గురించి గాని ఏ రోజు జరిగిన సంఘటనలు ఆ రోజు నమోదు చేయు పుస్తకం డైరీ.ప్రజలు వివిధ కారణాల వల్ల డైరీలను వ్రాసేందుకు ఇష్టపడతారు. డైరీ రాసే వ్యక్తి తన జీవితంలో ఏమి చేశాడనే దాని గురించి తనకంటూ ఒక రికార్డు ఉండాలని అతను కోరుకుంటాడు.ఈ లోకాన్ని వీడిన అతని ఇంటి అలమరలో వెతకగా 50 ఏళ్ల క్రితం నాటి డైరీ ఒకటి దొరికింది.అతను డైరీలో రాసి పెట్టుకున్న ఒకే ఒక పేజీ కనబడింది.అతను డైరీలో రాసి పెట్టుకున్నది శైలు తల్లి పుట్టిన తేదీ మాత్రమే.50 సంవత్సరాల కిందటి డైరీలో మిగతా పేజీల్లో ఏమీ రాయలేదు.ఒక పేజీలో మాత్రం శైలు తల్లి పుట్టిన తేదీని నమోదు చేసి పెట్టుకున్నాడు.అతనికి శైలు తల్లి పుట్టిన రోజు అంత ముఖ్యమైనదిగా,అపురూపమైనదిగా తోస్తోంది.కవయిత్రి హిమజ తనను ప్రాణంగా సాదుకున్న మామయ్య గారి స్మృతిలో కోటు – ధోతీ కవితను రాసి పాఠక లోకానికి అందించింది. కవయిత్రి హిమజ రాసిన కోటు – ధోతీ కవిత ఎప్పటికీ నిలిచి ఉంటుంది.చక్కటి స్మృతి కవిత రాసినందుకు కవయిత్రి హిమజను అభినందిస్తున్నాను.కవయిత్రి హిమజ మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

You may also like

Leave a Comment