డాక్టర్ కొమర్రాజు రామలక్ష్మి *అమ్మంటే” కవిత.
*సంబరాల సంతకం
ఆత్మీయత, అనురాగం వ్యక్తం చేసే కవిత్వము ఓ విశ్లేషణ.
కవయిత్రి,సామాజిక కార్యకర్త,రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్,ఏ.ఎస్.యమ్.మహిళా డిగ్రీ & పి.జి.కళాశాల,వరంగల్,డాక్టర్ కొమర్రాజు రామ లక్ష్మి కలం నుండి జాలువారిన స్నేహ గానం కవితా సంపుటిలోని అమ్మంటే కవిత పై విశ్లేషణా వ్యాసం. స్నేహ గానం కవితా సంపుటిని శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్,హైదరాబాద్ వారు బహుమతిగా ఎంపిక చేసి ప్రచురించడం ముదావహం.అమ్మంటే కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.కవయిత్రి రామలక్ష్మి తన తల్లిని గురించి అమ్మంటే కవితను రాసినట్లుగా తోస్తుంది. కవయిత్రి రామలక్ష్మి అంతు లేని అమ్మ ప్రేమను,అనురాగాన్ని ఇప్పటికీ పొందుతున్నది. సమాజంలో స్త్రీని తల్లి,మాత,జనని మరియు అవ్వ,అమ్మ అని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు.సృష్టిలో ప్రతి ప్రాణికి మూల కారణం అమ్మ.అమ్మ బిడ్డని నవ మాసాలు కడుపులో మోసి జన్మను ప్రసాదిస్తుంది.అమ్మ తన బిడ్డకు పాలు త్రాగించి, ఆహారం తినిపించి ప్రేమతో పెంచుతుంది. తల్లిని మించిన దైవం ఈ ప్రపంచంలో లేదంటే అతిశయోక్తి కాదు..ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ ఎక్కడా లభించదు.అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. మాతృదేవోభవ అని శాస్త్రాలు చెబుతున్నాయి. అమ్మ ప్రత్యక్ష దైవం.అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది.అమ్మ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? కవయిత్రి రామలక్ష్మి కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అమ్మ గురించిన గొప్ప అనుభూతుల లోకంలో విహరించండి.
“బతుకు బడిలో
“ఓనమాలు దిద్దించేది.
జీవించి ఉండటానికి ఆవశ్యకమైన భావన బతుకు అని అంటారు.బడి అనగా విద్యాలయం.బడిలో పిల్లలకు ఉపాధ్యాయులు విద్యను బోధిస్తారు. బడిలో పిల్లలకు ఉపాధ్యాయుడు అ నుంచి హ వరకు తెలుగు అక్షరాలు పలక మీద నేర్పి దగ్గర ఉండి ఓనమాలు దిద్దిస్తాడు.అమ్మ తన పిల్లలకు జీవితం అనే పాఠశాలలో ఓనమాలు నేర్పుతుంది. ఈ లోకమనే ప్రపంచంలో ఎలా గడపాలి అనే సంగతులను అక్షరాలు అవసరం లేకుండానే అమ్మ బతుకు పాఠాలను అరటి పండు ఒలిచినట్లుగా విడమర్చి చెబుతుంది.అమ్మ నేర్పిన ఓనమాల వల్లనే ఒడిదొడుకులు లేకుండా పిల్లవాడి జీవితం సాఫీగా సాగుతుంది.జీవితం అనే పాఠశాలలో అమ్మ ఓనమాలు నేర్పి పిల్లల జీవితాన్ని చక్కదిద్దుతుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“అనుభవాల్లోంచి
“జీవిత పాఠాలను నేర్పించేది.
అనుభవంను ఆంగ్లంలో Experience అని అంటారు.ఒక వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొనే ఆటుపోటుల నుంచి లభించిన జ్ఞానమును అనుభవం అంటారు.ఒక వ్యక్తి పుస్తకాలను చదివి నేర్చుకున్న జ్ఞానం కన్నా తన అనుభవం ద్వారా లభించిన జ్ఞానంతో సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలడు.ఒక పనిలో అనుభవం ద్వారా నైపుణ్యాన్ని సాధించిన వారిని అనుభవజ్ఞులు అంటారు.మనిషి నేర్చుకోవడానికి ఉత్తమమైన మార్గం అనుభవం.మనిషి నిత్య జీవితంలో వివిధ రకాల పనులు చేయడం ద్వారా అనుభవం వస్తుంది. మనిషి పని చేయడం వల్ల కలిగే అనుభవం ద్వారా జీవిత పాఠాలు నేర్చుకుంటాడు. మనిషి తన చుట్టూ నివసిస్తున్న వారి జీవితాలను నిశితంగా పరిశీలించినట్లయితే అవి గుణ పాఠాలుగా గుర్తుండిపోతుంది.పిల్లలకు తొలి గురువు ఎవరు? అంటే అమ్మ అని సమాధానం వస్తుంది.పిల్లలు బతుకు బాటలో సవ్యంగా నడుచుకునేలా అమ్మ జీవిత సారాన్ని అనుభవాల రూపంలో తెలియజేస్తుంది.రామాయణం,భారతం వంటి ఇతిహాసాలు,పురాణాలు చదివితే మనం ఎలా జీవించాలి? అనే విషయాలు తెలుస్తాయి. జీవితం వడ్డించిన విస్తరి కాదు.జీవితం మనకు విలువైన పాఠాలు నేర్పుతుంది.రంగులతో కూడిన జీవితం నేర్పే ప్రతి పాఠం మనల్ని మరింత తెలివైన,బలమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. అమ్మ తన అనుభవాల ద్వారా పిల్లవాడికి జీవిత పాఠాలను నేర్పిస్తుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ఆత్మీయతానుభూతులను
“అందించేది.
దగ్గర బంధువుల నుండి ఆత్మీయత మనకు లభిస్తుంది. ఆత్మీయత అనేది వ్యక్తిగత సంపద. ఆత్మీయత అనే గుణం పెంపొందించుకోవడానికి ప్రతి మనిషి జీవితంలో ప్రయత్నం చేయాలి.ఆత్మీయత మన బలమునకు కీలకంగా చెప్పవచ్చు.ఈనాడు సమాజంలో గల వ్యక్తుల్లో నైతికత లేకపోవడం వల్ల విశ్వాసం లేకపోవడం వల్ల ఆత్మీయతతో కలిసిమెలిసి ఉండడం లేదు.ఈనాడు మనిషి ఆత్మీయతకు దూరం అవుతున్నాడు.అనుభూతి అనేది భావోద్వేగం యొక్క చేతన ఆత్మాశ్రయ అనుభవాన్ని సూచిస్తుంది.ఏదైనా విషయం గురించి తెలుసుకునే భావన అనుభూతి.ఏదైనా పని చేసి ఉన్న జ్ఞానముతో వచ్చినది అనుభూతి.అనుభూతి ఒక మానసికమైన ఆనంద భావన.అనుభవంతో కూడిన భావన అనుభూతి. పిల్లలకు తల్లి ఆత్మీయత గురించి ఉగ్గుపాలతో రంగరించి నేర్పుతుంది.అమ్మ కంటే మించిన దగ్గరి వాళ్లు ఎవ్వరు ఉండరు.తల్లికి పిల్లల పట్ల ఉండే ప్రేమ ఆత్మీయత.అమ్మ తన పిల్లల పట్ల మమతానురాగాలను కలిగి ఉంటుంది.అమ్మ వల్ల పిల్లలకు ఆత్మీయత మరియు గొప్ప అనుభూతి లభిస్తుంది అని కవయిత్రి రామలక్ష్మి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“అనురాగామృతాన్ని
“కురిపించేది.
బలమైన అభిమానంను అనురాగం అంటారు. అనురాగంను ప్రేమకు పర్యాయపదంగా వాడతారు. మా అమ్మకు నేనంటే చాలా ఇష్టం.అమ్మలో అనురాగం,ఆప్యాయత అన్నీ కలబోసి ఉంటాయి. హిందూ పురాణాలలో అమృతం అనగా అమరత్వాన్ని ప్రసాదించే పానీయం అంటారు.అమ్మ వల్ల పిల్లవాడికి ప్రేమ,అనురాగాలతో అమృతం సేవించకుండానే ఆయుష్షు పెరుగుతుంది. అనురాగం,అమృతం కురిపించేది అమ్మ అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“బిడ్డల మనసును గ్రహించేది
“వారిని మనసారా ఆశీర్వదించేది.
తల్లికి పిల్లలు మనసులో ఏమనుకుంటున్నది? తల్లికి పిల్లల మనసులోని భావాలు ఎలా తెలుస్తాయి? అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది.తల్లికి పిల్లల మనసులోని భావాన్ని గ్రహించే అపూర్వమైన శక్తి ఉంది.పిల్లలు అడగకుండానే తల్లి వారికి కావాల్సినవి అన్ని ప్రేమతో చేసి పెడుతుంది.తల్లి పిల్లలను ప్రేమతో మనసారా ఆశీర్వదిస్తుంది.ఇవ్వాళ పిల్లలను మనసారా ఆశీర్వదించే వాళ్లలో తల్లికి మొదటి స్థానం ఉంటుంది.దేవుడు మనం కోరితేనే ఆశీర్వదిస్తాడు అంటారు.పిల్లలు కోరకుండానే తల్లి ఆశీర్వాదాలు అందిస్తుంది.అమ్మ బిడ్డల మనసును గ్రహిస్తుంది.అమ్మ బిడ్డలను మనసారా ఆశీర్వదిస్తుంది అని కవయిత్రి వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.
“తాను కరుగుతూ
“కుటుంబానికి వెలుగు నిచ్చేది.
మైనముతో చేసిన దీపాన్ని కొవ్వొత్తి అంటారు. కొవ్వొత్తిని వెలిగించినప్పుడు మైనము కరుగుతూ దానికి అమర్చిన వొత్తి మండటం ద్వారా వెలుగును ప్రసరింపజేస్తుంది.అమ్మ కుటుంబం కొరకు రోజంతా శ్రమిస్తూ గడుపుతుంది.అమ్మ తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా పని చేస్తూ కుటుంబంలో వెలుగులు నింపుతుంది.పిల్లలు పని మీద బయటకు వెళ్లి తిరిగి తిరిగి ఇంటికి వెళితే గుమ్మంలోనే మన కోసం అమ్మ కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తుంది.అమ్మ తాను కొవ్వొత్తి వలె కరుగుతూ కుటుంబానికి వెలుగును ఇస్తుంది అని చెప్పిన భావం చక్కగా ఉంది.
“ప్రయోజకులైన బిడ్డలను చూసి
“సంతసించేది.
తల్లి బిడ్డ చదువుకొని విజయాలు సాధించినప్పుడు చూసి ఆనందంతో పొంగిపోతుంది.ప్రయోజకులైన బిడ్డలను చూసి పరవశురాలు అవుతుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ఆశయ సాధనకు
“ఆధారమై నిలిచేది.
ఉన్నత స్థానానికి వెళ్లాలని కోరిక కలిగి ఉండడం ఆశయం.ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి పిల్లవాడు నిరంతరం శ్రమించేలా అమ్మ తోడ్పడుతుంది.అమ్మ పిల్లలను మీరు ఇంకా జీవితంలో ఎంతో సాధించాల్సినది ఉంది అని గుర్తు చేస్తుంది.అమ్మ వల్లనే జీవితానికి ఆశయం,అర్థం ఉన్నాయి.ఆశయ సాధనకు అమ్మ ఆధారమై నిలిచింది అని చెప్పిన భావం చక్కగా ఉంది.
“పిల్లల తప్పులెన్నింటినో సహించేది
“ గొప్ప మనసుతో క్షమించేది.
పిల్లలు తెలిసి తెలియని వయసులో ఎన్నో తప్పులు చేస్తారు.పిల్లలు చేసిన తప్పులను చూసి అమ్మ సహనంతో మెలుగుతుంది.పిల్లలు చేసిన తప్పులను అమ్మ గొప్ప మనసుతో క్షమిస్తుంది.పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్లు దండిస్తారు.అమ్మ మాత్రం పిల్లలను దండించదు.అమ్మ ప్రేమతో వారు చేసిన తప్పులను చెబుతుంది.అమ్మ పిల్లలు చేసిన తప్పులు సరిదిద్దుకునేటట్లు చేస్తుంది.ఇక ముందు పొరపాటున కూడా పిల్లలు అలాంటి తప్పులు చేయకూడదు అని అమ్మ ప్రమాణం చేయిస్తుంది. పిల్లల తప్పులను అమ్మ సహిస్తుంది.పిల్లల తప్పులను గొప్ప మనసుతో అమ్మ క్షమిస్తుంది అని చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.
“ఎప్పటికప్పుడు
“సంయమనం పాటించేది
“సంక్లిష్టతల ముడి విప్పేది.
సంయమనం అనే పదం వివిధ కారణాలవల్ల కొన్ని విషయాలను త్యజించడం మరియు నివారించడం అనే ఆలోచనను కలిగి ఉంటుంది.మనస్సును ఆధీనంలో పెట్టుకోవడం సంయమనం అంటారు. జీవితంలోని వివిధ అంశాలలో సంయమనం పాటించాలనే వ్యక్తి యొక్క ఎంపిక వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవడం మరియు గౌరవించడం చాలా ముఖ్యం.సంయమనం ఇది తరచుగా వ్యక్తిగత నమ్మకాలు,సాంస్కృతిక నిబంధనలు లేదా ఆరోగ్య పరిగణనలను ప్రతిబింబిస్తుంది.కాలక్రమేణా జీవితం క్లిష్టంగా మార వచ్చు.అమ్మ అవసరమైనప్పుడు ఆవేశానికి గురి కాకుండా సంయమనం పాటిస్తుంది.జీవితంలో ఎలాంటి చిక్కు పరిస్థితులు ఎదురైనప్పటికీ అమ్మ తెలివితో మరియు అనుభవంతో పరిష్కరిస్తుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.కవయిత్రి రామలక్ష్మి అమ్మంటే కవిత ద్వారా అమ్మ పట్ల గల అవ్యాజమైన ప్రేమను మరియు అనురాగాన్ని వ్యక్తం చేసిన తీరు అద్భుతంగా ఉంది.కవయిత్రి రామలక్ష్మి మరిన్ని కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
డాక్టర్ కొమర్రాజు రామ లక్ష్మి ‘సంబరాల సంతకం’ కవిత పై విశ్లేషణా వ్యాసం.
కవయిత్రి,డాక్టర్ కొమర్రాజు రామ లక్ష్మి కలం నుండి జాలువారిన స్నేహ గానం కవితా సంపుటిలోని సంబరాల సంతకం కవిత పై విశ్లేషణా వ్యాసం. సంబరాల సంతకం కవితను ఆసక్తితో చదివాను. నాకు నచ్చింది.నన్ను ఆలోచింపజేసింది.సంబరాల సంతకం కవితను తన తండ్రిని గురించి కవయిత్రి రాసినట్లుగా తోస్తుంది.సంబరాల సంతకం ఏమిటి? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు.సంబరం అంటే అది ఒక శుభకార్యం.సంబరాన్ని వేడుక వలె ఘనంగా జరుపుకుంటారు.మనిషి మనస్సు ఉత్సాహంగా ఉండేటప్పుడు కలిగే భావన సంబరం. ఒక నిర్దిష్ట సందర్భంలో సంబరాలు జరుపుకోవడం, సంబరాలు చేసుకోవడం,ఆనందించే కార్యక్రమాలలో పండుగలు,వేడుకలు,జాతరలు అన్ని కలిసి ఉంటాయి.ఒక వ్యక్తి సంతకం చేయడం అంటే ఆ వ్యక్తి దేని పైన సంతకం చేసాడో దానిని సృష్టించాడని గాని లేదా దాన్ని ఆమోదించాడని గాని ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడని గాని భావన జనిస్తుంది.కవయిత్రి కవిత శీర్షిక సంబరాల సంతకం అని పేరు పెట్టింది.నాన్నతో గల అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ అధికారంతో కూడిన సంబరాల సంతకం నాన్న అని గుర్తు చేసుకుంటున్నట్లు తోస్తుంది.నాన్నతో గడిపిన తీపి క్షణాలను సంబరాల సంతకం అని అంటున్నది. కుటుంబంలో సంతానానికి కారకులు తల్లిదండ్రులు.వీరిలో పురుషున్ని తండ్రి,అయ్య,నాన్న ఆంగ్లంలో Father అని అంటారు.మన సంఘంలో పిల్లలను కని పెంచే బాధ్యత తల్లిది,పిల్లలను పోషించే బాధ్యత తండ్రిది అని భావిస్తారు.తండ్రి మూలంగా పిల్లలకు సమాజంలో గుర్తింపు,గౌరవం,ఆస్తి హక్కులు లభిస్తాయి.మన సమాజంలో తల్లిని భూదేవి, తండ్రిని ఆకాశం అంటారు.నాన్న పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడే వాడు.నాన్నను జీవిత చుక్కాని అంటారు.నాన్న అంటే ప్రత్యక్ష దైవం.కనిపించే దేవుడు నాన్న.సంబరాల సంతకం కవితకు సంబంధించిన కథా కమామీషు ఏమిటి? తెలుసుకోవాలనే ఆసక్తి మీలో ఉందా? కవయిత్రి రామలక్ష్మి రాసిన కవితా చరణాల్లోకి వెళ్లి ఒక్కసారి మనసు పెట్టి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతి తరంగాలలో తేలియాడండి.
“నాన్న ప్రేమ
“సృష్టిలో అమూల్యం.
అమూల్యమైనది అంటే చాలా విలువైనది అంటారు.ఎవరు దానిని విక్రయించడానికి లేదా కొనడానికి ఇష్టపడరు.అమూల్యమైన వస్తువులు, ద్రవ్య విలువ లేని వస్తువులు అంటే స్నేహం, ప్రేమ,గౌరవం మొదలైనవి.తల్లిదండ్రులు తమ పిల్లలను అమూల్యమైన వారిగా భావించి ప్రేమిస్తారు.లెక్కించలేని ద్రవ్య విలువను కలిగి ఉండటం అమూల్యం అంటే విలువ కట్టలేనటువంటిది.
.అమూల్యమైనది అనే పదం తరచుగా చాలా విలువైన దానిని వివరించడానికి ఉపయోగపడుతుంది.అమూల్యమైన దాని విలువను సాధారణ ద్రవ్య విలువతో నిర్వచింపలేం.ఏదైనా ధరకు మించిన విలువను కలిగి ఉండటం అమూల్యమైనది.నాన్న అందించే ప్రేమ సృష్టిలో ఎక్కడా లభ్యం కాదు. పిల్లల పట్ల నాన్నకు గల ప్రేమ,అనిర్వచనీయమైనది మరియు అమూల్యమైనది అని కవయిత్రి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“నాన్న మనసు “ఉప్పొంగే సముద్రం.
మనసు అంటే అంతరంగం.మెదడులో నిక్షిప్తమైన జ్ఞాపకాలు,ఆలోచనలు,విచక్షణ మొదలైన అంశాల ప్రతిరూపం.మనలో భావోద్వేగాలు,అనుభూతులు, కోరికలు కలిగించేది మనసు.ఏదైనా వస్తువు లేదా జీవరాశిపై ప్రేమ లేదా ద్వేషం కలిగించే ఒక అంతరంగం.మన మనసు ఆలోచిస్తుంది.మన మనసు అనుభూతి చెందుతుంది.మన మనసు గ్రహిస్తుంది.మన మనసు ఊహిస్తుంది.మన మనసు గుర్తు చేస్తుంది.భూమి పైన పెద్ద పెద్ద జల రాశుల గురించి చెప్పడానికి వాడే పదం సముద్రం. విస్తారంగా నీరు కలది సముద్రం.నీళ్లు నిండుగా ఉండే ప్రదేశం సముద్రం.ఉప్పు నీటితో విశాలమైన భూభాగాన్ని ఆక్రమించినది సముద్రం.నీటి పరిమాణం,లోతు చాలా ఎక్కువగా ఉన్న ప్రదేశం సముద్రం.నాన్న మనసు ఉప్పొంగే సముద్రం. ఉప్పొంగే సముద్రమును చూసినట్లయితే చాలా సంతోషం కలుగుతుంది నాన్నను చూస్తే ఉప్పొంగే సముద్రాన్ని చూసినట్లుగా అనిపిస్తుంది.నాన్న మనసు వెన్నలాంటిది.నిర్మలమైన నాన్న మనసు ఉప్పొంగే సముద్రం వలె ఉంటుంది అని కవయిత్రి వ్యక్తపరిచిన భావం చక్కగా ఉంది.
“కష్ట సుఖాల కలబోత నాన్న.
నాన్న జీవితంలో ఎన్నో కష్టాలు,వేదనలు అనుభవించాడు.నాన్న జీవితంలో సుఖాలను కష్టాలను అనుభవించాడు.నాన్న కష్టాలకు బెదిరి పోలేదు సుఖాలకు పొంగి పోలేదు.కష్టం వెంట సుఖం,సుఖం వెంట కష్టం ఉంటాయి.కష్ట సుఖాలు జీవిత చక్రంలో ఒక భాగం అని చిరునవ్వుతో ఎదుర్కొన్నాడు.కష్ట సుఖాల కలబోత నాన్న అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“కలిమిలేముల కలనేత మా నాన్న.
కలిమి అంటే ఉండుట,కలుగుట సంపద అని అర్థం.లేమి అంటే లేకుండుట,దారిద్ర్యం అని అర్థం.మంచి,చెడు లాగే సంపద ఉండటం,సంపద లేకపోవడం అనేది కావడికి ఉన్న రెండు కుండల వంటివి.కావడి కుండలు సమానమైన బరువు కలిగి ఉంటేనే ఆ కావడి మోసే మనిషికి ఆహ్లాదకరంగా ఉంటుంది.కావడి సరిగా లేకపోతే మనిషి పడిపోతాడు.మనిషి జీవితంలో మంచి,చెడు, కష్టం,సుఖం రెండు ఉంటాయి.అప్పుడే మనిషికి మంచి ఏమిటి?చెడ్డ ఏమిటి?కష్టం ఏమిటి?సుఖం ఏమిటి? అనే దాని విలువ అవగతం అవుతుంది. ఐశ్వర్యం,పేదరికం అనేవి మానవ జీవితంలో తారసపడుతుంటాయి.అప్పుడే మనకు మంచి విలువ,సంపద విలువ తెలుస్తుంది.కలనేత అంటే రెండు రంగులు కలిపి నేయడం..కలనేత చూడ్డానికి చాలా బాగుంటుంది.పట్టు, కాటన్, సిల్క్ మిక్స్ చేసి కలనేతతో తయారు చేస్తారు.రెండు రంగులు అవటం వలన కలనేత అంటారు.సంపద,దారిద్ర్యం రెండు కలనేత వలె నాన్న జీవితంలో కలిసి ఉన్నాయి అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“బతుకు బాటన పయనించే బాటసారి.
నాన్న బతుకు కొరకు బాటసారి వలె ఎక్కడా ఆగకుండా పయనం కొనసాగించాడు.బాటసారి ప్రయాణం నిరంతరంగా కొనసాగుతుంది.ఏ ప్రయోజనం ఆశించి వెళుతున్నాడో ఆ ప్రయోజనం నెరవేరే వరకు బాటసారి పయనం కొనసాగుతుంది. బాటసారిది నిర్విఘ్నమైన ప్రయాణం.బాటసారికి ఎక్కడ అలసట కలిగినప్పుడు కొంత సేపు ఎక్కడో ఒకచోట సేద తీరి ప్రయాణం కొనసాగిస్తాడు. బాటసారి తన మానాన తాను బతుకు కొరకు సాగిపోతాడు.ఎన్ని ఆటుపోటులు ఎదురైనా బాటసారి తన పయనం ఆపడు.నాన్న గురించి కవయిత్రి బతుకుబాటన పయనించే బాటసారి అని వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.
“బరువు బాధ్యతలను వెరవని శ్రమజీవి.శ్రమ చేసేటటువంటి వ్యక్తిని శ్రమజీవి అంటారు.శ్రమజీవి ఎప్పటికైనా విజయం పొందుతాడు. ఇతరుల కొరకు శారీరక శ్రమ చేసేవాడు శ్రమజీవి.నాన్న అలుపు ఎరుగని శ్రమజీవి.నాన్న బరువు బాధ్యతలను నెత్తి మీద వేసుకొని కుటుంబ భారం మోసిన శ్రమజీవి. నాన్న కుటుంబం కొరకు బరువు బాధ్యతలను మోసి కుటుంబాన్ని గట్టెక్కించిన శ్రమజీవి అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“కష్టాన్ని చెప్పుకోని కర్మ జీవి.
మనిషి రోజు చేసే కార్యక్రమాలను కర్మలు అంటారు.కర్మను ఒక యోగం లాగా చేయడాన్ని కర్మయోగం అంటారు.కర్మ చేసే మనిషిని కర్మయోగి అంటారు.మనిషి చేసే ప్రతి చర్యకు ప్రతిఫలం అనుభవించి తీరాలి.మనిషి చేసే మంచి కర్మలకు మంచి ప్రతిఫలం లభిస్తుంది.మనిషి చేసే చెడు కర్మలకు చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి.కర్మ అంటే మనిషి మానసికంగా గాని శారీరకంగా గాని చేసిన కార్యకలాపాలు.సర్వ సామాన్యమైన పనులు చేసి ఆ పనుల నుండి సుఖ సంతోషాలను విశ్రాంతిని,ప్రశాంతతను పొందగలిగితే అతనిని కర్మ యోగి అంటారు.ఒక పని చేసినప్పుడు దాని పర్యవసానం ఎలా ఉంటుందో అని దాని ఫలితం కోసం ఆలోచించకుండా పని చేయాలి.నాన్న తనకు జీవితంలో ఎదురైనా కష్టాలను గురించి ఎవరి వద్దకు వెళ్లి చెప్పుకోలేదు.కష్టాలను ధైర్యంతో అధిగమించాడు.ఒక కర్మ జీవిలా కష్టాలను అనుభవించాడు.కష్టాలను గురించి ఎవరికీ చెప్పుకోని కర్మజీవి నాన్న అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“సమస్యలను ఛేదించే మహా జ్ఞాని.
సమస్యల పరిష్కారం అనేది చాలా కార్యకలాపాలను తరచుగా భాగమయ్యే అడ్డంకులను అధిగమించడం ద్వారా లక్ష్యాలను సాధించే ప్రక్రియ.జ్ఞానం ఉన్న వ్యక్తి సమస్యలను తెలివిగా పరిష్కరించగలడు.సాధారణ సామర్థ్యానికి మించిన జ్ఞానం ఉన్న వ్యక్తి సమస్యలను గుర్తించడం,విశ్లేషించడం మరియు పరిష్కరించడం జరుగుతుంది.సమస్య పరిష్కారం అనేది జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కారాలను కనుక్కునే ప్రక్రియను సూచిస్తుంది.మనం వ్యక్తిగత జీవితంలో సమస్యలను పరిష్కరించడానికి చాలా సమయాన్ని వెచ్చిస్తాం.కొన్ని సమస్యలు చిన్నవి.వాటిని మనం త్వరగా పరిష్కరించుకోవచ్చు.సంక్లిష్టమైన సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించడానికి సహకారం,సృజనాత్మకత అవసరం ఉంటుంది.కవయిత్రి నాన్న గురించి చెబుతూ సమస్యలను ఛేదించే మహా జ్ఞాని నాన్న అని వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.
క్రమశిక్షణను నేర్పే
“ఆది గురువు.
క్రమశిక్షణ అనే పదాన్ని జ్ఞానాన్ని మరియు నైపుణ్యాన్ని అందించడం మరియు బోధించడం అని నిర్వచింపబడింది.క్రమశిక్షణ అనేది శిష్యుడికి ఇవ్వబడిన క్రమబద్ధమైన సూచనలను తెలియజేస్తుంది.ఒక నిర్దిష్టమైన ప్రవర్తన నియమావళిని అనుసరించమని ఒక వ్యక్తికి సూచించడం క్రమశిక్షణ.క్రమశిక్షణ అనేది నియమాలు లేదా ఆదేశాలను పాటించాల్సిన అవసరము మరియు కష్టమైన పనిని కొనసాగించగల సామర్థ్యం ద్వారా పొందే స్వీయ నియంత్రణ.క్రమశిక్షణ అంటే బోధించడం,సరిదిద్దడం అని చెప్పవచ్చు.పిల్లలకు క్రమశిక్షణ తండ్రి వద్ద నుండి అలవడుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు అంచనాలు, మార్గదర్శకాలు మరియు సూత్రాల గురించి బోధించడానికి క్రమశిక్షణను ఉపయోగిస్తారు.క్రమశిక్షణ పిల్లలకు చిన్నతనం నుండి అలవాటు చేయాలి.ప్రపంచమంతా ఒక క్రమమైన పరిణామం కనిపిస్తుంది.రాత్రి,పగలు, నెలలు,రుతువులు,సంవత్సరాలు ఇలా ఒక క్రమ పద్ధతిలో వస్తాయి.అలాగే గ్రహాల గతి కూడా క్రమానుగతంగా తన విధులను నిర్వహిస్తుంది.అదే విధంగా మానవులు తమ విధులను నిర్వహించాలి. ప్రతి వ్యక్తి తనకు తానే స్వయంగా క్రమశిక్షణకు పాటుపడాలి.దీనిని అంతర్గత క్రమశిక్షణ అంటారు. క్రమశిక్షణ ఉన్న వ్యక్తి ఏదైనా సాధించగలడు.పిల్లల క్రమశిక్షణకు సజీవ రూపాలు.చక్కని క్రమశిక్షణతోనే దేశ ప్రగతికి పునాదులు వేయబడ్డాయి.గురువు అజ్ఞానం అనే చీకటిని పారద్రోలే వ్యక్తిగా చూడబడతాడు.మన భౌతిక ఆది గురువులు తల్లిదండ్రులు.మనను కన్న తల్లిదండ్రులను గౌరవించాలి,ఆదరించాలి,సేవించాలి.క్రమశిక్షణ నేర్పిన ఆది గురువు తండ్రి అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“మరెవ్వరితోని పోల్చలేని
“ఆత్మబంధువు.
హృదయానికి చాలా దగ్గరగా ఉండే బంధువు లేదా సంబంధం ఉన్న వారిని ఆత్మ బంధువు అని అంటారు.ఆత్మకు బంధువు నాన్న.పిల్లలకు ఆత్మబంధువు నాన్న.మరెవ్వరితోని పోల్చలేని ఆత్మబంధువు నాన్న అని కవయిత్రి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“పిల్లల
“గెలుపు సాధనం నాన్న.
పోటీలో నెగ్గుట గెలుపు అంటారు.నాన్న పిల్లలను విద్య నేర్పించడం కొరకు పాఠశాలలో చేర్పిస్తాడు. నాన్న ఎన్నో పనులు చేస్తూ తాను పడ్డ కష్టాలను మర్చిపోతాడు.పిల్లలు చదువుకొని ప్రయోజకులైతే అతడి ఆనందానికి అవధులు ఉండవు.పిల్లలు చదువులో ఉద్యోగంలో రాణించడానికి ఎంతో తోడ్పడుతాడు.పిల్లల గెలుపు సాధనం నాన్న అని కవయిత్రి చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ఓటమితో ఊరటనిచ్చే
“ధైర్యం నాన్న.
గెలుపుకు వ్యతిరేకం ఓటమి.పోటీలో ఒకరిపై ఓడిపోవడం ఓటమి.గెలువకపోవడం ఓటమి.ఓటమి అంటే పోరాటాన్ని విడిచి స్తబ్దంగా ఉండడం.ధైర్యం అంటే వేదన,నొప్పి,ప్రమాదం,అనిశ్ఛితి లేదా బెదిరింపులను ఎదుర్కొనే ఎంపిక మరియు సుముఖత.ధైర్యం అంటే కష్టాలను ఆపదలను ఇష్టపూర్వకంగా ఎదుర్కోవడం.ఊరట అంటే బాధా నివారణ.ఓడిపోయినప్పుడు పిల్లవాడికి మనో ధైర్యం ఇచ్చి ఓటమిని ఎదుర్కొనే ధైర్యం తండ్రి ద్వారా కలుగుతుంది.ఓటమితో ఊరట నిచ్చే ధైర్యం నాన్న అని కవయిత్రి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“కరుణ చూపే ఆ కళ్ళు
“అలసి సొలసిన ఆ కాళ్లు
“ఆయన వాత్సల్యానికి ఆనవాళ్ళు.
కరుణ అంటే కనికరము,దయ,జాలి అనే అర్థాలు ఉన్నాయి.వాత్సల్యం అంటే ప్రేమ,ఆప్యాయత, అనురాగం.బిడ్డల మీద తండ్రి చూపే ప్రేమ, ఆప్యాయత,అనురాగం.తల్లి ఆవు తన దూడపై చూపే ఆప్యాయత.ప్రేమ పూర్వక ప్రవర్తన అనేది తల్లిదండ్రుల పోషణ మరియు ప్రవర్తన నుండి వస్తుంది.నాన్న కళ్ళల్లో పిల్లల పట్ల కరుణ తొణికిసలాడుతుంది.నాన్న కుటుంబం కొరకు మరియు అందరి ఆనందం కోసం శ్రమించడం ద్వారా ఆ కాళ్లు అలసి సొలసిపోయినాయి.పిల్లల పట్ల నాన్న చూపించిన ప్రేమ,అనురాగం,ఆప్యాయత గుర్తులుగా నిలుస్తున్నాయి అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“కుటుంబమే నాన్నకు ప్రాణం
“దాని క్షేమానికి ఆయన
“జీవితం అంకితం.
కుటుంబం అనగా ఒక ఇంటిలో నివసించే కొంత మంది మనుషుల సమూహం.కుటుంబ సభ్యులు పుట్టుకతో లేదా వివాహంతో సంబంధం ఉన్న వారు. కుటుంబంలో సంబంధాలు అనుభవాలు, అనుభూతులు,కాలానుగుణంగా మారుతూ ఉంటాయితల్లిదండ్రులు పిల్లలకు సమాజంలో ఒక స్థానాన్ని కల్పించడం,సంస్కృతిని వారికి అందజేయడం జరుగుతుంది.పిల్లలు చిన్న వయసులో తల్లిదండ్రుల చెంతనే ఉంటారు. కుటుంబం అంటే నాన్నకు ప్రాణంతో సమానం. కుటుంబ సభ్యుల క్షేమానికి నాన్న జీవితం అంకితం చేశారు.తాను కరుగుతూ తన బిడ్డల ఎదుగుదలకు వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు నాన్న చేసిన త్యాగం మాటల్లో చెప్పలేనిది వెలకట్టలేనిది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“నాన్నంటే కురిసే వెన్నెల
“విరిసే నవ్వుల వాన వెన్నెలను చంద్రకాంతి అని కూడా అంటారు.ఆంగ్లంలో Moon Light అని అర్థం. చంద్రుడు రాత్రులందు కురిపించే కాంతిని వెన్నెల అంటారు.వర్షం లేదా వానను ఆంగ్లంలో Rain అని అర్థం.ఆకాశంలోని మేఘాల నుండి భూతలం పైకి నీటి బిందువుల రూపంలో కురిసే ఒక రకమైన ఆవపాతం వాన.రాత్రి పూట ఆకాశంలో కురిసే వెన్నెల రాత్రి ఎంతో హాయిగా ఉంటుంది.నాన్న ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల మోములో సంతోషాలు విరబూస్తాయి.నాన్న కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి సరదాగా గడపితే అందరి ముఖారవిందాల్లో సంతోషాలు వెల్లివిరుస్తాయి. నాన్నంటే కురిసే వెన్నెల విరిసే నవ్వుల వాన అని చెప్పిన భావం అద్భుతంగా ఉంది.
“ఇంటి సంబరాల సంతకం నాన్న
“కంటి వెలుగులకు
“చిరునామా నాన్న.
ఇంటిలో నెలకొన్న సంతోషాలకు,సంబరాలకు నాన్న అధికారంతో కూడిన సంతకం వలె ప్రేమ, ఆప్యాయత,అనురాగం నెలకొంటాయి.ఇంటి కుటుంబ సభ్యుల కళ్ళలో వెలుగులు విరజిమ్మడానికి చిరునామా నాన్న అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“మనిషి తనానికి
“ఆ నిలువెత్తు సాక్ష్యానికి
“ప్రేమతో వందనాలు !
భూగోళం పై నున్న ఇతర జీవులతో పోల్చి చూస్తే మనుషులు చాలా పురోగతి సాధించారు. మానవులలో వివేకం,ఆలోచన,భాష వంటి విషయాలు మెదడు అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చెందడం వల్ల సాధ్యపడినాయి.మానవులు భావవ్యక్తీకరణ,సమాచార పద్ధతులను వాడడంతో పాటు అత్యంత నిపుణతను కలిగి ఉన్నారు.ప్రతి మనిషి జీవితానికి అర్థం ఉండాలని కోరుకుంటాడు. నాన్న న్యాయమైన అర్జన చేశాడు.నాన్న ఎలాంటి అవినీతి,అవకతవకలకు పాల్పడ లేదు.నాన్న ఎవరికి ఏ కోశాన హని తలపెట్ట లేదు.నాన్న ఉన్నంతలో ఇతరులకు సహాయం చేశాడు.నాన్న కుటుంబ నావను మునిగి పోకుండా గట్టెక్కించాడు. మానవత్వం మూర్తీభవించిన వ్యక్తిత్వం నాన్నది. మంచితనానికి,మనిషి తనానికి నిలువెత్తు సాక్ష్యం అయిన నాన్నకు ప్రేమతో వందనాలు చెప్పడం ద్వారా తండ్రిని దేవుడిగా తలచిన తీరు మనస్సులో మెదులుతుంది.కవయిత్రి రామలక్ష్మి కి నాన్న పట్ల గల అపార ప్రేమకు నిదర్శనంగా సంబరాల సంతకం కవిత నిలుస్తుంది.కవయిత్రి రామలక్ష్మి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.