Home ఇంద్రధనుస్సు కవి మిత్రుల హృదయ భాషణం

కవి మిత్రుల హృదయ భాషణం

by Gaddam sulochana

ఫిబ్రవరి 16 తెలంగాణ రచయితల సంఘం జంట నగరాలు నిర్వహించిన సోపతి సప్తతి సభ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, కందుకూరి శ్రీరాములు, నాళేశ్వర శంకరం, నందిని సిధారెడ్డి ఈ ముగ్గురు కవులకు జరిగింది. ఈ సభలో మచ్చుకైనా తొంగి చూడని హంగులు ఆర్భాటాలు. దరిచేరని గజమాలలు ఫోటోల గోలలు లేకుండా సాదాసీదాగా సభ ఆసాంతం సాహితీ ప్రసంగాలతో గుబాళించింది . ఇదే సప్తతి సభల సందేశమైనది. ఈ ముగ్గురు కవులు ఈ సందర్భంగా తమ మనసును పంచుకున్న కొన్ని మాటలు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను.

కందుకూరి శ్రీరాములు తన సాహితీ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ, సిధారెడ్డి గారి ‘భూమి స్వప్నం’ నాళేశ్వరం శంకరం గారి ‘దూది మేడలు’ అచ్చయిన చాలా కాలానికి తన కవితా సంపుటి ‘వయోలిన్ రాగమో! వసంత మేఘమో!’ 1993లో అచ్చైందన్నారు. తానప్పుడు మినీ కవితలు తుమ్రీలు రాసేవాడినని, అవి తనకు చాలా ఇష్టంగా ఉండేవని చెప్పారు. “కళ్ళు పోయినా/ కాళ్లు చేతులు పడిపోయినా/ గుండెల్లో తడుండాలిగానీ/ నాలుకైనా నాలుగ క్షరాలు రాస్తుంది” అనే తన మినీ కవితను ఒక సభలో దేవి ప్రియ గారు చదివి వినిపించి మెచ్చుకున్నారట.
ఓ సారి విశాఖపట్నం కవి సమ్మేళనంలో పాల్గొనవలసి ఉండగా, ఒక కవిత రాసి శివారెడ్డి గారికి చూపిస్తే, మరో కవిత రాయమని చెప్పారని, అది బాగా లేదని అర్థం చేసుకున్నానని, ఆ సాయంత్రం సముద్రాన్ని చూసి, తెల్లవారగానే సముద్రం వద్దకు వెళ్లి ,”ఓ విశాఖ సముద్రమా/ నువ్వు ఆకాశమంత ఎదగడానికి/ ఎన్నేళ్ల దీర్ఘ తపస్సమాధి లో ఉన్నావో ” అని 30 లైన్ల కవిత రాసి ఆ సాయంత్రం కవి సమ్మేళనంలో చదివినప్పుడు గొప్ప స్పందన వచ్చిందని, శివారెడ్డి గారు కూడా మెచ్చుకున్నారని చెప్పుకున్నారు.
సినారె, శివారెడ్డి, సిధారెడ్డి, బెడిద రాజేశ్వరరావు వీరు తను సాహిత్యంలో ఎదిగి స్థిరపడడానికి హార్దికంగా ఆర్థికంగా ఎంతో తోడ్పాటునందించారు. 1974లో ఒక కవిత రాసి ‘సినారె‘ గారికి పంపిస్తే వారు ‘మీ కవితా జిజ్ఞాసను అభినందిస్తున్నా’నని లేఖ రాశారని అది ఇప్పటికీ తన వద్ద ఉందని ఆనాటి జ్ఞాపకాలను సంతోషంతో పంచుకున్నారు.

1979లో ఆర్ట్స్ కాలేజీలో చేరడం, 30 మంది కవుల పరిచయం, అక్కడి సాహితీ వాతావరణం తన జీవితంలో తనను తాను నిలబెట్టుకోవడానికి తోడ్పడిన మంచి అవకాశంగా భావించారు. వరవర రావు గారు ముందుమాట రాసిన “సందర్భం” కవితా సంపుటికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, తెలుగు యూనివర్సిటీ అవార్డు రావడం జీవితంలో గొప్ప మలుపు. మినీ కవితలు రాయడం మానేసి పెద్ద కవితలపై దృష్టి పెట్టాలని చెప్పిన సిధారెడ్డి గారి సలహాను పాటిస్తూ, పెద్ద కవితలు రాయడంలో శ్రద్ధ పెట్టానని, దశాబ్ద కాలంలోనే అనేక కవితా సంపుటాలు తీసుకువచ్చానని అందరితో తన సంతోషాన్ని పంచుకున్నారు. నందిని సిధారెడ్డి, నాళేశ్వరం శంకరం ల స్థాయి తనకు లేకపోయినా, వాళ్లతో కలిసి సప్తతి జరుపుకోవడం ఆనందంగా ఉందని, వారి స్నేహం తనకు గొప్ప అదృష్టమని చెప్పారు. కాస్త పేరు ప్రతిష్టలు రాగానే సంపాదన పెరగగానే, బంధువులను, స్నేహితులను, చేయూతనిచ్చిన వారిని మర్చిపోయే ఈ రోజుల్లో ఎంతో ప్రేమగా స్నేహంగా ఇలా చెప్పడం చాలా బాగా అనిపించింది. ఈ మధ్యనే 2024లో ‘పలకల నుంచి పలుకులవైపు’ కవితా సంపుటి కూడా అచ్చువేసారు.

నాళేశ్వరం శంకరం గారిది సప్తతి రెండవ సభ. జీవితం వ్యక్తిత్వం సాహిత్యంతో ముడిపడిన తన జీవిత విశేషాలను సదస్సులతో పంచుకున్నారు. 70 సంవత్సరాలుగా తన బతుకు ఒకే తీరుగా ఉందని, తనలాంటి బతుకు ఎవరికి ఉండొద్దని అందరూ సుఖంగా ఉండాలని ఆకాంక్షించారు.

తన ఊరిపై అవ్యాజమైన ప్రేమానురాగాలు కురిపించారు. వారి ఊరికి రెండు చెరువులు, తాటివనం, 10 ఊర్లకు సరిపడే ఈత కల్లుండేదని, హైదరాబాదు కూడా మా ఊరి ముందు చిటికెన వేలుకు కూడా సరిపోదని గొప్పగా చెప్పుకున్నారు. తన ప్రేమ కథ దేవదాసు సినిమా కన్నా గొప్ప కథట. ప్రేమంటే తెలియని నాలుగవ ఐదవ తరగతిలోనే ఒక అమ్మాయిని ఇష్టపడ్డారు. తర్వాత ఆమే అతని జీవిత సహచరిగా అయింది. కులాంతర వివాహం, తండ్రి తిరస్కారం, తీవ్రమైన దూషణ వ్యతిరేకత వల్ల ఊరికి దూరమయ్యానని, మళ్ళీ ఆ వూరు స్మశానంగా మారినాకే (పోచంపాడులో మునిగింది) వెళ్లానని చెప్పారు. తన ఇంటి స్థలం వెతుక్కోవడానికి వేప చెట్టు ఆనవాలుగా గుర్తించి, అక్కడే చాలాసేపు గడిపి వచ్చానని చెప్పారు. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఎంత దుఃఖం కలిగిందో, ఊరును స్మశానంగా చూసినప్పుడు అంత దుఃఖాన్ని అనుభవించానని ఆవేదనగా చెప్పుకున్నారు. వారి ఊరి వాళ్ళు వయసు వచ్చి కాక, రాజకీయ ఆర్థిక సాంఘిక కారణాల వల్ల చనిపోయిన వాళ్ళే ఎక్కువ అని వాపోయారు. జంగాలైన తాను చిన్నప్పుడే ‘భిక్షాం దేహి” అని అడుక్కునేవాడినని, అమ్మ పాలిచ్చి పెంచితే ఊరు తనకు అన్నం పెట్టి పోషించింది. బతుకునిచ్చింది. తనను తన కుటుంబాన్ని పోషించింది అని చెప్పారు. తనకు వాళ్లు భిక్షను వేసి బాలశివుడు వచ్చాడని తన కాళ్లకు మొక్కడం ఆశ్చర్యమనిపించేదని, అడుక్కుంటున్నాను కదా! నేను కదా వారి కాళ్లకు మొక్కాలని ఆలోచన అప్పుడే తనకు కలిగేదని,ఆ భావజాలంతో తీవ్రమైన స్వభావం ఉండేదని, బహుశా అదే తనను కవిగా మార్చిందేమోనని అభిప్రాయపడ్డారు.

ఇల్లు, ఊరు విడిచి రావడం, చదువు ఉద్యోగం ఇబ్బందులు అన్ని చెప్పారు. తన భార్య వైపు వారు గొప్పగా ఉన్నప్పటికీ తాను ఎవరిని ఎప్పుడు కూడా కలవలేదని, తన విలువ వ్యక్తిత్వం కాపాడుకోవడం తనకు ముఖ్యమని చెప్పారు.ఇలా చెప్పడం శంకరంగారి మానసిక పరిణతికి గొప్ప సాక్ష్యం.ఆయన నమ్ముకున్న విలువలు గొప్పవి.

‘దూది మేడలు’ ఒక్క పుస్తకాన్ని అచ్చు వేశానని అంటారు కానీ, ప్రస్తుతం కొనసాగుతున్న సమాజంలో అనేక పుస్తకాలుగా దాన్ని భావిస్తున్నట్టు చెప్పారు. బెడిద రాజేశ్వరరావు బతికి ఉంటే కనుక మా అందరి కన్నా చాలా ముందుండే వారన్నారు. బైసా రామదాసు మొదటి స్నేహితులని అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, ఇంటర్ కాలేజీ మ్యాగజైన్ ఎడిటర్ గా తన కవిత ‘వాణి నా రాణి’ ఒక ఫుల్ పేజీ వేశాడట అది అప్పట్లో శంకరం గారికి గొప్ప సంతోషం కలిగించిందట. అతను గనుక జర్నలిజంలోకి వెళ్లి ఉండకపోతే గొప్ప కవి అయ్యేవారని “కాళ్లు ఇనుప స్తంభాలు/ భవంతులను మోస్తున్నాయి/ చేతులు విసనకర్రలు/ సుఖ గాలులు వీ స్తున్నాయి” అని ఇంటర్లోనే రామదాసు గారు రాసిన కవిత తనకు బాగా నచ్చిందన్నారు.

చలంగారిని తెలంగాణకు తెచ్చానని, కేవలం ఇక్కడ స్త్రీల ఉద్యమాలు ఎస్టాబ్లిష్ కావాలని అలా చేశానని బాగా నడపానన్నారు. ఓల్గా లాంటివారు చాలామంది వచ్చారు. అయితే అది మగవాళ్లది అన్న ఉద్దేశంతో స్త్రీవాద ఉద్యమం దాన్ని పక్కకు పెట్టింది కానీ, చలం చేసినంత కృషి స్త్రీలకు మరెవరు చేయలేదని అభిప్రాయపడ్డారు. ఇది తనకు పెద్ద మలుపు అని కూడా చెప్పారు. తన ప్రియమిత్రుడు నందిని సిధారెడ్డి గురించి కూడా ఎంతో అభిమానంగా ప్రేమగా ఇలా చెప్పారు…. తన తండ్రి తనను జీవితాంతం కోప్పడేవాడని, సిద్ధారెడ్డి కూడా నాన్నలా కోప్పడతారని ఆయన కోపం మాత్రం అమ్మపెట్టే ముద్ద అంత ఆత్మీయంగా ఉంటుందని, తనకు నాన్న చేయవలసిన ఎన్నో పనులు తనకి చేసి పెట్టారని ప్రేమను వ్యక్తపరుస్తూ, స్నేహ పరిమళాలను సభంతా పరిచారు.

సోపతి సప్తతి మూడవ సభ నందిని సిధారెడ్డి గారిది స్నేహం గొప్పతనాన్ని సమాజానికి తెలిపాలని వారి ఉద్దేశ్యం అందరికీ ఆచరణీయం అనుసరణీయం. 50 సంవత్సరాలుగా ఏ అరమరికలు లేని స్నేహంగా, కవిత్వంగా, జీవితాన్ని కొనసాగిస్తున్న ముగ్గురు కవుల సప్తది సభ జరగడం ఒక ప్రత్యేకత. ఇదొక మంచి సందేశాన్ని అందించే అపూర్వ సన్నివేశం. లక్షల మందిలో మాట్లాడడం కంటే, కొద్ది మంది ఆత్మీయుల మధ్య మాట్లాడడం, ఆత్మీయులు ఇచ్చే స్ఫూర్తి గొప్పది అని అభిప్రాయపడ్డారు.

ఆర్ద్రత నిండిన మనసుతో తన చిన్ననాటి సంఘటన ఒకటి గుర్తు చేసుకున్నారు చంకలో తమ్ముని ఎత్తుకొని, చేతితో తనను పట్టుకొని, చేదబావిలో దూకి చనిపోవాలనుకుందట వాళ్ళ అమ్మ. ముందు చంకలో బిడ్డను వేయాలా, చేయి పట్టుకున్నతనను వేయాలా అని ఆలోచిస్తున్నంతలో, పక్కన ఉండేటటువంటి వడ్ల అంతయ్య పరుగున వచ్చి, మందలించి ఆ ప్రయత్నాన్ని విరమింప చేశారని, అదే అంతయ్య కొన్ని రోజుల తర్వాత కుటుంబ సమస్యతో ఉరి వేసుకున్నప్పుడు, అప్పుడే నీళ్లకు వెళ్ళిన వాళ్ళమ్మ అతనిని లేవట్టి అందర్నీ పిలిచి అతని ప్రాణాలు కాపాడిందని ఇది రూల్ అని చెప్పారు. ఇతరులకు మనం ఏదైతే ఇస్తామో! అది మనకు తిరిగి వస్తుందనే సత్యం ఈ సంఘటన ద్వారా మనకు స్పష్ట మవుతుంది.

ఆరుద్ర గారి “పులి వస్తే పులి ఎన్నడు అదరదు/ మేక వస్తే మేక ఎన్నడు బెదరదు/ మాయ రోగమదేమో కానీ/ మనిషి మనిషికి కుదరదు” అనే కవితా పంక్తులు ఉదాహరిస్తూ మనుషులు మనుషులు విడిపోతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో కవులు మరీ వింతగా ప్రవర్తిస్తున్నారు. నేనే కవిని అనే ధోరణి పెరిగిపోతుందని, కవిని చూస్తే మరో కవి ఓర్వడని, మనుషుల యొక్క నైజాన్ని ఒకింత ఆవేదన హాస్యాన్ని మిళితం చేసి ఉదహరించారు.

ఒక సందర్భంలో తెలంగాణ భాషలో మంచి కవిత్వం రాసిన కవి మోత్కూర్ అశోక్ గారి కోరిక మేరకు మెదక్ పుస్తక ఆవిష్కరణ సభకు ‘చేరా’ గారిని తీసుకొని వెలితే, అతనక్కడ ‘తెలంగాణ కవులు ఇట్లాంటి కవిని చూసి తల ఎత్తుకోవచ్చు’ అన్నారట.అసలు తెలంగాణ కవులు తల ఎత్తుకునే ఉన్నారు. అది చెప్పడానికి ‘చేరా’ అవసరం లేదు. నా కవిత్వానికి బలం చేరా నుంచి రాలే! అలంకార గ్రంధాల నుండి రాలే! తెలంగాణ మట్టి నుండి వచ్చింది. మా బాపు అవ్వ మా ఊరి నుండి వచ్చింది. వివక్షాపూరితమైన విమర్శకుడైన చేరాలాంటి వాళ్లతో గొడవ పడ్డానని, నా మట్టినాకు రోషాన్ని ఇచ్చిందని,అది నా గర్వమని, నిర్మోహమాటంగా నిక్కచ్చిగా తేల్చేశారు.

కవిత్వం అలంకార శాస్త్రాల నుంచి రాదు. జీవితాల నుండి వస్తుంది. గాథాశప్తశతిలో ఉన్నది ఆనాటి గాథలు సామాజిక జీవితమే! కవిత్వానికి కొలమానం విమర్శకుల ప్రశంసలు కాదు.” నేను రాస్తా వాళ్ళు చదువుతారు మధ్యన ఈ విమర్శకులెవరు?” అన్న కాళోజీ మాటల్ని గుర్తు చేసుకున్నారు. “హైదరాబాదు/ అందమైన సీతాకోకచిలుక/ దాని కాళ్లకు కత్తులు కట్టి/ కోడిపందాలు ఆడకండి” అన్న రాజు గారి కవిత్వాన్ని చదివి ఇంతకన్నా జీవితం నేర్పిన కవిత్వం ఏముంటుంది. ఇదే కదా కవిత్వం అన్నారు. ఈ ప్రాంతం కాకపోయినా ఆరుద్ర, కుందుర్తి, సోమసుందర్ మొదలైన వారు తెలంగాణ మీద కవిత్వం రాశారన్నారు. ఒక పోతన, సోమన, వేమన లేకుండా సిధారెడ్డి లేడు. ఒక కవికి బలం అనేకమంది పూర్వకవులు సమకాలీన కవులేనని గుర్తు చేశారు.

విప్లవోద్యమం తన కవిత్వాన్ని స్వీకరించిందని “మా మౌనం ప్రమత్తతే అనుకుంటావు/ నీకు తెలుసో తెలియదో/ గోడకు వేలాడే తుపాకీ కూడా/ మౌనంగానే ఉంటది “అనే కవితా పంతులు సైన్స్ కాలేజీలో, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో, తిరుపతి హాస్టల్లోనూ కనిపించిన సందర్భాలను వివరిస్తూ, కవిత్వం ఎవరు చదువుతారు అనుకుంటాం కానీ, ఎవరికి అవసరమో వాళ్ళు చదువుతారని వివరించారు. నేను తెలంగాణ ఉద్యమాన్ని ప్రేమించాను. ఆ సామాజిక సందర్భం గొప్పది. మంచి అక్షరాలు రాసే అవకాశం నాకు వచ్చింది. మనుషుల్ని ఏరుకోవడం అనుభవాల్ని, వస్తువుల్ని, సన్నివేశాలని ఎన్నుకోవడం తెలుసు. సహజ సుందరమైన అలంకారికమైన ప్రజల భాష శక్తి కలిగిన భాష. దాన్ని ఏరుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. జీవితంలో స్పష్టత లేకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. దాశరధి ప్రజా జీవితంలో నుండి వచ్చారు. మెల్లమెల్లగా తప్పిపోయారని గుర్తు చేసుకున్నారు. ఎవరికైనా ఒక స్పష్టత ఒక నిర్ణయం ఒక విధానం అవసరమని, చుట్టూ ఉన్న మయసభను తెలుసుకొని అడుగులు వేయాలని సూచించారు.

కులం ఇప్పుడు కొలమానమైనది. కానీ నాకు కులంతో సంబంధం లేదు. మనుషుల హృదయాలను ప్రేమించాను. హృదయాలతోనే నడుస్తాను. కులాన్ని ఇష్టపడే వాళ్ళు ఇష్టపడండి కానీ, కులంలోనూ మంచి వాళ్లను ప్రేమించండి. కవులు ఏం చేయాలి? మనుషుల్ని కవిత్వాన్ని జీవితాన్ని సమాజాన్ని ప్రేమించాలి. నేను అట్లా ప్రేమించాను. మనుషుల్ని స్నేహితులను సంస్థలను నమ్మాను. కాబట్టే నాకు మంచి మిత్రులు ఉన్నారు. మంచి కవిత్వము రాశాను. అనీ సంతృప్తిని వ్యక్తం వ్యక్తం చేస్తూ ,మంచి సందేశాన్ని అందిస్తూ ముగించారు.

ఇలా కందుకూరి శ్రీరాములు గారు, నాళేశ్వరం శంకరం గారు, నందిని సిధారెడ్డి గారు తమ సాహితీ ప్రయాణాన్ని తమ జీవితాలను వ్యక్తిత్వాలను 50 ఏళ్లుగా కలిసి సాగిస్తున్న స్నేహ ప్రయాణాన్ని అందరితో పంచుకున్నారు. ‘చూస్తాం చేస్తాం రాస్తాం’ అని సిధారెడ్డి గారు చెప్పినట్లుగానే వీరి ప్రయాణం ఆయురారోగ్యాలతో, ఉత్సాహంగా, సామాజికంగా మార్గదర్శనం చేస్తూ, కొనసాగాలని ఆశిద్దాం.

You may also like

Leave a Comment