Home బాల‌సాహిత్యం కుందేలు ఉపాయం

      అదొక అడవి .   ఆ అడవికి రాజులేడు.   అప్పుడు మరొక  అడవి నుండి ఒక  చిరుత పులి అక్కడికి  వచ్చింది. అది తన ఇష్టము వచ్చినట్లు జంతువులపై దాడి  చేయ సాగింది .దాని బాధ పడలేక జంతువులన్నీ తప్పించుకొని తిరగసాగాయి. ఆ చిరుత పులి ఆగడాలకు అంతే లేదు.
        ఇలా ఉండగా ఆ జంతువులన్నీ ఈ  చిరుతపులి బాధలు భరించలేక  అవి  కుందేలుతో మొరపెట్టుకున్నాయి. అప్పుడు ఆ  కుందేలు” మీరు నేను చెప్పినట్లు చేయండి. మీ బాధలు నివారణ అవుతాయి” అని వాటికి ఒక ఉపాయం చెప్పింది. అవి సరేనన్నాయి. 
       కుందేలు చిరుతపులి వద్దకు వెళ్లి “ఓ  చిరుతపులి రాజా !నీవు పరిగెత్తి వేటాడే అవసరం లేకుండా  ఆ జంతువులు నీ ముందరే ప్రత్యక్షమయ్యే మంత్రం నా వద్ద ఉంది. ఒక మునీశ్వరుడు ఈ మంత్రాన్ని పఠించగా నేను దానిని విని నేర్చుకున్నాను.   ఇదిగో చూడు “అని తన కళ్ళు మూసుకుని ” టుర్ర్ ర్ర్  కాంజి” అని అంది.  వెంటనే అక్కడ ఒక జింక ప్రత్యక్షమైంది .అప్పుడు చిరుతపులి దానిని వేటాడబోయేంతలో కుందేలు దానిని ఆపి “ఆగండి చిరుత పులిరాజా! ఇంకా కొన్ని జంతువులు కూడా ఇలాగే మీ ముందు ప్రత్యక్ష మవుతాయి.  మీరు దేనిని కోరుకుంటారో  చెప్పండి.  ఆ జంతువు   ఇక్కడ మీ ముందు వెంటనే  ప్రత్యక్షమవుతుంది. చూడండి .  మీకు ఇంకా ఏ జంతువు  కావాలి “అని  అడిగింది .  అప్పుడు చిరుతపులి” కోతి” అని అంది.  వెంటనే కుందేలు ” టుర్ర్ ర్ర్ తికో ”  ”  అని అంది.   వెంటనే ఒక కోతి వాటి ముందు ప్రత్యక్షమైంది.
         తర్వాత చిరుతపులి “అడవి దున్న” అని కోరింది. అప్పుడు కుందేలు ” టుర్ర్ ర్ర్  న్నదువిడఅ  ”  అని అంది .వెంటనే అక్కడ  అడవిదున్న  ప్రత్యక్షమయింది. అలాగే ఎలుగుబంటి, దుప్పి, జిరాఫీ కూడా కుందేలు ఆ మంత్రం చదవగానే  ప్రత్యక్షమైనాయి.  చిరుతపులి సంతోషించి” ఓ కుందేలా! నాకు ఈ మంత్రం చెప్పవా! నేను నిన్ను ఏమీ చేయనులే!” అని అంది.
        అప్పుడు కుందేలు “చిరుతపులి  రాజా! ఈ మంత్రం చాలా మహిమ గలది.  ఇది  పనిచేయాలంటే  మీరు  కొన్ని నియమాలు పాటించాలి.   ఒక నెల రోజుల వరకు మీరు  ఏ జంతువును చంపకూడదు.  అలా చేస్తేనే మీకు ఈ మంత్రం  పనిచేస్తుంది “అని అంది. అందుకు చిరుత పులి  సరేనంది .
            ఇలా నెల రోజులు గడిచాయి.   తర్వాత  ఆ చిరుతపులి ఆ మంత్రాలను చదివింది.  కానీ ఒక్క జంతువు దాని  ముందర నిలువలేదు. ఇదేదో కుందేలు తనను మోసగించిందని దానికి అప్పుడు అర్థమైంది.  వెంటనే అది కోపంతో  కుందేలు కోసం ఎంత వెదికినా  అది కనబడలేదు.  అదే కాదు. ఆ  అడవిలో ఒక్క జంతువు కూడా కనిపించలేదు .
          అవి అన్నీ పక్క అడవికి పారిపోయి మృగరాజు సింహాన్ని శరణు వేడాయి .  వెంటనే ఈ చిరుతపులి ఆ అడవికి కుందేలును వెదకుటకై వెళ్లింది.    ఆ అడవికి వెళ్ళిన చిరుతపులిని సింహం తరిమి తరిమి కొట్టింది.   చివరకు ఆ చిరుతపులి తన అడవికి తిరిగి వచ్చి  అక్కడ ఒక్క జంతువు కూడా  లేకపోవడంతో చేసేది లేక  అది  అక్కడనుండి మరొక కొత్త అడవిని  వెతుక్కుంటూ బయలుదేరింది .
        ఈ సంగతి తెలిసిన జంతువులన్నీ తిరిగి ఆ అడవికి వచ్చి సుఖంగా ఉండసాగాయి. అవి కుందేలుతో ” ఆ మంత్రం ఏమిటి? మాకు కూడా చెప్సవా!” అని అడిగాయి. అప్పుడు కుందేలు నవ్వి ” అయ్యో! అది మంత్రం కానే కాదు. అక్షరాలను తలక్రిందులుగా చేసి అన్నాను. అంతే! ఆ తెలివి తక్కువ చిరుత పులి నమ్మింది ” అని అంది.
        ఆ తర్వాత  అవి తమను కాపాడిన సింహాన్నే తమ అడవికి  రాజుగా ఉండమని కోరాయి .  అందుకు సింహం అంగీకరించి ఈ రెండు అడవుల్లో ఏ జంతువుకు ఆపద వచ్చినా తాను ఆదుకుంటానని హామీ ఇచ్చింది.  కుందేలు తెలివి వల్ల  చిరుతపులి బాధ తొలగి జంతువులన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. అందుకే పిల్లలూ! ఆపద వచ్చినప్పుడు ఇతరులకు చెప్పి వారి  సాయాన్ని కోరాలి.

You may also like

Leave a Comment