Home బాల‌సాహిత్యం కుక్క విశ్వాసం

           గోదావరి నది పొంగి  ప్రవహిస్తోంది.   ఆ నదిలో ఒక కుక్క ఒకటి కొట్టుకొని వచ్చింది.   దానికి ఈత వచ్చు.   ఆ ప్రవాహ వేగంలో అది కొట్టుకొని వచ్చి దిగువన ఉన్న ఒక గ్రామానికి చేరింది.   అది ఆ గ్రామంలోకి ప్రవేశించింది .  ఆ కుక్కను చూసి ఇతర కుక్కలన్నీ వెంబడిపడి మొరగడం ప్రారంభించాయి .  అయినా అది వాటిని లెక్క చేయలేదు. ఆ తర్వాత అది ఒక ఇంటిలోనికి ప్రవేశించింది .  ఆ ఇంటి యజమాని చాలా దయార్ద్ర హృదయుడు.   వెంటనే అతడు ఆ కుక్కకు ఆహారం పెట్టాడు.  అది తిన్న కుక్క ఆ యజమాని ఇంటి బయటనే ఉండసాగింది.

         ఒకసారి ఆ యజమాని తన కుటుంబంతో సహా ఒక ఊరుకు వెళ్లాడు .  ఆ కుక్కను ఇక్కడనే ఉంచిపోయాడు.   ఆ సమయంలో ఒక పెద్ద త్రాచుపాము వారి ఇంటిలోనికి దూరడానికి ప్రయత్నించింది.   ఇది గమనించిన   ఆ కుక్క  మొరుగుతూ ఆ త్రాచు పామును అడ్డుకుంది .  ఆ కుక్కకు భయపడిన   ఆ  త్రాచుపాము దూరంగా ఉండి ఆ ఇంటిలోనికి ఎలాగైనా ప్రవేశించాలని తాపత్రయపడింది .  కానీ ఆ కుక్క ముందు దాని ఆటలు సాగలేదు.  

         ఇంతలో ఆ  ఇంటి యజమాని  ఊరినుండి వచ్చాడు.   ఆ కుక్క ఎందుకు మొరుగుతున్నదోనని అతడు చూశాడు.  అక్కడ అతనికి ఒక విష సర్పం తన ఇంటిలోనికి ప్రవేశించడానికి  చేస్తున్న ప్రయత్నాన్ని  చూశాడు.   దానిని కుక్క అడ్డుకుంటున్న సంగతి కూడా గమనించాడు .  అది చూసి వెంటనే అతడు పాములు పట్టే వ్యక్తిని పిలిపించాడు.   అతడు ఆ పామును పట్టుకొని ఒక సీసాలో  బంధించాడు.  తర్వాత  ఆ యజమాని ఇచ్చిన డబ్బును తీసుకొని దాన్ని తీసుకుని వెళ్లి దూరంగా అడవిలో వదిలిపెట్టాడు.  

   మరొక్కసారి యజమాని, ఆయన భార్యా పిల్లలు అర్దరాత్రి నిద్రలో ఉన్నారు.  అప్పుడే కొందరు దొంగలు వారి ఇంట్లో ప్రవేశించి వారు  ఉన్న గది తలుపు  బయట గడియ పెట్టి వారి ఇంటిలోని డబ్బు, బంగారం దోచుకెళ్లారు. ఈ సమయంలో ఆ కుక్క ఎక్కడికో వెళ్లింది.  ఇంతలో ఆ యజమాని కి తెలివై బిగ్గరగా ” దొంగలు, దొంగలు”  అంటూ కేకలు వేశాడు.  ఆయన వేసిన ఆ కేకలకు ఆ వీధిలోని వారు మేల్కొని వారి ఇంటికి వచ్చి తలుపు గడియ తీశారు. అప్పటికే ఆ దొంగలు పారిపోయారు.  వారి బీరువా తలుపులు తెరచి ఉన్నాయి.  అప్పుడు యజమానికి తన కుక్క ఏమైందని జ్ఞాపకం వచ్చింది.  వెంటనే అతడు ఇరుగు పొరుగు వారితో “నా కుక్క కనిపించిందా !”అని అడిగాడు. వారు లేదని చెప్పారు.  వెంటనే ఆ యజమాని కుక్క కొరకై బయటకు వచ్చి చూశాడు. అప్పుడే ఎక్కడినుండి యో  వస్తున్న ఆ కుక్క నోటిలో ఒక డబ్బు, నగల మూట కనిపించింది.  అది తీసుకుని విప్పి చూశాడు. అది తన బంగారం, డబ్బులే.  ఆ యజమాని  జరిగినది ఊహించాడు.  ఇరుగు పొరుగు వారికి తన కుక్క ఆ దొంగల వెంటబడి  వారిని తరిమి తన బంగారం, నగదును పట్టుకుని తెచ్చిందని చెప్పి సంబరపడ్డాడు. ఇరుగు పొరుగు వారు ఆ కుక్క చేసిన పనికి ఎంతగానో  సంతోషించారు.   తర్వాత ఆ ఇంటి యజమాని తను  పెట్టిన ఆహారం తిని తన పట్ల తన కుటుంబం పట్ల విశ్వాసం చూపిన ఆ కుక్కను ప్రేమతో దాని తలపై నిమిరాడు. 

You may also like

Leave a Comment