ఘట్టమర్రాజుగారు వరిష్ఠ సాహిత్యవేత్త. నిరంతర గ్రంధపఠనం వారి ప్రత్యేకత. నిన్న మొన్నటి రచయితల్లో సాహిత్య స్నేహాలు కలిగివున్నవారు. తెలుగు, హిందీ కన్నడ భాషా సాహిత్యాలను లోతుగా అధ్యయనం చేసినవారు. సాహిత్య విమర్శ వారికి బాగా ఇష్టమైన ప్రక్రియ. రాచమల్లు రామచంద్రారెడ్డి (రారా) గారి లాగా సమీక్షా వ్యాసాన్ని విమర్శనావ్యాసంగా మలచినవారిలో వీరొక్కరు. వారి రచనలన్నీ ప్రచురిస్తే ఐదారు సంపుటాలు అవుతాయి. కాని వారు 2021-24 మధ్యకాలంలో ఒక మాస పత్రిక కోసం రాస్తూ వచ్చిన గ్రంధ సమీక్షలుగా పేర్కొనబడ్డ సాహిత్య విమర్శనా వ్యాసాలను పుస్తకంగా వెలువరించటానికి పూనుకున్నారు. ఇది ‘గ్రంధాంతరంగం’ పేరుతో ప్రచురింపబడటం ముదావహం. కేవలం వారి వ్యాసాలతో కూడిన గ్రంధమొకటి వెలవడటం ఇదే ప్రథమం.
విమర్శకులు ముందుగా సాహిత్య జిజ్ఞాసువులై ఉండాలి. వయసుకు అతీతమైన పఠనోత్సాహం అప్పడే సాధ్యమవుతుంది. ఎనభై సంవత్సరాల ఘట్టమర్రాజు గారు ఇప్పటికీ ఏ కొత్త పుస్తకం వచ్చినా ఆసక్తితో చదువుతారు. ఆ పుస్తకం పట్ల తన సాహిత్య అనుభవం దృష్ట్యా ఒక అభిప్రాయానికి వస్తారు. ఆ అభిప్రాయాన్ని వ్యాసరూపంలో ప్రకటిస్తారు. పరంపరాగతంగా వస్తున్న సాహిత్య చరిత్ర గ్రంధాల పట్ల వీరికి ఆసక్తి ఎక్కువ. ఆయా కవులు, రచయితల మూలరచనలు చాలావరకు చదివినవారు కావటం వల్ల ఆయా సాహిత్య చరిత్రకారుల వాదవివాదాల పట్ల కూడా వారికి ఆసక్తి ఎక్కువే. వీరిలో కొందరితో ఘట్టమర్రాజు గారికి వ్యక్తిగత పరిచయాలు, స్నేహాలు ఉన్నాయి.
ఘట్టమర్రాజుగారి విమర్శలో పూర్వాపరాలను బేరీజు వేసుకుంటూ ముందుకు సాగటం ఒక లక్షణంగా కనిపిస్తుంది. ఉదాహరణకు, భోగరాజు నారాయణమూర్తి గారు 1920లో ప్రచురించిన తమ ‘ఆంధ్ర కవిత్వ చరిత్రమట’లో ‘కంచిలోని ఒక జైనమఠంలో తెలుగు జైన శతకమొకటి’ ఉందని సూచించారు. వంద సంవత్సరాలు దాటిగా ‘ఏ పరిశోధకుడి దృష్టి అయినా ఈ చీకటి కొట్టు వైపు ప్రసరించిందా?’ అని ప్రశ్నిస్తున్నారు ఘట్టమర్రాజు గారు. సాహిత్య త్రవ్వకం పని నిరంతరం సాగుతుండాలని, అప్పడే కొత్త అంశాలు వెలుగులోకి వస్తాయని వారి అభిప్రాయం.
ఏ సాహిత్యకారుడు ఏ కొత్త సత్యాన్ని వెలుగులోకి తేస్తాడా? అని నిర్నిద్ర దృష్టితో ఎదురుచూడటం వారి స్వభావం. ‘కవిత్వవేది’ కళ్ళూరి వేంకట నారాయణరావు గారు 1928లో రచించిన ‘ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహమట’లో సంఘ చరిత్ర, వాఙ్మయ చరిత్ర, కావ్య విమర్శ, యుగలక్షణ సమన్వయము – అన్న అంశాలవారీగా తెలుగు సాహిత్యాన్ని పరిశీలించారు. 1928కి ముందు సాహిత్య చరిత్రలు రాసినవారెవ్వరూ సాహిత్యాన్ని ఈ దృష్టితో చూడలేదంటున్నారు ఘట్టమర్రాజుగారు. చరిత్ర సంస్కృతుల జ్ఞానం ఉన్న చరిత్రకారుడు మాత్రమే ఇట్లా విశ్లేషించగలడని వారి అభిప్రాయం.
‘స్వారోచిష మనుచరిత్ర టీకా తాత్పర్య వ్యాఖ్య’ అన్న వ్యాసం పెద్దన కవితాశక్తి గొప్పదనాన్ని, బ్రౌన్ దొర సామాన్య పాఠక దృష్టిలోని నవ్యతను, జూలూరి అప్పయ్య టీకా రచనలోని సరళ సంక్షిప్త వివరణను ప్రశంసించే వ్యాసమిది. అప్పయ్యగారి టీక అచ్చయిన 171 సంవత్సరాల తర్వాత డాక్టర్ కోడూరు ప్రభాకర రెడ్డిగారు తాత్పర్యాలను, విశేష వ్యాఖ్యలను సమకూర్చి కొత్త ప్రచురణను 2022లో పాఠకులకు అందుబాటులోకి తేచ్చారు. ఈ సందర్భంలో ‘అటజనికాంచె…’ అన్న పెద్దన సుప్రసిద్ధ పద్యానికి అప్పయ్యగారి టీకతో పాటు ప్రభాకర రెడ్డిగారు తాత్పర్యాన్ని, విశేష వ్యాఖ్యను ఉదాహరించి నేటి పాఠకులకు నాటి షడ్రుచులను చూపించిన ఘట్టమిది. ఇది ఒక రకంగా తరాల మధ్య వంతెనను నిర్మించడమే.
ఎం.ఎ. (ఆనర్స్) పట్టాకోసం పాటిబంద మాధవశర్మగారు సమర్పించిన లఘు సిద్ధాంత గ్రంధం ‘ఆధునికాంధ్ర భావకవిత్వం’ ఆచార్య వెలుదండ నిత్యానందరావుగారి పూనికవల్ల తెలుగు విశ్వవిద్యాలయం వారు 2012లో ప్రచురించారు. మాధవశర్మగారు పత్రికా సంపాదకులే కాక స్వయంగా కవి. ‘భావకవిత్వమందు వికసోన్ముఖమై యున్న ఉత్తమ లక్షణములను దిగ్మాత్రముగ ప్రదర్శించుట ఈ కావ్యముద్దిష్టము. ఈ కవితపై ని~ది కేవలమ తొలిపలుకు’అని అనటంలోని వినయ సౌశీల్యాన్ని సమీక్షకులు ప్రశంసిస్తున్నారు.
భావకవిలో జీవితాంతం వెంటాడే ‘అనిర్వాచ్యమైన అనుభూతి’ని గురించి పేర్కొనటమంటే భావ కవిత్వ ఆత్మను సంభావించినట్లే. భావకవులు ‘విశిష్ట కవులు’ని, అప్రాప్తమైన ప్రేమను ఆరాధించటమే భావకవుల ఆశయమని మాధవశర్మగారంటారు. ‘కవి ఎట్టి భావస్థితి యందు కావ్యమును భావించెనో, అట్టి భావస్థితిని పొందగల కొందరు పరిఢితులకు కొని సమయములందే ఇవి రుచించగలవు’ అని అనటాన్ని సమీక్షకులు సమర్థిస్తున్నారు. ll కొని పద్యగేయ కవితల్లోని ‘ఛందోశిల్పవైవిధ్యం, భాషా వైలక్షణ్యాల గురించి ఎక్కువగా వివరించారే కాని కవితా అగ్ని పుష్పాల జ్వాలల్ని విశ్లేషించే అవసరమైన ప్రయత్నం చేయలేకపోయారు’అని ఘట్టమర్రాజుగారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ll ‘అగ్నిపుష్పాల జ్వాలల’ వంటి కవితల విశ్లేషణ భావకవిత్వ పరిధిలోకి రాదని మాధవశర్మగారు భావించి ఉంటారు.
‘బ్రౌణ్య మిశ్ర భాషా నిఘంటువు’ (1854)ను సమీక్షించటం అందరితో అయ్యే పని కాదు. ఇందుకు ఘట్టమర్రాజు వంటి బహుభాషావేత్తలు మాత్రమే సరిపోతారు. ఇందులో అరబీ, పార్శీ, ఉర్దూ, ఇంగ్లీషు, తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, మరాఠీ, బెంగాలీ, ఒరియా, ఫ్రెంచి, టిబెట్ పదాలకు ఆంగ్లంలోను, తెలుగులోని అర్థాలు ఇవ్వబడ్డాయి. మొత్తం ఆరోపాలు 2286, ‘అస్తావేస్తమట’ అన్న మాటకు బ్రౌన్ దొర ఆంగ్లంలో ఫూలిష్‌నెస్, మాడ్‌నెస్ అన్న అర్థాలను, తెలుగులో చాదస్తమట అన్న అర్థాన్నిచ్చారు. అయితే ఘట్టమర్రాజుగారు ‘అస్తవ్యస్త’ అన్న సంస్కృత పదం దాని మూలం కావచ్చునని తమ ఉపజ్ఞతో సూచించారు. ఇది సరిగ్గా సరిపోయింది.
దేవులపల్లి రామానుజరావు గారి ‘యాభై సంవత్సరాల జ్ఞాపకాలు’ ఆత్మకథను విశ్లేషిస్తూ 22 సంవత్సరాల పాటు సాహిత్య అకాడెమీకి చేసిన సేవలను ప్రశంసించారు. ఆంధ్ర సారస్వత పరిషత్తును సాహిత్య వికాసానికి, విద్యావ్యాప్తికి వేదికగా మార్చిన మహానుభావులలో ప్రధాన స్థానం రావుగారిది. ‘రామానుజరావు జాతీయ, ఆంధ్ర, తెలంగాణ పునరుజ్జీవనోద్యమాల్లో తానొక సామాన్య కార్యకర్తగా ప్రముఖ నాయకుల అనుచరునిగా పాత్ర వహించినట్లు చిత్రించుకున్న వినయముద్ర వ్యక్తమవుతుంది’ అంటున్నారు. ఇది వారి సూక్ష్మదృష్టికి తార్కాణం. నిజానికి తెలంగాణ సాహితీమూర్తులెవ్వరిలోను తమ వ్యక్తిత్వాలను ఘనంగా ప్రచారం చేసుకునే తత్వం లేదు.
ఘట్టమర్రాజుగారికి అన్నమయ్య అంటే ఏడుకొండలంత అభిమానం. ప్రతి వ్యాసంలో ఆ వాగ్గేయకారుని కవిత్వాన్ని సందర్భోచితంగా ఉదాహరిస్తారు. ఈ గ్రంధాంతరంగంలో మరెన్నో విలువైన వ్యాసాలున్నాయి. వారి ఇతర వ్యాసాలను కూడా ప్రచురించి లోకార్పణ చేస్తే బాగుంటుంది. రచయితల రచనలే శాశ్వతంగా మిగులుతాయి. ఇది సాహిత్య సత్యం.
