Home బాల‌సాహిత్యం కోతి పొగరు

  సుందర వనం అనే అడవిలో ఒక కోతి వర్షంలో తడుస్తూ దారిలో  నిలబడింది .  ప్రక్కనే చెట్టుపై ఉన్న కాకి దానిని చెట్టు కిందకు రమ్మని ప్రేమతో  పిలిచింది.   కానీ కోతి ఆ మాటలు వినిపించుకోలేదు.  ఆ కాకి తిరిగి దానిని రమ్మని పిలిచింది.  అప్పుడు ఆ కోతి కోపంతో కాకి వైపు వచ్చి ఆ చెట్టును ఎక్కి దాని గూడును లాగి  క్రింద పడవేసింది.  అదృష్ట వశాత్తు అందులో దాని పిల్లలు లేవు. ఆ కోతి కోపానికి కాకి ఆశ్చర్య పోయింది.
         అది గమనించిన ఒక పావురం “ఓ కాకీ!  అటువంటి మూర్ఖురాలైన  కోతిని నీవు రమ్మనడం, దానికి ఉపకారం చేయాలని అనుకోవడం   పెద్ద తప్పు. నీవు మంచి చెప్పినా అది వినే స్థితిలో లేదు” అని అంది.  ఈ మాటలను విన్న కోతి కోపంతో ఆ పావురంపై దాడికి వచ్చింది.  ఆ పావురం వెంటనే ఆకాశంలోకి ఎగిరింది.
       అది చూసిన కాకి ” ఓ కోతీ! నీ ప్రతాపం నీకన్నా చిన్నగా ఉన్న  మా పక్షులపైన కాదు .  నీకు  బలం ఉంటే అదిగో  ఆ  కనబడుతున్న ఆ పెద్ద జంతువు ఆ గాడిదపైన నీ ప్రతాపం చూపించు” అని అంది. వెంటనే కోతి ” నాకేం భయమా ! దాని సంగతి కూడా నేను తేలుస్తాను. దాని  వెనుక కాలును లాగుతాను. చూడు” అని ఆ  గాడిద వైపు వెళ్ళింది. 
         అది అక్కడికి వెళ్లి గాడిద వెనుకవైపు వెళ్లి ఆ గాడిద కాలును లాగింది. ఆ గాడిదకు కోపం వచ్చి ఆ కోతిని తన వెనుక కాళ్లతో  బలంగా ఒక్క తన్ను  తన్నింది. దాని బలానికి ఆ కోతి కళ్లు బైర్లు కమ్మి   గాలిలో గిరగిరా మూడు తిరుగుళ్లు తిరిగి క్రింద పడింది.  ఆ కోతికి నడుం విరిగినంత పని అయింది. 
      వెంటనే తేరుకున్న కోతి ” అమ్మో! ఈ గాడిద జోలికి  మనం వెళ్లకూడదు. దీనికి చాలా బలం ఉంది.  ఇదే కాదు. మరొకసారి ఎవరి జోలికి పోకూడదు. నాకు తగిన శాస్తి జరిగింది ” అని అనుకొని ఇంటి దారి పట్టింది. అప్పుడు ఆ  పావురం, కాకులు దానికి బుద్ది వచ్చినందుకు సంతోషించి  ఆ గాడిదతో ” మిత్రమా! ఆ పొగరుబోతు కోతికి తగిన గుణపాఠం చెప్పావు. అది మరొకసారి ఎవ్వరి జోలికి పోకుండా చేశావు. నీకు మా ధన్యవాదాలు” అని అన్నాయి.
        అప్పుడు ఆ గాడిద” నా జోలికి వస్తే నేను ఊరుకుంటానా! అది మీతో దురుసుగా ప్రవర్తించడాన్ని నేను ఇక్కడి నుండి  కళ్లారా  చూశాను.  పాపం! మీరు చిన్న ప్రాణులు.  అందుకే దానికి తగిన గుణపాఠం చెప్పాను” అని అంది.   అందుకే పొగరు ఉన్న వారికి ఎప్పటికైనా భంగపాటు తప్పదు. 

You may also like

Leave a Comment