Home వ్యాసాలు గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా

గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా

by Narendra Sandineni

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(10)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి).
.ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత ఇది.గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవితను గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది. గుల్జార్  తనకు గల అపారమైన జీవితానుభవాన్ని,  తాత్వికతను మేళవించి షాయరీ కవితను రాసిన తీరు అద్భుతంగా ఉంది,షాయరీ కవితలోని భావాలు మనసును పరవశింప జేస్తాయి.షాయరీ కవితను చదవాలనే ఆసక్తి ఉందా? తెలుసుకోవాలని మనసు తహతహలాడుతుందా? అయితే కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.షాయరీ కవితలోని అపూర్వమైన భావాల లోకంలో విహరించండి.గొప్ప గొప్ప అనుభూతులను సొంతం చేసుకోండి.
“నన్ను ఈ చీకటిలోనే ఉండనీయ్ గాలిబ్!
“వెలుతురులో నా అనుకున్న వాళ్ళ
“ముఖాలు కనిపించి భయపెడతాయి!
చీకటి అనునది వెలుగునకు వ్యతిరేక పదం.చీకటి ఒక ప్రదేశంలో దృగ్గోచర కాంతి లేమిని సూచిస్తుంది.చీకటి అంతరిక్షంలో నలుపు రంగులో కనిపిస్తుంది.మానవుడు కాంతి గాని చీకటి గాని ప్రబలమైనప్పుడు దాని రంగును స్పష్టంగా గుర్తించ లేడు.చీకటి తక్కువగా ఉంటే మసక చీకటి అంటారు.చీకటి ఎక్కువగా ఉంటే దాన్ని కారు చీకటి అంటారు.ప్రతి రోజు రాత్రి కాగానే చీకటి అలుముకుంటుంది.ఎక్కువగా నేరాలు మరియు ఘోరాలు రాత్రి సమయంలోనే జరుగుతుంటాయి. సూర్యుడు అస్తమించడంతో లోకం అంతటా అంధకారం వ్యాపిస్తుంది. జీవితంలో తనకు అత్యంత ప్రధానమైనటువంటిది దూరమైనప్పుడు జీవితం అంధకారమయంగా తోస్తుంది.చీకటి అనేది అజ్ఞానానికి ప్రతీకగా చెబుతారు.అజ్ఞానం అంటే జ్ఞానము లేదా ఒక నిర్దిష్ట విషయంపై అవగాహన లేకపోవడం అని చెప్పవచ్చు.ముఖ్యమైన సమాచారం లేదా వాస్తవాల గురించి తెలియని వ్యక్తులను అజ్ఞానులుగా తలంచ వచ్చు.అజ్ఞానం మూడు రకాలుగా పేర్కొంటారు.1)వాస్తవ అజ్ఞానం అనగా కొన్ని వాస్తవాల జ్ఞానం లేకపోవడం. 2)వస్తువు అజ్ఞానం అనగా కొన్ని వస్తువులతో పరిచయం లేకపోవడం.3)సాంకేతిక అజ్ఞానం అనగా ఏదైనా శాస్త్రబద్ధంగా ఎలా చేయాలో తెలియక పోవడం.అజ్ఞానం అంటే తెలియనితనం.ప్రసిద్ధ కవి గాలిబ్ అగ్రాలో జన్మించాడు.గాలిబ్ చిన్న చిన్న మాటలతోనే తన కవితల్లో పెద్ద భావాన్ని పలికించాడు.మనసు నుండి ఉబికి వచ్చే దుఃఖం, ఊహా ప్రేయసి,ప్రేమ,శృంగారం,విరహం,కరుణించని ప్రేయసి కాఠిన్యం,స్వీయ అన్వేషణ,నీతి, సౌకుమార్యం, జీవితపు గాఢత,మానవుడి అంతరంగపు లోతు,ఒంటరితనపు క్షోభ,బతుకు రుచి,లోక రీతి,ఏదీ శాశ్వతంగా ఉండిపోదన్న వాస్తవాలు గాలిబ్ కవితల్లో కనిపిస్తాయి.అందంతో ఆరోగ్యవంతుడిని చేసే ప్రేయసి గురించి గాలిబ్ మాత్రమే రాయగలడు.ప్రేమకు ప్రేమే బాధ,ప్రేమకు ప్రేమే చికిత్స అని గాలిబ్ చెప్పగలడు.మనలో మనం మాట్లాడుకుంటాం.మనం ఇతరుల వల్లనే  మోసపోయాం అని అనుకుంటాం.కానీ వాస్తవానికి మనం మనతోనే ఎక్కువగా మోసపోయామని గాలిబ్ మాత్రమే చెప్పగలడు.ఈ షాయరీ కవితలోని భావాలు అతని హృదయం లోతుల్లో జరిగే సంఘర్షణల తాలూకు చీకటిని అజ్ఞానాన్ని తెలియజేస్తాయి.ఈ లోకంలో నివసించే ఎవరికైనా రోజుకు ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంటాయి.అందులో పదహారు గంటలు తాను ఏదైనా పని చేస్తూ జీవిస్తాడు.మిగతా ఎనిమిది గంటలు మాత్రం నిద్రపోతేనే అతని శరీరానికి ప్రశాంతత చేకూరుతుంది.నిద్ర పోయే ఎనిమిది గంటల సమయంలో కూడా ఆ చిమ్మ చీకటి రాత్రిలో అతనికి ఏవేవో తెరిపిలేని ఆలోచనలు,మనసును మెలిపెట్టే సమస్యలు, బాధ,దుఃఖం,దూరమైన ప్రేయసి ఎడబాటు గుర్తుకు వచ్చి సతమతమవడం ఎంతో ఆందోళనను కలిగిస్తుంది.చీకటిలో కూడా మరిచిపోలేని దుఃఖం,వేదన,దిగులు మనసును ఆవహించి అతన్ని నీడలా వెంటాడుతుంది.తన వాళ్ళు అంటే రక్తసంబంధీకులు,తన హృదయానికి నచ్చిన వాళ్ళు,దగ్గరి వాళ్ళు,బంధువులు మరియు స్నేహితులు అందరు ధన వ్యామోహంలో కూరుకుపోయి ఆత్మీయత,అనుబంధాలను మరిచిపోయారు.వారు తన పట్ల అనురాగమున్నట్లు నటిస్తూ,ఎంతటి దుర్మార్గం చేయడానికి అయినా వెనుకాడడం లేదు.అతను తన హృదయంలో చెలరేగే భావోద్వేగపు సంఘర్షణలను తనను చుట్టుముట్టిన సమస్యల సుడిగుండాలను జీవితం విసిరిన సవాళ్లను ఎదుర్కొనలేక నన్ను ఈ చీకటి ప్రదేశంలోనే ఉండనీయమని వినమ్రంగా గాలిబ్ ను వేడుకుంటున్నాడు.తన జీవితంలో కలిగిన అలజడులు, ఆందోళనలను అవాంతరాలను తొలగించడానికి గాలిబ్ నుండి మాత్రమే పరిష్కారం దొరుకుతుందని అతని ఆలోచన.అతని వల్లనే .తన జీవితానికి శాంతి,స్వాంతన లభిస్తుంది అనుకుంటున్నాడు.తన గుండెలో చెలరేగుతున్న భావావేశం,అలజడులు,కష్టాలు,కన్నీళ్లను గాలిబ్ కు చెప్పాలని నిర్ణయించుకున్నాడు.గాలిబ్ నుండి మాత్రమే తాను ఓదార్పును పొందగలనని అతని విశ్వాసం.ఈ లోకంలో ఎవ్వరు తన బాధలను అర్థం చేసుకోలేరు.ఒక్క గాలిబ్ మాత్రమే అర్థం చేసుకుంటాడు.జీవితం అనే ప్రయాణంలో చీకటి నుండి బయటికి వచ్చిన తర్వాత మనకు వెలుతురు కనిపిస్తుంది. వెలుతురును చూడగానే మన బతుకు తిరిగి చిగురిస్తుందని అనుకుంటాం.కానీ అలాంటి వెలుతురులో కూడా నాకు ప్రియమైన వాళ్ళ ముఖాలు కనిపించి భయపెడతాయి.నా ప్రియమైన వాళ్ళు అనుక్షణం నన్ను వేధించిన జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి.భయం నీడలోకి నన్ను త్రోసిన వారిని,నా వినాశనాన్ని కాంక్షించిన వారిని చూడడం నాకు అస్సలు ఇష్టం లేదు.ద్రోహం చేసిన వాళ్ళ ముఖాలు స్పష్టంగా కనిపించి నన్ను భయపెడతాయి అని చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.ఈనాడు లోకంలో మనుషులు ద్వేష భావాన్ని కనిపించకుండా ప్రేమను ఒలకబోస్తూ ఆప్తులుగా నటిస్తూ మన వెంటే ఉంటారు. ఆప్తులుగా నమ్మిన వారే మనను ఒక్కసారిగా వెన్నుపోటు పొడుస్తారు.మనకు వారి నిజస్వరూపం తెలిసినప్పుడు ఏమీ చేయలేని సందిగ్ధత నెలకొంటుంది.గుల్జార్ మనుషుల విచిత్ర మనస్తత్వాలను బాగా అర్థం చేసుకున్నాడు.అందుకే షాయరీ కవితల్లో అద్భుతమైన భావాలను పండిస్తూ లోక రీతిని చెప్పిన తీరు అసాధారణం అని చెప్పవచ్చు.గుల్జార్ షాయరీ కవితను తెలుగులోకి చక్కగా అను సృజన చేసిన కవయిత్రి గీతాంజలిని (డాక్టర్ భారతిని)  అభినందిస్తున్నాను.

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(11)
గుల్జార్ షాయరీ కవితలోని పొంగి పొరలే భావాలు,  ప్రేమ,అనుభూతి,అపారమైన జీవితానుభవంతో కూడిన తాత్వికత,పాఠకుల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తాయి. గుల్జార్ షాయరీ కవితల్లోని భావాలను గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? అయితే మనసు పెట్టి షాయరీ కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతులను సొంతం చేసుకోండి.
“పోయినేడాదిలాగే ఈ చలికాలపు
“డిసెంబర్ నెల కూడా వెళ్ళిపోతుంది
“దీనికి కూడా నీలాగే నా కోసం
“ఆగిపోయే అలవాటే లేదు !
పోయిన ఏడాదిని గడిచిపోయిన సంవత్సరం లేదా గత సంవత్సరం అని అంటారు.గత సంవత్సరం అతని జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగినాయి?అతని జీవితంలో అనురాగం,అప్యాయతలు పంచిన మధుర క్షణాలు ఉన్నాయి.గత సంవత్సరం జీవితంలో తీరని వేదన కలిగించిన సంఘటనలు అతని తీపి జ్ఞాపకాలను ఆనందాన్ని దూరం చేశాయి.గడిచిన సంవత్సరం గుర్తుకు వస్తే అతనికి నిరాశ,నిస్పృహలు కలుగుతాయి.విషాదం, పెను చీకటి అతని వెన్నులో చలి పుట్టిస్తుంది.డైరీలోని పేజీలను తిరిగేస్తే గత సంవత్సరపు జ్ఞాపకాలు,అతని జీవితంలో జరిగిన మార్పులు తెలుస్తాయి.నిత్యం జరిగే వ్యవహారాలను డైరీలో రాసే అలవాటు అందరికీ ఉండదు.కొందరికి మాత్రమే ఉంటుంది.ఒక వేళ అతనికి డైరీ రాసే అలవాటు లేనట్లయితే రాయని ఎన్నో విషయాలు అతని మెదడులో నిక్షిప్తం అయి ఉంటాయి. మరపురాని తీపి జ్ఞాపకాలు,మరిచిపోలేని చేదు అనుభవాలు,అనుభూతులు అతని బ్రతుకులో గుర్తులుగా చెరిగిపోకుండా ఉంటాయి.తీపి జ్ఞాపకాలు గుర్తుకు వస్తే అతని మనస్సు ఎక్కడా లేని ఆనందానుభూతిలో తేలి ఆడుతుంది.చేదు జ్ఞాపకాలు గుర్తుకు వస్తే అతను తీవ్రమైన విషాదంలోకి వెళ్ళిపోతాడు.రంగు రంగుల రమ్యమైన అతని జీవితంలో ఎన్నో మధుర స్మృతులు, ఆనందాలు,అనుభూతులు పెనవేసుకుని ఉన్నాయి.జీవిత  ప్రయాణంలో అతనికి తెలియకుండానే గడియారంలోని ముళ్ళు తిరిగినట్లుగా నిమిషాలు,గంటలు,రోజులు, సంవత్సరాలు గడిచి పోయినాయి.చిత్రమైన అతని జీవితంలో మనస్సును ఆహ్లాదపరిచే సంఘటనలు, ఆనందాన్ని పంచే అనుభూతులు, అనుభవాలు వున్నాయి.ఈ లోకం ఎన్నెన్నో వింత,వింత అద్భుతాల సృష్టి.వెల్లివిరిసే ఆనందాలకు కొదువ లేదు.ఒక్క క్షణం కళ్ళు మూసి తెరవగానే అతనికి సంవత్సరం గడిచి పోయింది.గడిచి పోయిన సంవత్సరం ఎన్నో తీపి జ్ఞాపకాలను,చేదు అనుభవాలను వెంట తీసుకొని వెళ్ళి పోయింది.ఈ సంవత్సరం డిసెంబర్ నెల మాసం వాతావరణంలో నెలకొన్న మార్పులతో ఉదయాన ఉషోదయాలు, రాత్రి వేళ చీకట్లు కలుగుతూ కాలం కరిగిపోతున్నది. శీతాకాలంలో మంచు కురుస్తూ విపరీతమైన చలి గాలులు వీస్తున్నాయి.చలి కాలంలో విస్తృతంగా వీస్తున్న చల్ల గాలుల మూలంగా శరీరానికి వణుకు పుడుతున్నది.డిసెంబర్ నెలలో జరిగిన మరపురానివి,మర్చిపోలేని కొన్ని సంఘటనలు అతని మనసుని మెలి పెడుతున్నాయి.మనసును గిలిగింతలు పెట్టే చలి,ప్రేయసి చెఃతన లేకపోవడం, ఏదో తెలియని గుబులు,అతనికి దడ పుట్టిస్తోంది. తాను అవ్యాజంగా ప్రేమించిన ప్రియురాలి ఎడబాటు,మనసును కలత పెట్టింది.ఆమె తనను ఒంటరి వానిని చేసి వెళ్లడంతో,తీవ్రమైన విషాదం తెలియని అలజడి,ఆందోళన మొదలైంది.ఆమె తన చెంత లేకపోవడం వల్ల,ఒక రకమైన నైరాశ్యం అతనిలో కలిగింది.ఆమె లేని ఎడబాటును తల్చుకుని అతని మనసు చెప్పలేని బాధతో విలవిలలాడింది. చూస్తుండగానే డిసెంబర్ నెల మాసం కరిగి వెళ్ళి పోతుంది.విరామం ఎరుగనిది కాలం.కాలం ఎవ్వరి కోసం ఆగకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళుతుంది.అత్యంత గాఢంగా ప్రేమించిన నీవు నన్ను నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టి వెళ్లినట్లే డిసెంబర్ నెల వెళ్ళిపోతుంది. ఎంతగానో ప్రేమించిన నీవు నా కోసం ఆగ లేదు. డిసెంబర్ మాసం కూడా నీలాగే నన్ను వదిలి వెళ్ళిపోతున్నది.డిసెంబర్ మాసానికి ఆగిపోయే అలవాటు అసలు లేదు.డిసెంబర్ మాసం నాకు మనసులో ఎప్పటికీ గుర్తు ఉంటుంది.గాఢంగా ప్రేమించిన నీవు నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయావు.ఈ సంవత్సరం డిసెంబర్ మాసం కూడా వెళ్ళిపోతుంది.నీ కోసం నాలాగే ఆగిపోయే అలవాటు దానికి లేదు అని కవి గుల్జార్ వ్యక్తికరించిన భావాల్లో ఎంతో సత్యం గోచరిస్తుంది. బ్రతుకులో గడిచి పోయిన కాలం నాటి చేదు జ్ఞాపకాలు,అనుభవాలు,మనసుని చుట్టుముట్టిన ఆలోచనలు,అలజడులను తట్టుకోవడం అతనికి కష్టంగా ఉంది.కవి గుల్జార్ లోక రీతిని ఎరిగినవాడు. గుల్జార్ షాయరీ కవితలోని భావాలు అద్భుతంగా ఉన్నాయి.

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(12)
గుల్జార్ లో మానవ జీవితంలోని సంఘర్షణలను కవిత్వంలోకి మలిచే అపారమైన సృజన శక్తి దాగి ఉంది.షాయరీ కవితలోని భావాల్లో నూతనత్వం, సహజ సరళి పాఠకుల హృదయాలను ఇట్టే ఆకట్టుకుంటాయి.గుల్జార్ షాయరీ కవితను గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే మనసు పెట్టి కవితా చరణాల్లోకి వెళ్ళి దృష్టిని సారించండి.గొప్ప అనుభూతులను సొంతం చేసుకోండి.
“ఎవరైనా వచ్చి నన్ను తమ
“బాహువులతో పొదువుకుంటే
“బాగుండు … చాలా  కొద్దిగా
మిగిలాను .. అచ్చం ఈ
“డిసెంబర్ నెలలాగే !
మానవ జీవితం సంఘర్షణల నిలయం.అతని మనసులో చెలరేగే సంఘర్షణలు విరుద్ధ భావాన్ని తెలియజేస్తున్నాయి. ఎవరైనా అంటే ఎవరో ఒకరు అని అర్థం.ఎవరో ఒకరు ఆపద్బాంధవునిలా వచ్చి తనను ప్రేమానురాగాలతో పలకరిస్తే బాగుంటుంది. ఎవరో ఒకరు తనకు తెలియని వారు తన దగ్గరికి ఎందుకు వస్తారు?ఎవరో ఒకరు వచ్చి అప్పుడే కలిగిన ప్రేమ,ఆకర్షణలతో తనను తన బాహువులతో అలుముకోవాలి అనే ఆలోచనలు అతనిలో కలుగుతున్నాయి.అతని మనసులోని ఆలోచనలు మనసులోనే ఉంటాయి.వాటికి రూపం ఇవ్వడం జరగదు.అతని ఆలోచనలు ఊహకు అందకుండా ఎక్కడో విహరిస్తున్నాయి.అతను తనకు తానే ఏదేదో మనసులో ఊహించుకుంటున్నాడు.అతని మనసులో చెలరేగిన ఊహలకు సమాధానం లేదు.అతను మనసులో అనుకున్నట్టుగా ఎవరో ఒకరు వచ్చి తనను బిగి కౌగిలిలో బంధిస్తే బాగానే ఉంటుంది. కానీ అలా జీవితంలో ఊహించినవి ఎలా జరుగుతాయి? ఊహించినవి జరిగితే ఊహలకే రెక్కలు వచ్చినట్టుగా ఉంటుంది.జరగని వాటిని గురించి ఎడతెగని ఆలోచనలు కలుగుతున్నాయి.అసలే అతను సున్నిత మనస్కుడు.అతడు హృదయ వేదనతో చాలా కొద్దిగా మిగిలాను అని అంటున్నాడు.అతని ఆలోచనల్లో స్పష్టత లోపించింది.ఎడతెగని ఆలోచనలతో అతని మనసు చిక్కి శల్యమైంది.సంవత్సరంలోని చివరి నెల డిసెంబర్ మాసంలాగే అతని ఆలోచనల్లో తగ్గుదల ప్రభావం కనిపిస్తుంది.తాను ఊహించినవి జరగకపోవడాన్ని తెలియజేస్తుంది.మనుషుల జీవితాల్లో కార్యాలు సంభవం అయినవి ఉంటాయి. సంభవం కాని కార్యాలు కూడా ఉంటాయి. మనిషి జీవితాన్ని సానుకూల దృక్పథంతో అడుగులు వేసి కృషి చేస్తే అసాధ్యాలు కూడా సుసాధ్యాలవుతాయి. మనిషి తనలో తాను వ్యతిరేక భావాలతో మెదులుతూ అసంభవాల వైపు ఊహలు చేస్తూ ఉన్నాడు.ఇట్లాంటి ఆలోచనలు ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి వెళ్ళినట్లుగా ఉంటుంది.జీవితమంటే కష్టసుఖాల కలబోత అంటారు.మానవ జీవితంలో ఏది జరిగినా సానుకూలంగా భరించాలి. సానుకూలంగా ఎదుర్కోవాలి. కష్టపడితేనే ఫలితం ఉంటుంది.ఒక్కోసారి కష్టపడినప్పటికీ ఫలితం రాదు.అయినా మనిషి ఓర్పుతో మళ్లీ మళ్లీ ప్రయత్నం చేస్తే విజయం వరిస్తుంది.కష్టాలు వచ్చినప్పుడు అనుకున్నవి జరగనప్పుడు మనిషి ధైర్యాన్ని కోల్పోకూడదు.ఓర్పుతో తనకు తాను ప్రేరణ కలిగించుకుంటూ జీవితాన్ని సాగించాలి. ప్రేరణ మానవున్ని విజయాల బాట పట్టిస్తుంది. గుల్జార్ షాయరీ కవితలోనీ అద్భుతమైన భావాలు పాఠకుల హృదయాలను కదిలిస్తాయి.గుల్జార్ మనిషి మనసు చేసే మాయాజాలాన్ని కవిత్వీకరించడం అబ్బురపరుస్తుంది.

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(13)
గుల్జార్ లో మానవ జీవితంలోని సంఘర్షణలను విభిన్న కోణాల్లో మలిచే అపారమైన సృజన శక్తి దాగి ఉంది.గుల్జార్ షాయరీ కవితలో పొంగి పొరలే భావాలు, అద్భుతమైన పద సంపద, జీవితానుభవం,తాత్వికతతో నిండి ఉండి పాఠకుల హృదయాలను ఆహ్లాదపరుస్తాయి.గుల్జార్ షాయరీ కవితలోని భావాలను గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉందా అయితే షాయరీ కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతుల లోకంలో విహరించండి.
“ఎవరి కోసమైతే చీకటి నిండిన రాత్రులతో
“స్నేహం చేశానో ….
“వాళ్ళే ఉదయపు వెలుగులో నన్ను
“నిర్దయగా వదిలేశారు.
అతని మనసు గతం గురించిన తలపోతలు,అనుభవాలతో నిండిన ఆలోచనలు ఒక తెరిపి లేకుండా నిరంతరంగా సాగుతున్నాయి.అతని మనసులో చెలరేగిన ఆలోచనలకు ఒక క్రమం లేదు.అతను తన హృదయంలో ఆమెకు చోటు ఇచ్చాడు.ఆమెను ఎంతగానో అపురూపంగా ప్రేమించాడు.ఆమెతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్నాడు.ఆమె లేకుండా తన జీవితం లేదు అనుకున్నాడు.తాను ప్రేమించిన ఆమెను గురించి చెప్పకుండా చీకటితో స్నేహం చేశాను అంటున్నాడు. రాత్రులు చిమ్మ చీకటితో నిండి ఉంటాయి. అంధకారంలో చూస్తే కంటికి ఏమీ కనిపించదు. అతను జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు,కలిసి రాని కఠిన సమయం,మూర్తీభవించిన సహనం, మొక్కవోని ధైర్యం,ఆత్మవిశ్వాసాన్ని పెంచినాయి. నేను కష్ట సమయాల్లో ఎవరినైతే చేరదీశానో వారు నన్ను ప్రభాత వేళ  నిర్దాక్షిణ్యంగా వదిలేశారు అంటున్నాడు.కష్ట సమయాలు ముగిసిన తర్వాత తన జీవితం నూతనత్వంతో కూడిన ప్రకాశవంతమైన సూర్యకిరణాలు సోకి అద్భుతమైన సమయం ప్రారంభమైనప్పుడు తన చెంతనే ఒకప్పుడు అనురాగం,ఆప్యాయతతో తనను ఆశ్రయించి ఉన్న వారు అక్కర తీరిన తర్వాత తనని వదిలి పెట్టారనే భావాలను చక్కగా వ్యక్తీకరించారు. మరపురానిది,మరిచిపోలేనిది స్నేహం అంటారు. ఎల్ల వేళలా స్నేహం ఒక్క తీరుగా ఉంటుంది. స్నేహంలో మార్పు ఉండదు.కఠిన సమయాలు వచ్చినప్పుడు స్నేహం మారదు.కఠిన సమయాల్లో కూడా స్నేహం,ప్రేమ,ఆప్యాయతలు పొంగి పొరలుతూ ఉంటాయి.కష్ట సమయాలు తీరి వారి పరిస్థితులు బాగుపడి నప్పుడు వారు అతనితో కలిసి మెలిసి ఉన్న స్నేహాన్ని మరిచిపోయి నమ్మక ద్రోహంతో మోసంతో పట్టించుకోనితనంతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం,విడిచిపెట్టడం, స్నేహంలో గల వ్యత్యాసాన్ని స్వార్థపూరితమైన మనుషుల నైజాన్ని తెలియజేస్తుంది.అతను తన జీవితంలో ప్రత్యక్షంగా జరిగిన అనుభవాలు మరియు యదార్థమైన సంఘటనల దృశ్యాన్ని  కళ్ళముందు కదలాడినట్లుగా షాయరీ కవితలో వ్యక్తం చేయడం జరిగింది.ఎవరినైతే అత్యంత ఆప్తులుగా భావించి నమ్మినాడో వారు అతని గుండె పగిలేలా చేశారు.నమ్మిన స్నేహితులు అతని నమ్మకాన్ని వమ్ము చేసినారు.తన గుండెకు కోలుకోలేని  గాయాన్ని కలిగించి తీరని ద్రోహం చేశారు.స్నేహితులు ఇలా చేయడం ఎక్కడా చూడలేదు.స్నేహానికి జరిగిన అవమానం ఇది. ఎవరు కూడా కలలో ఊహించని సంఘటన.అతను వారిని తన వారని అమాయకంగా నమ్మినాడు. అతను వాళ్ళ శ్రేయస్సు కొరకు అహో రాత్రులు శ్రమించాడు.అతను ఎన్ని కష్టాలు ఎదురైనా భరించినాడు.అతను వారి జీవితాల్లో వెలుగులు నింపాడు.కష్టాలు తీరిన తర్వాత వారు అతనిని నిర్దయగా వదిలేశారు అని బాధపడుతున్నాడు. లోకంలో మనుషులు మానవత్వాన్ని మరిచిపోయి ప్రవర్తించిన తీరు వింతగా విడ్డూరంగా ఉంది.కష్టంగా ఉన్నప్పుడు వారు అతని చెంత చేరారు.కష్టం తీరిన తర్వాత అతని అవసరం మాకు లేదు అనుకున్నారు.అతని పట్ల కనపరిచిన దయా దాక్షిణ్యం లేని  వారి చేష్టలు క్షమించ రానివి.అక్కర తీరిపోయిన తర్వాత వారు అతనిని విడిచి  పెట్టి వెళ్లి పోవడం ద్రోహంగా చెప్పవచ్చు.లోకంలో మనుషులు నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నారు.అవసరం ఉన్నప్పుడు మనుషులు ఒక తీరుగా ఉంటారు. అవసరం తీరిపోయిన తర్వాత మరో రకంగా ఉంటారు.అతని పట్ల వారి ప్రవర్తన ఎప్పటికీ క్షమించరాని ద్రోహంగా చెప్పవచ్చు.కవి గుల్జార్ షాయరీ కవితలో వ్యక్తీకరించిన భావాల్లో నిజాయితీ ఉంది.కష్టాల్లో ఉన్నప్పుడు మరియు కష్టాలు తీరిన తర్వాత మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందో ఈ షాయరీ కవిత తెలియజేస్తున్నది.స్నేహంలో కూడా ద్రోహం ఉంటుందని మనకు షాయరీ కవితలోని భావాల ద్వారా అవగతమవుతుంది.

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(14)
గుల్జార్ లో సామాజిక దృక్పథం,తాత్విక చింతన,అపారమైన జీవితానుభవం మరియు లోక రీతికి చెందిన షాయరీ కవితలో వెల్లడించిన భావాలు పాఠకుల మనోఫలకంపై చెరగని ముద్ర వేస్తాయి.గుల్జార్ రచించిన షాయరీ కవిత్వం గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా?అయితే షాయరీ కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి. అపూర్వమైన అనుభూతుల లోకంలోకి వెళ్లి విహరించండి.
“కాకరకాయలా చేదుగానే ఉండు
“గులాబ్ జామూన్ లా తియ్యగా
“ఉన్నావనుకో …జాగ్రత్త జనం తినేస్తారు
“నిన్ను!
కవి గుల్జార్ షాయరీ కవితలో వ్యక్తీకరించిన భావాలు పాఠకుల హృదయాలను ఆలోచింపజేస్తాయి.మనిషికి తన జీవన గమనంలో తన లోతైన జీవితానుభవం తోడ్పడుతుంది. లోకంలో మనుషులు అందరు ఒక్కలా ఉండరు. విభిన్నమైన మనస్తత్వాలు కల వాళ్ళు ఉంటారు. మనిషి చేతికి ఉండే ఐదు వేళ్ళు ఒక్కలా ఉండవు. ఒక్కో వ్రేలు ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. లోకంలో నివసించే మనుషులు విభిన్నమైన వ్యక్తులతో వ్యవహరించాల్సి ఉంటుంది.వారు అటు వంటి సమయంలో సహనంతో మెలగాలి.మనిషి తాను ఇతరులతో ఎలా మసులుకోవాలి అనేది ఒక రకమైన కళ.అట్టి అపురూపమైన కళలో కవి గుల్జార్ నిపుణుడు అని షాయరీ కవితలోని భావాల  ద్వారా వ్యక్తం అవుతున్నది.ఇవ్వాళ మంచిని చెప్పే వాళ్ళు అరుదుగా ఉంటారు.మంచిని బోధించే కవితలోని భావాలు చదువుతుంటే ఆశ్చర్యంతో పాటు ఆనందం కలుగుతుంది.మనిషి నడవడి సవ్యమైన మార్గంలో ఉంటే జీవితం సరి అయిన బాటలో సాగుతుంది.గుల్జార్ జీవితానుభవంతో వెలిబుచ్చిన భావాలు సకల మానవాళికి అనుసరణీయం. మంచిని పాటిస్తే జీవితంలో విజయం సాధించి ముందుకు సాగడం ఖాయం.జీవితం అనే ప్రయాణంలో మనిషి జాగరూకతతో నడుచుకోవాలి. లేకుంటే బొక్కబోర్లా పడతాడు. మనిషి అడుగుల్లో తేడా వస్తే అధః పాతాళానికి దిగజారుతాడు. మనిషిగా మనం మనగలగాలంటే ఏం చెయ్యాలి అనే సందేహాలు మనని వెంటాడుతాయి.ఈ లోకంలో మనిషిగా మనుగడ సాగించే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం లోకానికి ఎంతో ఆకర్షణీయంగా, అద్భుతంగా,తియ్యగా,మంచిగా కనిపించేదైనప్పటికీ అందులో ఒక జాగ్రత్త అనేది తప్పకుండా ఉండాలి. అది మన జీవితానికి ఎంతో అవసరం.అందులో సందేహానికి తావులేదు.లోకో భిన్న రుచిః లోకంలో భిన్న రుచులు కల వాళ్ళు ఉన్నారు.సహజంగా మనం రుచికరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడడం జరుగుతుంది.మనం తినే ఆహారం మన ఆరోగ్యానికి మంచిది కాక పోయినప్పటికీ రుచి గల పదార్థం అయితే మనం ఇష్టంగా తింటాం. ఆరోగ్యానికి మంచి చేసేది అయినప్పటికీ రుచిగా లేకుంటే ఆ పదార్థాలను మనం తినం.రుచి లేని ఆహార పదార్థాలు తీసుకోవడం జరగదు మరియు వాటి జోలికి పోకుండా ఉంటాం.చాలా మంది కాకర కాయ పేరు వింటేనే చాలు.అమ్మో కాకరకాయ!నాకు వద్దు చేదు కూర అని పెదవి విరుస్తారు.చాలా మందికి కాకర కాయ చేదు అయినప్పటికీ మనసులో తినాలని కోరిక ఉంటుంది.కాకర కాయ చేదు అనే ఒకే ఒక్క కారణంతో దానిని తినడానికి అయిష్టత చూపుతున్నారు.ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో కాకర కాయ మొదటిదిగా ఉంటుంది. కాకరకాయ ఉపయోగాలు తెలిస్తే దానిని తినడం ప్రారంభిస్తారు.కాకరకాయ ఓ  తీగ జాతికి చెందినది కాకర కాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాకరకాయ చేదు అయినప్పటికీ మధుమేహానికి మందుగా వాడుతున్నారు. కాకర కాయ చేదుగా ఉండడం వల్ల  జనాలు తినడానికి ఇష్టపడరు. గులాబ్ జామూన్ అనేది ఒక తీపి మిఠాయి.గులాబ్ జామూన్ తియ్యగా ఉంటుంది.తియ్యగా ఉన్న గులాబ్ జామూన్ తినడానికి అందరు ఆశగా ఎదురు చూస్తారు మరియు ఆనందంతో తినడానికి ఎగబడతారు.అదే విధంగా మనం కూడా అందంగా,తీయగా,ముద్దు ముద్దుగా మురిపాలు ఒలకబోస్తూ మాట్లాడుతూ ఉంటే మన ప్రవర్తనను ఆసరాగా తీసుకుని జనం మనలను  తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటారు. అందుకే మనిషిగా మన స్వభావాన్ని మరియు వ్యక్తిత్వాన్ని కాకర కాయలా చేదుగా ఉంచంకుంటూ జాగ్రత్తగా కాపాడుకోవాలి.మన పట్ల మనం జాగ్రత్తగా లేకపోతే మనల్ని ఇతరులు తమ స్వార్థపూరితమైన ప్రయోజనాలకు వాడుకుంటారు. మనం మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోకపోతే ఇతరులకు మనం కేవలం వాడుకునే వస్తువుగా మిగిలి పోతాం. మనిషి వ్యక్తిత్వం అలా చేదుగా ఉన్న. చేదుగా ఉన్న మన జీవితంలోకి ఇతరులు చొరబడరు.స్వార్థపరులైన  ప్రజలు కాకరకాయలా చేదుగా ఉండే మనకు దూర దూరంగానే ఉంటారు.గులాబ్ జామూన్ లా మనం తీయ తియ్యగా ముద్దులు ఒలకబోసేలా మాట్లాడుతూ ఉంటే ప్రపంచం మనల్ని మిగలనివ్వదు.కాబట్టి ఈ కవితలో  మనిషిగా మీ  మీ వ్యక్తిత్వాల ప్రత్యేకతను జాగ్రత్తగా కాపాడుకొండి.
అనే ఒక గొప్ప సూచన దాగి ఉంది.కవి గుల్జార్ షాయరీ కవిత మనకు ఒక బలమైన  సందేశాన్ని మరియు జాగ్రత్తలను తెలియజేస్తున్నది.మనిషిగా మీ ప్రవర్తన కాకరకాయలా చేదుగా ఉండాలి. మనిషిగా మీరు  తీయ తీయగా గులాబ్ జామూన్ లా బలహీన మనస్తత్వం కలిగిన వారుగా ఉంటే తెలివైన  ఈ లోకంలోని ప్రజలు  మిమ్మల్ని తమ స్వార్థానికి ఉపయోగించుకుంటారు.మీ వ్యక్తిత్వంలో తేనె లాంటి తీపి పదార్థాలు గల గులాబ్ జామూన్ లాంటి స్వభావం ఉంటే అందరు మిమ్మల్ని దోచు కుంటారు. మీరు మీ జీవితం పట్ల గాడమైన అనురాగం,ఆప్యాయత కలిగి ప్రతి క్షణం మెళుకువతో జాగ్రత్తగా ఉండాలి.ఎందు కంటే ఈ ప్రపంచం మీరు గులాబ్ జామూన్ లా తీపిగా సరళంగా ఉంటే మీలోని విలక్షణతను వాడుకుంటుంది.మీరు కాకరకాయలా చేదు స్వభావం కలిగి ఉంటే ఈ విశాల ప్రపంచం మిమ్మల్ని చూసి భయపడుతుంది.మీకు దూర దూరంగా ఒదిగి ఉంటుంది అని కవితలోని భావాలు తెలియజేస్తున్నాయి.ఈ కవిత మనిషిగా మీ వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి?.మనిషిగా మీరు ఈ ప్రపంచంలో ఎలా నడుచుకోవాలి? అనే గొప్ప సందేశాన్ని అందిస్తున్నది.గుల్జార్ షాయరీ కవిత ఊహాత్మకమైన భావాల హెచ్చరికగా విలసిల్లుతున్నది.షాయరీ కవితలోని అపూర్వమైన భావనలు పాఠకులకు ఒక రకమైన వినూత్నమైన సందేశాలను  అందజేస్తున్నాయి.గుల్జార్ షాయరీ కవితను తెలుగులోకి అను సృజన చేసిన కవయిత్రి గీతాంజలిని (డాక్టర్ భారతిని) అభినందిస్తున్నాను.

You may also like

Leave a Comment