గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (15)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి).
ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత ఇది.గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవితను కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.గుల్జార్ షాయరీ కవితలోని భావాలు
పాఠకుల హృదయాలను అలరిస్తాయి.
నన్ను ఇంతగా ఎడిపిస్తున్నావేంటి
జీవితమా …
ఒక్క సారి వెళ్ళి మా అమ్మని అడిగి రాపో …
ఎంత గారాల బిడ్డనో నేను ?
జీవితం అంటే ఉనికి యొక్క స్వాభావిక ప్రాముఖ్యత.మనం ఇక్కడ ఎందుకు ఉన్నాము?మన అస్తిత్వం యొక్క ఉద్దేశ్యం ఏమిటి?అనే ప్రశ్నలకు విభిన్న సాంస్కృతిక మరియు సైద్ధాంతిక నేపథ్యాల నుండి అనేక ప్రతిపాదిత సమాధానాలు ఉన్నాయి. జీవితాన్ని గూర్చిన అన్వేషణ చరిత్రలో తాత్విక,శాస్త్రీయ, వేదాంత మరియు మెటా ఫిజికల్ ఊహాగానాలను ఉత్పత్తి చేసింది.మనిషి యొక్క మితిమీరిన ఉనికి,సామాజిక సంబంధాలు,స్పృహ మరియు ఆనందాన్ని గూర్చిన తాత్విక, మతపరమైన ఆలోచనలు,శాస్త్రీయ విచారణల నుండి జీవితం యొక్క అర్థాన్ని పొందవచ్చు.జీవితం యొక్క అర్థం ఆనందాన్ని పెంచడం,సాధారణ జీవితాన్ని సులభతరం చేయడంగా భావించ వచ్చు. జీవితం అంటే ఒక అద్భుతమైన ప్రయాణం.మనిషి జీవితం శాశ్వతం కాదు.జీవితం క్షణికమైనది.మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు జరిగే ఈ ప్రయాణంలో అనేక అనుభవాలను,భావోద్వేగాలను ఎదుర్కొంటాం.జీవితం అనగా ఒక మార్గం.ఈ మార్గంలో మనకు అనేక ఘట్టాలు ఉంటాయి. ఇవి మనకు అనుభవాన్ని అందించి మనసును బలపరుస్తాయి.జీవితం మనకు ప్రతి క్షణం కొత్త పాఠాలను నేర్పుతుంది.జీవితం అంటే కేవలం సుఖం,సంతోషాల సమాహారమే కాదు.జీవితం బాధలు,కష్టాలు,కన్నీళ్లు మరియు సవాళ్లతో కూడినదిగా ఉంటుంది.జీవితంలో చెలరేగే సంఘర్షణలు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.జీవితంలో విజయం పొందేందుకు మార్గం చూపిస్తాయి.కుటుంబం,ఇరుగు పొరుగు వారితో స్నేహితులతో ఉండే అనుబంధాలు, సమాజంలో మనకు ఉండే సంబంధాలు జీవితం యొక్క పరమార్ధాన్ని తెలియజేస్తాయి.జీవితం మనకు ఎన్నో అవకాశాలను అందిస్తుంది.జీవితం అందించిన సరి కొత్త అవకాశాలను గుర్తించి సద్వినియోగం చేసుకోవాలి.మనం రోజును కొత్తగా ఆరంభం చేయడానికి జీవితం అవకాశం కల్పిస్తుంది.జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది.ఆ పుస్తకంలోని ప్రతి పేజీ మనకు కొత్త కొత్త పాఠాలను నేర్పుతుంది.మనం ఆ పుస్తకంలోని చివరి పేజీకి చేరేలోపే వాటిని ఆస్వాదించాలి.ఈ షాయరీ కవితలోని భావాలు తీవ్రమైన వ్యధను,నిరాశను మరియు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.నన్ను ఇంతగా ఏడిపిస్తున్నావేంటి అనే వాక్యంలో జీవితం తనను ఎందుకు ఇలా మితిమీరిన కష్టాలకు,బాధలకు గురి చేస్తోంది?భరించలేని దుఃఖాన్ని,బాధలను తట్టుకోలేకపోతున్నాను అనే ఆవేదన వ్యక్తం అవుతుంది. జీవితంలో ప్రశ్నగా మిగిలిన తన స్థానం ఏమిటి?జీవితంలో తాను పొందిన తీవ్రమైన బాధలు,తాను ఎదుర్కొన్న కష్టాలు, భావోద్వేగాలు అతని కవితలో వ్యక్తమవుతున్నాయి.ఒక్కసారి వెళ్లి మా అమ్మని అడిగి రాపో…ఎంత గారాల బిడ్డనో నేను?
కాని మా అమ్మ నా గురించి ఎంతో ప్రేమగా ఆలోచించేది,నేను ఎంత విలువైన వానినో అని గుర్తు చేసుకొనేది,గారాల బిడ్డ అనే పదం తనకు తల్లికి గల ఆత్మీయతను,ప్రేమను,అనుబంధాన్ని తెలియజేస్తుంది.జీవితం మనకు కొన్ని సార్లు తీవ్రమైన కష్టాలను, సవాళ్లను ఎదుర్కొనేటట్లు చేస్తుంది.అలాంటి కష్ట సమయంలో మనకు అండగా నిలిచే ఏకైక వ్యక్తి అమ్మ.అమ్మ తన బిడ్డల మీద చూపిన ప్రేమ జీవితంలో వారు తనకు ఎంత ముఖ్యమైన వారో తెలియజేస్తుంది.తాను అపురూపంగా చూసుకునే తన తల్లి సహాయంతో శాంతిని పొందుతున్నాడు.వ్యక్తి తల్లి ప్రేమను, ఆదరణను కాంక్షిస్తున్నాడు.తల్లికి తన పట్ల అపారమైన ప్రేమ, తనను తల్లి ఇతరుల కంటే ఎంతో ప్రత్యేకంగా,ప్రేమగా, ఆదరణగా చూసేది.తల్లి తన పట్ల ఎంతో ప్రేమను కురిపించేది. తల్లి తనను ఎంతో విలువైన బిడ్డగా చూసేది.ఇప్పుడు తాను జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు,బాధలు ఎంతో భిన్నముగా ఉన్నాయి.జీవితంలోని నిరాశ మరియు కష్టాలు తల్లి చూపించిన అపారమైన ప్రేమను గుర్తు చేస్తున్నాయి.జీవితంలో బాధలను అనుభవిస్తూ జీవన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు.ఒక్కసారి అనే పదం వ్యక్తి యొక్క ఆత్రుతను,ఆరాటాన్ని తెలియజేస్తున్నది.ఈ కవితలోని భావం చాలా తీవ్రమైన భావోద్వేగంతో కూడి సమాధానం కోసం వెతుకుతున్నట్లుగా ఉంది.మనిషి జీవితంలో ఎదుర్కొంటున్న తీవ్రమైన సంఘర్షణ ఈ కవితలో వ్యక్తం అవుతున్నది.వ్యక్తి ఆవేదనను, నిస్సహాయతను జీవితంలో ఉన్న అసమానతల పట్ల అసహనాన్ని ఈ కవిత ప్రతిబింబిస్తున్నది.కవి గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలను ఆలోచింపజేస్తాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (16)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
ప్రఖ్యాత కవి గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.
“శత్రువులను కలుద్దామని వాళ్ళ ఇళ్ళని
“వెతుక్కుంటూ వెళ్ళానా …ఇక చూడండి
“అక్కడ నా స్నేహితులతోనే ములాఖత్ అయింది”.
ఒకరికి కొందరికి హాని కలిగించినట్టి,రాజ్యానికి దేశానికి ద్రోహం చేసినట్టి వ్యక్తిని శత్రువుగా భావిస్తారు.మిత్రుడు అనే పదానికి వ్యతిరేక పదం శత్రువు.ఒకరికి మరొకరిపై మనసులో కలిగే కీడు భావన ఇరువురి మధ్య శత్రుత్వాన్ని కలిగిస్తుంది. అటు వంటి వాడే శత్రువు.ఒకరి నిర్ణయం ఇంకొకరికి నచ్చనప్పుడు మౌనంగా ఉండకపోవడం వల్ల మనసులో చెలరేగే ప్రతీకార భావనలు శత్రువుల్ని తయారుచేస్తాయి.తన కోపమే తన శత్రువు అని సుమతీ శతకంలో రాయబడి ఉంది.స్నేహితులు కాని వారు శత్రువులు.మనకు హాని కలిగించే వారు శత్రువులు.మనకు వ్యతిరేకంగా పని చేసే వారు శత్రువులు.శత్రుత్వం అనేది ఇద్దరి వ్యక్తుల మధ్య లేదా రెండు సమూహాల మధ్య నెలకొన్న వ్యతిరేక భావనగా పేర్కొనవచ్చు.స్నేహితుల మధ్య సయోధ్య లేక పోవడం,అపోహలు,మనస్పర్ధలు,అవగాహన లోపంతో స్నేహం పటాపంచలై శత్రుత్వంగా మారుతుంది.స్నేహం అద్భుతమైంది.నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు.స్నేహానికి హద్దులు లేవు.అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది.స్నేహం ఓ మధురమైన అనుభూతి.దానికి వయసుతో నిమిత్తం లేదు.ఆట పాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలో స్నేహ భావం ఉంటుంది.అటు వంటి స్నేహాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది.సృష్టిలో నా అనే వారు, బంధువులు లేని వారైనా ఉంటారేమోగాని స్నేహితుడు లేని వారు అసలు ఉండరు.ఇంట్లో చెప్ప లేని సమస్యలను,బాధలను సైతం స్నేహితులతో ఎటు వంటి దాపరికం లేకుండా చెప్పుకొని ఓదార్పును పొందుతారు.అది స్నేహంలోని గొప్పతనం.స్నేహం ప్రకృతి వంటిది.అది ఆహ్లాదంతో పాటు ఎంతో హాయిని ఇస్తుంది.మనిషి జీవన యానంలో స్నేహం శ్వాస వంటిది.స్నేహం ఎంతో తియ్యనైంది.అమ్మ ప్రేమ,స్నేహం వెల కట్ట లేనిది.ఈ రెండే జీవితంలో ముఖ్యమైనవి. స్నేహితులతో కలిసిమెలిసి ఉంటే కలిగే ఆనందం చెప్ప లేనిది.పవిత్రమైన స్నేహం ఉండాలి.అటు వంటి స్నేహంలో ఎంతో ఆనందం ఉంటుంది.ఈ కవిత శత్రుత్వం మరియు స్నేహం యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది.మనం శత్రువులను వెతుక్కుంటూ వెళ్లినప్పుడు అక్కడ స్నేహితులు తారసపడ్డట్లుగా ఉంది.ఈ కవితలోని భావం మనల్ని ఆలోచింప జేస్తుంది.అసలు శత్రువులు అంటే ఎవరు? మనుషుల మధ్య శత్రుత్వం ఎలా ఏర్పడుతుంది? స్నేహం మరియు శత్రుత్వానికి గల సంబంధం ఏమిటి?ఈ కవితలో ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా స్నేహితులను మరియు శత్రువులను గురించి ఆలోచింప జేస్తుంది.శత్రువులు అందరు మన స్నేహితులు కాకపోవచ్చు.స్నేహితులు కూడా శత్రువులుగా మారవచ్చు.మనం ఎవరిని శత్రువులుగా భావిస్తాము అనే సంగతి గురించి ఆలోచించాలి.ఈ వాక్యం ఆలోచనాత్మకంగా మరియు వ్యంగ్య భరితంగా,ఎంతో లోతైన భావాలు,జీవన దార్శనికతతో కూడిన అనుభవాలను ప్రతిబింబించేలా ఉంది.శత్రువులను కలుద్దామని వెతుక్కుంటూ వెళ్లడం అనే వాక్యం మనలను ఆలోచింపజేస్తుంది.ఇది సమస్యను నేరుగా ఎదుర్కోవాలనే సంకల్పంతో ప్రారంభమైన చర్యగా భావించవచ్చు.శత్రువులు అంటే మీరు ప్రత్యర్థులుగా భావించిన వారు అని సూచిస్తుంది. జీవితంలో మనం ఎవరిని శత్రువులుగా భావిస్తున్నామో వాళ్లను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తే అసలు వాళ్లు శత్రువులే కాకుండా స్నేహితులుగా కూడా మారవచ్చు.అక్కడ స్నేహితులతో ములాఖత్ కావడం అనేది ఆలోచింపజేస్తుంది.ములాఖత్ అనేది ఉర్దూ పదం.ఎవరైనా లేదా వ్యక్తులతో సమావేశం కావడం అని అర్థం.ఒకో సారి మనకు జీవితంలో అనుకోని సందర్భాలు కూడా ఎదురవుతాయి.మీరు ఒక ప్రతికూల సంఘటనను ఎదుర్కొనే ఉద్దేశంతో వెళ్లడం అది ప్రతికూలంగా కాకుండా సానుకూలంగా మారిపోవడం సహజం అనిపిస్తుంది.అనూహ్యంగా మీరు శత్రువులుగా భావించిన వారు నిజానికి మీ స్నేహితులు అని తెలిసింది.అక్కడ మీరు అనుకోని స్నేహితులను కలిశారు.మీరు వారిని మనసులో ప్రతికూలంగా భావించారు.కాని సానుకూల పరిణామం ఏర్పడింది.అది జీవితపు వ్యంగ్యాన్ని ప్రతిబింబిస్తుంది.మనం చాలా సార్లు ఒక దాన్ని అనుకుంటాం.విచిత్రంగా వేరే దాన్ని ఎదుర్కొంటాం. మనం కొన్ని సార్లు అపోహతో ఎదుటివారిని తప్పుగా అర్థం చేసుకుంటాం.జీవితంలో మనం కొన్ని సార్లు అనవసరంగా కొందరిని శత్రువులుగా భావిస్తాం.కాని వారిని గమనిస్తే మనకు వాళ్లలో ఏదో తెలియని సంబంధం,స్నేహం మిళితమై ఉంది అనిపిస్తుంది.ఒక్కో సారి మనకు తెలియకుండానే జీవితంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి.మన జీవితంలో ఏది ఎలా జరుగుతుందో ముందుగా అంచనా వేయడం చాలా కష్టం.జీవితం అనే మజిలీలో జరిగిన ఆ సంఘటన చిత్రంగా అనుకోని మలుపుగా భావించవచ్చు. జీవితంలో ఎదురైన సంఘటనలు కొన్ని మనలను ఆశ్చర్యానికి గురి చేస్తాయి.తాను ఎదురు చూసింది ఒకటి తనకు తెలియకుండానే మరొకటి జరిగింది. తాను ప్రతికూల భావనలతో వ్యవహరించినప్పటికీ చివరకు అది సానుకూల పరిణామంగా మారడం సంతోషాన్ని కలిగించింది.ఈ వాక్యం జీవితపు అంతర్లీన సత్యాలను,అనుభవాలను, దార్శనికంగా వ్యక్తపరుస్తుంది.శత్రువులను వెతుక్కుంటూ వెళ్లి స్నేహితులని కలవడం అంటే తాను అనుకున్న దానికి పూర్తిగా భిన్నమైన అనుభూతిని పొందడం విస్మయం కలిగిస్తుంది.కవి గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలపై చెరగని ముద్ర వేస్తాయి.