Home వ్యాసాలు గూటి పక్షులు – గులాబి ముళ్లు

గూటి పక్షులు – గులాబి ముళ్లు

by Padmasri Chennojwala

అందమైన లోకమనీ రంగురంగు లుంటాయని అందరూ అంటుంటారు రామరామ అంత అందమైన కానే కాదు చెల్లెమ్మా….. చెల్లెమ్మ

ఈరోజు ఉదయం ఈ విషయం విన్నప్పటి నుండి ఈ పాట నా మదిలో మెదులుతూనే ఉంది. పాట చిత్రీకరణకు, నేను విన్న విషయానికి ఏ విధమైన సంబంధం లేకపోయినా అందులోని భావం ఈ సంఘటనకు చక్కగా సరిపోలడమే అందుకు కారణం.
నేను ఈ పాటపై విశ్లేషణ రాయడం లేదనీ, సంఘటనను విశ్లేషించడానికి ఈ పాటను ఒక ఉదాహరణగా స్వీకరించాననే విషయాన్ని పాఠకులు గమనించవలసిందిగా మనవి.
ఒక పాటను గేయ రచయిత ఒక సంఘటనకు ఆధారంగాగానీ, స్పందించి గానీ రచించి ఉండవచ్చు. దానిని ఒక దర్శకుడు తెరకెక్కించి ఉండవచ్చు కానీ ఆ చిత్రం విడుదలై జనంలోకి వెళ్లిన తర్వాత, శ్రోతలు దానిని విన్నప్పుడు కొన్నికొన్ని సార్లు అది తమను చూసే, తమ గురించే వ్రాసారా అన్నంతగా భావానికి లోనవుతారు. అందులోని సాహిత్యం వారి అనుభవాలకు , పరిస్థితులకు అద్దం పట్టడంతో ఆ విధమైన అనుభూతికి లోనవుతూ ఉంటారు. ఇంతకీ ఈ వ్యాసానికి కేంద్ర బిందువైన విషయం కొత్తదేమీ కాదు. పత్రికలు, బుల్లితెర, వెండి తెరలపై కెక్కడమే కాకుండా, జనాల నాలుకలపై నాట్యమాడిన సాధారణ విషయమే. కాకపోతే ఇది నిత్యనూతనం. పాత సీసాలోని కొత్త సారాయి.
జీవనోపాధిని వెతుక్కుంటూ పల్లె నుండి పట్నానికి వలస వచ్చిన ఓ కొత్తజంట,ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి , జోడెడ్లై బతుకు బండిని లాగుతూ ఉంటారు. భార్యాభర్తలిద్దరూ నిరక్షరాస్యులు కావడంవల్ల వారు పొందిన అవమానాలు, చేదు అనుభవాలే పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలనే గట్టి సంకల్పానికి కారణమై రాజీలేని పోరు సలుపుతూ ఉంటారు.
అతను ఒక చక్కటి మేస్త్రి. భవన నిర్మాణంలో అతని అనుభవం, మెళకువలు చూసి కాంట్రాక్టర్లు ముచ్చట పడేవారు. పదిమంది పని వాళ్ళను బృందంగా సంఘటిత పరిచి , వారితో కలిసి పనులు కుదుర్చుకునేవాడు. చెప్పిన సమయానికి పని పూర్తి చేసి అప్పగించడంతో అందరి మెప్పును పొందగలిగేవాడు. అయినప్పటికీ కేవలం ఆ పని మీదే ఆధారపడకుండా, ఎంత చిన్న పనైనా చేయడానికి వెనుకాడేవాడు కాదు.
కాలచక్రం తన దారిన తాను వెళుతూ ఉండగానే , నిశ్చలంగా ఉన్న నీటిలో రాయి పడినట్లుగా ఒకరోజు ఒక బహుళ అంతస్తుల భవనాన్ని కట్టే సమయంలో అతను పైనుండి కింద పడటంతో తలకు, కాళ్లకు,చేతులకు బలమైన గాయాలయ్యాయి. అసలు పనులు చేయగలుగుతాడా? అనే అనుమానం అందరిలోనూ కలిగింది. కానీ అతను ధైర్యాన్ని కోల్పోకుండా కాస్త కోలుకోగానే, శక్తిని కూడదీసుకుని పనులకు వెళుతూ, జరిగిన ఆర్థిక నష్టాన్ని పూడ్చుకునే దిశగా తల్లిదండ్రుల ద్వారా సంక్ర మించిన కొద్దిపాటి ఆస్తిని అత్యంత నేర్పుతో విక్రయించి, పరిస్థితిని ఒక దారిలోకి తీసుకు రాగలిగాడు.
మరో సందర్భంలో ఆమె ఆరోగ్యం కూడా బాగా దెబ్బ తినడంతో, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భర్త, దానికి తోడు క్షీణించిన తన ఆరోగ్యం ఎక్కడ పిల్లల చదువులకు ఆటంకంగా మారుతుందోననే బాధ బాగా కృంగదీయడంతో, అతను ఆమెకు అన్ని రకాలుగా భరోసానందించి కుటుంబాన్ని ముందుకు నడిపించాడు.
ఆమె నాలుగిళ్లలో పని చేసేది. గర్భం ధరించిన సమయంలో కానీ, చంటి పిల్లల్ని సాకే సమయంలో గానీ ఎన్ని ఇబ్బందులెదురైనప్పటికీ , అన్నిటినీ చక్కగా సమన్వయపరచుకునేది. ఇద్దరు పిల్లల్ని స్కూలుకు పంపించి, చిన్న వాణ్ణి సెల్లార్ లో పడుకోబెట్టి, ఒక సీసాలో పాలు, మరో సీసాలో నీళ్లు పెట్టి, అపార్ట్మెంట్ వాచ్మెన్ ని కొడుకు లేస్తే కాస్త తనను పిలవమనీ, అదే అపార్ట్మెంట్లో పనిచేస్తున్న మరో పని మనిషి చేతికి ఒక పాల సీసానిచ్చి పిల్లాడు లేచి ఏడిస్తే కాస్త పట్టించమనీ, ఫలానా ఇంట్లో పని చేస్తూ ఉంటాననీ, మరీ అవసరమైతే తనను పిలవమనీ, తొందరగానే తిరిగి వచ్చేస్తానని వారిని బతిమాలి, పనికి వెళ్లి మధ్య మధ్యలో వచ్చి పిల్లాడిని చూసుకుంటూ ఉండేది.
ఒకానొక సందర్భంలో ప్రభుత్వ కళాశాలల్లో చదవడానికి పిల్లలు వ్యతిరేకించడంతో, మరో నాలుగు చోట్ల పని వెతుక్కుని ఆమె, అప్పటికే నిర్మాణంలో ఉన్న మరో రెండు భవనాలను మాట్లాడుకుని, బ్యాంకుల్లో రుణాలు తీసుకుని, వాటిని చెల్లించడానికి నానా తిప్పలు పడుతూ అతను , మొత్తానికి భార్యాభర్తలిద్దరూ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా పిల్లలను కార్పోరేట్ కళాశాలలో చదివించారు.
వారికి తెలిసిన విషయం ఒక్కటే. తమకు మల్లే తమ పిల్లలు కష్టపడ కూడదని. వాళ్ల ముందున్న లక్ష్యం ఒక్కటే. ఎన్ని ఇబ్బందులు పడైనా సరే తమ పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలని.
దానికి తగ్గట్టుగానే వారి శ్రమ,కల రెండూ కూడా అత్యద్భుతంగా ఫలించాయి. పిల్లలిద్దరికీ ఒకరికి ఇంజినీరింగ్ సీటు , మరొకరికి మెడికల్ సీటు దొరకడంతో వారి ఆనందానికి అవధులు లేవు.
“ఒక మెరుపు వెంట పిడుగూ… ఒక మంచి లోన చెడుగూ……..చెల్లెమ్మ అన్నట్టుగా వారి సంతోషం ఎక్కువసేపు నిలబడలేదు.
ఇంక విషయాన్ని ఎక్కువగా సాగదీయకుండా పాయింట్ లోకి వచ్చేస్తాను.
పెద్దవాడి స్నేహితులు ఓ 10 మంది దాకా షాపింగ్ మాల్ లో ఎంజాయ్ చేసి, పక్కనే ఉన్న వీళ్ళ ఇంటికి రావడంతో (వాళ్ల ఇల్లు ఎలా ఉంటుందన్న వివరణ నేను ఇవ్వడం అనవసరమనుకుంటాను) సదరు పుత్రరత్నం వాళ్లతో మాట్లాడటానికి బయటికి వెళుతూ, వాళ్ళమ్మను బయటకు రావద్దనీ, వాళ్ళు వెళ్ళేంత వరకూ లోపలే ఉండమని చెప్పాడు.
“గడ్డి మేసి ఆవు పాలిస్తుంది. పాలు తాగి మనిషి విషమవుతాడు. అది గడ్డి గొప్పతనమా ఇది పాల దోష గుణమా”
ఎంతో అపురూపంగా పెంచుకున్న ఆ తల్లి మనసు కకావికలమై పోయింది.
కాళ్ళ కింద నేల కదిలినట్లు, తానందులో కూరుకుపోతున్నట్లు అనిపించింది.
అలసిపోయి ఇంటికి వచ్చిన ఆమె భర్త ఈ విషయం తెలిసి నిశ్శబ్దంగా పడుకుని, తెల్లవారాక ఏమీ తినకుండానే పనికి వెళ్లాడు. అతని మౌనంలో ఇరవయ్యేళ్ళ శ్రమ ఉంది. అతని కంటి తడిలో దుర్భర దారిద్రంతో తాను చేసిన పోరాటం ఉంది. కష్టకాలంలో కుటుంబాన్ని ఒక కొలిక్కి తేవడానికి తన కెదురైన అనుభవాల సెగ ఉంది.
కార్పొరేట్ కాలేజీలో సీటు వచ్చేసరికి, ఆధునిక వస్త్ర ధారణ లో, అనర్గళంగా పలు భాషలు మాట్లాడుతూ, సెల్ఫ్ డ్రైవింగ్ లో అధునాతన కార్లు నడుపుతూ వచ్చే తల్లులను చూసేసరికి అంట్లు తోముకునే అమ్మను, తాపీ పట్టిన తండ్రిని తల్లిదండ్రులు అని చెప్పుకోవడానికి వాడికి నామోషి అనిపించింది.
ఇంతకంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదని నేనననుగానీ(ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు ఒకదాని కంటే ఒకటి ఎంత దారుణంగా ఉంటున్నాయో మనం చూస్తూనే ఉన్నాం) . అత్యంత బాధాకరమైన పలు సంఘటనలలో ఇది ఒకటి.

“ముద్దు గులాబీకీ ముళ్లుంటాయి మొగిలి పువ్వు లోనా నాగుంటాది………చెల్లెమ్మ

గులాబి పువ్వును చూసుకున్నంత అపురూపంగా పెంచారు. కానీ ఇప్పుడు దాని రంగుల సోయగం గానీ, దాని సౌకుమార్యం గానీ వారిని మురిపించడం లేదు సరి కదా , దానికున్న కంటకాలే వారి గుండెను గుచ్చుతున్నాయి. ఇరవయ్యేళ్ళ తమ కల ఫలించినందుకు ఆనందించాలో, తమ ఉనికే ప్రశ్నార్థకమైనందుకు బాధపడాలో అర్థం కాని స్థితి.

ఇటువంటి పిల్లలకు తెలియాల్సిన కొన్ని విషయాలు: ఉన్నత స్థాయిలో ఉన్న తల్లిదండ్రులను చూసి,నీ తల్లిదండ్రులు అని చెప్పుకోవడానికి నువ్వు అవమానంగా భావించడం కాదు.

  1. పాతికేళ్లు వాళ్ళ కండలు కరిగితే గానీ నువ్వు ఈ స్థాయికి రాలేదన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు.
  2. నిన్ను ప్రయోజకుడిని చేయాలననే ఆలోచనే వారి శ్రమ శక్తికి అంకురమై, నీకు చక్కని జీవితాన్ని అందించాలనే ఆశయమే వారి సంకల్ప బలానికి ఊతమైందనే విషయాన్ని నువ్వెన్నడూ విస్మరించకూడదు.
  3. వారి పరిస్థితులు సాన అయితే వారిద్దరూ గంధపు చెక్కలై ఆ సాన మీద అరిగితేనే నువ్వు ఈ స్థాయికి రాగలిగావు.
  4. సానకు,చెక్కకు నడుమ లభించిన పరిమళ ద్రవ్యానివే నువ్వు.
  5. వీరు నా తల్లిదండ్రులు అని గర్వంగా వారిని ప్రపంచానికి పరిచయం చేసి చక్కని పుత్రునిగా, ఉత్తమ పౌరుడిగా నిన్ను నువ్వు నిలబెట్టుకుంటావో, సంకుచితత్వంతో నీ స్థాయిని దిగజార్చుకుంటావో నీ చేతుల్లోనే ఉంది.
  6. నీ ప్రజ్ఞాపాటవాలను అద్భుతంగా నిరూపించుకున్నావు. సంతోషమే. కానీ నీ వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
  7. వ్యక్తిత్వ వికాస నిపుణులు, మానసికవేత్తలు ఎంతోమంది కేవలం సమాజ శ్రేయస్సు కోసమే చక్కని పుస్తకాలు రచించారు.
  8. ఆ పుస్తకాలు చదివి సమాజానికి ఒక చక్కని నమూనాగా నిన్ను నువ్వు మలుచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మేడిపండు జీవితాలు. తెలివైన పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులుగా, కుటుంబాన్ని అత్యంత నేర్పుతో నడిపిన కార్యశూరులుగా ఈరోజు సమాజం ముందు వారు నిలబడి ఉండవచ్చు. కానీ అంతరంగంలో మొదలైన కల్లోలం, రేపు ఇంకెంత తీవ్రరూపం దాలుస్తుందో అనే అభద్రతలో ఉన్న వారి పరిస్థితి ఎంత మందికి తెలుస్తుంది. బయటకు చెప్పుకోనూ లేక, లోపల దాచుకోనూ లేక సతమతమయ్యే మేడిపండు జీవితాలు మన చుట్టూ కోకొల్లలు.

You may also like

Leave a Comment