1. గూడు చేరిన చిలుక
ఒక రోజు చిలుకమ్మకు బాగా ఆకలివేసి పండ్లు, గింజలేమన్నా దొరుకుతాయేమోనని అడవిలో చెట్లనీ గాలించింది.
దానికి ఎక్కడా ఆహారం దొరకలేదు. ఇంతలో ఒక చోట చిలుకలగ్నీ చాతుర్మాస దీక్ష చేస్తూ ఒక దగ్గర సమావేశమైనాయి. అవి భజన చేసి భగవంతుడి శిల్పం ముందు రకరకాల పండ్లను నైవేద్యంగా పెట్టినవి. ఇంతలో చిలుకమ్మ ఎగురుతూ ఆ నైవేద్యాన్ని చూసింది. ఆకలికి ఆగలేని చిలుకమ్మ ఎవ్వరినీ అడగకుండా అందులోని కొన్ని పండ్లు తిన్నది. అది చూసిన మిగతా చిలుకలకు బాగా కోపమొచ్చింది. అవి వెళ్లి చిలుకమ్మ అమ్మా నాన్నకు చిలుక ఈ విధంగా చేసిందని చెప్పినాయి. చిలుకమ్మ అమ్మా నాన్నకు చిలుకపైన కోపం వచ్చింది. అవి దాన్ని గట్టిగా కసురుకున్నాయి. చిలుకమ్మ చిన్నబోయింది. అది దాని అమ్మానాన్న మీద అలిగి వాటికి చెప్పకుండా గూటిలోనుండి వెళ్లిపోయింది. చిలుకకు దేవుడి మీద కూడా బాగా కోపం వచింది. అది దేవుడులేనే లేడు, నేను ఇకనుండి దేవుని నమ్మనే నమ్మను అని తీర్మానించుకుంది.
అదట్లా ఆలోచిస్తూ ఓ చెట్టు కొమ్మపై కూచుంది. ఇంతలో అక్కడికి ఒక గద్ద వచ్చి వాలింది. ఒంటరిగా ఉన్న చిలకమ్మతో “గద్ద” మాట కలిపింది. అసలే ఒంటరితనంతో దిగాలు పడ్డ చిలుకమ్మకు గట్టి తనతో మాట్లాడడం ఎర్రటి ఎండలో చల్లటి పిల్లగాలి వీస్తే ఎంతహాయిగా ఉ ంటుందో అంత హాయిగా అనిపించింది. చిలుకమ్మ ఎగిరి గంతేసి గద్దతో స్నేహం చేసింది.
ఒక రోజు “గద్ద” చిలుకతో ఏమే చిలుకమ్మా ఎంత సేపని ఒంటరిగా ఉంటావు. ఎలాగూ మనిద్దరం దోస్తులం గదా నా గూటికే వచ్చేస్తే ఎంత మంచిగ ఇద్దరం కలిసుందాం అని గద్ద చెప్పింది సబబయినదే అనిపించింది. అది గద్దతో సరే నీతో వస్తాను అని పయనమయ్యింది. రెండూ సాయంత్రానికల్లా గద్ద గూటికి చేరుకున్నాయి. చిలుకా, గద్దా హాయిగా కలిసిమెలిసి ఉ న్నాయి.
గద్ద కుటుంబ సభ్యులు గద్దను పిలిచి ఇట్లన్నాయి “గద్ద పెద్దడా, గద్ద పెద్దగా మనందరం నల్ల ఈకలతో ఉంటే చిలుక పచ్చ ఈకలతో ఉంది. ఇది మన గూటిలో ఇముడదు” అన్నాయి.
చిలుకను వెళ్లగొట్టడం గద్దకిష్టం లేదు. ఎందుకంటే చిలుక రోజుకో రకపు పండ్లను ఎక్కడ నుంచైనా సేకరించి తేగలదు. ఆ శక్తి గడ్డలకు లేదు. అందుకే చిలుకను వదులుకోవడం గడకు ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు. అట్లని చెప్పి కుటుంబ సభ్యుల మనస్సు కష్టపెట్టడం కూడా గద్దకు ఇష్టం లేదు. అందుకని అది చిలుకతో “చిలుకమ్మా నువ్వొక్కదానివి వేరే రంగులో ఉ న్నావు నువ్వు కూడా మాలాగా మారితే మాలో ఒకదానివిగా ఉంటావు ఏమంటావ్ అనడిగింది. అందుకు చిలుక ఉన్నట్టుండి నల్లగా నేనెట్లా మారేది? అనడిగింది. ఏం పరవాలేదు. అందుకు నేనొక ఉపాయం ఆలోచించిన నువ్వు నాతో వస్తే చాలు అన్నది గద్ద. సరే పదా అని గద్ద, చిలుక ఎగురుతూ ఎగురుతూ ఒక బొగ్గుగని దగ్గరకు చేరినవి. అక్కడ బొగ్గుపొడి ఒక కుప్పగా పోసి ఉన్నది. “నువ్వెళ్లి ఆ బొగ్గు పొడిలో బాగా పొర్లిరావే చిలుకా” అని గద్ద చెప్పింది. చిలుక అట్లే చేసింది. చిలుక నల్లగా మారిపోయింది.
ఇప్పుడు గద్దకు బాగా సంతోషమయింది. చిలుక కూడా మా కుటుంబంలో ఒకటిగా కలిసిపోయిందని, కానీ గద్ద కుటుంబ సభ్యులకు ఎటువంటి తృప్తి కలగలేదు. “చిలుక పండ్లు తినడం మాకిష్టం లేదు. అది కూడా మన మాదిరి శవాలను పొడుచుకు తింటే బాగుంటుందిరా గద్ద పెద్దాడా” అన్నాయి. “గద్ద” అట్లాగే చిలుకమ్మకు శవాలపై కూచుండి పొడుచుకు తినమని చెప్పింది. ఈ షరతు చిలుకమ్మకు నచ్చలేదు. అది ‘గద్ద’ తో చెప్పకుండా చాలా దూరంగా ప్రయాణించి ఒక చెట్టుకొమ్మపై వాలింది.
ఆ చెట్టు నాశ్రయించి కొన్ని కోతులు జీవిస్తున్నాయి. అవి చిన్నబోయిన చిలుకమ్మను పలుకరించాయి. ,చిలుకమ్మ కష్టాలు విని జాలి చూపించాయి. ఇక నుండీ ఇక్కడనే ఉండు నీకేం బాధలేదు అన్నాయి. చిలుకమ్మ ఆరోజు నుండి అక్కడనే ఉండసాగింది. చిలుకమ్మకు బాగా నిద్రపట్టింది. కానీ కోతులు ఒక కొమ్మ మీద నుండి మరొక కొమ్మకు దూకుతూ ఉంటే చెట్టంతా భూకంపమొచ్చి అదిలినట్టుగా అనిపించింది. మంచి నిద్ర కాస్త చెడిపోయింది. ఇట్లాగే ప్రతిరోజు జరగడంతో చిలుకమ్మకు నిద్రాభంగమై ఆరోగ్యం కాస్తా దెబ్బతిన్నది. దానికి తలనొప్పి రోగం వచ్చింది. దేవుడా అనుకుంటు అది ఆ చోటు నుండి కూడా ఎగిరిపోయింది. పోయి పోయి చిలుక ఒక తంగేడు చెట్టుపై వాలింది. దానిమీద కొన్ని గురుక పిట్టలు ఉన్నాయి. ఒక వేటగాడు గురుక పిట్టలను వేటాడడానికి వచ్చాడు. అతడు పిట్టలను గులేరుకు బండలను పెట్టి కొట్టసాగాడు. అట్లా రాళ్ల దెబ్బలకు కొన్ని పిట్టలు కింద పడిపోయినవి. వాటిని పట్టుకుని వేటగాడు బుట్టలో వేసుకుని పోయినాడు. ఆ రాళ్ల దెబ్బలు అక్కడే ఉన్న చిలుక కాలికి తగిలింది. అది నొప్పితో బాధ పడుతుంది. సరిగ్గా ఎగుర లేకపోతుంది. అది కుంటుకుంటు, కుంటు కుంటూ ఒక దగ్గరలో ఉన్న ఒక పోచమ్మ గుడిలోని దీపపు గూటిలో కూచుంది. ఆ గుడి ముందే జ్యోతిష్యం చెప్పి పొట్ట పోసుకుంటున్న ఒక జ్యోతిష్యుడు కాలు విరిగిన చిలుకను చూసి జాలిపడ్డాడు. అతడు దానికి వైద్యం చేసి నొప్పి తగ్గించి కాలును బాగుచేశాడు. అందుకుగాను చిలుక అతనికి కళ్ల చూపులతోనే కృతజ్ఞతలు తెలుపుకుంది.
వెంటనే జ్యోతిష్కుడు దాన్ని పట్టి పంజరంలో ఉంచాడు. “నేను నీకు ఇంత సహాయం చేసినందుకు నువ్వు నాకు జీవితాంతం సేవ చేయాలి. నా జ్యోతిష్య వృత్తిలో నువ్వు సహకరించాలి” అన్నాడు. జ్యోతిషుని కుటిలత్వానికి చిలుక చాలా బాధ పడ్డది. దానికి రాత్రికి లాలిపాడుతూ నిద్రపుచ్చే అమ్మ, బతిమాలి బతిమాలి జామపండ్లు తినిపించే నాన్న గుర్తుకు వచ్చారు. చిలుకకు దుఃఖం ముంచుకొచ్చింది. అది ఏడ్చి ఏడ్చి పంజరంలో అట్లాగే నిద్రపోయింది.
తమ బిడ్డను వెదకడానికి వచ్చిన చిలుక తల్లి దండ్రులు జ్యోతిష్యుడు కూచున్న చెట్టుపై వాలాయి. అవి పంజరంలో నిద్రపోతున్న చిలుకను చూశాయి. అది తమ బిడ్డే అని గుర్తు పట్టాయి. అవి వెంటనే జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్లి వివిధ రకాలుగా బ్రతిమాలి తమ బిడ్డ చిలుకను తమకిచ్చేయమని దీనంగా ప్రార్థించాయి. ఎంతోసేపటికి గాని జ్యోతిష్యుడి మనసు కరగలేదు. చివరికు అతడు ఆ చిలుకను విడిచిపెట్టేశాడు. తల్లి చిలుక తన బిడ్డను ఒడిలోకి తీసుకొని లాలించింది. తండ్రి చిలుక ముద్దులు పెట్టుకున్నాడు.
ఎంత కోపమొచ్చినా తన వారిమీద అలిగి ఎక్కడికీ వెళ్ళిపోకూడదని చిలుక పశ్చాతాప పడింది. అది ఇంకెప్పుడూ అట్లా వెళ్ళిపోనని తల్లిదండ్రులకు మాట ఇచ్చింది. తాను సురక్షితంగా బయటపడ్డందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నది.
చిలుక కథలు (కథా గుచ్ఛము)
previous post