Home కవితలు జలం – ప్రాణ ధార                              

జలం – ప్రాణ ధార                              


జలం ఉనికి ఎప్పుడూ ఒక రహస్యమే! జలం పరుగు ఎప్పుడూ ఒక రాజకీయ పన్నాగమే!
జలాలపై చర్చ ఒక సాలెగూడు అల్లికయే! జలం ఎప్పుడూ ఒక పోరాటానికి ఎజెండానే!
తెలియదు గాని – జల అస్తిత్వపు దేహంపై గాయం చేసేదెవరో !?
ప్రకృతికి, పర్యావరణానికి, మానవ మనుగడకు సారాన్ని అందించే
జలం మనుగడకే ఎసరు పెట్టే కుతంత్రం ఎవరిదో?
జడత్వానికి చేతననిచ్చే జలస్పర్శకు విష తుల్యం చేసే ప్రణాళికలు –
మంచి నీటి చుక్కై గొంతు లోకి ప్రవహించి – గుండె లయకు జీవ సంగీతాన్నందించే గుక్కెడు జలాన్ని
కళ్ళలో ఉప్పు నీటి సంద్రమై ఎగసిపడే అలలుగా చేసి ఆనందించే రాక్షస క్రీడలు ఎవరివో?

* * *

విషాద వలయంలో వారు, అగాధాల చీకట్లలో వారు
వర్తమానపు విచారాలను మరిచి- రేపటి వెలుగు కిరణాల దాహార్తులుగా బలిపశువులై వారు
ఎండిన డొక్కలతో తడి మట్టి వాసనలకై పొడి బారిన నాలుకలు చాచి వారు
వేయి కలలతో – నిద్ర కళ్ళతో వారు

* * *

ఇక – వేదనాభారంతో పూడుకుపోయిన గొంతుకల పూడికలు తవ్వి తీద్దాం
మిషన్ భగీరథ, కాకతీయ పథకాలు, హరిత హారాలను ఆయుధాలుగా చేద్దాం
గొలుసుకట్టు చెరువులను నిండు కుండల్లా మార్చుకుందాం
రేపటి ఉదయాలలో వానచినుకుల ధ్వనులతో నేటి తరాన్ని మేల్కొలుపుదాం
ఇంతకాలం దుఃఖ స్వరాలతోనే సుప్రభాతాలు విన్నాం
ఇంతకాలం వొడిలోని పాప అమాయకపు కళ్ళలోని చిలిపి తనాన్ని చూడనేలేదు
సంవత్సరాల నిరీక్షణలో ముక్కలైన గుండెలను ఎవ్వరి సాంత్వనతో అతికించను,
ఇకనైనా ప్రశాంతంగా జీవించనీ – కాలం తన నియతిలో నిజాయతీగానే సాగనీ –
అమాయక జీవుల సిరలలో జలాన్ని ప్రాణ ధారయై ప్రవహించనీ !!

You may also like

Leave a Comment