పంచ అధ్యాయాలతో సాగే
బతుకు పుస్తకం
జీవన విధి విధానం
ఓ చక్కని అనుభవ సారం
ప్రతీ పుట ఆసక్తి దాయకం!!
ఓ చిన్న అణువు అమ్మ గర్భంలో చేరి
దినదిన ప్రవర్ధమానమై
ముడుచుకున్న కాళ్ళుచేతులు
ఉమ్మ నీటిలో జలకాలాడుతూ
గాలి ఎటో తిండి ఎట్లనో
చీకటి కుహరంలోనే
పది నెలల ఆవాసం
పదిలంగా కాచే తల్లి
మొదటి అధ్యాయం ముగింపు!
తల్లి గర్భ దేవాలయం నుండి
బయటకు వచ్చిన క్షణం నుండి
భాష రాక మాట లేక
ఆకలికి బాధకు ఏడ్పు భావనే
ఆట పాట ఆనందం
ఏమెరుగని అమాయకత్వం
రంగులలోకంలో రాగరంజితం
శైశవ అధ్యాయం తిరిగిరాని
సంతోష భావజాలం!!
విద్య వికాసం సంస్కారం
లోకాజ్ఞానం ,మంచి చెడు
కష్టాలు కన్నీళ్లు,సంబరాలు
ఆట పాట స్నేహితులు
ఎన్నో ఎన్నో అనుభూతులు
ఎన్నో కథలు నీతులు
బాల్యం భోగ జీవనం
గురువుల పెద్దలు చెప్పిన బాట
జీవితానికి సుద్దుల మూట!!
రెండు వాదనల వేదనల భావి కి సూచనలిచ్చే రెండో అధ్యాయం
యవ్వనం నేర్పే జీవిత పాఠాలు
అనుభవ సారం
వయసు ఎగిరే విహంగం
ఊహల రెక్కలతో విశ్వ దర్శనం
సుఖ దుఃఖాలు ఈసడింపులు
అవహేళనలు కోపతాపాలు
ప్రేమలు పెళ్లిళ్లు బాధ్యతలు
ఉద్యోగాలు పిల్లలు,స్నేహితులు
సమస్త అనుభవ సారం
ప్రతీ పుట నవరస భరితం
అది జీవన భారతం!!
బంధాలకు బంధీ అయ్యే మూడో అధ్యాయం!!
తానో తల్లి తానో తండ్రి
తనవంటి బ్రతుకు ముచ్చట
బాధ్యత ల ముచ్చట
పిల్లల పెళ్ళిళ్ళు ఉద్యోగ విరమణలు
దోచుకున్నవో దాచుకున్నవో
పొదుపు చిట్టా కనువిందు రూపమయ్యే నాలుగో అధ్యాయం!
వృద్ధాప్యం కొందరికి వరం
ముసలితనం కొందరికి శాపం
మూటకట్టిన అనుభవం
సంసార సాగరం అనుభవైకవైద్యం
సుఖదుఃఖాల సారం
పంచమ అధ్యాయం
రాసుకున్న బతుకు పుస్తకం
ప్రతీ పుట తెలుపు అంతరంగం
వడబోసిన జీవితం
జీవిత గ్రంథం కావాలి సుఖాంతం!!
