మరీ దూరం కాని దగ్గరలో పరుచుకున్న
ఆకుపచ్చ పుప్పొడి దాకా వెళ్ళాను
తీరా చూస్తే అది జొన్న చేను, మొన్న మొన్న మొలకెత్తింది
పసిపిల్లల్లాంటి మొక్కలు, ఒంటి నిండా మెత్తని చూపులు
చిట్టి ఆకులు నాజూకైన చేతులు, ఉత్సాహపు వుయ్యాలలు
ఆ పక్క నిల్చున్న పెద్ద చెట్టూ, ఇటు నేనూ
చేనునే చూస్తున్నాం కానీ
నా కన్న చెట్టే చేనుకు చేరువ అనుకుంటా-
చేనునానుకున్న రహదారిమీద
వడివడిగా వాహనాల్లో వెళ్తున్న కళ్ళలోకి
ఈ చేను మొత్తంగా ఎట్లా చేరుతుంది
కనుక వాళ్ళ ఇళ్లకు దీని సోయగం చేరదు
తానే ఈ చేనుకు చోటిచ్చానని
నేల ఇక్కడ ఏ హోర్డింగూ పెట్టుకోలేదు
తానే దున్ని విత్తానని చెప్పడానికి
రైతు ఇక్కడ ఏ ఫలకాన్నీ పెట్టి పోలేదు
తొలిసారి కాదేమో నేను ఈ చేనును దర్శించడం!
ఏ పూర్వ జన్మలోనో నేనేమో చేను, ఇది మనిషి కాబోలు
మా ఇరువురి సంభాషణ అప్పుడు మొదలై
ఇప్పటికీ కొనసాగుతున్నట్లున్నది
రైతు పాదముద్రలతో చేను పావనమైంది
అతని రోజూ తన నీడను ఇక్కడ వదిలి వెళ్తాడనుకుంటాను
దానితో మిళితమై ఈ మొక్కల నీడలు చిక్కబడ్డాయి
ఆ సంగమ ఛాయల్తో నా నీడ కలిసిపోయిన ఈ క్షణాలు
నా దేహమ్మీద కురుస్తున్న దయాపూరిత దీవెనలు!