Home కథలు జొన్న రొట్టెలు “కథ

జొన్న రొట్టెలు “కథ

by Butam Mutyalu

వానాకాలపు సాయంత్రం మలిసంజపొద్దు పడమట కొండల మాటున జారుకుంటుంది. మస్క మసకగా చీకటి ముసురుకుంటుంది. చెట్టు, పుట్ట, గట్టు, కొండలు గుట్టలు అనక ఊరు, వాడ నల్లని కాటుకమల్లే చీకటి దుప్పటి కప్పుకుంటున్నాయి అప్చిపటికే చినుకులు రాలి రోడ్డంతా తడిసిముద్పోదగయిపోయి చిత్తడి చిత్తడిగా మారింది. అటు పడమటి దాపున సరిహద్దుగా ఎత్తైన కొండల శిఖరాలుగా కాపురాలు గుట్ట అంచు వెంబడి దూరంగా విసిరేసినట్టున్న నల్లగొండలోని జీవివారిగూడెం రోడ్డు బాటంతా వచ్చిపోయేవారితో రద్దీగా ఉంది ఆ బస్టాపు మూలమలుపు తిరిగితే నల్లతాసులా పరుచుకునే వారిగూడానికి బాట చాపుతుంది 

    అసుంట ఆంజనేయస్వామి గుడి బాటకు ఇటు అటుగా ఇద్దరు ముగ్గురు లంబాడ లచ్చువమ్మలు బాటకు పక్కెంట కట్టెలు పొయ్యిలు రాజేసుకుంటు పొయ్యి ముందు సేదతీరిండ్రు పొయ్యిలో మంట రాజుకుంటుంది పొయ్యి మీద పెంక వేడెక్కుతుంది పొయ్యి చుట్టూత రక్షణ కవచంలా నాపరాళ్ళు మూడువైపులా అమర్చి ఉన్నాయి పొయ్యి ముందు ఆమెకు ఒకవైపు ఎండు కట్టెలు కొన్ని, చేతులో ఊదురుగొట్టంతో ఊపిరి బిగబట్టి ఊదుతూ నిప్పు రాజేస్తుంది ఇటుముందు తాంబాలంలా ( బేషన్ గిన్నే ) ఇంకో పక్క కాల్చిన రొట్టెలు వేడి చల్లారకుండా ఉండేందుకు హాట్ బాక్స్. బేషన్లో పిసికి ముద్ద చేసిన పిండి  

పక్కెంట జగ్గులో నీళ్ళు , కలపని పొడిపిండి, పొడిపిండిని పీటపై చల్లుతూ పిసికిన పిండి ముద్ద తీసుకొని ఒకచేత పట్టి మరోచేత ఒత్తుతూ అద్దుతూ పీట నిండారగా చేతితో రొట్టెను సాగదీస్తూ నిండు సందమామలా రొట్టెకు రూపమిస్తుంది

   యథాలాపంగా వేడివేడి రొట్టెలకోసంనేను ఆమె దగ్గరికి సమీపించాను ఆమె నా వైపు ఇంతలేసి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ” ఎన్ని రొట్టెలు కావాలి సారు” అని తిన్నగా అన్దినది. నేను ఆమె వైపు చూస్తూ ” రెండు జొన్న రొట్టెలు ఇవ్వమ్మా” అని అన్నాను. నేను అన్న మాటను అందుకుని పీటపై అప్పటికే పచ్చి రొట్టెగా చేసిన రొట్టెను చేత తీసుకొని పొయ్యి పై మంటకు వేడెక్కుతున్న పెంక పై వేసింది. కుడి చేతిని నీటిలో ముంచి పెంకపై కాలుతున్న రొట్టెను తడి చేస్తూ ఉంది , నాలాగే రొట్టెలకు వచ్చినవారు నాకు పక్కగా నిలబడి చూస్తూ ఉన్నారు. ఆమె దగ్వగరకు వచ్చిన గిరాకి మళ్ళి పోకుండా మంటని పెద్దది చేస్తూ త్వరగా రొట్టెను కాల్చేలా తిప్పి తిప్పి పెంకమీద వేస్తూ ఉంది , వేడికి రొట్టె అక్కడక్కడ ఉబ్బుతుంది అక్కడక్కడ కాలి నల్లగా మారిపోతూ ఉంది . ఆమె తిప్పి తిప్పి కాలుస్తూనే ఉంది. అటు ఇటు చూస్తే బజారు వీధి లైట్లు వెలుగుతూ ఉన్నాయి అక్కడక్కడ గతుకులు పడిన రోడ్డు కురిసిన వర్షానికి రంగు మారిన నీళ్ళు బురదరూపు సంతరించుకున్నాయి. పొయ్యి మంట బగబగమని మండుతూ ఉంటే ఆమె మొఖము ఆ వెలుగులో దగదగ మెరిసిపోతోంది . ఇంత పిండి ముద్ద మరొకటి తీసుకొని అప్పడంలా సాగదీస్తూ రొట్టెను చేస్తావుంది కానీ ఏదో పోగొట్టుకున్న దానిలా మొఖమంతా పాలిపోయి విచారంతో నిండిపోయింది ఆమె పక్కన ఆమెను చూస్తూ కూర్చున్న కూతురు ఆమె పనికి ఆటంకం కలిగిస్తూ ఉంది. 

 ” ఏమే పిల్ల జరట్లుండు విసిగించకూ ” అని కసురుకుంటూ అన్నదామె

” నీయమ్మ నేన్జేస్తనే ” అని బిడ్డ విసిగిస్తూ అనసాగింది.

” జర్రాగే మమ్మగాని సతాయించకు” అని బతిమాలుతున్నట్టు అన్నది.

” నీయమ్మ నేన్జేస్తేందమ్మ నన్నొదంటవు నాకు చెయ్యరాదా ఎట్ల “

“జర్రాగు రొట్టె పిండి ముద్ద సరిగ చెయ్యరాదు నీకు పీటమీద కొడితే అప్పలాగ పల్సగ రావాలి ముందు చూడు తర్వాత చేద్దువు చిత్తడిల ఎందుకొచ్చినవే మళ్ళీ వానొస్తే నేన్తడుస్త నువ్ తడుస్తవ్ , వానకు తడిస్తే సర్ది అయితది రూమ్ దగ్గర ఉండి చదువుకోపో “

“ఊకే సదువు సదువు అంటవ్ నేన్ సదవన్ పో ఈయాల సెలవు సెలవు నాడు సదవాలా “

“ఒశే పిల్ల జోలి బాగుందిగా బలె గమ్మతి చేస్తుందేంరో మాకే సదువు లేక రోడ్ల మీద కుసోని రొట్టెలమ్ముకుంటున్నం నువ్వన్న గింత సద్వుకుంటవంటే” అని గుల్గ సాగింది.

మాటలవడి పెంకమీద రొట్టె నల్లగా మాడింది ” అయ్యో అయ్యో జర్రాగు సారు రొట్టే నల్లగ అయ్యింది ఇంకోటి చేస్తా “అని

లబోదిబోమంటు కూతురి వైపు గుడ్లురిమి చూసింది చూస్తూనే పీటపై తొందరతొందరగా రొట్టెను సాగదీయసాగింది సాగదీస్తుంటే రొట్టె పర్రెలు పర్రెలు గా ఇచ్చుకుంటుంది సరిచేస్తూ సాగదీస్తుంది

” ఏమ్మా నీ కూతురా” అని నేను అనగానే

” అవును సారు , చదువుతుంది సారు , నాకొడుకు వాటర్ ఫిల్టర్ మీద ఉండు వాడు సదువు సద్వురా అంటే… సదువుకు పంగనామాలు బెట్టిండు. ” అని అంటుండగా

” ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్” మంటూ ఆమె రొమ్ములో దాగివున్న సెల్ పోన్ మోగింది. గుండెల్లో పిడుగు పడ్డట్టు ఉలికిపడి తిన్నగా తడిచేత తీసుకుంది. ఒకవైపు అసహనంతో కూడిన ఆందోళన చెందుతూనే జీరబోయిన గొంతుకతో “అలో అలో” అంటూ తడబడుతూనే పలికింది. ఆమె మాటలో వనుకు స్పష్టంగా కనిపిస్తూవుంది. మొఖంపై చెమట కమ్మింది. తను మండుతున్న పొయ్యి ని తదేకంగా చూస్తానే పెంకపై జొన్నరొట్టె ను తిరిగేయబోయింది అంతలోనే చేయికి సురుక్కున వేడితగిలి అలాగే రొట్టెను విడిచింది రొట్టె పోయ్యిలో పడి బగబగ మండుతూ నల్లగా మాడింది “ అయ్యో వోరి దేవుడా … ఇయ్యాల లేసి ఎవరి మొఖం చూస్తినిరా శని చుట్టుకున్నట్టు వున్నది అని తనను తానే నిందించుకుంటూ జర్రాగు సారు ఇంకోటి చేసి ఇస్తాను అని ఒకచేత పిండి తీసుకొని పిసుకుతూనే మరోచేత “ అలో అలో ఎవరూ? “ అని అన్నది.

“ హలో నేను “ అంటూ అవతలి గొంతు పలికింది.

“ ఆ చెప్పుండ్రి “ అని బదులు పలికింది.

“ అదేనమ్మా నీ కూతురు గురించి నేను చెప్పిన విషయం గురించి ఏమి అనుకుంటున్నారు” అంటూ అతను సావదానంగా పలికిండు. 

“ యాడియే …మీరే చెప్పుండ్రి . నేనా ఆడిమన్సిని నాకంటే మీకే బాగా తెలుసు , పిల్లల గురించి అంతా మీకు ఎర్కేనాయే మీరే ఏదో ఒకటి చెప్పుండ్రి ఏమి చేద్దామో?” అంటూ గబగబా పలికింది . పీటపై రొట్టె చేస్తూనే

“ అంతా నాకు తెలుసు అంటే ఎలాగమ్మా? మనం సావదానంగా ఒక నిర్ణయానికి వద్దాం ఏమంటవూ?” అని అతను అనగానే 

“ అదేనయా నేనా ఆడపిల్ల తల్లిని. ఏదెర్కలేనిదాన్ని. నాకా సదువు గిదువు తెల్వని దాన్ని . జర్రంత మీరే నజర్ పెట్టి నా బిడ్డ బతుకు ఆగం గాకుండా సూడాలి జల్దిన లగ్గం జేస్తే సరి” అని కట్టెవిరిచినట్టు అన్నది. 

“ అట్లా అంటే ఎట్లమ్మా? పెండ్లి పెండ్లి అని ఒకటే తొందర పెడుతున్నవ్. అట్లా గబగబ ఉర్కులాడితే ఎట్లా? ఉర్కి ఉర్కి పసుల కాస్తే కుదురుతుందా చెప్పు. ఇదిగో నేను ముందే చెప్పిన మా ఇంటికాడ పప్పన్నం తిందాం. మీ ఇంటికాడ ఎంగేజ్మెంట్ 

 చేద్దాం. అలాగే మీ ఇంటి దగ్గరనే పిల్ల, పిలగానికి లగ్గం పెట్టుకొని లగ్నపత్రిక రాయిద్దాం . మన్చిరోజు చూసుకొని మీ ఇంటిదగ్గరనే పెండ్లి చేద్దాం సరేనా, లగ్గం మీ యింటి దగ్గర చేస్తే అది మీకే మంచిది” అంటూ నింపాదిగ పలికిండు అతను 

“ సరే అట్లనే కానిద్దాం “ అని ఆమె అన్నది….

“ కానీ ఏందమ్మా, ఇంకా నేనే ఒకమెట్టు దిగివస్తే “ అంటూ కాస్తా కటువుగా పలికిండు అతడు.

“ అదికాదు బయ్యా.. పిల్లా, పిలగానికి పెండ్లి మీ యింటి దగ్గర జరుపుండ్రి. నేనా ఏదెర్కలేని ఆడిమన్సిని, అటసూత్తే పెండ్లి అన్ని ఇగురంగ చెయ్యగలనా? నాకేమన్న సదువా సాత్రమా, అసలే మగదిక్కు లేనిదాన్ని , నువు కూడ నన్నే చేసియమంటున్నవు. నీదేంబోయింది రేపు నలుగురు నన్నంటరు అడదాని పెత్తనం తమ్మల్ల దొరతనం అని వూకెనే అనలే , ఏది గింత సరిగ కుదురకున్నా వచ్చిన జనం నన్నాడిపోస్కుంటరు బయ్యా.. జర గది నువ్వే ముంగట నడ్సి పుణ్యం గట్టుకోండ్రి.” అని దీనంగా వేడుకుంటి. అయిన వుండి “ అలాగంటే ఏట్లనమ్మా , యిద్దరం కల్సి ఒకపని చేద్దాం . ఇప్పుడు ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం , దసరా, దీపావళి లగ్గాలప్పుడన్న , కుదరకుంటే మళ్లి మాఘమాసం లగ్గాలప్పుడు పెండ్లికి వాయిదా వేద్దాం. అప్పుడు అందరం ప్రీగా వుంటాం కదా, ఇగపోతే నువు పిలగానికి ఇస్తానన్న కట్నం డబ్బులు యిప్పుడే ముందుగా యిస్తే అబ్బాయి ఏదేవొక యాపారం చేసుకుంటడు. వచ్చే ఎండాకాలం లగ్గాల నాటికి 

“ ఆ.. ఏందమ్మా వినిపించనట్టు మాట్లాడుతవు. “ అని అతను అన్నడు

 “ అట పతిదానికి తప్పులు తీస్తవేందయా యినవడ్డది కాని ముంగల ముంగల ఎట్ట ఇయ్యను పైసలతో పని” అని అన్ననోలేదో “ సూడమ్మా నువు ఇప్పుడు పైసలు ఇచ్చి సరేనంటే మనకు మంచిది. లేకుంటే పిలగాడు ఏదో ఒకటి చేసి కుదుర్కున్నంకనే పెండ్లి ఏమంటవు సరేనా? “ అని అనే.

 “ ఆ… ఓరిదేవుడా ఎట్టా సచ్చేది గాళ్ళ మన్సుల మర్మం ఏందోగని అంతు చిక్కుతలేదు “ అని లోలోన గొనుగుతూ బాదతో కండ్లు పిండసాగింది. చేతులున్న పోను నేల జారింది. నేలచూపులు చూస్తూ నే కొంగు మొఖానికి పెట్టుకొని బోరుమంటూ ఏడుపందుకుంది. “ ఏమయిందమ్మా” అంటూ కూతురు కాసింత ఆందోళన చెందుతూ ఆత్రుతగా అడిగింది 

….

” ఏందమ్మా ఏమైంది ఏడుస్తున్నవ్” అని ఆమె వైపు తీక్షణంగా చూస్తూ నేను అడిగిన.

ఇగో సారు నా పేరు తీత్రిబాయి

నాకు ఒక్కగానొక్క ఆడబిడ్డె , పేరు సామియా. మాది మీరంగాని తండా గా ముచ్చట ఇనుర్రి కొడుకును ఆపి పిల్లను డిగ్రీ దాక సదివిచ్చిన కాలేజు పోరల సోపతిల అది ఒక పిలగాన్ని ఇష్టపడింది మేము లంబాడ. గాళ్ళు సూదర్లట సరే పిల్ల మన్సు పడింది గదా గా ముచ్చట నా కండ్ల పడింది గాళ్ళను ఇడదీస్తందుకు నాకు మనసొప్పలే , గాళ్లను కలపాలని చూస్తున్న గా పిలగాన్ని అడిగితే ఇద్దరం ప్రేమించుకుంటున్నం పెళ్ళి చేస్కుంటం అని అన్నడు నా బిడ్డె కుద్దుగ అదే మాట పలికింది కని గా పిల్లగ్గాన్ని అయ్య గింత తేడు పెడుతుండు కిందికంటే మీదికేస్తడు మీదికంటే కిందికేస్తడు ఒక్కతీరు మనిషికాదు ఒకపాలి ఏమో “నాకు ఇష్టం లేదు గుడిల దండలు మార్చి చేపిచ్చుకో అంటడు. లేకుంటే రీస్టరు పెండ్లి చెపియ్యి అంటడు, ఇంకోపాలి పప్పన్నం తిందాము అంటడు సరే దారిలకు వచ్చిండని , పిల్లను గార్వంగ సాదుకుంటి ఉత్తగ ఎట్ల పట్టియ్యను దాన్ని ఎవరినో ఒకయ్యను జూసి పెండ్లిచేసి నాల్గిత్తులు నెత్తిన సల్లితే నా బర్వు దిగుద్ది అనుకుంటి గట్లనే మన్సుల అనుకుని పిల్లకు ఇంత ఒంటిమీదికి నల్లపూసలదంండను చేపిచ్చిన నా మెడల గుండ్లను సెడగొట్టి నా చెవుల గెంటీలు చెడగొట్టి పిల్లకు దిద్దులు బుట్టాలు చేపించిన రెక్కలు ముక్కలు చేసుకుని పైసపైస కూడబెట్టి సందేళ్ళ మాపు గీడ కూకొని జొన్న రొట్టెలు చేసి అమ్ముకుని పూట ఎల్లదీస్కుంట ఊస్నూరు పాస్నూరు చేసుకుని జర్రంత నలుగురిల నజరు గొడితట్టు తలెత్తి బతికేటట్టుగ ఉండాలని నేను చూస్తున్న , కాని నన్ను పగ్గుతూ ఇబ్బంది పెడుతుండ్రు గాళ్ళు పిల్ల ఒంటిమీదికి బంగారం పెడితే నీ పిల్లకు పెట్టుకుంటున్నవ్ అనే, సరే పిలగానికి లగ్గం కర్సులకు గిన్ని పైసలు జూస్త తియ్య అంటే నా పిలగానికి కట్నం ఇయ్యమనే, మళ్ళీ అయన ఆడిబిడ్డ కట్నం ఇయ్యమనే ఆ పిల్లగానికి ఏదో యాపారానికి నన్నే ఎగనూకమనే సరే అదులో బదులో చేసి దులుపుకుందాం అంటే ఆ ఇచ్చే డబ్బులు ముంగల ముంగల ఇయ్యమంటుండు లగ్గం తర్వాత అంటుండు. ఎట్టజెయ్య సారు …ఆయిన అత్తగారి సొమ్ము అయినట్టు ఇయ్యమంటే ఎట్లియ్యాలే సారు అదికూడ ముంగల ముంగలంటే లోకంల ఎవలన్న ఇస్తరా. నేనయుతే సూడలే సారు గిదేంపజ్జతి గతిలేని సంసారానికి గంజినీళ్ళే పాన్కం అని మేం బతుకుతుంటే ఆయిన సంపాయించి పెట్టిన ముల్లెలు వున్నట్టు ముంగల ముంగల ఇయ్యాలంట నాకు అరికాలిమంట నెత్తికెక్కింది వొచ్చిన కోపానికి కొర్కాసు వాత పెట్టాలన్నంత కోపం వుంది గని పిల్ల మొఖం సూడాల్సి వచ్చే. పిల్లను గార్వంగ సాదుకుంటి ఎట్ట జెయ్యాలే సారు… యిగ్గో

మొంచోడు మంచోడనుకుంటే మంచం కరాబు సేసిండట అట్టుంది గాయిన వాలకం , ఇసుంట రమ్మంటే ఇల్లంతా నాదంటరా . నమ్మితిరా సిద్దా అంటే ముంచితి బిడ్డా అన్నట్టుగుంది గాళ్ళ యిలవరస, 

మిరాశి హక్కు వున్నట్లు పీస దీస్కుంట అడిగిండు

పిల్ల బతుకు ఆగం గావొద్దని సుట్టాల దాపుకు జేరుదామంటే 

సెడి చెల్లెలు యింటికి అలిగి అత్తగారింటికి పోగుడదాయే ఎట్ట జెయను సారు

” అంటూ ఎగదన్నుకొచ్చే దుఃఖాన్ని పైటకొంగుతో తూడ్సుకోసాగింది.

“అమ్మా మరేం గాబరా పడకు నీ కూతురిపై నీకు మమకారం ఉంటది సహజం , విషయం సాగతీత మంచిది కాదు దీని పరిష్కారానికి వెంటనే వెళ్ళి పోలీసులను కలువు ” అని నేను అనగానే అలా అన్నానో లేదో సరసర అక్కడ పని పక్కన పెట్టి పిల్లను వెంటబెట్టుకొని ” దేవుడా ఈ గండం నుంచి గట్టెక్కించే దారి చూపు” అని ఆమె మతిలో ప్రార్ధించింది శుభ సూచకంగా దూరాన వున్న గుడి లో గంట మోగిన సప్పుడు వినిపించింది . ఆమె తన కూతురు ను తోడు గా వెంటబెట్టుకొని ముందుకు సాగిపోయింది తెగిన గాలి పటంలా…! దిక్క దాపు ఆసరా కోసం.నేను వారినే చూస్తూ కొయ్య బారిన వాడిలా నిశ్చేష్టుడయ్యాను. అలా క్షణకాలం రెప్ప వేయకుండా చూస్తోవుండిపోయా. కానున్నది కాకమానదు ఎమైనా కానియ్యి బంధం ముడి పడి వుంటుందా? తెగుతుందా, సమస్య జటిలమే కానీ బుర్ర లో అలోచనలు పరిపరి విధాలుగా గింగిరాలు కొడుతున్నాయి. అటుగా చిరుగాలి వీచింది, మనసు కాసింత తేలికగా అనిపించింది.గుండెలో బరువు తగ్గి చినుకుల చిరుజల్లు ఆశ మిణుగురు లా మినుకు మినుకు మంటూ చిరుదివ్వే వెలిగింది.

…….. 

You may also like

Leave a Comment