Home కథలు డబ్బెందుకు చేదు?

డబ్బెందుకు చేదు?

by Nandiraju padmalata

రాత్రి భోజనం చేశాక కాసేపు  నడవడం అలవాటు నాకు.  ఈ మధ్య రాధ కూడా వస్తోంది నడకకి నాతో. ఆరోగ్యం కోసమనే కాదు, పగటి విషయాలు పంచుకునే మంచి సమయం అది.

“ ఈ రోజు ఎనిమిది సంబంధాలొచ్చాయి నా వాట్సాప్ లో. ఇదేంటో?స్రవంతి వివరాలు మన చుట్టాలకి తప్ప ఎవరికీ చెప్పకపోయినా, ఏ పెళ్ళిళ్ళ బ్యూరో కి ఇవ్వకపోయినా వస్తూనే ఉన్నాయి.” ట్రింగుమంటూ  వాట్సాప్ నోటిఫికేషన్ రావడంతో, ఫోను చూసుకుంటూ అంది రాధ.

ఈ మధ్యే మా పెద్దమ్మాయి స్రవంతికి సంబంధాలు చూస్తున్నాం.  ఇంజనీరింగ్ అయిన ఈ ఏడాది నుంచీ ఉద్యోగం చేస్తోంది. తాను సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కనుక, కాబోయే భర్త సైతం తన రంగం వాడే అయితే మంచిదని భావిస్తోంది. ఆ క్రమం లో మంచి సంబంధం ఉంటే చెప్పమని దగ్గరి వాళ్లకి చెప్పి పెట్టాను, నాకు జాతకాల మీద నమ్మకం, కొద్ది ప్రవేశం కూడా ఉన్నాయి. నా ఫోనుకీ, రాధ ఫోనుకీ చాలా సంబందాలొస్తున్నాయి. చిత్రం. వడపోతల తర్వాత, ఒక్కటీ మిగలట్లేదు. అలా అని మేమేం  పెద్దగా  షరతులు, పరిమితులు నిర్ణయించలేదు. మంచి కుటుంబం, కుదురైన ఉద్యోగం  ఉండి, దురలవాట్లు లేకుండా ఉంటే చాలు అనుకుంటున్నాం.

“ఇదుగో! ఈ అబ్బాయి ఫోటో చూడండి. బావున్నాడు కదూ!” చూపించింది రాధ.

చాలా బావున్నాడు కుర్రవాడు. స్రవంతికి ఈడు జోడు. నడక అయ్యాక ఇంటికి వెళ్లి, ప్రొఫైల్ ని తీరిగ్గా చూశాం. అతనికి మాస్టర్స్ డిగ్రీ ఉంది. ఉద్యోగమూ బాగానే ఉంది. అది కూడా హైదరాబాద్ లోనే! మిగిలిన వివరాల్లోకి వెళ్లాను. మా గోత్రం కాదు. నక్షత్రాలు కలుస్తున్నాయి. మొత్తం మీద ముప్పయ్యారుకు గానూ,  ముప్పయ్యయిదు గుణాలొచ్చాయి.

స్రవంతిని పిలిచి చూపించింది రాధ.

“సారంగపాణి. పేరు కూడా బావుంది నాన్నా!” తనకి అంగీకారమే అన్న సూచన ఉంది అందులో.

వివరాలలో తండ్రి పేరు రమా మనోహర్ అని ఉంది. ఇది నాకు బాగా పరిచయం ఉన్న పేరు. కానీ ఒకే పేరు చాలా మందికి ఉండొచ్చు కదా. తెల్లవారాక ఆ సంబంధం వాళ్లకి ఫోన్ చేశాను. పిల్లవాడి తండ్రి మాట్లాడాడు.

నేననుకున్నట్లే అయింది, ప్రపంచం బొత్తిగా చిన్నది.  ఆ కుర్రవాడు నా మిత్రుడు రమామనోహర్ కొడుకే! మనోహర్ బీయస్సీ లో నా సహాధ్యాయి. నన్ను గుర్తించిన తర్వాత వాడి ఆనందానికి హద్దుల్లేవు. కాసేపవీ ఇవీ మాట్లాడుకున్నాక ఫోను పెట్టేసేసరికి, ప్రక్కనే క్వశ్చన్ మార్కు ముఖాలతో రాధ, స్రవంతి, స్పూర్తి.

“ఈ సంబంధం వద్దులే రాధా….”

“అదేమిటి? ఇంతసేపు నవ్వుతూ మాట్లాడారు, ఇప్పుడీ మాటేంటీ?” నివ్వెరపోయింది రాధ.

“వద్దన్నానుగా…వదిలెయ్యి. ఇంకోటి చూద్దాంలే!” అన్నాను.

“ అన్నీ బావున్నాయి. జాతకాలు కుదిరాయి. మేం విన్నదాన్ని బట్టి, ఆయన మీ మిత్రుడే అని కూడా అర్థమయింది. అన్నింటికన్నా ముఖ్యంగా  స్రవంతికి నచ్చాడు.” రాధ నిష్టూరంగా అంటూంటే, స్రవంతి నిరాశగా చూసి లోపలికెళ్ళిపోయింది.

ఇంక వాళ్లకి సూటిగా, స్పష్టంగా చెప్పేయాలనుకున్నాను.

“రాధా! మనోహరూ, నేనూ డిగ్రీలో కలిసి చదూకున్నాం.  మా నాన్న, వాళ్ళ నాన్న ఒకటే డిపార్టుమెంటు. అంటే వాళ్ళ నాన్నగారికి, మా నాన్న ఆఫీసర్. ఆ భేదమేమీ మా మధ్య లేదనుకో! అయితే, చాలా విషయాల్లో మనోహర్ తీరు నాకు నచ్చేది కాదు. వాడుట్టి డబ్బు మనిషి. డబ్బే ప్రాణం. డబ్బే జీవితం. ఓ సరదా, షికారూ, షాపింగ్ ఏదీ లేదు వాడికి. పైసా, పైసా దాచుకునేవాడు. మేం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూంటే, ఒక్కసారి కూడా మాతో కలిసేవాడు కాదు. ఉదయం రెండు, సాయంత్రం రెండు హోం ట్యూషన్స్ చెప్పుకుని సంపాదించుకునేవాడు. దీపావళి పండగొస్తే టపాకాయలమ్మకం, సంక్రాంతికి గాలిపటాలు ఇలా సీజన్ చూసుకోవడం, డబ్బు చేసుకోవడమూ తప్ప మరో వ్యాపకం ఉండేది కాదు వాడికి. ఎప్పుడు చదువుకునే వాడో ఏమో గానీ, మంచి మార్కులే వచ్చేవి. నాకస్సలు నచ్చేది కాదు వాడి వ్యవహారం.”

“అయితే…దానికీ దీనికేం సంబంధం? అప్పట్లో పాపం పేదరికమో, పెద్దకుటుంబమో అయి ఉంటుంది.” రాధ అంది.

“ అయితే గియితే ఏమిటి నీ మొహం? పెద్ద కుటుంబమే కానీ, గతి లేని వాళ్ళేం కాదు వాళ్ళు. మేం అద్దె ఇంట్లో ఉండేవాళ్ళం, వాళ్ళది సొంత ఇల్లు. ఆ డబ్బు మనుషుల ఇంట్లో పడితే, మన పిల్ల ఎంత కష్ట పడవలసి వస్తుందో  ఒక్క సారి ఆలోచించు. అల్లారు ముద్దుగా పెంచాం మనం వీళ్ళని. కంటికి నచ్చింది కొనుక్కోవడం, నోటికి నచ్చింది తినడం అలవాటు మనకి. రేపటి నుంచీ మెతుకులు లెక్కపెట్ట్టుకుని తినాల్సొస్తే? చాలా కష్టంలే….వద్దు.” కాస్త ఖచ్చితంగానే చెప్పి లేచాను.

“ పాపం…అక్క ఆ అబ్బాయి వివరాలు మొత్తం ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో వెతికేసింది నాన్నా! దానికి చాలా నచ్చాడు.” స్ఫూర్తి మాటలు విననట్లే ఊరుకున్నాను.

 

****

ఆదివారం. బద్ధకంగా కాఫీ త్రాగుతూ  వార్తలు చూస్తుంటే, కాలింగ్ బెల్ మ్రోగింది. స్రవంతి తలుపులు తీసి ఎవరో అడుగుతూండగానే,  నేను లేచి చూసాను.

ఆశ్చర్యం. రమా మనోహర్.

రాత్రేగా వాడితో మాట్లాడాను. ప్రొద్దున్నే ప్రత్యక్షమయ్యాడేమిటా  అనుకుంటూ ఉన్నానో లేదో, వాడి వెనుక వాడి భార్య. మరింత ఆశ్చర్యం. వాడి కొడుకు… అదే పెళ్లి కొడుకు సారంగపాణి.

‘ఇదేమిటి, ఉరుముల్లేని వానల్లే నేరుగా పటాలంతో ఇంటికొచ్చేశాడు.. వీడికి నా అసమ్మతి ఇంకా చెప్పలేదు. ఇప్పుడెలా?  కాదని ఎలా చెప్పాలి?’ మధన పడుతూనే, ఇంట్లోకి ఆహ్వానించాను. నేను ఆహ్వానించడమేమిటి? మొహమాట పడుతున్న భార్యతో, ‘వీడు నా జిగిరీ దోస్తు. రా… రా… పాణీ! మీ  తాతయ్య, ఈ అంకుల్ వాళ్ళ నాన్నగారి క్రిందే చేశారుద్యోగం’ అంటూ లోపలికొచ్చి కూర్చున్నాడు.

“రండి. కూర్చోండి” ఆహ్వానించింది రాధ.

“వార్నీ…ఎన్ని సార్లు ఈ వైపు నుంచీ తిరిగానో! నువ్విక్కడే ఉన్నావని తెలీనే లేదురా  ప్రసాదూ! పాతికేళ్ళయింది కలిసి. ఉండబట్టలేక ఫ్యామిలీతో దిగి పోయా! ఏమ్మా..రాధమ్మా? . నీ పేరు బయట నేమ్ బోర్డు మీద  చూశాలేమ్మా! తను… దమయంతి. నా భార్య. పెద్దబ్బాయి సారంగపాణి. వీడి తర్వాత ఒక కొడుకు, కూతురు కవలలు.” మంచి మాటకారి మనోహర్. తనే పరిచయం చేసేసుకున్నాడు మా వాళ్లకి.

స్రవంతిని, స్పూర్తిని పరిచయం చేసింది రాధ. స్రవంతి, సారంగపాణి ఒకర్నొకరు చూసుకోవడం నేను గమనించక పోలేదు. మనోహర్ భార్యకి మొహమాటం ఎక్కువనుకుంటా! తక్కువ మాట్లాడుతోంది. అంతేలే….దంపతులలో ఒకరిలా, మరొకరలా ఉంటేనే మంచిది.

“అంకుల్! కాఫీలో చక్కర వెయ్యచ్చా?”

“నేనింకా చక్కెర ఫ్యాక్టరీ కొనలేదమ్మా! నిరభ్యంతరంగా వెయ్యొచ్చు. దమయంతీ…నువ్వు తెచ్చినవి ఇవ్వూ!” స్పూర్తికి చెప్పి, భార్యతో అన్నాడు మనోహర్.

వాళ్ళు తెచ్చిన బుట్ట తీసుకుని వంటగదిలోకి వెళ్ళింది అతని భార్య దమయంతి.

చాలా కబుర్లు చెప్పుకున్నాం.

“అయితే, అత్తయ్య, మావయ్యగార్లు నీ దగ్గరే ఉన్నారన్నమాట.” వాడితో అన్నాను.

గలగలా నవ్వాడు మనోహర్.

“మేమే వాళ్ళ దగ్గరున్నాం. అదే ఇల్లు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. నిన్ను కలవడానికి వెళ్తున్నామని చెప్తే ఎంత సంతోషించారో! మీ నాన్నగారు పోయారని తెలిసింది. అమ్మ ఎక్కడున్నారు?” అడిగాడు.

మా ఈ అపార్ట్ మెంట్ లో ఉండడం నచ్చలేదు అమ్మకి. తమ్ముడి దగ్గర కాకినాడలో ఉంటోంది. వాడిది ఇండిపెండెంట్ ఇల్లు. అదే చెప్పాను. పాత విషయాలు చాలా మాట్లాడుకున్నాం. ఇద్దరం యాభైలు దాటాం కాబట్టి, అప్పటి విషయాలు ఇపుడు చాలా సిల్లీగా అనిపించాయి. మనోహర్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నాడుట. ట్రాన్స్ఫర్ ఇష్టం లేక, పరీక్షలు రాయలేదట. అందుకే ప్రమోషన్ కూడా రాలేదుట. పిల్లలు ముగ్గురివీ మంచి చదువులేనట. సారంగపాణి ఖరగ్ పూర్ ఐ.ఐ.టీ లో చదివాడట. అదృష్టవశాత్తూ, అంతసేపట్లోనూ మా మధ్య పెళ్లి విషయాలేవీ రాలేదు.

“ మిస్సెస్ మనోహర్ మంచి కలుపుగోలు మనిషండీ! మాట తక్కువ కానీ చేత ఎక్కువ. ఆ కాసేపట్లో,  మాట్లాడుతూనే, నేను వంట కోసం పెట్టుకున్న చిక్కుడుకాయలు వలిచేసింది. కొబ్బరి తురిమేసింది. వారించినా వినలేదు. ‘చేతులు ఖాళీగానే ఉన్నాయి కదండీ’ అంది. వాళ్ళ ఇంటి పంటట. బోలెడు కూరగాయలు, ఆకు కూరలు తెచ్చారు.” చెప్పింది రాధ, వాళ్ళు వెళ్ళిపోయాక.

“చెప్పానా…ఉట్టి డబ్బుమనిషి అని. ఎవరయినా పళ్ళు తెస్తారు. స్వీట్స్ తెస్తారు. వీళ్ళ లాగా ఇంట్లోవి తెస్తారా?” మనసులో ఉన్న  మాట అనేశాను.

“తప్పేముంది నాన్నా? పళ్ళు, స్వీట్స్ దొరుకుతాయి కానీ, ఇంత తాజా వెజిటబుల్స్ మార్కెట్ లో దొరుకుతాయా?” ఎర్రటి క్యారెట్ ని నములుతూ తన గదిలోకెళ్ళిపోయింది స్రవంతి.

“స్వీట్లు  కూడా తెచ్చారండీ వాళ్ళు. ఆవిడ రెండు  చిన్న కుటీర పరిశ్రమలు నడుపుతారట. ఒకటి స్వగృహ ఫుడ్స్, మరోటేమో మగ్గం వర్క్స్ చేయించి,  డిజైనర్ దుస్తులు కుట్టించి అమ్మే బొతీక్. పాతిక మంది పనివాళ్ళు ఉన్నారట.” కమ్మని నెయ్యి వాసన వస్తున్న బొబ్బట్టును పళ్ళెంలో పెట్టిచ్చింది నాకు రాధ. నేను తీసుకోలేదు.

“హు…తెలిసిందా….వాడొక్కడే కాదు, వెధవ డబ్బు కోసం   భార్యని కూడా కష్టపెడుతున్నాడన్నమాట! ఇంట్లో పెద్దవాళ్ళు, పిల్లలూ ఉంటే…పగలూ, రాత్రీ లేకుండా మొగుడూ పెళ్ళాలు సంపాదనలో పడితే, అమ్మో…మనమ్మాయిని ఇచ్చామంటే ఎంత కష్టం?” అనేసి వెళ్ళిపోయాను.

డబ్బే జీవితం అనుకునే వాళ్ళు నాకసలు నచ్చరు. మనం సృష్టించుకున్న డబ్బు, మనని శాసించడం కరెక్ట్ కాదు. డబ్బు వల్ల వచ్చే పరువు, ప్రతిష్ట కృత్రిమం. శాశ్వతమయినవి మనవాళ్ళతో మనం గడిపే క్షణాలే! నేనెరిగిన మనోహర్ డబ్బునే శ్వాసిస్తాడు. వాడి ఆస్తిపాస్తుల గురించి నేనడగలేదు. వాడే మాటల మీద చెప్పాడు. ఒకప్రక్క బ్యాంకు ఉద్యోగం చేస్తూనే, పార్ట్ టైం జాబ్ లాగా కన్స్ట్రక్షన్ అడ్వైజర్ గా ఉండి ఇళ్ళూ, అపార్ట్మెంట్స్ కట్టిస్తాడట. ఈ మధ్య కాలంలో పారితోషికానికి బదులుగా ఓ ఫ్లాట్ ని ఇమ్మని అడుగుతున్నానని చెప్పాడు. .

ఏతా,వాతా అస్సలు మార్పులేని వాడి వైఖరి నాకు నచ్చలేదు. రాధకి దమయంతి నచ్చింది. స్పూర్తికి మనోహర్ కలివిడితనం నచ్చింది. స్రవంతికి ఎవరు నచ్చారో నేనడగలేదు. అది నాకు చెప్పనూ లేదు.

***

“సరేరా..ప్రసాద్! బై! వెళ్ళొస్తా! అయితే…ఒకటి… నేను డబ్బే సర్వస్వంగా బ్రతికే స్వార్ధపరుడిని అన్నావు చూడు. ఈ  నీ అభిప్రాయం తప్పు. మనలో ఉన్న శక్తెంతో , అర్హత ఏమిటో తెలుసుకొని అది పెంచుకుని ఎదుగుతే తప్పెలా అవుతుంది?చూడూ…సంపాదించడం తప్పు కాదు. అక్రమ సంపాదన తప్పు. వ్యాపారం తప్పు కాదు. ఆ పేరుతో మోసం చేసి దోచుకోవడం తప్పు. నేను డబ్బును ఆర్జించడమే కాదు, ఖర్చు కూడా సక్రమంగా పెడతాను. సంపాదించడంలో నాకు ఆనందం లభిస్తుంది. భవన నిర్మాణం లో  అనవసర ఖర్చులు తగ్గించి, మరింత నైపుణ్యత తో కట్టించి ఇచ్చి యజమానికి లక్షల ఖర్చుని మిగిల్చి, నేను వేలల్లో ఫీజు తీసుకోవడం తప్పెలా అవుతుందిరా?”  చాలా నొచ్చుకున్నాడు మనోహర్.

గత ఆదివారం మా ఇంటికి వచ్చి వెళ్ళాక, నాలుగు రోజులాగి నాకు ఫోన్ చేశాడు మనోహర్. మాకు ఇష్టమైతే, మాతో సంబంధం కలుపుకోవాలని ఉందని, స్రవంతి వాళ్ళ అబ్బాయికి నచ్చిందనీ చెప్పాడు. ఇంట్లో వాళ్ళ ముందు మాట్లాడడం నాకు ఇష్టం లేదు. అందుకని వాడిని మెయిన్ రోడ్ లో ఉన్న హోటల్ కి రమ్మన్నాను. మేము కలిశాక, నిర్మొహమాటంగా చెప్పేశాను.

“ డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆత్మీయులతో గడిపే సమయాన్ని. డబ్బు వైద్యాన్ని అందించగలదేమో ఆరోగ్యాన్నివ్వలేదు. పరిచయస్తులనివ్వగలదు, స్నేహితుల్నివ్వదు. ఈ సంపాదన మోజులో పడి ఎన్ని కోల్పోతామో! నిన్నే చూడు. ఇంట్లో పెద్దవాళ్ళని వదిలి, నువ్వూ మీ ఆవిడా డబ్బు వెంట పడుతున్నారా లేదా? ఏం చేసుకుంటావురా మనోహర్ అంత డబ్బుని? ఒకటికి ఏడు ఫ్లాట్లున్నాయన్నావు. స్థలాలు కొన్నావు. అరే!  నువ్వు బ్రతకడానికి కావాల్సింది ఎంత? ఒక్క ఇల్లు. అంతేనా? చిన్నప్పటి నుంచీ డబ్బు వెనకాలే పడుతున్నావు. నీకంటూ తీరికగా ఓ పుస్తకం చదవడమో, సినిమా చూడడమో ఉందా అసలు? పెళ్ళాన్నీ తిప్పలు పెడుతున్నావు. రేపు నా పిల్లనీ మనీ మిషన్ గా మార్చేస్తావేమో! వద్దురా….ఏమీ అనుకోకిలా అన్నానని.” ఈ నా మాటలకే వాడలా అన్నాడు. లేచి నిల్చున్నాడు.

“ఓకే రా…పర్లేదు. కలుద్దాం. చెప్పడం మర్చిపోయాను. అమ్మ నిన్ను అడిగినట్లు చెప్పమంది. స్వగృహ ఫుడ్స్ నడిపేది అమ్మే! నాన్న దగ్గరుండి ఎకరాన్నర భూమిలో ఆర్గానిక్ కూరల సేద్యం చేయిస్తారు. అయితే, ప్రసాదూ  అది నా ప్రోద్బలం వల్ల మాత్రం  కాదు సుమా! అక్కడే పది ఆవులతో గోశాల కూడా ఉంది. పాలిచ్చే ఆవులు కావవి. వట్టిపోయి, కబేళాకి తీసుకు పోతూంటే డబ్బిచ్చి కొన్నాను.  ‘ఇంట్లో ఊరికే ఉండి ఏం చేయను? నేనూ ఏదో ఒకటి చేస్తాన’న్నది దమయంతి. తనకిష్టమైన పని చేస్తూ, చేయిస్తూంది.

డబ్బు కేవలం దాచుకోవడానికీ, ఖర్చు పెట్టడానికే కాదురా! సమాజసేవ చేయాలంటే కూడా డబ్బే అవసరం. పదిమంది పేదలకి చదువు చెప్పించాలన్నా, నలుగురికి ఉపాధి కల్పించాలన్నా డబ్బున్నవాడేగా చేయగలడు? డబ్బున్న వాళ్ళని ద్వేషించడం అనేది తరతరాలుగా చాలా మందిలో ఉన్న జాడ్యం. వాళ్లకి డబ్బు చేదు కాదు. డబ్బున్నవాళ్ళు చేదు. చెడిపోతేనే ధనవంతులవుతారని వాళ్ళ నమ్మకం. ఏం చేస్తాం? అందర్నీ మార్చే అవసరం నాకేం లేదు. సోమరిపోతులా బ్రతకవద్దనేవాడు మా  నాన్న. సమయాన్ని డబ్బుగా మార్చుకోవడం నేర్పాడు. పరుల మీద ఆధారపడకుండా నిజాయితీ తో  బ్రతకాలన్నాడు. నాకది నచ్చింది. నా వాళ్ళకీ నచ్చింది. అయినా నాకెంత కావాల్రా? ఇంకేం కావాలసలు? అమ్మా నాన్నల అండ దండలున్నాయి. అందమైన కుటుంబం ఉంది. ఆరోగ్యం ఉంది. నలుగురికీ మంచి చేయాలనే తపనుంది. నా దారి నాకు బాగుంది. …ఓకే రా…! నెవర్ మైండ్. విష్ యువర్ డాటర్ అల్ ది బెస్ట్. వీలున్నప్పుడు అందర్నీ తీసుకురా…అమ్మానాన్నా సంతోషిస్తారు.” చేయి కలిపి లేచాడు మనోహర్.  రెండు కప్పుల కాఫీకి నలభై రూపాయలకి బదులు, వంద నోటు వెయిటర్ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. మరో కప్పు కాఫీ త్రాగి నేనూ బయల్దేరాను.

*****

రాత్రంతా ఆలోచించాను. మనోహర్  మాటలే మననం చేసుకుంటూ ఉన్నాను. నిర్ణయం తీసుకున్నాకగానీ నిద్ర పట్టలేదు.

తెల్లవారింది.

“ఏం తల్లీ…నీకు సారంగపాణి నచ్చాడా? ముందుకు వెళ్దామా?” నా నుంచీ ఈ ప్రశ్న ఊహించలేదేమో, స్రవంతి బుగ్గలు ఎరుపెక్కాయి. కళ్ళు మెరిశాయి.

“మీ ఇష్టం నాన్నా!” రాధ వెనక్కి చేరి నెమ్మదిగా అంది.

“అక్కా…నేను చెప్పలేదూ…’నాన్న ఒప్పుకుంటారే! డోంట్ వర్రీ అని.’ మా నాన్న బంగారు.”  నా భుజాల్ని చుట్టి అంది స్ఫూర్తి.

నా వాళ్ళ ముఖాల్లో సంతోషం కాక, నేను కోరుకునేది ఇంకేముంటుంది?

 

You may also like

2 comments

పి.వి.ఆర్.శివకుమార్ August 28, 2021 - 3:05 pm

చాలా బాగుంది కథ. కొత్త ఇతివృత్తం.
*వాళ్ళ కి డబ్బు చేదు కాదు – డబ్బున్న వాళ్ళు చేదు.
చెడిపోతేనే ధనవంతులవుతారని వాళ్ళ నమ్మకం.*
ఈ వాక్యాలు నిష్ఠుర సత్యాలు. బాగా చెప్పారు రచయిత్రి.
అభినందనలు పద్మలత గారూ!

Reply
కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి October 29, 2021 - 7:21 am

శ్రీమతి పద్మలత గారి కథ చాల బాగుంది. అభినందనలు.

Reply

Leave a Comment