Home కవితలు తూటావై మొలిచిన వాడా

తూటావై మొలిచిన వాడా

by Jwalitha Denchanala

తుపాకుల రాష్ట్రంలో
తూటావై మొలిచిన వాడా ప్రజానాయకుడా జోహార్
దార్శనికుడా జోహార్

సామాజిక తుట్టె పురుగులకు
రాజకీయ విషనాగులకు
శత్రువుగా అవతారమెత్తిన సవ్యసాచి ప్రజానాయకుడా జోహార్
నిలువెత్తు నిజాయితీపరుడా జోహార్

హక్కులు కావాలంటే పోరాడటం నేర్చుకోండని
ప్రతి అడుగులోనూ నిలబడటం నేర్చుకోండని
ప్రబోధించినవాడా జోహార్
ప్రజానాయకుడా జోహార్

భారత జనాభా ఉమ్మిలో
బ్రిటిష్ పాలకులు కొట్టుకుపోతారని స్వాతంత్ర్య స్ఫూర్తిని పూరించిన వాడా ప్రజానాయకుడా జోహార్
స్వాతంత్ర్య సమరయోధుడా జోహార్

బీసీలకు రిజర్వేషన్లు యాబైఏళ్ళకు ముందే
అందించిన ఘనుడా
బహుజన రాజకీయ ఉపాధ్యాయుడా
లోకనాయకుని అనుచరుడా జోహార్
ప్రజానాయకుడా జోహార్

విద్యలో మెట్రిక్య ఫలితాలు
అమ్మాయిల వివాహాలకు అడ్డుగోడకాగా ఆంగ్ల ఉత్తీర్ణత నిబంధనను రద్దుచేసినవాడా
ప్రజానాయకుడా జోహార్
మా పాలిటి బోధిసత్వుడా జోహార్

నిజం, నిగ్రహం, కరుణ
మూడు కళ్ళుగా నిలుపుకన్న త్రినేత్రుడా
క్రమశిక్షణ నిరాడంబరతా
నిలువెత్తు విగ్రహమైనవాడా
మచ్చలేని చంద్రుడా జోహార్
ప్రజానాయకుడా జోహార్

ఆస్తుల ఆశలేని నిస్వార్ధ పరుడా
అధికారుల సిఫార్సులను అడుగక
క్షురక వృత్తే ఘనమని చాటినవాడా
ప్రజానాయకుడా జోహార్
మానధనుడా జోహార్

బడుగుల కోసం కర్పూరమై కరిగిన
కర్పూరీ ఠాగూర్ జోహార్
మర్యాద లక్ష్మణరేఖను
కలనైనా దాటని
మహనీయుడా జోహార్
ప్రజానాయకుడా జోహార్

You may also like

Leave a Comment