Home కవితలు దిక్సూచి

దిక్సూచి

ఆత్మా ఇల్లూ ఒకటే

చూపునకు చిన్నగా వుంటాయి

లోన ఎంత విశాలమో

రెంటికీ చుట్టూ గోడలుంటాయి

గోడల్లో కిటికీలుంటాయి

బయటకు వెళ్ళడానికీ లోనికి రావడానికీ

దర్వాజాలుంటాయి

తలుపులు తలపులు

మూసుకుంటాయి తెరుచుకుంటాయి

గాలీ వేల్తురూ

కిటికీల గుండా ద్వారాల గుండా

వెంటిలేటర్ల ద్వారా

ఇంట్లోకి వస్తూ పోతూ వుంటాయి

సయ్యాటలాడతాయి సరసాలడతాయి

కొండకచో దాగుడుమూతలాడతాయి

నేనేమో ఇంట్లో కొంత బయట కొంత

కాలం గడిపేస్తూ వుంటాను

ఇల్లేమో స్థిరంగా నిలబడి

చోద్యం చూస్తుంది

ఆత్మే ఆలోచనల భారంతో

అనుభవాల వేదనలతో

నా అన్ని కదలికలకూ చేష్టలకూ

సాక్ష్యంగా బాసింపట్టు వేసుక్కూర్చుంటుంది

నేనేమో ఆత్మను దిక్సూచిగా

ప్రయాణం సాగిస్తూ వుంటాను

You may also like

2 comments

Piper2179 May 29, 2025 - 7:39 pm Reply
కొండూరి కాశీ విశ్వేశ్వరరావు May 30, 2025 - 10:15 am

వారాల ఆనంద్ గారు ఇల్లు మరియు ఆత్మ ఒక్కటే అని మీ నిర్వచనం మహా అద్భుతం. అభినందనలు🎉🎊
కొండుారి కాశీవి కాశీ విశ్వేశ్వరరావు, రచయిత

Reply

Leave a Comment