Home ఇంట‌ర్వ్యూలు దేశాన్ని ప్రేమించండి. భారతీయ ధర్మాన్ని కాపాడండి.

దేశాన్ని ప్రేమించండి. భారతీయ ధర్మాన్ని కాపాడండి.

by Aruna Dhulipala

– ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి

జ :    నమస్కారమండీ. తెలంగాణ లోని పాలమూరు ఒక  ప్రసిద్ధి పొందిన జిల్లా. జనమంతా కూలీల జిల్లా అంటారు. అక్కడినుండి బయలుదేరిన కూలీలంతా ఇటు నాగార్జున సాగరం నిర్మాణం వైపు, అటు భాక్రానంగల్ నిర్మాణం వైపు వరకు కూలీకి వెళ్లారని ప్రతీతి. కాబట్టి కష్టజీవుల జిల్లాగా దానికిపేరు. ఆ జిల్లాలోని పోలేపల్లి మా స్వగ్రామం. ఇప్పుడది రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్ మండలం కిందికి వస్తుంది. ఆ ఊళ్ళో నేను ఆగస్ట్ 3వ తేదీ 1946 వ సంవత్సరంలో జన్మించాను. మా అమ్మగారి పేరు ద్రౌపదమ్మ, నాన్నగారి పేరు కసిరెడ్డి మేఘారెడ్డి గారు. చుట్టూ చెట్టూ చేమలు, గుట్టలు. వ్యవసాయ జీవితం మాది.

జ:  మా నాన్నగారు వ్యవసాయ దారుడు అయినప్పటికీ ఆయనకు చిన్నప్పటినుండీ పద్యాలు చదవడం. మొల్ల రామాయణం అధ్యయనం చేయడం అలవాటుగా ఉండేది. మహాభాగవతంలో నారాయణ కవచం ఆయనకు కంఠస్థంగా ఉండేది. దాశరథి పద్యాలు కూడా నోటికి వచ్చేవి. రాకమచర్ల వేంకటదాసు యొక్క కీర్తనలు గొంతెత్తి పాడేవారు. ఊళ్లోని ఆంజనేయస్వామి దేవాలయం దగ్గర భజనలు చేసేవారు. కార్తీకమాసం ముప్పై రోజులు ముప్పై ఇండ్లల్లో రోజూ భజనలు జరిగేవి. మా వాకిలి చాలా పెద్దది. బతుకమ్మ పండుగ సందర్భంగా నూరు నుండి నూటా యాభై వరకు ఆడవాళ్లు మా ఇంటి ముందు బతుకమ్మ ఆడేవారు. ఈ విషయాలన్నీ చిన్నప్పుడు మేము విన్నాం.
            మా ఊళ్ళో ఏకోపాధ్యాయ పాఠశాల ఉండేది.ఆ పాఠశాలలో తెలుగు మాట్లాడడం సరిగా రాని వ్యక్తి ముస్లిముల కాలం నాటి ఒక పంతులు గారు ఉండేవారు. నిజాములు వాళ్లకు నచ్చిన ఎవరినో ఒకరిని మౌల్వీసాబ్ గా చేసేవారు. నేను దాదాపుగా 1950 ప్రాంతంలో ఆ పాఠశాలలో చేరాను.  పాఠశాల కూడా సరిగా లేదు. మా నాన్నగారు ఒక గుడిసె వేసి (సపారం అంటారు దాన్ని) దాంట్లో నలుగురు చదువుకునేలా ఏర్పాటుచేశారు. అది మా పశువుల కొట్టం పక్కనే ఉండేది. మా తమ్ముడు మోహన్ రెడ్డికి నాకు ఏడాదిన్నర వయసు తేడా ఉన్నప్పటికీ ఇద్దరము కలిసి అదే  పాఠశాలలో చదువుకున్నాం. (చదువు అయిపోయాక మా తమ్ముడు మిలిటరీలో చేరాడు) అక్కడినుండి 4, 5 తరగతుల వరకు మా మేనమామ ఊరు మాడుగులలో చదువుకున్నాం. 1946 నుండి 1952 వరకు బాల్యం అనుకుంటే 1952 నుండి 1957 వరకు నా ప్రాథమిక పాఠశాల చదువు కొనసాగింది. నారాయణరెడ్డి సార్, రఘుపతి రెడ్డి సార్ మా మనసులో ఇప్పటికీ నిలిచిపోయిన ఉపాధ్యాయులు. మేము మా మేనమామ గారి ఇంట్లో చదువుతుంటే రఘుపతి రెడ్డి గారు స్వయంగా ఇంటికి వచ్చి ఎట్లా చదువుతున్నారని అడిగే వాళ్ళు. ఆ కాలంలో ఉపాధ్యాయులు అంతటి ప్రేమ కలిగి ఉండేవాళ్ళు.

జ:     అప్పుడు ‘కల్వకుర్తి’ మాకు తాలూకా కేంద్రంగా ఉండేది. అక్కడ ఆరవతరగతి నుండి నేను 1963 వరకు, మా తమ్ముడు 1964 వరకు చదువుకున్నాం. 1963లో నా హెచ్ ఎస్ సి పూర్తి అయింది. మా ఊరి నుండి చెరుకూరు అనే ఊరికి నడిచి వెళ్లేవాళ్ళం. అక్కడికి ఒక సర్వీసు వచ్చేది. దాన్ని ‘అబ్దుల్ ఖాదర్ సర్వీస్’ అనేవాళ్ళు. అది కల్వకుర్తి మీదుగా హైద్రాబాదు కు వెళ్ళేది. ఆ సర్వీసులో వెళ్ళేవాళ్ళం. ఆరుకిలోల బియ్యం, మూడు కిలోల జొన్నలు, కందిపప్పు ఇంకా కొన్ని సరుకులను తీసుకొనిపోయి మా తమ్ముడు, నేను వంట చేసుకొని తినేవాళ్ళం. కల్వకుర్తి బస్టాండుకు దగ్గర్లో ఒక ముస్లింల ఇంట్లో నెలకు మూడు రూపాయల కిరాయితో ఒక గది తీసుకొని ఉన్నాం. అట్లా హెచ్ ఎస్ సి పూర్తి చేశాను.

ఆచార్య కసిరెడ్డిగారితో ముఖాముఖి గ్రహీత అరుణధూళిపాళ

జ:    నేను హెచ్ ఎస్ సి 1963లో పూర్తి చేసేటప్పటికి మా నాన్నగారికి 70 ఏళ్ళ వయస్సు. అందుకే తమ్ముళ్ళిద్దరినీ చదివిస్తూ నేను మాత్రం ఇంటి దగ్గర వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాను. అట్లా 1963 మార్చి నుండి మొదలు 1965 మే వరకు రెండేళ్లు ఇంటి దగ్గర వ్యవసాయం చేశాను. ఎలాగంటే మధ్యరాత్రి లేచి మోటగొట్టడంతో సహా వ్యవసాయంలో తెలియని పని, చేయని పని లేదన్నట్టుగా చేశాను. ఇట్లా వ్యవసాయం చేస్తున్నప్పుడే జానపదులకు బాగా దగ్గరయ్యాను. ఆ విధంగా జానపదుల ప్రభావం నా మీద పడింది. మోటకొట్టే పాటలు, పల్లెల జీవనం, పల్లెల పాటలు అన్నీ తెలిశాయి. అంతేగాక మా ఊళ్ళో ‘చిరుతల రామాయణం’ వేయాలని యువకులు అనుకున్నారు. అందులో నేను రాముని వేషం వేశాను. ఆ తర్వాత నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఆచార్య వేణు, మరొకరు ఈ చిరుతల రామాయణం మీద పి హెచ్ డి చేశారు. అందుకే వ్యవసాయం చేస్తున్నప్పుడే జానపదుల సాహిత్యం, పొడుపు కథలు, సామెతలు, గేయాలు, పల్లెల్లో చెప్పుకునే చిన్న చిన్న కథలు వీటన్నిటి ప్రభావం నా మీద ఉంది.

జ:     అదొక విచిత్రమైన విషయం. నేను హెచ్ ఎస్ సి లో ఉన్నప్పుడు యాదగిరి అని నా స్నేహితుడు పక్కరూములో ఉండేవాడు. గొప్ప మేధావి. వాళ్ళ ఊరు ఎల్లమ్మ రంగాపురం. అక్కడ ఆ కాలంలో పెద్ద లైబ్రరీ ఉండేది. అక్కడి నుండి పుస్తకాలు పట్టుకొచ్చేవాడు. నేను కూడా ఆ లైబ్రరీకి వెళ్ళేవాడిని. చెప్తే మీరు ఆశ్చర్య పోతారు. ఆ కాలంలో నేను చదివిన పుస్తకాలు డిటెక్టివ్ నవలలు. అందులో మిస్టరీతో కూడుకున్న ‘మాయామహి’ అని పదహారు సంపుటాల నవల, జగజ్జాణ అనే ఇరవై ఒక్క సంపుటాల నవల చదివాము. విశ్వప్రసాద్ అనే రచయిత రాసిన నవలలు..ఈ విధంగా వందలకొద్ది నవలలు చదివాము. ఆ తర్వాత ఇవి ‘డేంజర్ బార్డర్ పాకెట్ సైజు’ నవలలని వీటిని తిరస్కరించాం. ఇవి మనిషిని ఎక్కడికో తీసుకుపోతాయని అందరి భావన. కానీ మాకు మటుకు మానసిక వికాసానికి దోహదపడ్డాయి. అటు తర్వాత సాంఘిక నవలలు చదవడం జరిగింది. యద్ధనపూడి సులోచనా రాణి, ముప్పాళ రంగనాయకమ్మ , అరికెపూడి కౌసల్యాదేవి మొదలైన వారి నవలలు హెచ్ ఎస్ సి వరకే అందుబాటులో ఉన్నాయి కాబట్టి చదివాము. వ్యవసాయం చేస్తున్న సమయంలో రామాయణం (శేష రామాయణం అని గుర్తు) అమనగల్లు లైబ్రరీ నుండి తెచ్చి చదువుకున్నాం. అప్పుడే రచనలు చేయాలన్న ఆసక్తి కలిగింది. మా ఊళ్ళో పట్వారీ ( ఆయన మా దాయాదుల్లో ఒకడు ) వలన కొంత కష్టం, నష్టం అనుభవించిన వారిని గురించి విని కథలు రాసేవాడిని. అలాగే ఊళ్ళో జరిగిన సంఘటనల మీద కథలు, కథానికలు రాసేవాడిని. వ్యవసాయ జీవితంలో 44 రచనలు చేశాను. ఈ రచనల్లో ఇరవై, ముప్పై పేజీల నవలికలు కూడా ఉన్నాయి. భావుకత ఉంది కానీ భాషాజ్ఞానం ఎక్కువ లేకపోవడం వల్ల వాటి భాష అంత బాగుండదు. ఇంట్లో తయారు చేసుకున్న సిరాతో రాసేవాళ్ళం. ఆ రోజుల్లో ఏవీ దొరికేవి కావు. బియ్యాన్ని బాగా మాడబెట్టి దాంట్లో మసి వేసి పొత్రం పట్టి తిప్పితే ఇంకు తయారయ్యేది. మా నాన్నగారు చెప్పిన పద్ధతి ఇది. పాత కాగితాల్లో రాసుకున్నాను. రాసిన రచనలన్నీ అట్టకట్టి పెట్టుకున్నాను. కానీ ఎక్కడా తీయలేదు. అందులో భాష బాగాలేదని, పరిణతి లేని దశలో రాసినవని, డిటెక్టివ్ నవలల ప్రభావం ఉందని అనుకొని, అలనాడు గుణాఢ్యుడు కావ్యహోమం చేశారంటారు కదా! అట్లా నేను 1985 మార్చి 19వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ కావడానికి నాల్గు రోజుల ముందు కామారెడ్డిలో నేనున్న ఇంటిముందు వాటన్నిటినీ పెట్టి కావ్యహోమం చేశాను.

జ:     అదొక బాధాకరమైన సంఘటన. 1965 వ సంవత్సరంలో పంట వేశాము. ఎండాకాలంలో కత్తెర వడ్లు అని అంటారు. మాకు మూడు ఎకరాల్లో వరిచేను ఉంది. మాకు కుంటనీరే ఆధారం. చేను పొట్టకొచ్చింది అంటే గింజ పిండి పడుతుందన్నమాట. కొద్దిరోజులైతే కోత కోయడానికి వీలుగా అవుతుంది. అప్పుడు మా నాన్నగారు నాగు కట్టారు ( పైసలకు మిత్తి లాగా అన్నమాట ). దానివల్ల మేము అప్పు పడ్డాము. నాన్నగారి వయసు రీత్యా నేను , సక్రియా అనే పద్నాలుగేళ్ల  పిల్లవాడు కలిసి వ్యవసాయం చేసేవాళ్ళం. మా కుంట పొంగి పొర్లింది. వర్షం వస్తోంది. ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో మా పొలం ఉంటుంది. మధ్యలో ఉన్న అలుగు తెగ్గొడితే మా పొలం లోకి నీరు పారడం ఆగుతుంది. నేను పలుగు, పార పట్టుకొని వెళ్ళాను. మా అమ్మకు ఈ విషయం తెలిసి సక్రియాకు చెప్పడంతో ఆ అబ్బాయి వెనకాల వస్తున్నాడు. మా నాన్నగారు కొంతమందిని తీసుకొని బయలుదేరాడు. ఇవేవీ నాకు తెలియవు. వడివడిగా నడుస్తున్నాను. నేను వెళ్ళేటప్పటికే మూడెకరాల వరిపొలం మీద తెగిన కుంట నీళ్లు పారుతున్నాయి. దాంతో పాటు ఇసుక కూడా పొలంలో పడుతున్నది. నాకప్పుడు పంతొమ్మిదిన్నర ఏళ్ళు. ఆ బాధ తట్టుకోలేక జీవితం చాలిద్దామనుకొని ఆ కుంటలో దూకబోతుండగా వెనుక నుండి ఆ పిల్లవాడు ‘నేనొస్తా ఉండు’ అంటూ పరుగెత్తుకొని వచ్చాడు. ఇద్దరం ఒకళ్ళనొకళ్ళం పట్టుకొని స్పృహ తప్పిపోయేలా ఏడ్చాము. నేనక్కడే పడిపోయాను. మా నాన్నగారు పదిమందిని తీసుకొని వచ్చారు. కళ్ళముందే మూడెకరాల పంట నాశనం అవుతుంటే ఏ వ్యవసాయదారునికైనా గుండె ఎంత బాధగా ఉంటుందో చెప్పండి ( అప్పటి సంఘటన గుర్తుకు తెచ్చుకుంటూ ఆర్ద్రంగా ). అంటే దాదాపు అయిదారు పుట్ల పంట దెబ్బ తిన్నది. ఇది జరిగిన తర్వాత ఈ వ్యవసాయం వద్దని, పాలెం ఓరియెంటల్ కళాశాలలో చదివితే తెలుగు పండిట్ పోస్ట్ వస్తుందని తెలిసి పోదామని నిర్ణయించుకున్నాను. మా స్నేహితులు యాదగిరి, బి. వెంకట్ రెడ్డి, ఆనంతరాములుతో కలిసి పాలెం చేరుకొని ఫారాలు నింపి ఇచ్చాము. అట్లా అక్కడ డిప్ ఓ ఎల్ లో చేరాము.

జ:     అప్పుడు పాలెం కళాశాలలో తెలకపల్లి విశ్వనాథ శర్మగారని ఆ కళాశాల ప్రిన్సిపాల్ గొప్ప సంస్కృత పండితులు. మొదటి సంవత్సరం మధ్యలో పంతంగి చిన పుల్లయ్యగారని ( హైస్కూలులో తెలుగు పండితునిగా చేసేవారు ) ఆయన వచ్చి మా కళాశాలలో పద్యాలు చెబుతుండేవారు. ఆయన పద్యాలు పాడుతుంటే నేను పరవశించి పోయేవాడిని. మా స్నేహితులు రుక్నొద్దీన్, యాదగిరి, వెంకట్ రెడ్డి, అనంతరాములు మేమంతా ఒకే తాలూకాకు చెందినవాళ్ళం కాబట్టి ఒక జట్టుగా ఉండేవాళ్ళం. తర్వాత శ్రీ రంగాచార్య గారు మాకు గురువుగా వచ్చారు. ఆయన వచ్చిన తరువాత సాహిత్యం, కవులు, లోకం తెలిసింది. అంతవరకు గురువులు చెప్పింది మనసులోనికి తెచ్చుకోవడం తప్ప ఏమీ తెలియదు. ఎప్పుడు, ఏది, ఎక్కడ, ఎట్లా పుడుతుంది? సాహిత్యం ఎట్లా వికసిస్తుంది అనే విషయాలను ఆయన ద్వారానే తెలుసుకున్నాం.  చారిత్రక దృష్టి, సాంస్కృతిక దృష్టి ఆయన వల్లనే ఏర్పడ్డాయి.
           డిప్ ఓ ఎల్ చదువుతున్న కాలంలో వారానికి ఒకసారి ఉపన్యాసపోటీలు జరిగేవి. నేను ఒక కావ్యం ప్రిపేరై అరగంట మాట్లాడేవాడిని. దాంతో గొప్ప ఉపన్యాసకుడు వస్తున్నాడని అనుకునే పరిస్థితి ఏర్పడింది ( నవ్వుతూ ). కళాశాల చుట్టూ వర్ధమానపురం అని ఉంటుంది. మా గురువుగారు మమ్మల్ని తీసుకొని శాసనాలు ఎట్లా చదవాలో, ఎట్లా చూడాలో చెప్పారు. సాహస లక్షణాలు మాలో ఎక్కువగా ఉండేవి. దాదాపు మూడు కిలోమీటర్ల చెరువును రెండుసార్లు ఈదాము. స్నేహితులమందరం పాలెం నుండి శ్రీశైలం వరకు భజనలు చేస్తూ నడుచుకుంటూ పోయాము. ఈ సందర్భంలో ఆర్ ఎస్ ఎస్ తో పరిచయం ఏర్పడింది. సంఘ శాఖలు నడిచేవి. నేనొక్కడినే శాఖలకు వెళ్ళేవాడిని. అక్కడే బావి దగ్గర స్నానం చేసేవాడిని. ఈ సమయంలో భోజనానికి ఇబ్బంది ఏర్పడింది. రెండవ సంవత్సరంలో సుబ్బయ్యగారిని అడిగితే హాస్టల్లో సీటు ఇచ్చారు. పాలెం కళాశాల వెనుక వెంకటేశ్వర స్వామి గుడి ఉండేది. ఉదయమే లేచి శాఖకు పోయి బావిదగ్గర స్నానం చేసి, వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేవాడిని. అప్పుడే ‘వెంకటేశ్వరా’ అనే మకుటం పెట్టి పద్యాలు రాశాను. దీనికంటే ముందే ‘నవయుగాల బాట! నార్లమాట!’ అనే శతక ప్రభావంతో ‘బిడ్డ మదిని నమ్ము! రెడ్డి మాట!’ అనే మకుటం పెట్టి పద్యాలు రాశాను.
           పరీక్షలు జరుగుతున్న సమయంలో ఒక సంఘటన జరిగింది. అది చెప్పాలి మీకు. హాస్టల్ లో అన్ని గదులు లోపలికి ఉంటే నేనుండే గది బయటకు ఉండేది. ఒకసారి మా ప్రిన్సిపాల్ గారు వచ్చి తలుపు తట్టారు. ఆ టైమ్ లో నేను ‘వేయిపడగలు’ చదువుతున్నాను. అదిచూసి “పరీక్షలు పట్టుమని పదిహేను రోజులు లేవు. వేయిపడగలు చదువుతున్నావా?” అన్నారు. ‘మొత్తం సిలబస్ చదివాను సార్’ అన్నాను. “అయినా సరే మళ్లీ చదువు ఫస్ట్ క్లాస్ రావాలి. మన కళాశాలకు పేరు రావాలి” అన్నారు. వెంకటేశ్వర స్వామి దయ, గురువుల బోధ వల్ల యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకు వచ్చింది. ఇలాంటివెన్నో జ్ఞాపకాలు.

జ:     అప్పుడు పాలెం కళాశాలలో తెలకపల్లి విశ్వనాథ శర్మగారని ఆ కళాశాల ప్రిన్సిపాల్ గొప్ప సంస్కృత పండితులు. మొదటి సంవత్సరం మధ్యలో పంతంగి చిన పుల్లయ్యగారని ( హైస్కూలులో తెలుగు పండితునిగా చేసేవారు ) ఆయన వచ్చి మా కళాశాలలో పద్యాలు చెబుతుండేవారు. ఆయన పద్యాలు పాడుతుంటే నేను పరవశించి పోయేవాడిని. మా స్నేహితులు రుక్నొద్దీన్, యాదగిరి, వెంకట్ రెడ్డి, అనంతరాములు మేమంతా ఒకే తాలూకాకు చెందినవాళ్ళం కాబట్టి ఒక జట్టుగా ఉండేవాళ్ళం. తర్వాత శ్రీ రంగాచార్య గారు మాకు గురువుగా వచ్చారు. ఆయన వచ్చిన తరువాత సాహిత్యం, కవులు, లోకం తెలిసింది. అంతవరకు గురువులు చెప్పింది మనసులోనికి తెచ్చుకోవడం తప్ప ఏమీ తెలియదు. ఎప్పుడు, ఏది, ఎక్కడ, ఎట్లా పుడుతుంది? సాహిత్యం ఎట్లా వికసిస్తుంది అనే విషయాలను ఆయన ద్వారానే తెలుసుకున్నాం.  చారిత్రక దృష్టి, సాంస్కృతిక దృష్టి ఆయన వల్లనే ఏర్పడ్డాయి.
           డిప్ ఓ ఎల్ చదువుతున్న కాలంలో వారానికి ఒకసారి ఉపన్యాసపోటీలు జరిగేవి. నేను ఒక కావ్యం ప్రిపేరై అరగంట మాట్లాడేవాడిని. దాంతో గొప్ప ఉపన్యాసకుడు వస్తున్నాడని అనుకునే పరిస్థితి ఏర్పడింది ( నవ్వుతూ ). కళాశాల చుట్టూ వర్ధమానపురం అని ఉంటుంది. మా గురువుగారు మమ్మల్ని తీసుకొని శాసనాలు ఎట్లా చదవాలో, ఎట్లా చూడాలో చెప్పారు. సాహస లక్షణాలు మాలో ఎక్కువగా ఉండేవి. దాదాపు మూడు కిలోమీటర్ల చెరువును రెండుసార్లు ఈదాము. స్నేహితులమందరం పాలెం నుండి శ్రీశైలం వరకు భజనలు చేస్తూ నడుచుకుంటూ పోయాము. ఈ సందర్భంలో ఆర్ ఎస్ ఎస్ తో పరిచయం ఏర్పడింది. సంఘ శాఖలు నడిచేవి. నేనొక్కడినే శాఖలకు వెళ్ళేవాడిని. అక్కడే బావి దగ్గర స్నానం చేసేవాడిని. ఈ సమయంలో భోజనానికి ఇబ్బంది ఏర్పడింది. రెండవ సంవత్సరంలో సుబ్బయ్యగారిని అడిగితే హాస్టల్లో సీటు ఇచ్చారు. పాలెం కళాశాల వెనుక వెంకటేశ్వర స్వామి గుడి ఉండేది. ఉదయమే లేచి శాఖకు పోయి బావిదగ్గర స్నానం చేసి, వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేవాడిని. అప్పుడే ‘వెంకటేశ్వరా’ అనే మకుటం పెట్టి పద్యాలు రాశాను. దీనికంటే ముందే ‘నవయుగాల బాట! నార్లమాట!’ అనే శతక ప్రభావంతో ‘బిడ్డ మదిని నమ్ము! రెడ్డి మాట!’ అనే మకుటం పెట్టి పద్యాలు రాశాను.           పరీక్షలు జరుగుతున్న సమయంలో ఒక సంఘటన జరిగింది. అది చెప్పాలి మీకు. హాస్టల్ లో అన్ని గదులు లోపలికి ఉంటే నేనుండే గది బయటకు ఉండేది. ఒకసారి మా ప్రిన్సిపాల్ గారు వచ్చి తలుపు తట్టారు. ఆ టైమ్ లో నేను ‘వేయిపడగలు’ చదువుతున్నాను. అదిచూసి “పరీక్షలు పట్టుమని పదిహేను రోజులు లేవు. వేయిపడగలు చదువుతున్నావా?” అన్నారు. ‘మొత్తం సిలబస్ చదివాను సార్’ అన్నాను. “అయినా సరే మళ్లీ చదువు ఫస్ట్ క్లాస్ రావాలి. మన కళాశాలకు పేరు రావాలి” అన్నారు. వెంకటేశ్వర స్వామి దయ, గురువుల బోధ వల్ల యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకు వచ్చింది. ఇలాంటివెన్నో జ్ఞాపకాలు.

జ:   పరీక్షలు అయిపోయి ఇంటికి వచ్చాను. డిప్ ఓ ఎల్ మీద ఉద్యోగం వస్తుందని తెలిసి ఆ ప్రయత్నాలు మొదలుపెట్టాను. మా మిత్రులు బి ఓ ఎల్ చదవడానికి వెళ్లారు. నేను మా మేనమామ ఊరు మాడుగులకు వెళ్ళాను. అక్కడే రిజల్ట్స్ తెలిసి, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినట్లు తెలిసింది. అక్కడ హైస్కూలులో హెడ్ మాస్టర్ ‘రామ్ సింగ్’ గారు. ఊరి సర్పంచ్ రామలింగారెడ్డి గారు కూడా అక్కడే ఉన్నారు. మన ఊరి మేనల్లుడు ఇంత సాధించాడు. “మన ఊళ్లో తెలుగు పండిట్ లేడు కాబట్టి ఇతని సర్టిఫికెట్లు తెప్పించి ఆ ఉద్యోగం ఇద్దాం” అనుకున్నారు. ఆ ఊళ్ళో రాజకీయ నాయకుడు జైపాల్ రెడ్డి అప్పట్లో ‘ఆంధ్ర జనతా’ పత్రిక చూస్తున్నాడు. యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా ఉన్నాడు. ఆయన ద్వారా మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ కు చెప్పించి నాకు జూనియర్ తెలుగు పండితునిగా ఏ ట్రైనింగ్ లేకుండానే  నియమింప చేశారు. ఆరోజు జూన్ 11, 1967. మరుసటి నుండే పాఠాలు చెప్పుమన్నారు ఆర్డర్స్ రాకుండానే. ఆ తర్వాత 11 రోజులలో ఆర్ట్స్ కాలేజీకి వెళ్లి నా సర్టిఫికెట్లు తీసుకొని అధికారికంగా జూన్ 21, 1967 నుండి ఉద్యోగంలో చేరాను. నా మొట్టమొదటి జీతం 98 రూ.25 పైసలు. తర్వాత నాలుగైదు నెలల్లోనే పెరిగి 120 రూ. అయింది. ఏడు పీరియడ్లు ఉండేవి రోజూ. 11,12 తరగతులకు హిందీ చెప్పేవాళ్లు లేకపోతే హిందీ కూడా చెప్పాను.
          ఇక్కడ ఒక టర్నింగ్ పాయింట్ గురించి చెప్పాలి మీకు. నేను ఉద్యోగంలో చేరిన నాలుగైదు నెలలకు పాఠశాల తనిఖీ జరిగింది. కామేశ్వరీ దేవి అని గెజిటెడ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్. తరువాత డి ఇ ఓ అయినారు.
నేను నాల్గవ తరగతి క్లాసులో పాఠం చెబుతుండగా వచ్చి కూర్చున్నది. నేను ఆమె ముందు నాకున్న శబ్దశక్తి, ప్రౌఢశక్తి అంతా ఉపయోగించి (గట్టిగా నవ్వుతూ)50 నిమిషాలు పాఠం చెప్పాను. అప్పుడామె “నువ్వు పాఠం బాగా చెప్పావు. కానీ పిల్లల బుర్రల్లోకి ఒక్కముక్క కూడా పోలేదు. నువ్వు పాఠం చెప్పింది నాకు కానీ పిల్లలకు కాదు. నువ్వు పిల్లలతో ఆడుతూ పాడుతూ పాఠం చెప్తావని మీ హెడ్ మాస్టర్ చెప్పారు. నీకున్న జ్ఞానం అంతా నాకు తెలవాలని చెప్పావు” అన్నది. “పిల్లల స్థాయికి తగ్గి చెప్పాలా అమ్మా!” అన్నాను వినయంగా. అప్పుడామె “కాదు. ఆ పిల్లలను నీ మీదకు లాక్కొన్నట్లు చెప్పాలి. వినేవాళ్లు ఏ స్థాయి వారో దానికి తగినట్లు ఉండాలి కానీ నీ భాషాజ్ఞానం చూపించడం కాదు” అన్నది. అది ఎప్పటికీ మర్చిపోలేదు. 1967 నుండి 1973 వరకు ఆరు సంవత్సరాలు ఆ పాఠశాలలో పని చేశాను.

జ:  మాడుగుల పాఠశాల తర్వాత సెప్టెంబర్ 1, 1973 నుండి 1985 వరకు దాదాపు 12 సంవత్సరాలు నేను కామారెడ్డి డిగ్రీ కళాశాలలో మొదట జూనియర్ లెక్చరర్ గా, తర్వాత లెక్చరర్ గా పనిచేశాను. ఆ మధ్యకాలంలోనే ‘తెలుగు పొడుపు కథలు’ అనే అంశంపై పరిశోధన చేశాను. అసలు అది చేయాలని అనుకోలేదు. నాకు భారతీయ చరిత్ర మీద బాగా అభిమానం. కాబట్టి ఆ విషయాలను రాసుకొని ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాను. అపుడు శాఖాధ్యక్షులు బిరుదురాజు రామరాజు గారు. నేను అంతకుముందు పాఠశాలలో పనిచేసినప్పుడే పిల్లలతో, ఊరివాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెబుతుంటే ఐదారు వందల పొడుపు కథలు సేకరించి పెట్టాను. ఒకవేళ చారిత్రక కావ్యాల మీద పి హెచ్ డి కుదరక పోతే పొడుపుకథల గురించి అడగాలనుకున్నాను. రామరాజు గారికి జానపదం అంటే ఇష్టం. జానపదంలో  పొడుపుకథలు ఒక భాగమే కదా! ఫారంలో నేను ‘చారిత్రక కావ్యాలు-సమగ్ర పరిశీలన’ అని రాశాను. రామరాజుగారితో పాటు సినారె లాంటి పెద్దవాళ్ళున్నారు. “చారిత్రక కావ్యాలు అయిపోయింది కదా! నువ్వేం చేస్తావు” అన్నారు. అప్పటికే చారిత్రక కావ్యాల మీద పి హెచ్ డి చేసిన సీతా కళ్యాణి గారు తెలుగు శాఖలోనే ఉన్నారు. ‘వేరే దృక్పథంతో చేస్తాను’ అన్నాను. “ఆమె సమగ్రంగా చేసింది. నువ్వు ఇంకా ఏదైనా చేయి” అన్నారు. నా దగ్గర సిద్ధంగా ఉన్న రెండువందల పొడుపుకథలు చూపించాను. ఎన్ని ఉన్నాయని అడిగారు. ఐదారు వందలు ఉన్నాయన్నాను. వారు సంతృప్తి పడి ‘ఇదే ఇస్తున్నాం’ అన్నారు. అట్లా దానిమీద పరిశోధన చేయడం జరిగింది. అప్పటికే నేను రాసిన భగవద్గీత గేయకృతి, రెడ్డిమాట, గాంధీ తాత అనే పుస్తకాలు కూడా వారికి చూపించాను.
         ఇంటర్వ్యూ అయిపోగానే బయటకు వచ్చి నిలుచున్నాను. కాసేపటికి నారాయణరెడ్డి గారు వచ్చి నన్ను పిలిచి “ఇదిగో,  నేను వేసుకున్నాను. ఆర్డర్ ఇప్పుడు వస్తుంది. జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి పో” అన్నారు. అట్లా ఆయన నేతృత్వంలో 1982 లో పి హెచ్ డి డిగ్రీ పొందాను.  వీటిని తెలుసుకోవడం కోసం దేశమంతటా తిరిగాను. ముఖ్యంగా రాయలసీమ, తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా తిరిగాను. ఆ సమయంలో రామరాజు గారు తెలుగు జానపద సాహిత్యంలో పరిశోధన చేసినప్పుడు తొలి దశలో ఆయనకుఎన్ని అనుభవాలున్నాయో నాకూ అన్ని ఉన్నాయి. దాదాపు ఏడెనిమిది వేల పొడుపుకథలు సేకరించాను.


జ:    కామారెడ్డి బస్ స్టాప్ లో పొడుపు కథలను ‘గుజిలీ’ ప్రతుల మీద ( రఫ్ కాగితాల పైన ) ‘చమత్కారాల్, చమత్కారాల్’ అని అమ్మేవాళ్లు. ఐదారువందలు అట్లా సేకరించాను. తెలంగాణాలో కొన్ని జిల్లాలు తిరిగాను. రాజాపూర్ దగ్గర మల్లేపల్లి అని ఒక ఊరుంది. నా సహోద్యోగి నారాయణాచారి సొంత ఊరది. రాజాపూర్ లో బస్సు దిగి మూడు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. బస్టాండ్ లో దిగి నడుస్తున్నాను. ఉంటే నాతో పాటు నలుగురైదుగురు ఆడవాళ్లు, ఇద్దరు ముగ్గురు చిన్నపిల్లలు కూడా బస్సు దిగారు. వారు ఊరి నుండి వచ్చే బండికోసం ఎదురుచూస్తూ నేనెవరో ఎందుకొచ్చానో కనుక్కుని “ఊళ్ళోకి వెళ్ళి ఫలానాయన గురించి కనుక్కొని ఆ ఇంటికి వెళ్లి మా కోసం బండి పంపించుమని చెప్పుమన్నా”రు. నేను వెళ్లి వాళ్ళు చెప్పిన చోటికి వెళ్లేసరికి ఆడవాళ్ళ కోసం బండి ఏర్పాటు చేస్తున్నారు. ఊళ్ళో మా స్నేహితుడు లేడు. నేను ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే అక్కడ ఒక ‘కొలిమి దాటి’ ఉంది. అక్కడ కొంతమంది నాగళ్లు, కర్రు, కుండి ఇలాంటివి చేయించుకోవడం కోసం కూర్చొని ఉన్నారు. అక్కడ ఒకాయన నన్ను చూసి ‘ఎవరు నువ్వు’ అని అడిగాడు. తెలంగాణలో పొడుపు కథలను ‘తట్లు’ అంటారు. కొందరు సమస్యలు, సమీక్షలు అంటారు. పొడుపు కథల సేకరణకు వచ్చానని చెప్పాను. అవి ఎలా ఉంటాయి? అన్నాడు. నేను ఒక రెండు ‘తట్లు’ వేశాను. కొలిమి దగ్గర కూర్చొని ఉన్నాయన మరో రెండు వేశాడు. అక్కడి నుండి వెళ్తున్న పిల్లలను పిలిచాడు. వాళ్ళూ చెప్పారు. అందులో ఒక పిల్లవాడు మా అమ్మకు ఇవి చాలా వస్తాయని ఆమెను తీసుకురావడానికి వెళ్ళాడు. మీరు ఆశ్చర్యపోతారు. ఈ కొద్ది సమయంలో 84 పొడుపు కథలు సేకరించాను. ఈలోపు పోయిన బండి ఆడవాళ్లను తీసుకొని వచ్చింది. వాళ్ళు నేను అక్కడే ఉండడం చూసి ఇంటికి పోయి ఒక అబ్బాయిని పంపించి నన్ను భోజనానికి రమ్మన్నారు. సంతోషంతో వాళ్లింటికి వెళ్ళాను. వాళ్ళు ఒక ఇరవై దాకా చెప్పారు. కొన్ని పదాలను కట్ చేస్తూ చెప్పారు. అశ్లీలాలు కావు కానీ శరీర భాగాలు. అట్లాంటివి కొన్ని ఉంటాయి పొడుపు కథల్లో. ఇదొక అపూర్వ అనుభవం.
            అక్కడక్కడ తెలిసిన మిత్రులు ఉంటే నేను వస్తున్నానని ఉత్తరాల ద్వారా తెలిపి, వెళ్లేవాడిని. ఘనపురంలో కొన్ని, మల్లేపల్లిలో ముఖ్యంగా స్కూల్ పిల్లల దగ్గర వాళ్ళ తల్లుల దగ్గర సేకరించినవి, ఇట్లా ఎన్నో. రాయలసీమలో ‘మారు తట్లు’, అంటారు.’మారు కథలు’ అని కూడా వ్యవహారంలో ఉంది. తంగిరాల వేంకట సుబ్బారావు అని తాను సేకరించినవి పంపారు. వీటన్నిటినీ దాదాపు 20 చాప్టర్లుగా విభజించుకున్నాను. మా హైస్కూలు గురువుగారు ముకురాల రామారెడ్డి గారు ‘దేవరకొండ దుర్గం’ అని పరమాద్భుత కావ్యం రాశారు. ఆయన ప్రభావం మాపైన చాలా ఉంది. ఆయన దగ్గరికి వెళ్లి, నేను తయారు చేసుకున్న పొడుపు కథల విశ్లేషణను చూపించాను. అది చూసి ఆయన “ఎప్పుడు కూడా తక్కువ చాప్టర్లలో ఎక్కువ విషయం ఉండాలి” అని చెప్పారు. ఆయన సూచనలను పాటిస్తూ 12 చాప్టర్లకు కుదించుకున్నాను. 850 పుటల పరిశోధనా గ్రంథం అయింది. సుదర్శన్ అని కామారెడ్డిలో నా స్నేహితుడు ఉన్నాడు. ఆయన, మరికొందరి సహాయంతో అచ్చువేశాను. కామరెడ్డిలోనే ఆవిష్కరించి ఆయనకే అంకితం ఇచ్చాను. సుదర్శన్ చాలా గొప్పవ్యక్తి. PWD శాఖలో ఇంజనీరుగా పని చేసేవాడు. దివిసీమలో ఉప్పెన వస్తే, ఆ ఉప్పెనలో మునిగిన దీన్ దయాళ్ పురం అనే ఊరు నిర్మాణానికి సెలవు పెట్టి వెళ్లినవాడు. నేను కూడా ఏడు రోజులు అక్కడికి వెళ్లి ఉన్నాను.

ఆచార్య కసిరెడ్డిగారు రచించిన పుస్తకములు

జ:   నేను పొడుపు కథల కోసం తిరుగుతున్న సమయంలో ఒక ఊళ్ళో జానపద గేయాలు పాడారు.
“పోతుంటిరా జాణ పోతుంటిరా/ చార్ కమాను కట్టమీద పోతుంటిరా/ ఒగణ్ణి పండవెట్టి, ఒగణ్ణి ఎండవెట్టి/ ఒగని కోసం నేను పోతుంటిరా…” ఇది ఒక పొడవు కథాగేయం. ఇందులో ఒకరిని పండవెట్టి, ఒకరిని ఎండవెట్టి అన్నప్పుడు ఒక ఉత్కంఠ కలుగుతుంది. పొడుపుకథ ముఖ్య లక్షణమే అది. దీని వెనుక ఉన్న అర్థమేమిటని ఆలోచింపజేస్తుంది. రోకలిని పండబెట్టి, ఒడ్లను ఎండబెట్టి కుదురు కోసం, కుందెన కోసం పోతున్నానని దీని అర్ధం. ఇట్లా పొడుపు కథలే కాకుండా జానపద గేయాలను కూడా సేకరణ చేయడం జరిగింది. అలా సేకరించిన జానపద గేయాలను “పాలమూరు జిల్లా జానపద గేయాలు” అనే పేరిట రెండు సంకలనాలు వేయడం జరిగింది. ఈ పర్యటనలో ఇది నాకు ఉపకరించిన అంశం. దీనివల్ల జానపద సాహిత్యంపై అధ్యయనం చేసే అవకాశం చిక్కింది.
           ఖిల్లా గణపురం ఊరికి మా చెల్లెలిని ఇచ్చాం. అందువల్ల ఆ ప్రాంతంలో ఎక్కువ సేకరణ చేయడం జరిగింది. పాలెంకు దగ్గరగా ఉన్న శ్రీపురంలో ‘పాపకల్లు’ అనే ఊరులో సేకరించాను. ఈ ప్రాంతంలో వారు రాసిన పాటలను రాసుకుంటే కొన్ని వ్యవసాయ గీతాలుగా, కొన్ని హాస్య గీతాలుగా లభించాయి. అందులో ఒక స్త్రీ పాడినట్టుగా ఒక వ్యక్తి ఒక పాట పాడాడు.
“నేను వోతున్న పెండ్లికి జివాల రంగ
సిగ బిళ్ళ లేదని మోట బిళ్ళ వెట్టుకొని..!!నేను వోతున్న!!”
జివాలు అంటే గొర్రెలు, మేకలు అంటే చిన్న జీవులు అని అర్థం. పెండ్లికి పోవాలంటే ఆమె దగ్గర సొమ్ములు లేవు.
“గెంటీలు లేవని సొప్ప బెండ్లు వెట్టుకొని, వడ్డాణం లేదని వరి అంటు సుట్టుకొని…!!నేను వోతున్న!!”
చిట్టచివర్లో ముగింపు ఎంత కదిలిస్తుందంటే దీన్నే ఆధునిక కవిత్వంలో ‘హైలైట్’ అంటాము. “సంక పిల్ల లేదని, కుక్కపిల్ల నెత్తుకొని”  !!నేను వోతున్న!!
సంతానం లేకపోవడం వలన కుక్కపిల్లను తీసుకొని పోతున్నాననడంలో ఆమె ఆవేదన వ్యక్తమవుతుంది.
దీన్ని ఎంత లోతుగా నైనా వివరించవచ్చు. చివరలో ఒక చురుకు లాంటిది, కొరడా దెబ్బ లాంటిది, సందేశం లాంటిది ఉంటుంది. అంటే ముగింపు అనేది హృదయాన్ని కదిలించాలి.
          అలాగే మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి ఒక పెద్దమనిషి నన్ను వాళ్ళ స్కూలులో జరిగిన కార్యక్రమానికి పిలిచారు. అక్కడ ఉపన్యసిస్తూ ఒక జానపద గేయాన్ని ఉదాహరించాను. ఆయన దాన్ని ముద్రించడానికి ఎంత ఖర్చవుతుందని నన్ను అడిగి ఆర్థిక సహాయం చేశారు. ఆ పుస్తకాన్ని ఆయనకే అంకితం ఇచ్చాను. అట్లా “పాలమూరు జిల్లా జానపద గేయాలు” , ఇద్దరు మిత్రుల సహకారంతో “రంగారెడ్డి జిల్లా జానపద గేయాలు” అచ్చు వేశాను. ఉన్నత పాఠశాలల, కళాశాలల లైబ్రరీలకు కూడా ఇచ్చాను. పొడుపు కథల పరిశోధనలో భాగంగా ఇదొక మంచి అవకాశం దక్కింది నాకు. ఆ తరువాత చాలా సంవత్సరాలకు నేను ‘నూరు కథలు’ అని  పుస్తకం వేశాను. అందులో ఆంజనేయునికి, విభీషణునికి సంబంధించిన కథలు ఉంటాయి.  జానపదుల ఆలోచనే వేరు. అపర వాల్మీకులు వాళ్ళు( నవ్వుతూ). అందుకే అంతగా నాతో ఆ సాహిత్యం పెనవేసుకుంది.

జ:    1983 చివర్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రెండు పోస్టులు ప్రకటించారు. ఒకటేమో ఖాళీ అయినటువంటిది. ఇంకొకటి నూతన నియామకం. రెండు వేర్వేరుగా పత్రికల్లో వచ్చాయి. రెండింటికీ అప్లై చేశాను. రెండింటి మధ్య తేడా ఎనిమిది నెలలు. కానీ రెండింటికి కలిపి ఒకేసారి ఇంటర్వ్యూ పెట్టారు. ఒక గమ్మత్తైన సంఘటన చెప్పాలి. నేను బస్సెక్కి నా బ్యాగు పైన పెట్టాను. దిగేటప్పుడు నా బ్యాగుతో పాటు పదిరూపాయల నోటు వచ్చింది. ఎవరిదని అడుగుదామంటే అప్పటికే దిగిపోయారు. నాతో పాటు ఉన్న నా స్నేహితుడు సుదర్శన్ అనుకోకుండా పదిరూపాయలు దొరికింది. నువ్వు ఇంటర్వ్యూలో తప్పక సెలెక్ట్ అవుతావు అన్నాడు (నవ్వుతూ).
         ఇంటర్వ్యూలో ఒక దాంట్లో నేను సెలెక్ట్ కాలేదు. ఇంకో పోస్టులో నా పేరు రెండవస్థానంలో ఉంది. అంటే మొదటి వ్యక్తి జాయిన్ కాకపోతే నాకు అవకాశం వస్తుంది. ఇంకా విచిత్రం ఆ మొదటి వ్యక్తి ఎవరో కాదు నా స్నేహితుడు రుక్నొద్దీన్. కానీ ఆ విషయం కూడా నాకు తెలియదు. ఆ సమయంలోనే మేము 20 రోజులు జానపద సెమినార్ నిర్వహిస్తున్నాము. అప్పుడు నేను, రుక్నొద్దీన్ తో ‘మీరు దేనికి సెలెక్ట్ అయ్యారు?’ అన్నాను. ‘దేనికేంటి?’ అన్నారాయన ఆశ్చర్యంగా. రెండు పోస్టులు కదా! ఒకటి రెగ్యులర్, రెండవది ప్లానింగ్ పోస్ట్ అన్నాను. “నాకు రెగ్యులర్ మాత్రమే తెలుసు. దానికే అప్లై చేశాను అన్నారాయన” కానీ ఆయనకు వచ్చింది రెండవ దాంట్లో. అంటే ఆయన దానికి కనీసం అప్లై కూడా చేయలేదు. ఎలా సెలెక్ట్ అవుతాడు? అందులోనే నాది రెండవ పేరు. నేను నేరుగా యూనివర్సిటీ లాయర్ బాబుల్ రెడ్డి గారిని కలిశాను. అక్కడ నారాయణ రెడ్డిగారనే మరో లాయర్ ఉన్నారు. ఆయన పర్వతరావు గారనే మరో లాయర్ దగ్గరకు తీసుకు వెళ్లారు. ఆయనకు విషయం వివరించాను. మరుసటి రోజుకల్లా ఆ పోస్టు పైన హైకోర్టు ‘స్టే’ ఇచ్చింది. ఎనిమిది నెలలు కేసు నడిచి నాకనుకూలంగా తీర్పు వచ్చింది. అప్లై చేసుకోని వ్యక్తి సెలెక్ట్ కావడమనేది టెక్నికల్ గా జరిగిన తప్పిదమే తప్ప ఎవరూ దీనికి కారణం కాదు. అట్లా నియమింపబడి 1985 మార్చి 19వ తేదీన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో అధ్యాపకునిగా చేరాను. 2006 వరకు దాదాపు 21 సంవత్సరాలు పని చేశాను. దీంట్లోనే రీడర్ గా, ప్రొఫెసర్ గా, తెలుగు శాఖ అధ్యక్షునిగా, బి ఓ ఎస్ అధ్యక్షునిగా పదవులు నిర్వహించాను.

జ:   నేను హిందీ నుండి తెలుగులోకి చేసిన అనువాదాల్లో ముఖ్యమైనది స్వాతంత్ర్య వీర సావర్కర్ జైలు చరిత్ర . ఆయన జైలులో ఉండి రాసుకున్నది. 1911 లో జైలుకు వెళ్లిన ఆయన 20 సంవత్సరాలు జైలులోనే మగ్గిపోయాడు. ఆ సందర్భంగా ఆయన రాసిన పుస్తకం మన దాశరథి జైలు గోడలమీద రాయడానికి ప్రేరణ నిచ్చింది. ఆయన జైలు గోడలమీద మరాఠీ భాషలో కవితలు రాసినాడు. జైలు నుండి వచ్చిన తర్వాత వాటన్నిటినీ కమల, గోమంతక్, సముద్ర్  అనే పేరిట కావ్యాలుగా వచ్చాయి. మరాఠీలో ఆయన అప్పటి బ్రిటిష్ చట్ట ప్రకారం ఆజన్మాంత శిక్ష 50 సంవత్సరాలు. అతనికి రెండు ఆజన్మాంత శిక్షలు విధించింది బ్రిటిష్ ప్రభుత్వం. వయసు 25 సంవత్సరాలు. అప్పుడాయన అన్నమాట. బ్రిటిష్ వారికి మా పునర్జన్మ సిద్ధాంతం మీద నమ్మకం ఉన్నట్టుంది అని. ఆయన జైలు జీవితం గురించి అనువాదం చేయడానికి నాకు జాగృతి పత్రిక సంపాదకులు వడ్లమూడి రామ్మోహన్ రావు గారు ప్రేరకులు. జైలులో వీర సావర్కర్ మరాఠీలో రాసుకున్న ‘మాఝీ జన్మ్ ఠేప్’ అనే పుస్తకం “అండమాన్ కా ప్రియ ప్రవాస్” అని హిందీలో 500 పేజీల అనువాదంగా వచ్చింది. దానికి నేను చేసిన తెలుగు అనువాదం ‘అండమాన్ లో ఆజన్మాంతం’ రచనను జాగృతి పత్రికలో వరుసగా రెండు సంవత్సరాలు సీరియల్ గా వేశారు. ఈ పుస్తకం రెండు సార్లు అచ్చయింది. వీర సావర్కర్ కాళ్లకు సంకెళ్లు వేసి బ్రిటిష్ వాళ్ళు ఆయనను పెట్టిన చిత్రహింసలు మామూలువి కావు. ఇలా దేశం కోసం నరకయాతనలు పడిన వారు ఎందరో ఉన్నారు. ఇలాంటి వాళ్ళ గురించి చెప్పాల్సి వచ్చినపుడు కరుణశ్రీ రాసిన “లాఠీ పోటులు పూల చెండ్లు చెరసాలల్ పెండ్లి వారిండ్లు ఏ/ కాఠిన్యంబైనన్ సుఖానుభవమే గాంధీ కళాశాలలో……” అనే పద్యాన్ని కోడ్ చేస్తుంటాను. అందరికీ దేశం మీద ప్రేమ, భక్తి కలగాలనే తాపత్రయం నాది.

జ:  అనువాద గ్రంథాలలో ముఖ్యంగా ‘భగవద్గీత’ ను ముత్యాలసరాలలో అధ్యాపకునిగా ఉన్నప్పుడు అనువాదం చేశాను. తరువాత శంకరాచార్యుల ‘భజగోవిందం’ అనువాదం చేస్తే అది నాలుగుసార్లు అచ్చయింది. ఎక్కడైనా ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు ఆది శంకరాచార్యుల వారి గురించి చెబుతుంటాను.
“బాలస్తావత్క్రీడా సక్తః
తరుణస్తావత్ తరుణీ సక్తః
వృద్ధస్తావచ్చిన్తా సక్తః
పరే బ్రాహ్మణి కో‌పి న సక్తః”
పిల్లలు ఆటలు, యువతీ యువకులు పరస్పరాకర్షణ, వృద్దులకు తమకు సంబంధించిన చింత ఉంటే ఆ పరబ్రహ్మాన్ని గురించి దృష్టి పెట్టేదెవరు? దేవుడిని, దేశాన్ని గురించి ఆలోచించేదెవరు? దేశం దైవంతో సమానం. కాబట్టి ఆ దేశాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనదే అని నా భావన. అది లేకుండా మన అస్తిత్వం లేదు కదా! ఎన్ని దురాగతాలు మన దేశంపై జరిగినా వాటన్నిటినీ తట్టుకొని నిలబడగలగడం మన సంస్కృతి గొప్పదనం వల్లే సాధ్యమైంది. అని ఇలా చెబుతూ ఉంటాను.
అలాగే ‘శ్రీరామ రక్షా స్తోత్రం’ గేయ రూపంలో అనువాదం చేశాను. అందులో ఉన్న ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క గేయంగా అనువదించాను. ఇవన్నీ పత్రికలో వచ్చాయి. ఇది ముఖ్యంగా ‘కోవిడ్’ ప్రారంభంలో వచ్చింది. అందరూ పారాయణ చేసి ఆ మహమ్మారిని దూరం చేయాలని చేశాను. హనుమాన్ చాలీసా చౌపాయి ఏ బాణీలో ఉందో అదే బాణీలో అనువాదం చేసి వ్యాఖ్యానం రాశాను. అది ‘శివానంద భారతి’ అనే పత్రికలో నలభై నెలలు వరుసగా వచ్చింది. దీనిని వీరపట్నం (ఇబ్రహీం పట్నం) ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఆ ఊరి వాళ్ళు అచ్చు వేశారు. ఇవి గాక వాజ్ పేయి గారు రచించిన హిందీ కవితల్ని కొన్ని గేయలుగా అనువదించాను. హిందీ వచన గ్రంథాల్ని కొన్నింటిని కూడా అనువాదం చేశాను. ‘Who are Aryans they?’ అనే ఇంగ్లీష్ పుస్తకాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం హిందీ శాఖలో పనిచేసే ప్రొఫెసర్ కె.ఎల్.వ్యాస్ గారు హిందీలోకి ‘ఆర్య్ కౌన్ థే?’ అనే పేరుతో అనువదించారు. దానిని నేను ‘ఆర్యులు ఎవరు?’ అనే పేరుతో తెలుగులోకి అనువదించాను. ఇతిహాస సంకలన సమితి వారు నాలుగైదు సార్లు అచ్చు వేశారు.ఇవి కాకుండా ‘చిటగాంగ్ వీరగాథ’ , ‘దారి తప్పిన పంజాబ్’ అనే వాటిని కూడా హిందీ నుండి తెలుగులోకి అనువాదం చేశాను.

జ:     నేను రచించిన గేయ సాహిత్యంలో ‘సింహగర్జన’ అనేది బాగా ప్రసిద్ధి చెందింది. అందులో దేశభక్తితో కూడిన గేయాలుంటాయి. ఎక్కువ ఖండగతిలో నడుస్తుంటాయి. విద్యార్థులకు చెప్పేటప్పుడు సులభంగా నేర్చుకునేలా ఉంటుందని ఖండగతిని గురించి చెప్పేవాడిని. త్రిస్ర గతి అనేది ‘తకిట తకిట తకిట’ అనే విధంగా నడుస్తుంది. దీనికి ఉదాహరణగా “నిన్ను గూర్చి పాడుకొందు/ నన్ను గూర్చి పాడుకొందు/ నిన్న నన్ను గన్న నేల గూర్చి పాడుకొందు” అంటూ నారాయణరెడ్డి గారు రాసిన గేయాన్ని ఉదహరించేవాడిని. చతురస్ర గతికి ‘సీతా రామా రామా సీతా’ ఇది ఎట్లా వేసుకున్నా సరిపోతుంది. దీనికి బసవరాజు అప్పారావు గారు రాసినటువంటి “నీలాలందం మేఘాలందం/ కలువల కన్నుల కాంతలు అందం/ అందాలన్నీ నీలో దాగి/ నాలో నాట్యం చేసేనే…. చివరి అక్షరం ‘నే’ అనేది పాడుతున్నప్పుడు దీర్ఘం తీయడం వల్ల నాలుగు మాత్రలై దానికొక అందం ఇస్తుంది. ఇలాంటివన్నీ పిల్లలకు వివరంగా చెప్పేవాడిని. ఇక మిశ్ర గతిని గురించి చెబితే ముత్యాలసరాలు మొత్తం మిశ్ర గతిలో నడుస్తుంది. ఉదాహరణకు “ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్” ఇందులో ‘ఒట్టి’ అనేది త్రిస్ర, ‘మాటలు’ చతురస్ర, ‘కట్టి’ త్రిస్ర, ‘పెట్టోయ్’ చతురస్ర..
          సాహిత్య రచనా శైలి అలవడడానికి వీటిని గురించి బాగా చెప్పేవాళ్ళం. నారాయణరెడ్డి గారు నాగార్జున సాగరం మొదలైనవి ఖండగతిలో ఉంటాయి.
వాటిని గురించి, అలాగే గజ్జెల మల్లారెడ్డి గారి ‘శంఖారావం’ దీనికి ఎక్కువగా నేను ఉదాహరించి చెప్తాను.
“స్వాతంత్ర్య గానాలు, స్వేచ్ఛా ప్రబోధాలు/ కవుల ఊహాలోక కమనీయ దృశ్యాలు……….
కను తెరచి వీక్షించరా….
ఈ నిజము కాదన్న వాడెవడురా”
పైన వాటిలో ఈ ‘రా’ అనేది రెండుసార్లు వచ్చింది. దానివల్ల ఆ రాగం తీయడంలో ఒక అందం ఏర్పడుతుంది. ఇది అయిదు మాత్రలుగా కొనసాగుతుంటుంది.
       ఖండగతి అనేది అయిదు మాత్రల కాలం. త్రిస్ర, చతురస్ర, ఇవి రెండూ కలిసి మిశ్రగతి. ఆ తరువాత ఖండగతి. ఇవి కాకుండా గిడుగు సీతాపతి గారు సంకీర్ణ గతి అని చెప్పారు. ఇందులో రెండు ఉండొచ్చు. అయిదు ఉండొచ్చు. అంటే నియమం లేదు. కలగాపులగంగా ఉంటుంది. ఇన్ని గతులు ఉండగా దేనికీ అందక ఒక రాగంలో నడుస్తూ ఉంటుంది. దాన్ని ఏమనాలి అనుకొని ఛందశ్శాస్త్రంలో పని చేసిన మేమంతా దాన్ని స్వరగతి అన్నాం. వేదం ‘స్వరగతి’లో ఉంటుంది. ఈ రాగాలను మనం సంకీర్తనల్లో చూస్తాం. ఆలాపన నడుస్తూనే ఉంటుంది. రఘురామయ్య గారు ఆలాపన చేస్తే చేంతాడంత ఉంటుందంటారు. దానికి ఇక్కడి వరకు అనే నియమం లేదు. సాహిత్య విద్యార్థులలో గేయాలను గురించి ఆలోచించేలా, రచనా శక్తిని ప్రోత్సహించేలా ఈ విషయాలు చెప్పడం జరిగేది. జానపద సాహిత్యంలో కూడా ఇవే గతులు ఉంటాయి

జ:   మంచిప్రశ్న. ఇంతకు ముందు మీకు చెప్పాను కదా! జానపద సాహిత్యంలో కూడా గతులు ఉంటాయని. కానీ రాగాలు భిన్నంగా ఉంటాయి. వాటిని బాణీలు అంటాం. దాన్ని కూడా ప్రత్యేకంగా ఏం చేశామంటే ఉదాహరణకు “నందామయా గురుడ నందామయా/ ఆనంద దేవికి నందామయా” ఇది పాతబాణీ. దీన్ని అనుసరించి “నందామయా గురుడ నందామయా/ రామ జన్మాభూమి చూద్దామయా” అని ఎవరైనా రాశారనుకోండి. దీనిని ‘అనువర్తిత జానపదం’ అనాలని జానపద సాహిత్య కారులు నిర్ణయించారు. విమర్శకులు దీనిని మొదట ‘నకిలీ జానపదం’ అన్నారు. నకిలీ జానపదం అంటే బాగుండదు కదా! ఎందుకంటే పొదుపు ఉద్యమం, కుటుంబ నియంత్రణ, వ్యాపార సంస్థలు ప్రచారం కోసం పెట్టుకున్నవి, ఇంకా ఎన్నో సమాజ పరమైన అంశాలు ఇవన్నీ జానపదాల్లో వస్తుంటే ఇట్లా అనడం సరికాదని వీటిని అప్లైడ్ ఫోక్ సాంగ్స్, అప్లైడ్ ఫోక్ పోయెట్రీ, అప్లైడ్ ఫోక్ లిటరేచర్ అని పేరు పెట్టారు. తెలుగులో దీనికి జానపద సాహిత్యకారులందరమూ వీటిని అనువర్తిత జానపద పాటలు , అనువర్తిత జానపద కవిత్వం, అనువర్తిత జానపద సాహిత్యం అని పేర్కొన్నాం. నేను కూడా ఈ పద్ధతులో కవిత్వం రాశాను. ప్రత్యేకంగా జానపద సాహిత్యం అని పుస్తకం వేయలేదు కానీ ఆయా సందర్భాలలో రాసినవి 60, 70 గేయాలవరకు ఉంటాయి. ఇట్లా సాహిత్య వికాసంలో పద్యం, గేయం, వచనం ఇవన్నీ వచ్చాయి.

జ:    ఉంది. మా అమ్మ పేరు ద్రౌపదమ్మ. మమ్మల్ని పెంచి పెద్ద చేసిన నడిపి పెద్దమ్మ శాంతమ్మ. మా తమ్ముని పుట్టుకలో మా పెద్దమ్మ నర్సమ్మ చనిపోయింది. అయితే నేను పుట్టిన సమయంలో చాలా బలహీనంగా ఉండి ‘బతకడు’ అనుకున్నారట. నాకు మూడు నెలల వయస్సులో ఏది తాగినా ఇమిడేది కాదట. అటువంటి పరిస్థితుల్లో మా నాన్నగారు చేసేది ఏమీ లేక గోమాతను నమ్ముకొని ఏది అవుతే అదవుతుందని, ఆవు నుండి అప్పుడే పితికిన చెంబెడు వేడి పాలను నా గొంతులో పోశారట. అది ఔషధంగా పనిచేసి బతికి బట్ట కట్టాను. అందుకే ముందు మా అమ్మ , ఆ తర్వాత గోమాత నాకు అమ్మ. ఆ తర్వాత నాకేదో గండం ఉందని ఎవరో చెప్పారని, సిరిసిన గండ్ల ఊరులో ‘గట్టు జాతర’ అని చేస్తారు. అక్కడ దేవాలయంలో రాముడు మా ఇలవేలుపు. ఆ సందర్భంలో ఆ గండం నుండి బయటపడడానికి నా చేత ‘గండదీపం’ మోయించి చుట్టు తిప్పారట. పెద్దయిన తర్వాత ఈ విషయాలు తెలిసి ‘గోరక్షణ’ శతకం, ‘సిరిసిన గండ్ల రామ’ శతకం రాశాను.


జ.  ఇది నా జీవితంలో సుదీర్ఘ ప్రస్థానమని చెప్పొచ్చు. అనేకమైన పత్రికలకు సంపాదకత్వం వహించాను. ఇప్పటికీ విరమించలేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు నేను రెండు, మూడు పత్రికలకు సంపాదకత్వం వహించాను. షాద్ నగర్ దగ్గర వెలసిన రామకోటి జపయజ్ఞ ఆశ్రమ నిర్వాహకులు నిత్య శుద్ధానంద గిరి స్వామి. ఆ ఆశ్రమం నుండి ‘గీతాజ్ఞాన యోగ సమాచార్’ అనే పత్రికను 1989 ప్రాంతంలో ప్రారంభించారు. స్వామి వారి ప్రేరణతో నేను 21 సంవత్సరాలు దానికి సంపాదకునిగా ఉన్నాను. అధ్యాపకునిగా ఉన్నప్పుడే ‘విశ్వహిందూ’ మాసపత్రికను చూసేవాడిని. గత 23 సంవత్సరాలుగా ఇప్పటికీ ఆ పత్రికకు సంపాదకునిగా ఉన్నాను. భాగ్య నగర్ లో గాంధీ ఆసుపత్రి వెనకాల ‘శివానందాశ్రమం’ వారు ‘శివానంద భారతి’ పేరుతో మాసపత్రికను నిర్వహిస్తున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అది నిరాఘాటంగా సాగుతోంది. దానికి ఇప్పటికీ సంపాదకునిగా కొనసాగుతున్నాను. ఒక్కో సందర్భంలో నాలుగైదు పత్రికలను కూడా చూశాను. ‘పుష్పగిరి భారతి’ అనే పత్రికకు నాలుగేళ్లు సంపాదకునిగా ఉన్నాను. ‘సాధన’ అనే మాస పత్రికకు ఐదేళ్లు సంపాదకునిగా ఉన్నాను. ‘ధర్మ సారథి’ అనే ఆధ్యాత్మిక మాస పత్రికను రెండేళ్లు చూశాను.

జ:     నేను పదవీ విరమణ చేసిన తరువాత రెండు సంవత్సరాలు తిరుపతి దేవస్థానంలో “హిందూ ధర్మ ప్రచార పరిషత్” కార్యదర్శిగా ఉండాల్సివచ్చింది. ఒకసారి ‘రమణీయ రామాయణం’ అనే పేరుతో దేవస్థానం వారు ప్రసంగాలు నిర్వహించారు. నేను, కోవెల సుప్రసన్నాచార్య గారు పాల్గొన్నాము. అంతకు మునుపు పరిషత్తుకు రాళ్లబండి కవితా ప్రసాద్ గారు కార్యదర్శిగా ఉన్నారు. అయితే ఈవో ఐ.వై.ఆర్ కృష్ణారావు గారు తేనీటికి పిలుస్తున్నారని మాకు పిలుపు వచ్చింది. నేను, సుప్రసన్నాచార్య గారు వెళ్ళాం. కృష్ణారావు గారు నాతో “కసిరెడ్డి గారూ! పదవీ విరమణ అయ్యాక ఏం చేస్తున్నారు? ఇక్కడ కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది వచ్చేయండి”. అన్నారు. “నేనిక్కడ తట్టుకొని నిలబడగలుగుతానా?” అన్నాను. “మేమంతా ఉండడం లేదా? మనకు అమ్మవారు, అయ్యగారు ఉన్నారు. వాళ్లు చేయమంటున్నారు. మేము చేస్తున్నాం.” అంటూ పద్మావతీ వేంకటేశ్వరుల చిత్రపటాలు చూపించారు. నవ్వుతూ అంగీకరించాను.20 రోజుల తర్వాత ఆర్డర్ పంపించారు. ఆయన కాలంలో ఆరు నెలలు, తర్వాత వచ్చిన ఎల్. వి. సుబ్రహ్మణ్యం గారి కాలంలో ఏడాదిన్నర చేశాను.
          అక్కడ ఉన్నప్పుడు ‘శుభప్రదం’ అనే పేరుతో బాలబాలికలకు ఉపయోగపడే పుస్తకం వేశాను. విద్యార్థులను మంచి వైపు నడిపించే శిక్షణ ఇవ్వడానికి ‘సదాచారం’ పేరుతో వేసిన పుస్తకంతో పాటు మొత్తం ఏడు పుస్తకాలు వేశాను. అన్నీ దేవస్థానం వారే వేశారు. ‘యుగయుగాల్లో హిందూ ధర్మం’ అనే దాన్ని మూడు లక్షల కాపీలు వేసి దేవస్థానం వారే అందరికీ పంచిపెట్టారు. అంతేకాక తరిగొండ వెంగమాంబ రచించిన ‘వేంకటాచల మాహాత్మ్యం’ మనందరికీ తెలుసు. పోతన స్థాయిలో ఉన్న అద్భుతమైన పద్యకావ్యమది. దాన్ని చాలా సరళంగా 48 పేజీల్లోకి మార్చి ‘పద్మావతీ శ్రీనివాస కల్యాణం’ అనే పేరుతో రాస్తే దాన్ని ప్రచురించారు. ‘నారాయణ వనం’ లో జరిగే బ్రహ్మోత్సవాలలో 30 వేల కాపీలు అచ్చు వేసి పంచారు. అట్లా మూడు సంవత్సరాలు పంచారు. అక్కడ ఉన్నన్ని రోజులు “జీవితంలో శక్తి తగ్గిపోయింది. రక్తి కొంత ఉంది. భక్తి ఉంది. ఇక్కడికి నన్ను రప్పించి ముక్తి ప్రసాదించావు భగవంతుడా!” అని స్వామికి స్తుతులు చేశాను. అందుకే ‘దాసోహం శ్రీనివాసస్య’ అని రాసుకున్నాను. శ్రీవారి భక్తులు అనే పేరిట 22 మంది భక్తులను వంద పేజీల పుస్తకం రాశాను. ఇట్లాంటి సాహిత్యాన్ని అక్కడ ఉన్నప్పుడే సృజించే అవకాశం లభించింది.

జ:    వ్యాసాశ్రమానికి సంబంధించిన ఒక ఆశ్రమం హైదరాబాద్ షాద్ నగర్ దగ్గర వెలసింది. దాని పేరు “రామకోటి జప యజ్ఞ ఆశ్రమం” దానికి నిత్య శుద్ధానంద గిరి స్వామి నిర్వాహకులుగా ఉన్నారు. వారి ప్రేరణతో అక్కడికి వెళ్ళాను. అప్పుడే ‘గీతా జ్ఞాన యోగ సమాచార్’ పత్రిక సంపాదకునిగా ఉన్నాను. 21 సంవత్సరాలు ఆ పత్రికకు సంపాదకీయాలు రాయడం, స్వామీజీ ఇచ్చిన ఉపన్యాసాలను వివరించి రాయడం ఇవన్నీ కలిపి ఆరేడు పుస్తకాలు వచ్చాయి. అందులో ఒకటి 650 పేజీల పెద్దపుస్తకం. నిజంగా గ్రేట్ వర్క్ అది. శ్రీ విష్ణు సహస్ర నామాలకు వ్యాఖ్యానం స్వామీజీ సూక్ష్మంగా చెప్పిన దానిని విశ్లేషించి రాశాను. అట్లాగే భగవద్గీత వ్యాఖ్యానం. ఆ తర్వాత గజేంద్ర మోక్షణం. ఇవన్నీ స్వామీజీ పేరిట వచ్చినవే. వాటన్నిటిలో నా పీఠిక ఉంటుంది. స్వామీజీ ఉపన్యాసాల్లో ఇవన్నీ కసిరెడ్డి గారే తయారు చేసేవారని చెబుతుండేవారు (నవ్వుతూ). వారి ప్రేమ అట్లాంటిది. ఆయన రెండేళ్ల క్రితం బ్రహ్మలీనమయ్యారు. అంతకు పూర్వమే నేను వారి జీవిత చరిత్రను దాదాపు 300 పేజీలు రాస్తే రెండుసార్లు అచ్చయింది. ఆయన బ్రహ్మలీనమయ్యాక ‘స్వామి నిత్యశుద్ధానంద – ప్రేమమూర్తి’ అనే మకుటంతో రాశాను. వారు ఉపన్యాసాల్లో చెప్పిన వాటిని ‘నిత్యశుద్ధానంద – నీతికథలు’ అనే పేరుతో 20 కథలను పుస్తకంగా వేశాను.
        ఇక్కడ ఒక విషయం చెప్పాలి. వేదాంత విజ్ఞానాన్ని జన జీవితంలోకి తీసుకొని పోవడానికి బ్రహ్మాండమైన కథలను జోడించి చెప్పినవారు.  స్వామి రామానంద తీర్థ. ఆయన వేదాంత తత్త్వంలో ఎన్నో నీతి కథలు వస్తాయి. అట్లాగే నిత్య శుద్ధానంద స్వామి వారు కూడా. ఆయన కూడా పురాణాల్లోనివి కావచ్చు, ఇతిహాసాల్లోనివి కావచ్చు, అంతకు ముందు ఎవరో చెప్పగా మనం విన్నవే కావచ్చు. వాటిని ప్రసంగాలలో చెప్పేవారు. వ్యాసాశ్రమ వ్యవస్థాపకులైన మళయాలస్వామి సాంప్రదాయం అది. మళయాల స్వామి తరువాత విమలానంద స్వామి, విద్యానంద స్వామి. ఈ పరంపరలో ఇప్పుడున్నవారు పరిశుద్ధానంద గిరి స్వామి వారు. వీళ్ళంతా చిన్న చిన్న కథలను ఆధ్యాత్మిక బోధనలో భాగంగా చెబుతూ ఉంటారు.   దాంతో గహనమైన ఆధ్యాత్మిక, తాత్త్విక విషయాలు కథల ద్వారా హాయిగా అర్థమవుతాయి. అట్లాగే శ్రీ జ్ఞానేశ్వరానంద గిరి స్వామి వారని ఆయనను అనుసరించినవారే. నేను ఆయన జీవితాన్ని గురించి “స్వామి జ్ఞానేశ్వరానంద – సాధుమూర్తి” అనే పేరుతో రాశాను. ఇట్లా స్వామీజీల ప్రసంగాలలో ఉండే తత్త్వాన్ని అనుసరించి ఉండే సూక్తులతో పుస్తకాలను వెలువరించాను. స్వామి శివానంద గారు హృషీకేశ్ లో మూడువేల ఎకరాల స్థలంలో ‘శివానంద నగర్’ నిర్మాణం చేశారు. అక్కడ ‘శివానందాశ్రమం’ ఉంటుంది. అక్కడ ఆధ్యాత్మికము, ఆది భౌతికము, సైన్సు, యోగ మొదలైన వాటితో బ్రహ్మాండమైన శిక్షణ ఇస్తారు. స్వామివారికి సంబంధించి ‘ఉపదేశం’, ‘జ్ఞాన గంగాలహరి’ లతో పాటు ఆయన చెప్పిన పిల్లల కథలు 22 కలిపి ‘శివానంద పిల్లల కథలు’ అనే పేరుతో మూడు పుస్తకాలు వేశాను. ఇవే కాకుండా కథా సాహిత్యంలో చిన్నకథ, పెద్ద సందేశాన్ని అందించాలనే సంకల్పంతో నేనప్పుడప్పుడు విన్నవి ‘నూరు చిన్న కథలు’ అనే పుస్తకం వేశాను. ఐదారుసార్లు అది అచ్చయింది. సాహితీ నికేతన్ అనే సంస్థ వాళ్ళు పదివేల పుస్తకాలను అచ్చు వేసి, ప్రైమరీ, హై స్కూల్ పిల్లలందరికీ అందేట్లు చేశారు.

ధన్యవాదాలు సార్ నమస్కారం. ఎంతో సమయాన్ని కేటాయించి, మీ జీవితాన్ని, మీ సాహిత్య, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సవివరంగా మా పాఠకులకు తెలియ జేసినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున కృతజ్ఞతలు.

శతాధిక గ్రంథకర్త, ద్విసహస్రాధిక వ్యాసకర్త, అష్ట సహస్రాధికోపన్యాసకర్త ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారి సాహితీ ప్రస్థానం ఇకముందు కూడా నిరంతరంగా ప్రవహించాలని కోరుకుంటూ సెలవు🙏

You may also like

1 comment

అరుణ April 2, 2024 - 11:52 am

చాలా మనోహరంగా వుంది

Reply

Leave a Comment