Home ఇంట‌ర్వ్యూలు ప్రాచీన సాహిత్యాన్ని – ఆధునిక సామాజిక కోణంలో దర్శించడం- నేటి అవసరం.

ప్రాచీన సాహిత్యాన్ని – ఆధునిక సామాజిక కోణంలో దర్శించడం- నేటి అవసరం.

శ్రీ పాలకుర్తి రామమూర్తి గారితో ముఖాముఖి గ్రహీత రంగరాజు పద్మజ

పద్మజ:- నమస్కారమండీ.
పాలకుర్తి రామ్మూర్తి గారు:- నమస్కారం అమ్మా.

పద్మజ:- మయూఖ పాఠకులకు మీ నేపథ్యం వివరిస్తారా?
రామ్మూర్తి గారు:- మా స్వగ్రామం కొడకండ్ల, ఉమ్మడి వరంగల్ జిల్లా.  మా నాన్న గారు శ్రీ పాలకుర్తి నరసింహ రామయ్య గారు. వారు ఈ ప్రాంతంలో కొడకండ్ల సిద్ధాంతిగా ఎంతో పేరు పొందిన వారు. అమ్మ శ్రీమతి సుభద్రమ్మ. మేము ఆరుగురం అన్నదమ్ములము, ముగ్గురు చెల్లెళ్లు. నా భార్య పేరు ఉమాదేవి. మాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి ఢిల్లీలో  ఉంటుంది. అల్లుడు ఢిల్లీ యూనివర్సిటీలో [Linguistics Department] అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. మా అబ్బాయి జర్మనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు.

పద్మజ:– మీ విద్యాభ్యాసం గురించి చెప్తారా?
రామమూర్తి గారు :— నా  ప్రాథమిక విద్యాభ్యాసం నల్లగొండ జిల్లాలోని అడ్డ గూడూరులో మా మేనమామ గారింట్లోనూ; PUC లాస్ట్ బ్యాచ్ మాది.. సిద్ధిపేటలోనూ, గణితం ఐచ్ఛికంగా గ్రాడ్యుయేషన్ (B. Sc.)   హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో చదివాను. ఉద్యోగం బెల్లంపల్లి ఏరియాలో సింగరేణి కాలరీస్ లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో దాదాపు 37 సంవత్సరాలు పనిచేసే రిటైర్ అయ్యాక ప్రస్తుతం భువనగిరిలో స్థిరపడ్డాను. మా పక్కనే మా తమ్ముడు ఉంటాడు.

పద్మజ:– సాహిత్యాభిరుచి ఎలా ఏర్పడింది? ఎలా కొనసాగుతోంది?
రామమూర్తి గారు:– చిన్నప్పుడు అమ్మ తెలుగు పద్యాలు నేర్పించేది. దాని వల్ల పద్యాలపై కొద్దిగా అభిమానం ఏర్పడింది. విద్యార్థి దశలో తెలుగు పాఠాలు బోధించిన ఉపాధ్యాయుల వల్ల సాహిత్యం చదవాలనే కోరిక కలిగింది. ఉద్యోగం చేసే సమయంలో సాహిత్య సమావేశాలకు వెళ్లడం, విరామసమయంలో పుస్తకాలు చదవడం వల్ల ఆ అభిరుచి నిలిచిపోయింది. కవి సమ్మేళనాలకు వెళ్ళడం వల్ల కవితలు ముఖ్యంగా పద్య కవిత్వాన్ని వ్రాయడం అలవడింది. బెల్లంపల్లిలో కొందరు సాహితీ మిత్రులు ప్రతి నెల కలుసుకోవడం.. సాహితీ చర్చలు చేయడం వల్ల నా అవగాహనను మెరుగుపరుచుకొనే అవకాశం వచ్చింది.

పద్మజ:– పుస్తకాల ప్రచురణకు ప్రేరణ ఎలా కలిగింది?
రామమూర్తి గారు:– చదివిన అంశంపై నాకు కలిగిన అవగాహనను సమాన హృదయులతో పంచుకోవాలనే భావన నా ఆలోచనలను పుస్తకస్తం చేయాలనే భావనకు బీజం వేసింది.

పద్మజ:–ఆధునిక సాంకేతికత ఆకాశాన్ని అంటుతున్న ఈ కాలంలో సాహిత్యం వల్ల ప్రయోజనం ఏమిటి? ముఖ్యంగా ఏ ప్రయోజనమూ లేని తెలుగు సాహిత్యాన్ని ఆధ్యయనం చేయడం దేనికి? ఇవి సాధారణంగా యువత  మనసును తొలుస్తున్న ప్రశ్నలు. దీనిపై మీ స్పందన ఏమిటి?
రామమూర్తి గారు:– నిజమే.. సాంకేతిక ప్రగతి వల్ల సంపద సృజింపబడుతుంది. ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. కాని వికాసం కలగడం సాహిత్యం వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. మీకు అర్థం అయ్యేందుకు.. ఒక కత్తిని తయారుచేసే సమయంలో సాంకేతికత.. ఆ కత్తిని ఎంత తక్కువ సమయంలో, ఎంత తక్కువ ఖర్చుతో, ఎంత నాణ్యంగా అందించ వచ్చో తెలియచేస్తుంది. కాని సాహిత్య ఆధ్యయనం వల్ల దానిని ఎంత సమర్ధవంతంగా ఉపయోగించుకోవచ్చో అవగహాన కుదురుతుంది. వ్యక్తిత్వ వికసన, శీల నిర్మాణం, ప్రాకృతితో మమేకమయ్యే లక్షణం, మానవ సంబంధాలు, వృత్తిలో విలువలు పాటించడం, సామాజిక పరిణతి ఇవన్నీ సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వల్ల మాత్రమే లభిస్తాయి. అయితే.. సాధారణంగా అధ్యయనం వల్ల విషయం అవగాహన పెరుగుతుంది.. కాని దానిని ఆచరణలో పెట్టిన వ్యక్తులను పండితులుగా వ్యవహరిస్తాము.. ఈనాటి సమాజానికి పండితుల అవసరం ఎంతో ఉన్నదని విశ్వసిస్తున్నాను.

పద్మజ:– పద్య సాహిత్యాన్ని చదివారు, వ్రాశారు.. మరి యాజమాన్య నిర్వహణపై దృష్టి పెట్టడానికి కారణం ఏమిటి?
రామమూర్తి గారు:– వివేకానంద సాహిత్యాన్ని చదివినప్పుడు యువత పట్ల వారి తపన కొద్దిగా అవగాహనకు వచ్చింది. బెల్లంపల్లిలో పలు సాహితీ సంస్థలకు కార్యదర్శిగా, అధ్యక్షునిగా పనిచేసాను. పలు కవి సమ్మేళనాలు, అవధానాలు ఏర్పాటు చేయడంతో పాటుగా పెద్దలను ఆహ్వానించి ఉపన్యాసాలను ఇప్పించడం జరిగేది. దాని వల్ల పెరిగిన అవగాహన సాహిత్యం నా వ్యక్తిగత ఆనందానికే కాదు సామాజిక బాధ్యతగా పలువురితో పంచుకోవాలనే భావన కలిగింది. శీల నిర్మాణం, వ్యక్తిత్వ వికసన లక్ష్యంగా నా రచనలు సాగేవి. పద్య సాహిత్యం కూడా అలాగే నడిచింది. తదుపరి కాలంలో సింగరేణి కమ్యునికేషన్ సెల్ విభాగంలో పనిచేయడం వల్ల యాజమాన్యానికి సంబంధించిన విధానాలను చదవడం.. పలువురు అధికారుల పనితీరును దగ్గరగా పరిశీలించడం జరిగింది. దానివల్ల నేను బాల్యంలో ఏం కోల్పోయానో అర్థం అయింది. దానికి తోడుగా కొందరు మిత్రులు ఆ అంశాలను చర్చచేసేందుకు.. యాజమాన్య నిర్వహణ, నాయకత్వ లక్షణాలు పెంచుకునేందుకు అవసరమైన పుస్తకాలు చదివేందుకు ప్రేరణనిచ్చారు. తోటి మిత్రులు ప్రోత్సాహం, మా కంపనీ అధికారుల ప్రోత్సాహం ఆ వైపు నడిచేందుకు కారణాలయ్యాయి. దానితో Management [వ్యక్తిత్వ వికాస] కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి పెట్టి, దాదాపు నాలుగు వందల పైగా పాఠశాలలలో; కాలేజీలలో ; ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మొదలైన వేదికల మీద వివిధ అంశాలపై మాట్లాడాను. ముఖ్యంగా యాజమాన్య నిర్వహణ [Managing skills] నాయకత్వ లక్షణాలు [Leadership qualities] మీద ప్రసంగించాను. ఆ సందర్భంలో అందరి మార్గంలో కాకుండా.. ప్రాచీన సాహిత్యాన్ని– ఆధునిక సమాజానికి అన్వయించడం ఎలా? అనే కోణంపై ఎక్కువగా దృష్టి పెట్టాను! ప్రాచీన సాహిత్యంలో మానవతా విలువలు, అందులోని నాయకత్వ లక్షణాలు, సంక్షోభాలు నిర్వహించుకోవడం, ముఖ్యంగా ఓటమి ఎదురైన సందర్భంలో ఎలా దానిని నిర్వహించుకోవాలి… అనే అంశాలపై యువతకు అవగాహన కల్పిస్తూ.. ప్రసంగించడమే కాకుండా దాదాపు 22 పుస్తకాలను ప్రచురించాను.

పద్మజ:– అంటే.. ఈనాటి యువత ఎదుర్కొనే అన్ని సమస్యలకు ప్రాచీన సాహిత్యం పరిష్కారాన్ని సూచిస్తుందంటారా…
రామమూర్తి గారు:– అలా అస్సలు అనుకోవద్దు.. ప్రాచీన సాహిత్యంలో ఆయా పాత్రలకు ఎదురైన విపత్కర సంఘటన లేదా సమస్య.. ఈనాడు అలాగే ఎదురుకాక పోవచ్చు కాని దానిని అధ్యయనం చేయడం ద్వారా మన ఆలోచనా సరళిలో ఒక క్రొత్త కోణం వెలుగుచూస్తుంది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందనే విశ్వాసం కలుగుతుంది. ఆ పరిష్కారమార్గాన్ని కనుగొనాలనే తపన క్రొత్త కోణంలో దృష్టి సారించేందుకు ప్రేరణనిస్తుంది. సాధారణంగా మనందరం పిల్లలకు మార్కులు ఎలా సాధించాలనే విషయం నేర్పిస్తాము.. ఎలా చదవాలో నేర్పిస్తాము.. గ్రేడ్ లు ఎలా సాధించాలో నేర్పిస్తాము.. కాని ఎలా ఆలోచించాలో నేర్పించము. ఆలోచించడం నేర్పిస్తే వారే పరిష్కారాన్ని కనుగొంటారు.. ఆ లాజిక్ ను చాలామందిమి మిస్ అవుతున్నాము..

పద్మజ:– ఆలోచించడం అనేది నేర్పించడం అవసరం అంటారా?
రామమూర్తి గారు:– అవును.. ఆలోచించడం నిజానికి రెండురకాలుగా ఉంటుంది. సమస్య ఎదురవగానే దాని నుండి పారిపోవడం లేదా ఎదుర్కోవడం చేస్తాము. అది మనలోని ప్రవృత్తి. ఎప్పుడైతే ఎదుర్కోవాలని అనుకుంటామో.. ఎలా ఎదుర్కోవాలి అనే ఆలోచన వస్తుంది. ఒక ఆలోచన సమస్య లోతులలోకి చూడమంటుంది.. మరొక ఆలోచన దాని పరిమితుల పరిధులకు బాహిరంగా ఆలోచించమంటుంది.. దానినే Out of Box thinking లేదా Lateral thinking అంటాము. మన ఆలోచనా పరిధిలో దీనికి ఇదే పరిష్కారం.. ఇంత కన్నా మరే పరిష్కారం లేదనే భావనను అధిగమిస్తేనే అంటే.. Limitations ను Dissolve చేస్తేనే ముందుకు సాగగలం.. అభ్యున్నతిని సాధించగలం… ఆ విధమైన ఆలోచనను చేయడం ఎలాగో పిల్లలకు నేర్పించాల్సిన అవసరం ఈనాడు ఎంతైనా ఉన్నది.

పద్మజ:– మీ వృత్తి బోధనా వృత్తి కాదు! గణిత శాస్త్ర సంబంధమైన చదువు చదివారు! అలాంటప్పుడు తెలుగు భాష పట్ల మీకు మక్కువ ఎలా కలిగింది? అది ప్రవృత్తిగా ఎలా నెరవేర్చుకోగలిగారు?
రామమూర్తి గారు:– బెల్లంపల్లిలో సాహిత్య సమూహాలు, సంస్థలు తక్కువగానే ఉన్నా, అలాంటి అభిరుచి కలిగిన మిత్రులతో చక్కని సాంగత్యం ఉండేది. అదే సాహిత్యాన్ని చర్చించడానికి ఉపకరించింది. ఎప్పుడైనా సకారాత్మకమైన మిత్రుల సాంగత్యంలో చర్చిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం లభించడమే కాక మన భావనను ఉన్నతీ కరించుకునేందుకు దోహదపడుతుంది. సింగరేణిలో మా మిత్రులు, అధికారులు నాకా అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా కమ్యునికేషన సెల్ లో పనిచేయడం వల్ల మేనేజ్మెంట్ కు సంబంధించిన అంశాలపై ఎక్కువ దృష్టి నిలిపి చదవాల్సిన అవసరం వచ్చింది. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుండి జనరల్ మేనేజర్ వరకు ఉన్న అధికారులు సమస్యల పరిష్కారాలలో అనుసరించే రకరకాల వ్యూహాలు, అధికారులు కార్మికుల మధ్య సమన్వయం చేసుకునే విధానంపై అవగాహన కుదిరింది. యాజమాన్యానికి కార్మికులకు మధ్య వారధిగా ఏర్పడిన సింగరేణి కమ్యూనికేషన్స్  ద్వారా మా బృందం దాదాపుగా 25 టెలిఫిలిమ్స్ చేసాము. సింగరేణి కమ్యూనికేషన్ సెల్ నిర్వహించిన ప్రతి ఆక్టివిటీలో పాల్గొనడం వల్ల అధికారుల పనితీరును దగ్గరగా చూడడం, పని విధానాలపై ఒక అవగాహన ఏర్పరచుకోవడం, సమస్యలు ఎలా వస్తాయో? అంచనా వేసి, వారెలా పని చేస్తున్నారు? మనం ఎలా చేయవచ్చు? అనే అవగాహన పెంచుకోవడం వల్ల ప్రత్యక్ష అనుభవం కలిగింది.

పద్మజ:– మీ జీవితం ఎదురైన అనుభవాన్ని పంచుకుంటారా?
రామమూర్తి గారు:– ఒకసారి యాజమాన్య – ఉద్యోగుల సంబంధాలు ఉత్పత్తి ఉత్పాదన సామర్ధ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో ఆచరణాత్మకమైన పరిశీలన చేయాలనిపించింది. మిత్రులు శ్రీ భాస్కర్ గారని ఒక IED ఇంజనీర్ తో ఆ ఆలోచను పంచుకున్నాను.. అతను, నేను కలసి మా జనరల్ మేనేజర్ గారితో చర్చించాము. వారు దానికి అవసరమైన అనుమతులను ఇవ్వడమే కాకుండా అవసరమైన సమాచారాన్ని ఇవ్వమని అన్ని గనుల శాఖాధిపతులను ఆదేశించారు. దానితో దాదాపు ఒక వేయి (1000) మందిని వివిధ స్థాయిలలో ఉన్న ఉద్యోగులను కలసి వారి అభిప్రాయాలను సేకరించి దానిని క్రోడీకరించి ఒక రిపోర్ట్ పంపించాము. దానినే “ఉత్పాదనా సామర్ధ్యంతో జీవించడం ఒక కళ” అనే నా పుస్తకంలో వాడుకున్నాను కూడా. అదొక ప్రత్యక్ష అనుభవం.

పద్మజ:– బాగున్నదండి.. మళ్ళీ వెనుకకు వస్తే.. మీరు చెప్పిన విషయాన్ని బట్టి సాహిత్య రూపంలో ఋషుల దార్శనికత సార్వకాలికమై.. వారి లక్ష్యం  నెరవేరినట్టే భావించవచ్చా?
రామమూర్తి గారు:– సాహిత్యం ఎప్పుడు సమకాలీనమే కాదు!  సార్వకాలికం కూడా… ఏ  ఇజంలో బంధించనంతవరకు స్టకప్ అవ్వదు. ఫెమినిజం, దళిత వాదం, కమ్యూనిజం లాంటి చట్రాలలో సాహిత్యం బంధీకానంతవరకు సాహిత్యం సార్వకాలికమవుతుంది. సర్వ జనీనమవుతుంది. అందరికీ పనికొస్తుంది.. అలాకాక ఇజాల పరిమితులకు లోబడినంత కాలం… దాని ప్రయోజనం పరిమితమే..

పద్మజ:– ఎంతో అభినందించదగ్గ మంచి ఆలోచన! ప్రాచీన సాహిత్యాన్ని- ఆధునిక కోణంలో చూడడమే… ప్రస్తుత కాలానికి కావలసిన అత్యంత ముఖ్యమైన విషయం. అయితే ఈ విషయాలను మీరు రచించిన పుస్తకాలకు ఇతిహాస, పురాణాలే తీసుకున్నారా? లేక ఉపనిషత్తులు మొదలైనవాటిని కూడా ఉదాహరించారా?
రామమూర్తి గారు:– నా పుస్తకాలలో అన్నింటినీ వాడుకున్నాను.. ప్రశ్నోపనిషత్తు.. మాండూక్యోపనిషత్తు.. కఠోపనిషత్తు.. శ్రీ సూక్తం, మేధా సూక్తం , అఘమర్షణ సూక్తం, అక్షీభ్యాం తే సూక్తం.. ఇలా అన్నింటిలోనూ చూడగలిగితే ఆధునిక దృక్కోణంలో మేనేజ్మెంట్ కు సంబంధించి, యాజమాన్య నిర్వహణ సంబంధించిన అంశాలు కనిపిస్తాయి. నేను నా పరిధిలో తాత్వికతను, ఆధునిక యాజమాన్యాన్ని .. రెండింటిని సమన్వయం చేసే ప్రయత్నం చేశాను! అందులో పూర్తిగా విజయం సాధించానని చెప్పలేను కానీ ప్రయత్నమైతే చేశాను!

పద్మజ:– ఏ యే ప్రక్రియలలో రచనలు చేసారు?
రామమూర్తి గారు :— అన్ని ప్రక్రియల్లోనూ పద్యం నాకు ఇష్టమైన ప్రక్రియ. చిన్నప్పుడు అర్థం కాకపోయినా పద్యాలు చదివేవాడిని. అలా చదువుతూ చదువుతూ పద్యం రాయడం అలవాటయింది. గంగావతరణం  అనే పద్య కావ్యం రాశాను. మీకు ముందే చెప్పినట్టు యువతకు గంగావతరణం ఎలా ప్రేరణ నిస్తుందనే దాని మీదే దృష్టి నిలిపాను. అలాగే… వ్యక్తిత్వం- విజయపధం అనే ఒక పుస్తకం రాశాను. ఆ ప్రక్రియ  పాఠకులకు ఎలా చేరాలనేది ఆలోచిస్తూంటే  గట్టు నారాయణ గురూజీ మంధని వారు బరోడాలో ఉంటారు. చాలా కంపెనీలకు ఆయన డైరెక్టర్, సీఈఓ గా కూడా పనిచేసారు. వారికి ఎక్సెల్ కంపెనీ ఉంది. వారు ఆఫరింగ్స్ [Offerings] అని 4 వాల్యూమ్ లు పుస్తకాలు రాశారు. రెండో వాల్యూం చదివినప్పుడు.. అది నాకు మార్గదర్శన చేసింది. వ్యక్తిత్వం- విజయపధం అనే పుస్తకం 1000 కాపీలు ముద్రణ చేసి .. ప్రతి విద్యా సంస్థకు నేను వెళ్ళినప్పుడు అక్కడ 10- 15 కాపీలు ఉచితంగా ఇచ్చి వచ్చేవాడిని. చాలా పుస్తకాలు అలా పంచాను. అలాగే వేదసంస్కృతి – వివాహ సంస్కారోద్దేశ్యం అనే పుస్తకాన్ని కూడా 1000 ప్రతులను ఉచితంగా పంచడం జరిగింది. విమర్శక వ్యాసాలు వ్రాసాను.. ఆధ్యాత్మిక వ్యాసాలు వ్రాశాను.

పద్మజ  :– ప్రత్యేకత అంటే ఏమిటో వివరిస్తారా?
రామమూర్తి గారు:— ఉదాహరణకు రుక్మిణి కళ్యాణం ఉంది. దానిలో రుక్మిణి నాయికా లక్షణాలు, ద్రౌపది గురించి రాసినప్పుడు ద్రౌపది అపూర్వమైన వ్యక్తిత్వం ఆమె గృహ నిర్వహణ బాధ్యత మొదలైనవి హైలైట్ చేసి రాశాను. అలాగే  భారతంలోని ఒక పద్యం చదివినప్పుడు ఆ పద్యం నేపథ్యంగా… “అత్యున్నత విజయ సాధన మార్గంలో ప్రభావవంతమైన ఏడు అలవాట్లు “[ seven  Habits to Elevate to the Heights of Ecstasy] అనే పుస్తకాన్ని రాశాను. ఆ పుస్తకం రాయడానికి నాకు ప్రేరణ కలిగించిన పద్యం ఇలా ఉంది.
” ఆలస్యంబొక యింత లేదు, శుచి ఆహారంబు, నిత్య క్రియా
జాలం బేమఱ, మర్చనీయు లతిథుల్, సత్యంబ పల్కంబడున్
మేలౌ శాంతియు , బ్రహ్మ చర్యమును నెమ్మిం దాల్తు మట్లౌట నె
క్కాలంబుం బటు మృత్యురోగ భయ శంకన్ బొందమే మెప్పుడున్ !”
( శ్రీమదాంధ్ర  మహా భారతము – ఎఱ్ఱన- అరణ్య పర్వం – చతుర్ధాశ్వాసము )
మార్కండేయుడు ధర్మరాజుకు చెప్పిన మాటలివి. జూదంలో ఓడిపోయి అడవులకు పోయి మనసు కకావికలమైన సందర్భంలో… ఆ పరిస్థితులను తట్టుకునేందుకు మరియు కాబోయే పరిపాలకుడుగాను, అవసరమొచ్చి ఋషుల దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. ధర్మరాజు మానసిక శాంతి కొరకు ఋషులు బోధించిన బోధనల వల్ల మనసు కుదుటపడ్డాక తాను కావాల్సిన నిర్ణయాలు తీసుకున్నాడు. అందుకే ” సాహిత్యం మానవులకు ఎలా ఉపయోగపడుతుందంటే మొదట మనసుకు  ప్రశాంతతనిస్తుంది, తరువాత కర్తవ్యాన్ని బోధిస్తుంది. తన మానసిక కుంగుబాటు నుండి కార్యోన్మఖుడు కావాలన్నదే.. ధర్మరాజు లక్ష్యం. తాను ఏం చేయాలన్నా దానికి మానసికంగా ప్రశాంతతను ఋషుల మాటల ద్వారా పొందాడు.

పద్మజ:– అలాగే మీరు రచించిన భారతీ స్తవం పుట్టుక నేపధ్యం వివరిస్తారా? అందులో మీకు నచ్చిన ఒక పద్యం ఉదహరించండి..
రామమూర్తి గారు :– భారతీస్తవం అనేది ముందుగా శతకం రాయాలనుకోలేదు కానీ రాస్తూ పోతే అది భారతీ స్తవంగా 100 పద్యాలుగా రూపుదిద్దుకున్నది.
” సంకల్పింతువొ వాసమున్ ధృత మహత్జ్ఞాన ప్రభా దీప్తవై
సంకాశోరు పరార్ధ తత్త్వ నిధి ప్రజ్ఞాపూర్ణ హిందూక్షితిన్
శంకింపన్ పనిలేదు తల్లి! యిట విశ్రామార్ధమై నిల్చినన్
యింకంటాక్సని, వెల్త్ టాక్సనుచు నిన్ వేదింతురో భారతీ!!
                భారతావని ఆధ్యాత్మిక తత్త్వనికి పెన్నిధి అనుకుంటూ.. జ్ఞానమనే ధనాన్ని తీసుకొని నీవు పొరపాటున కొద్దిసేపు ఇక్కడ విశ్రమిస్తావని అనుకున్నాగానీ నిన్ను ఇన్కమ్ టాక్స్ అని వెల్త్ టాక్స్ అని వేధిస్తారమ్మా! అని సామాజిక దృష్టిలో రాశాను. తర్వాత సాధారణ రచనలు కూడా ఉన్నాయి.

పద్మజ:– సరస్వతీ సన్నిధానం గురించి చెప్పండి!
రామమూర్తి గారు:–  సరస్వతీ సన్నిధానంలో సాహిత్య ప్రక్రియా రూపకం చేశాను. ఎలా అంటే సరస్వతి అమ్మవారి దగ్గర ఎనమండుగురు కవులు సాహిత్య గోష్టిని నిర్వహించినట్లుగా కల్పన చేశాను. ఒక్కో తరానికి ఇద్దరేసి కవులను తీసుకున్నాను. నన్నయ– తిక్కన; శ్రీనాథుడు– పోతన;  ప్రబంధ కవులలో పెద్దన గారిని — తెనాలి రామకృష్ణ కవిని ; వానమామలై వరదాచార్యులు-  జాషువాను ఎన్నుకొని, వారిచే భువనవిజయం వలె… నాలుగు ప్రక్రియల కింద రూపకం తయారు చేసాను.
1 – స్తుతి పద్యం [ ఒక్కొక్కరు ఒక్కొక్క స్తుతి]
2 – వారి వారి కావ్యాల నుండి వారి రచనలను నుండి పద్యాలు.
3 – తెలుగు నుండి- సంస్కృతం; సంస్కృతం- నుండి తెలుగులో పద్యాలు చెప్పాలని తయారు చేసాను.
4.వీటికి సామాజిక కోణంలో ఉపోద్ఘాతమిచ్చి రూపకం తయారుచేసి, నంది అవార్డు కోసం పంపాము.. కానీ ఎన్నుకోబడలేదు.

పద్మజ::– సాహిత్యం పట్ల మీకు అభిరుచి ఎలా ఏర్పడింది? అంటే  పండిత కుటుంబ నేపధ్యమా?  అనువంశక పాండిత్యమా? మీ స్వయంకృషే కారణమా?
రామమూర్తి గారు :– మా నాన్నగారు అమ్మ వారి ఉపాసకులు. తెలంగాణ ప్రాంతమంతా అమ్మవారి ఆరాధన అంటే ఆ కాలంలో చాలా భయపడేవారు. ఆ సమయంలో నాన్నగారు అందరికీ మంత్రోపదేశం చేసి ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చారు. సప్తశతి పారాయణలు కానీ హోమాలను బాగా జరిపించేవారు. లలితా సేవా సమితి అనే సంస్థ స్థాపించి, భక్తులు వారి ఇష్ట పూర్తిగా అమ్మవారి పూజ చేసుకుంటామన్న వారితో నెలనెలా పూజలు చేయించేవారు. ఆయన 70 సంవత్సరాలపైగా దేవీ నవరాత్రులు జరిపించారు. అలా నాన్న సాహిత్యం వైపు దృష్టి పెట్టలేదు… కానీ అమ్మవారి సంబంధిత పుస్తకాలు చాలానే రాశారు. దైవప్రతిష్టలు చేసేవారు. వాటి సంబంధిత పుస్తకాలు కూడా రచించారు.
         మా అమ్మ తండ్రి గారికి కూడా సాహిత్యంలో ప్రవేశం ఉండేది. దానికి తోడుగా బెల్లంపల్లిలో సత్యనారాయణ రాజు గారు అనేవారు ఉండేవారు. వారు నిత్య స్మరణీయులు. ముద్దురాజయ్య గారు ఆంగ్లభాషోపన్యాసకులుగా పదవి విరమణ చేశారు. వినోదరావు గారని ఒక మిత్రుడు ఉండేవారు. మేము నలుగురము సాహిత్య చర్చలు చేస్తూ రాయడం చదవడం చేసేవాళ్ళం. దానికి తోడుగా ఒక నాస్తిక సభకు వెళ్ళివచ్చాక ఆ సమావేశంలో ప్రసంగించిన ఒక వక్త ఉపన్యాసం విన్నాక  నిజాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసతో వైదిక సాహిత్యం చదవాల్సి వచ్చింది. దాని పర్యవసానంగా వేద సంస్కృతి- వివాహ సంస్కారోద్దేశ్యం అనే పుస్తకం వచ్చింది.

పద్మజ… మన సమాజంలో బాల్య వివాహాలు ఉండేవి కదా?…
రామమూర్తిగారు… అది ప్రాచీన కాలంలో లేదు.. మధ్యన వచ్చింది.. నిజానికి  నమ్మకం రెండు రకాలుగా పనిచేస్తుంది. ఒకటి నమ్మకాన్ని ఆశ్రయించుకొని లాజికల్ గా కాన్సెప్ట్ను అవగాహన చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి… రెండు  కొందరు నమ్మకాన్ని పట్టుకొని అలా వెళ్తారు. విశ్వాసం వికాసాన్నివ్వాలి కానీ మూఢత్వం పెంచకూడదు!  సరైన అవగాహనతో చర్చలు చేయాలి కానీ ఊరికే వాదన చేయకూడదు!  సమావేషాలలో బాల్యవివాహాలు కూడదని చెప్పేందుకు ఒక మంత్రం ఉదాహరిస్తాను.
 సోమోదదతు గంధర్వో- గంధర్వో దదదగ్నియే  అనే మంత్రం ఉంది. వివాహ సమయంలో పురోహితుడు అబ్బాయితో అమ్మాయికి చెప్పే మంత్రం అది, దాని అర్ధం ఏమిటంటే? ” సోముడు నీకు మొదట భర్తగా ఉండి తర్వాత నిన్ను గంధర్వుడికిచ్చాడు… గంధర్వుడు రెందవ భర్తగా ఉండి  తరువాత నిన్ను అగ్నికిచ్చాడు… నేను నాలుగో భర్తగా నిన్ను స్వీకరిస్తున్నాను” అని భావము. ముగ్గురు వదిలిపెట్టాక వరుడు ఆ వధువును వివాహం చేసుకున్నట్టుగా అర్థం చేసుకున్నారా నాస్తిక వాదులు…   నేను దానికి వివరణ ఈ విధంగా చెప్పాను.
” సోముడు అంటే బాలికలలో ఉండే హార్మోన్స్ కు ప్రతీక! అమ్మాయి రజో దర్శనానికి సోముడు సహకరించాలి.. చంద్రుడు భూప్రదక్షిణ చేయడానికి 28 1/2 రోజులు పడుతుంది. అమ్మాయిలకు ఒక రజస్వల నుండి మరో రజస్వల  కావడానికి మధ్యకాలం 28 రోజులు పడుతుంది. పదమూడు- పద్నాలుగు సంవత్సరాల వయసు వచ్చేసరికి అమ్మాయిలలో  ఒక వర్ఛస్సు  వస్తుంది. రూపము , తారుణ్యము, లావణ్యము అనే వర్చస్సు విశ్వావసు అనే గంధర్వుడు అమ్మాయిలకు ఇస్తాడని  వేదం చెప్తుంది. వయసు… వయసుతో పాటు పరిణితి, ముఖంలో అందం, ఆకర్షణ, తర్వాత గర్భం దాల్చేందుకు కావలసిన అగ్ని [Fertility]  రూపంలో ఇస్తాడు. ఈ దశలన్నీ పూర్తయితే గానీ అమ్మాయికి వివాహ యోగ్యత రాదు. అంటే పూర్తిగా స్త్రీగా రూపొదిద్దుకుంటుంది కన్య.
     ఇక్కడ మనం ఆలోచించాల్సిందేమిటి అంటే? బాల్యవివాహాలు (ఎనిమిది సంవత్సరాల) పెళ్లిళ్లు చేశారని, అష్టవర్షద్భావేత్  కన్య, అనేది తప్పుగా అన్వయించబడింది. నిజానికి అష్టవర్శాత్ భవేత్ కన్య.. నవవర్శాత్ రోహిణి… అంటుంది శ్లోకం.. ఎనిమిది సంవత్సరాల అమ్మాయిని కన్య అంటారు.. తొమ్మిది సంవత్సరాల అమ్మాయిని రోహిణి అంటారు. కన్య అని పెండ్లయిన వారిని కూడా సంబోధించే సంస్కృతి ఉన్నది. “కన్య నీవేడ రణరంగ గమన మేడ” అంటాడు కృష్ణుడు సత్యభామతో భాగవతంలో.. ఈ మంత్రాలను ఉదహరిస్తూనే బాల్య వివాహాలు కాల పరిణామములో వచ్చినవే కానీ, వేదకాలనాటి వధువు పూర్తిగా స్త్రీగా మారిన తర్వాతనే వివాహ అర్హత పొందేదని పలు సమావేశాలలో చెప్పాను. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ? వేదమంత్రాలలో ఉన్న మూల విషయం లేదా అంతరార్థం తెలియకపోతే ఈ యాంత్రికత చోటు చేసుకుంటుంది…
                 సాహిత్యం లోనారసి చూడవలసి ఉంటుంది. ప్రశ్నోపనిషత్తులో ఆరు ప్రశ్నలుంటాయి. వాటిని చదివినప్పుడు ఒక అవగాహన వస్తుంది. శంకరభాష్యంలోని భగవద్గీత మనం ఒక తీరుగా చదువుతాము. దానిలోని భావాన్ని అర్థం చేసుకుంటే మన జీవితానికి అన్వయించుకుంటాము. శంకర భాష్యం తాత్త్వికత కలిగి ఉంది. తాత్త్వికతనే కాకుండా జీవితానికి ఎలా  ఉపయోగపడుతుందని తెలిసికొని ఆచరణలో పెట్టాలి. ఉపనిషత్తులు కూడా అదే చెబుతుంది. మన ముందు రెండు మార్గాలు ఉన్నాయనీ, ఒకటి ప్రేయోమార్గం, రెండోది  శ్రేయో మార్గం ఉందని చెబుతుంది.
(ప్రేయస్సు= భౌతిక జీవనంలో అభివృద్ది) ప్రేయోమార్గంలో భౌతికంగా ప్రేయస్సు అంటే అభివృద్ధితో ఆగకుండా… అక్కడ నుండి పెరుగుదల ఉండాలి, పెరుగుదలతోనూ ఆగకూడదు! శ్రేయస్సు కావాలి ! శ్రేయస్సు దగ్గర కూడా ఆగకూడదు! అక్కడనుండి విజయాలు సాధించాలి! లేదా విజేత కావాలి!  
                  అభివృద్ధి అంటే నేను.. నా కోసం… సంపాదించుకోవడం, కూడబెట్టుకోవడం. అదే కాకుండా పెరుగుదల అంటే  నేనే కాదు! నా చుట్టూ ఉన్నవారికి కూడా కొంత నేను పంచాలి! వారిని ఉన్నతీకరించాలి! అని సమాజాన్ని చూసే  చూపులో దృష్టికోణం మార్చుకుంటే  మనకు అన్ని విధాలా కలిసి వస్తుంది. ఎందుకంటే నాకు సంపద ఉండి, నా చుట్టూ ఉన్నవారికి ఉంటేనే.. సమాజ ప్రగతి చేకూరుతుంది. ప్రాస్పరిటీ అంటే… నా దగ్గర ఉన్న దాన్ని సమాజంతో పంచుకుంటే .. సమాజంలో పేదరికం లేకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. సమాజం కోసం నా సమయాన్ని వెచ్చిస్తాను. ధనాన్ని వెచ్చిస్తాను.
                సమాజం లోనికి మనం ఎప్పుడైతే చొచ్చుకు వెడతామో? అదే ప్రాస్పారిటీ లేదా అభ్యున్నతి లేదా అభ్యుదయం. ఇక్కడే ఆగిపోతే కూడా పరిగణనలోనికి రాదు! ఇక్కడే సక్సెస్ లేదా విజయం చేకూరాలి… సమాజమే నేను- నేనే సమాజం! అంతా ఒకటే అనే భావన లోపలకి రాగలగాలి. (ఇది కమ్యూనిజానికి దగ్గరగా ఉంటుంది.)
                ఈ విజయం లోపల అందర్నీ కలుపుకోవాలి! లేదా చేర్చుకోవాలి! ఇంత ఉదాత్తమమైన భావన వేదమంత్రాల్లో ఉంది. భారతీయ తాత్త్విక చింతన చెప్పే విషయం. భారతీయ తాత్త్వికత చింతన  మనకు నేర్పించినటువంటి పాఠాలు ఉపనిషత్తులు కానివ్వండి, వేదాలు కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, వేటినైనా మనం అధ్యయనం చేస్తే మన దృష్టి కోణం మారితే మనం మనుషులుగా ఉండగలుగుతాం!

పద్మజ:– యాంత్రికతతో కాకుండా మనసుపెట్టి భగవద్గీత చదివితే… దాని అర్ధం ఎలా స్ఫురిస్తుందో ఒక్క శ్లోకం గురించి చెప్పండి !
రామ్మూర్తి గారు :—- యాంత్రికత అని ఎందుకంటున్నానంటే…?
శ్లో॥ భగవద్గీత 18-78
“ యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః |
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ || ”
    మనం ఎప్పుడూ వినే గీతా శ్లోకం ఇది! పరిశీలించినట్లయితే ఎక్కడైతే అర్జునుడు గాండీవం పట్టుకొని ఉంటాడో? నొగల మీద కృష్ణుడు కూర్చొని ఉంటాడో? అక్కడ విజయం వరిస్తుంది అని ఈ శ్లోకభావం.
     నేనేమంటానంటే …
*యత్ర యోగేశ్వర కృష్ణో…. యోగేశ్వర… యోగం అనేది జ్ఞానానికి ప్రతీక!  మనకు ముందుగా జ్ఞానం కావాలి.  డొమైన్ నాలెడ్జ్ అంటే ఏ రంగంలో నువ్వు ఉంటావో? దానికి సంబంధించిన జ్ఞానం, మృదువైన నైపుణ్యాలు( soft skills) ఉండాలి. ఆ నైపుణ్యాలకు ప్రతినిధి అర్జునుడు. అర్జునుడి ధనస్సు లేదా గాండీవం కర్మాచరణకు ప్రతీక! కృష్ణుడు జ్ఞానానికి ప్రతీక! జ్ఞానం ప్రేరణ చేస్తుంది. ఈ రెండు అంటే జ్ఞానం మరియు  కర్మాచరణ ఎవరికైతే ఉంటాయో (కృష్ణార్జునులు) ఎక్కడైతే ఉంటారో అక్కడ విజయం తప్పక ఉంటుంది.
   ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. జ్ఞానపరంగా ఇంకా ఇంకా ఆలోచిస్తే… జ్ఞానం అభివృద్ధి చెంది, సాధన చేయగా చేయగా… పనిలో నైపుణ్యాలు పెరిగి , ఈ రెంటి సమన్వయంతో విజయం స్వంతం చేసుకోవచ్చు ! ఈ అర్థం తెలుసుకొని భగవద్గీత శ్లోకం పఠించి, ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే సత్ఫలితాలను ఇస్తుంది. కాకపోతే కంఠశోషే మిగులుతుంది.

పద్మజ:– నాన్నగారు హవనాలు ఎక్కువగా చేసేవారని మీరు చెప్పారు! మీకు కూడా ఆసక్తి ఉన్నట్టు గమనించాను… వాటి ఉపయోగం ఏమిటో చెప్తారా?
రామ్మూర్తి గారు:– హవనం ఎంతో ఉపయోగకరమైనది ఎందుకంటే? మా నాన్నగారు చేశారు కాబట్టి మంచిదని చెప్పడం లేదు. ప్రతి హవనం ఎంతో శక్తినిస్తుంది. ముఖ్యంగా నియమబద్ధంగా ( Frequency)  శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు మనలో 72 కండరాలు కదులుతాయి.
                ఒక ఆయుర్వేద వైద్యులు శ్రీ నారాయణరెడ్డి గారు ఏమంటారంటే అంటే కండరాల కదలికలు నరాల మీద ప్రభావం చూపుతాయి. అందువల్ల రక్తప్రసరణ చక్కగా జరిగి, గుండెను చేరుతుంది. ఇది ఒక గొలుసు చర్య! మనం మాట్లాడే ప్రతి మాట మన మీద ఒక ప్రభావం చూపుతుంది. మాట ప్రకంపనాలు కలిగిస్తుంది. ఎంతవరకైతే ఈ ప్రకంపనాలుంటాయో! అంతవరకు అక్కడున్న మనుషుల మీద మానసిక స్థితి మీద ప్రభావం చూపెడుతుంది. హవనంలో వాడే ద్రవ్యాలు నెయ్యి, సమిధలు లాంటివి అగ్నిలో వేల్చడం వల్ల వాతావరణంలో ఒక ధనాత్మక శక్తి ( Positive Enrage) సకారాత్మక శక్తి ఉత్పన్నమౌతుంది. ఇది పరిసరాలను శుభ్రం చేస్తుంది. ఇది వరకు ప్రతి ఇంట్లో అగ్ని కార్యం చేసేవారు .ఇలా చేస్తే మంత్ర శబ్దతరంగాలు మరియు అగ్నిలో వేల్చే పదార్థాలతో వాతావరణం పరిశుభ్రమయ్యేది. ఇలా ప్రతి ఇంట్లో చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీగా మారి, నెగటివ్ వాతావరణం పాజిటివ్ వాతావరణంగా మారేది. దీనికి ఉదాహరణ భోపాల్ లో సంభవించిన అగ్ని ప్రమాదం [ గ్యాస్ లీకేజ్]  సంగతి అందరికీ తెలిసిందే! అందులో రెండు కుటుంబాలు మాత్రమే ఆ ప్రమాదం నుండి బయటపడ్డాయి. ఎందుకని శాస్త్రజ్ఞులు పరిశోధిస్తే తేలింది ఏమిటి అంటే? ఆ రెండిళ్లలోనూ రోజు అగ్ని కార్యం చేసేవారట. దానివల్ల ఇంటి చుట్టూ ఉన్న వాతావరణం కలుషితం కాకపోవడమేనట! నెగటివ్ విషవాయువులను తీసుకొని పాజిటివ్ గా మార్చడమే కారణమని అన్నారు.
     కాబట్టి యజ్ఞయాగాలు చేయడం వల్ల వాతావరణ కాలుష్యాన్ని పోగొట్టొచ్చనని నిరూపించబడింది. కానీ ఇందులో ఒక విషయం గుర్తుంచుకోవాలి! ఏదో యాంత్రికంగా యజ్ఞం చేయడం కాదు! ఋత్విక్కులు కూడా శ్రద్ధగా మనసుపెట్టి మంత్ర పఠనం చేయాలి! కానీ యాంత్రికంగా మంత్రాలు చదివితే ఫలితం ఉండదు.
   ప్రశ్నోపనిషత్తులో అర్హతను నిర్ధారించుకోవడానికి పిప్పలాదునని దగ్గరకు ఆరుగురు(6) ముని కుమారులు వస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు  కూడా తపః సంపన్నులే… వారు వచ్చి తాత్త్విక తత్త్వం గురించి చెప్పమంటారు. నాకు తెలిసింది నేను చెప్తాను! కానీ మీరు ఒక సంవత్సరం పాటు బ్రహ్మచర్య దీక్ష తీసుకొని రమ్మంటాడు పిప్పలాదుడు. బ్రహ్మచర్యమంటే కేవలం వివాహం చేసుకొని సంసార సుఖాలు అనుభవించడమే కాదు! బ్రహ్మం+ ఏన+ చరయితి= బ్రహ్మచర్యం… బ్రహ్మ తత్త్వాన్ని తెలుసుకొనేందుకు మనసును లగ్నం చేసుకొని రావడమన్నమాట! సంవత్సరం తర్వాత వస్తే నాకు తెలిసింది చెప్తాను అంటాడు.
     అలాగే అని వారు వెళ్లి దీక్షగా ఉండి సంవత్సరానికి తిరిగి వస్తే 6 ప్రశ్నలకు జవాబు చెప్పి నాకు ఇంత మాత్రమే తెలుసు అంటాడు.
    అంటే ఏ విద్యైనా నేర్చుకునేందుకు అర్హత ఉండాలని భావం! నేర్చుకోవాలని జిజ్ఞాస ఉన్నదో లేదో! అని చూసి గురువు ఆ విద్యను బోధించాలి! అప్పుడు మంచి ఫలితం వస్తుంది. విలువైన మంత్రం లేదా తత్త్వం ఎవరికిబడితే వారికి ఆ విద్యను ఇస్తే అది యాంత్రికంగా మారిపోతుంది. మంత్ర ఉద్దేశాన్ని అవగాహన చేసుకుని పాటిస్తే మంచి ఫలితం వస్తుంది.

పద్మజ:– తాత్త్విక విషయం రచించేటప్పుడు కానీ, మీరు పత్రికలకు పంపేటప్పుడు కానీ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా?
రామ్మ్మూర్తిగారు:- రాసేది వీలైనంత మేరా నాకు అవగాహన ఉన్న విషయాన్ని రాస్తాను కాబట్టి, ఇబ్బంది ఏమీ లేదు. సౌందర్యలహరిలో దాదాపు 40 శ్లోకాలకు పైగా వ్యాఖ్యలు పత్రికలలో రాసాను. అయితే 40 వరుసగా రాయలేదు. ఎందుకు రాయలేదంటే? నేను ఆ శ్లోకాలను చదువుతున్నప్పుడు దీనిని సామాజిక కోణంలో చెప్పగలనా? లేదా? తాత్త్వికత అనే విషయం నా అవగాహనలో ఉందా? లేదా? అని చూసి ఉన్నదనిపిస్తే దానికి రాసాను కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. తత్త్వం అంటే తత్ +త్వం. అంటే …తత్= అది …. త్వం = నీవే  అయివున్నావు. ఇవి మహావాక్యాలు. అది నీవే  అయి ఉన్నావని అర్థం తెలుపుతున్నది… అది అనే సర్వనామమే భగవంతుడు.

పద్మజ:– ఇంత గొప్ప మహా వాక్యాలను పాఠ్యాంశంగా పెడితే విద్యార్థులు చిన్నప్పుడే మంచి విషయాలు తెలుసుకుంటారు కదా! ఇవి సామాజిక కోణంలో ఎంతో మేలు చేసేవి.. మరి మీ సూచనలేమిటి?
రామ్మూర్తి గారు :– కరోనా మహమ్మారి వచ్చిన సమయంలో సామాజిక దృక్కోణంలో  తత్త్వం గురించి చెప్పేందుకు ప్రయత్నించాము. నారు మంచి అనంతకృష్ణ గారని ఒక మిత్రుడున్నారు. వారు హైకోర్టు అడ్వకేట్, అతను నేను ఇద్దరం కలిసి దాదాపు 16 సెమినార్లు నిర్వహించాము. భారతీయత– విద్య మీద చాలా మంది ప్రొఫెసర్లను, టీచర్లను, విద్యార్థులను, చదువుకున్న వారందరినీ పిలిచాము. ఇలా జూమ్ లో 16 సెమినార్లు నిర్వహించి, సామాజిక దృష్టికోణంలో తాత్త్వికత – ఈనాటి దృష్టికోణంలో పాఠ్యాంశంగా ఉంటే బాగుంటుందని ఒక రూపం కల్పించి ఇచ్చాం. కాకపోతే రాజకీయ నాయకులు సమర్ధించలేదు. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ( N A P) ఉంది కదా! వారి వెబ్సైట్లో మేము చెప్పదలుచుకున్న వన్నీ ఉత్తరాల రూపంలో నిక్షిప్తం చేసాము. ఉపన్యాసాలు కూడా రికార్డు చేసాం! సెమినార్ లో జరిగిన విషయాలన్నీ ప్రభుత్వ  దృష్టికి తీసుకువెళ్ళాము. ప్రభుత్వం దానికి అంతగా స్పందించలేదు.

పద్మజ:– భవిష్యత్తులో పాఠ్యాంశంగా తీసుకుంటుందని ఆశావాహ దృష్టితో చూద్దాం! సరేనండి. మరి యువ రచయితలు  ప్రాచీన సాహిత్యం నేటి తరానికి సామాజిక దృక్కోణంలో అందించేందుకు ఎలాంటి కృషి చేయాలంటారు? సనాతన ధర్మం — వేద వాజ్ఞ్మయం అందరికీ అందుబాటులోకి వచ్చి మంచి ఫలితాలను పొందాలంటే వారు చేయాల్సిన రచనల గురించి చెప్తారా?
రామమూర్తి గారు:– యువ రచయితలకు సలహాలు ఇచ్చే స్థాయి నాకు లేదమ్మా !ఎందుకు లేదంటున్నానంటే? మనం ఒక విధానానికి అంటి పెట్టుకొని ఉన్నాం! నేటి రచయితల దృష్టి – దృక్కోణం వేరే విధంగా ఉంది! ఏది ఎక్కువ? ఏది తక్కువ? అని నేను అనడం లేదు. ఒకటి తప్పు మరొకటి ఒప్పు అని కూడా కాదు! ఏమైనా కానీ ప్రాచీనత- సనాతనము అంటే… నిన్న ఉండె… నేడూ ఉన్నది… రేపూ ఉంటుంది… దీని దృష్టిలో పెట్టుకొని పాతదాన్ని పునాదిగా చేసుకొని కొత్తగా నిర్వచించుకొని భవిష్యత్తు మీద ఆశ ఉండేలా విశాల భావనలతో రచనలు చేస్తే అప్పుడు సమాజానికి సందేశంతో బాగుంటుంది. అలా కాకుండా హ్రస్వదృష్టితో ఏదో ఒక వాదనకు బద్ధులమైతే చూసే కోణంలో తప్పు వస్తుంది. నేటి సమాజంలో ఎంతో మంచి ఉంది. ఆధునిక భావాలతో రచిస్తున్నారు. ఇవాళ్ళ మన సమస్యలు లేదా అభివృద్ధిని కాకుండా…. ఎప్పుడో ఏదో జరగాలనీ, జరుగుతుందనీ ఊహా లోకాలలో విహరిస్తే మటుకు ఫలితం ఉండదు. ప్రాచీనతను అన్వయించుకొని, కొత్తమార్గంలో రచనలు చేయగలిగితే అప్పుడు వారిని అనుసరించేవారు ఎందరో ఉంటారు. కాకపోతే ఆ విషయంపై సలహాలు, సూచనలిచ్చే స్థాయి నాకు లేదు.

పద్మజ:– అయ్యా ! అది మీ వినయానికి పరాకాష్టగా భావిస్తూ… తాత్త్వికత గురించి కొంత తెలుసుకున్నాం . అయితే మరో సందేహం రాధాకృష్ణులు… అత్తా- అల్లుళ్ళ మధ్య ప్రేమను గురించి ఎందరో ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. మీరు రాధాకృష్ణుల ప్రేమ అంతరార్థం ఏమని చెప్తారు?
రామమూర్తి గారు :– రాధాకృష్ణులు అంటే.. మనం అనుకుంటున్న భారత, భాగవతాల్లో కనిపించే కృష్ణుడు కాడు ! సృష్టికి సంబంధించింది కృష్ణుడు….  పరమాత్మ తత్త్వం, రాధా ప్రాకృతిక తత్త్వం. ప్రకృతి –పురుష సంయోగం ఏదైతే ఉందో దాని ఫలితం ఆనందం… పోతన గారు కూడా  భాగవతంలో “మహానందాంగ నా డింభకున్” అని అంటాడు.
శ్రీ కైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్తపాలన కళాసంరంభకున్ దానవో
ద్రేకస్తంభకు గేళిలోల విలసదృగ్జాల సంభూత నా
నాకంజాత భవాండకుంభకు మహానందాంగనా ఢింభకున్.
“మహానందనా డింభకు” అంటేనే ఆనందానికి ఢింభకుడు  అని అర్థం. మహానందం  సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నది. అది తప్ప మరొకటి లేదు అనేదే పరమాత్మ తత్త్వం. దానిలోనే  పాజిటివ్ ఎనర్జీ – నెగటివ్ ఎనర్జీ రెండు ఉన్నాయి.

   పెళ్లిళ్లలో చదివే చూర్ణికలు  “మహదహంకార పృథివాపతేజో వాయురాకాశా వరణమైరావృతే”
అని ఈ సృష్టి ఎలా ఉందంటే మహత్తు నుండి వచ్చిందని, మూల ప్రకృతి మాయ అంటాము. అక్కడి నుండి అహంకారం వచ్చింది. పంచభూతాలు, పంచతన్మాత్రలు , ఇలా ఒక వ్యవస్థ బయటికి వచ్చింది. అంటే తయారు చేయబడింది. ఇక్కడ రాధాకృష్ణుల తత్త్వం- గోకులంలో కృష్ణ తత్త్వం ఉంది.

   కృష్ణ తత్త్వం స్త్రీ తత్త్వంతో (రాధా) కలసి ఆనందాన్ని పంచుతుంది. స్త్రీ తత్త్వమంటే ఏమిటంటే సత్వ, రజస్తమో గుణాలతో బందీకృతమైన ప్రతిదీ స్త్రీనే. సకారము, రకారము, తకారము దీనికి ఈ కారము కలసినపుడు స్త్రీ ఔతుంది. ఇది ప్రకృతి. ఇక్కడ దీనికి ఉన్నతి రావాలంటే పురుష తత్త్వంతో కలవాలి.

    పురుషునిలోనూ ఈ మూడు తత్త్వాలుంటాయి .కానీ వీటికతీతంగా స్పందిస్తాడు. వీటికి లోబడి ఉండడు. అది పురుష తత్త్వం. ఇవి తత్త్వమే తప్ప… ఆడ -మగ కాదు! దీనికి ఉదాహరణ ఒక పౌరాణిక కథ చెప్తారు!
        ఒకసారి శివుడు కృష్ణుని దర్శించాలనుకుని బృందావననికి వెళ్ళాడట! లోపలికి వెళ్ళగానే అతను కూడా స్త్రీగా మారిపోయాడు.
       తత్త్వం ఎప్పుడైతే అవగాహనకొస్తుందో… ఈ సత్వ రజస్తమో గుణాలకతీతమైన ఒక తాత్త్విక చింతనలో మనం ఉంటే మనకు వచ్చే ఫలితం ఏమిటంటే ఆనందం !
    ఆనందం అంటే మనం అనుకునే Happiness కాదు. అందులో నాలుగు దశలున్నాయి. ఆనందాన్ని ఆంగ్ల భాషలో pleasure అంటారు. Happiness అంటాం! తర్వాత Blissful state , ecstasy state వీటినే సంతోషం- ఆనందం -తాదాత్మ్యత , తన్మయత అని నాలుగు దశలుగా చెపుతారు. తన్మయత్వానికెపుడైతే  చేరుతామో మనం తప్ప  రెండవది ఉండదు! అక్కడ భగవంతుడు వేరుగా ఉన్నాడనే స్పృహ కూడా ఉండదు. ఆనందమే… ఆనందం! అంతటా మనమే ఉంటాం!  మనలోనే అంతా ఉంటుంది! తన్మయ స్థితిలో  ఇలా ఉంటుంది. “నేను” అనేది ప్రత్యేకంగా ఉండదు.

   ఇక తాదాత్మ్యత స్థితిలో తదేకంగా చూస్తూ ఉంటాం! అక్కడెవరో ఉంటారు! మిగతా అంతా మరచిపోయి ఆ కనపడేది మాత్రమే తదేకంగా చూస్తాం!   అంటే నేను గాక మరొకటి ఉన్నదని భావన! ఇక్కడ నేనున్నాను! నేను చూసే మరొకటి ఉంది!    నాకు ఒక వస్తువు లభిస్తే దానివల్ల ఆనందం కలుగుతుంది. అంటే వస్తువులున్నాయి- నేను ఉన్నాను! అనేదే ఆనందం. ఇష్టమైనది మనసులో అనుకున్నా చాలు ఆనందం కలుగుతుంది. రాధాకృష్ణ తత్త్వము అంటే తన్మయ స్థితిని పొందడమే. ఒదే ప్రకృతి పురుషుల యొక్క తత్త్వం. ఈ రెంటి మధ్యన ఉండేది మాయ! మాయను మనం జయించడం కష్టం. ఋషులు తాదాత్మ్య స్థితికి  చేరినవారు మాయను జయిస్తారు.

పద్మజ:— కృష్ణుడి గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మీ సొంత ఊరి పక్క ఊరే బమ్మెర గ్రామం. అక్కడ పోతన భాగవతం రచించారు కదా! ఆ భాగవతం మీద మీదైన ఆలోచన సరళి “సామాజిక ధోరణిలో- భాగవత పురాణం” పైన ఏదైనా రాశారా?

రామమూర్తి గారు:– వినోదరావుతో కలిసి పోతన భాగవతం చదివాను. చదవడం కష్టమైన ప్రక్రియ. అవగాహన చేసుకోవడం అంతకన్నా కష్టమైన ప్రక్రియ. అందుకే  రుక్మిణి కళ్యాణం సామాజిక కోణంలో రాశాను. క్షీరసాగర మధనం పద్య కావ్యం వ్రాసాను. పురాణాలు- జీవన మార్గదర్శకాలని  ఒక పుస్తకం రాశాను.

పద్మజ:– ప్రశ్నోపనిషత్తు పరిచయం ఒక సీరియల్  వలె దర్శనం పత్రికకు రాసారు కదా?

అందులో మొదటి ప్రశ్న :- కాత్యాయన కబంధి పిప్పలాదుడిని అడిగిన ప్రశ్న!భగవాన్, కుతోవా హ వా ఇమాః ప్రజాః ప్రజాయంతి ఇతి? ఈ సృష్టి అంతా ఎక్కడ నుండి వచ్చిందని అడిగాడు! కదా! మా పాఠకులకు వివరిస్తారా?

రామమూర్తి గారు:– ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆనాటి నుండి ప్రతి జిజ్ఞాసవు వేసే ప్రశ్నే ఇది. ఆది అంతం లేని కాలం యొక్క రహస్యం ఏమిటి? భగవంతుడు ఏమిటి? ఎక్కడ ఉంటాడు? ఇలాంటి ప్రశ్నలు దేశ విదేశాల తత్త్వవేత్తలను తొలచి వేస్తూనే ఉన్నాయి. ఈ ప్రశ్న ఈ నాటికి కూడా వర్తిస్తుంది.
ఈ సృష్టి ఎలా జరిగింది? ఎక్కడి నుండి వచ్చింది? దీని మూలం ఏమిటి? అనే ప్రశ్నలకు పిప్పలాదుడు ఏమంటారంటే?.. ప్రతి జిజ్ఞాసవు తెలుసుకోవలసిన విషయము.  సైన్సు ఎక్కడో అక్కడ ఒక చోట ఆగిపోతుంది!
కానీ వేదం పూర్తి జ్ఞానాన్ని వివరిస్తుంది..
    “రయించ ప్రాణంచేతి..” అంటుంది ఉపనిషత్తు. రయి అంటే పదార్థము. మరియు ప్రాణము అంటే శక్తి. పదార్ధము శక్తి అనే జంటను ముందుగా భగవంతుడు సృష్టించాడు. సూర్యచంద్రులు  ఇద్దరు సృష్టిలో మొదట వచ్చారు. చంద్రుడు పదార్థానికి- ఆహారానికి ప్రతీక! సూర్యుడు అగ్నికి మరియు శక్తికి ప్రతీక! అని ఈ పశ్నోపనిషత్తు వివరిస్తుంది. అక్కడి నుండి సృష్టి మొదలైనది. పదార్థం అంటే అనంతమైన శక్తి ఒక ఆకృతి తీసుకుంటే పదార్థం అవుతుంది. ఈ పదార్థం చుట్టూ ఉండే ఆవరణ అంతా శక్తి ( space)రెండు కలిపి సృష్టి మొదలైంది. శక్తి విస్ఫోటనం వల్ల అన్నీ ఏర్పడ్డాయి. ఇలా మొదటి ప్రశ్న ఎంతో విజ్ఞానదాయకమైన ప్రశ్న!   గర్భం తాల్చిన దగ్గర నుండి శిశువు పుట్టే దాకా ఏమేమి మార్పులు జరుగుతాయో వేదములో చెప్పబడింది. నేను ఒక  స్త్రీల గర్భాశయ వైద్యురాలి దగ్గరికి వెళ్ళి,  ఈ వేదభాగం వినిపించి, ఇది కరెక్టేనా? అని అడిగాను.  ఆమె సైన్స్ కూడా ఇదే చెప్తుందని,  ఆమె అమ్మాయిల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. కమ్యూనికేషన్ సెల్ ద్వారా వీడియో చేయించి డిస్ప్లే చేయించాము. మన వేదములో ఎంతో విజ్ఞానం ఉంది. దాన్ని అధ్యయనం చేయాలి. లేకుంటే అంత విజ్ఞానం మనం పోగొట్టుకుంటాం!

పద్మజ:– మయూఖ అంతర్జాల పత్రిక పై మీ అభిప్రాయం చెప్పండి!
రామమూర్తి గారు:– నీహారిణి గారు మయూఖ అంతర్జాల పత్రిక నిర్వహిస్తున్నామని నాతో చెప్పారు. ఏ పత్రికనైనా నిర్వహించడం అనేది చాలా కష్టతరమైన ప్రక్రియ. ఈరోజుల్లో పత్రికలను ఎవ్వరూ కొని చదవాలనుకోవడం లేదు. నేను దాదాపు 300 కాలేజీలకు వెళ్లాను, అక్కడ 400 స్టేజీల మీద మాట్లాడాను. ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ వరకు విద్యార్థులతో మాట్లాడాను. డొమైన్ నాలెడ్జ్, సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవడం అవసరం కనుక కొద్దో గొప్పో నేర్చుకుంటున్నారు, కానీ సాహిత్యం మీద దృష్టి అంతగా పెట్టడం లేదు. కొంత మంది మాత్రమే  పత్రికలు చదువుతున్నారు కాబట్టి ఇలాంటి సమయంలో పత్రికను నడిపించడం సమాచారం నలుగురికి అందించడం అనేది చాలా కష్టమైన పని. ఆర్థికంగానూ అంతే భారం. వెన్నుదన్నుగా నిలిచేవారు కావాలి. పత్రికలో వచ్చినవన్నీ క్షుణంగా చదివి వాటిల్లో సారం ఏమున్నదని చూసి మంచి చెడులు నిర్ణయించి, పాఠకులు ఎటువంటి వారున్నారు వారు ఎలాంటివి ఇష్టపడుతున్నారని నిర్ణయిస్తూ పత్రికకు వచ్చిన వ్యాసాలను ఎన్నుకోవాలి. అంతే కాకుండా సాంకేతిక నిపుణుల అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా సమాచారం సేకరించే వారు కావాలి. అది కూడా నిజమైన సమాచారం కావాలి ఏదో ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి పంపిద్దాం అన్నట్టు కాకుండా…. ఇదంతా పెద్దతతంగం. ఈ కష్టనష్టాలకోర్చి వ్యయ ప్రయాసలకోర్చి పత్రికకు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని, ఏదో సాధించాలనీ ఏదో పరిణీతి పొందాలనీ ధ్యేయంతో పత్రిక నడపడం కష్టం.  ప్రతి పత్రికా నిర్వాహకులకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఏ పత్రికైనా నాలుగు కాలాలపాటు నిలవాలంటే ఆదరించే వారు కావాలి! నేను చేసే విన్నపేమేమిటంటే పత్రికను ఆదరించండి. ఏ తీరు వీలైతే ఆ తీరు సహాయం చేయండి. పత్రికంటూ ఉండి సమాచారం అంటూ ఉంటే వాడుకుంటాం. సమాచారమే లేకపోతే వాడే ప్రసక్తి ఎక్కడ? పత్రికలకు నేను చేసే విజ్ఞప్తి ఏమిటంటే? వచ్చిన ప్రతి రచనను తీసుకోకుండా నిజమైన సమగ్ర సమాచారం మాత్రమే తీసుకోవాలి. చెత్తతో పత్రికను నింపకూడదు. చెత్త నుండి వేరు చేసేలా పత్రిక దోహద పడితే సంతోషం!
సంపాదకురాలికి అభినందనలు!

పద్మజ:- పత్రిక తరపున నా సందేహాలకు మీ అమూల్యమైన సమయం వెచ్చించి, చక్కని సమాధానాలిచ్చినందుకు ధన్యవాదములండీ!!

పురాణ మిత్యేవ న సాధురస్వం
నచాపికావ్యం నవమిత్యవద్యం
సంతః  పరీక్షాన్య తరత్ భజంతే
మూఢః పర ప్రత్యయ నేయ బుద్ధిః

ప్రాచీనమైనదంతా సమ్మతమైనది, గౌరవించాల్సిందీ కాదు! ఆధునికమైనదంతా వదిలి పెట్టాల్సిందీ, ద్వేషించదగ్గదీ కాదు! మంచి చెడులను తమ  అనుభవాలతో పరీక్షించుకొని, ఏది మంచైతే అది స్వీకరిస్తారు విజ్ఞులు!
   ఈ కోవకు చెందిన వారే ఈనాటి ముఖాముఖి అతిథివరేణ్యులు!
    వేదాలు, ఉపనిషత్తులు మొదలైనవి అర్థమైతే చాలనని అనుకుంటున్నారు కొందరు. కానీ వేదాల్లో అన్నీ ఉన్నాయిష … అనే కొందరికి  అందులోని సారాంశం అందించాలి! ఆ దిశగా పయనిస్తున్నారు శ్రీ రామ్మూర్తి గారు.
   విద్యాధికులైనా వినయంతో- పాండిత్య ప్రకర్ష అరచేతిలో ఒదిగిపోయినా, ప్రాచీన సాహిత్యాన్ని ఆధునిక సాహిత్యంతో చిలికి వెన్న ముద్దలాంటి విజ్ఞానాన్ని, నా ప్రశ్నలకు చల్లని సమాధాన జలపాతాన్ని కురిపించిన సజ్జనులు, మాన్యులు పాలకుర్తి రామ్మూర్తిగారికి సవినయ కృతజ్ఞతాంజలి సమర్పిస్తూ…

                    

You may also like

Leave a Comment