Home వ్యాసాలు దైన్యం నిండిన శవవాహకుల గాథ

దైన్యం నిండిన శవవాహకుల గాథ

ఎలనాగ చేసిన సైరస్మిస్త్రీ అనువాద నవలశవాలను మోసేవాడి కథపై వ్యాసం

కాలం మారినా అన్ని మతాలలోని అట్టడుగు వర్గాల స్థితిగతులు ఉన్నత వర్గాలతో పోల్చదగినంతగా మారలేదు. అందుకు సామాజిక కారణాలు, ధార్మికత నెపంతో రుద్దబడిన కట్టుబాట్లు, వాటి వల్ల ఆవరించిన పేదరికం ప్రధాన కారణాలు. ఈ వలయం నుండి బయటపడలేని సమూహాలు కనీసావసరాలకు, మానవ హక్కులకు నోచుకోనంతగా అణచివేయబడ్డాయి. అటువంటి సమూహాలు సాహిత్యానికెక్కడం అరుదు. మరాఠాలో దళిత సాహిత్యం విస్తారంగా వచ్చింది కానీ అది హిందూ మతంలోని నిమ్న కులాల కోసం రాయబడింది. అదే ప్రాంతం నుండి పార్శీ మతంలోని ఖాంథియాల గురించి రాయబడిన నవల Chrolicle of a Corps Bearer.

ఈ నవలా రచయిత సైరస్‌ మిస్త్రీ. ఈయన జర్నలిస్టుగా, Short Films రచయితగా ప్రసిద్ధుడు. Radiance Ashes అనే నవల, కొన్ని కథలు ప్రచురించిన మిస్త్రీకి Chrolicle of a Corps Bearer చాలా పేరు తెచ్చింది. దీనికి సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు 2014 సం||నికి గాను దక్షిణాసియా సాహిత్య బహుమతి లభించింది. సాహిత్య అకాడమీ కోరిక మేరకు ప్రసిద్ధ అనువాదకుడు ఎలనాగ ఈ నవలను ‘శవాలను మోసేవాడి కథ’గా అనువదించారు.

పార్సీలలో ఒక ప్రత్యేకమైన తెగ ఖాంథియాలు. శవాలను శుద్ధి చేయడం, మోసుకుపోవడం, రాబందులు ఇతర పకక్షులకు ఆ శవాలను ఆహారంగా బురుజుల మధ్య వదలి రావడం వీరి వృత్తి. ఈ వృత్తి నిర్వహణ కోసం ఖాంథియా కుటుంబాలన్నీ బురుజుల దగ్గరి స్మశాన వాటిక దగ్గరే నివసిస్తాయి. కుటుంబాలన్నీ అక్కడే నివసించడం వల్ల స్మశానవాటిక ప్రభావం వారి మీద పడుతుంది. శుభ్రత లోపిస్తుంది. పిల్లలకు సమీపంలో బడి ఉండదు. చుట్టూ అడవి ఆవరించి ఉండడం వల్ల పురుగు పుట్రతో సహవాసం తప్పదు. ఇక అసలు వృత్తి నిర్వహించే శవ వాహకులకు చాలా వేదన ఉంటుంది. సాధారణంగా శవాలకు దగ్గరగా ఉండలేని పరిస్థితి మనుష్యులది. వీరు మాత్రం శవాల శరీర భాగాలను శుభ్రపరిచి, చనిపోయిన ప్రదేశం నుండి బురుజుల ప్రాంతాన్ని మోసుకు రావాలి. బురుజుల ప్రాంతంలో శవాలను ఎత్తైన ప్రాంతానికి తీసుకుపోయి, మళ్ళీ లోయలోకి దించాలి. ఈ పనిలో శారీరక శ్రమ ఎక్కువే కాక తీవ్రమైన మానసిక అయిష్టతను ఎదుర్కోవలసి వస్తుంది. నిర్ణీత సమయంలేని పని కూడా కావడం మరొక సమస్య. అందువల్ల ఖాంథియాలంతా తప్పనిసరిగా మద్యం సేవిస్తారు. శవాల అంత్యక్రియలు కాకముందు మందు తాగొద్దని నిబంధన పెడతారు ట్రస్టీలు. మందు కొడితేనే కానీ శవాల పని చేయలేమన్న బాధ ఖాంథియాలది. ఇంత కఠినమైన వృత్తిలో ఉన్న ఖాంథియాలకు వచ్చే కూలీ తక్కువ. సెలవులు ఉండవు. అందువల్ల ఆ కుటుంబాల స్త్రీలు వ్యభిచారం చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. ఆ వృత్తిలో విటుల చేతుల్లో స్త్రీలు హత్యకు గురైన సందర్భాలూ ఉంటాయి. ఇలాంటి ఖాంథియాల దయనీయ జీవితాన్ని రెండు మూడు కుటుంబాల కథల నేపథ్యంలో విస్తృతంగా చిత్రించాడు రచయిత.

శవాలు మోసేవాడు ఫిరోజ్‌ ఎల్చిదానా. ఫిరోజ్‌ పుట్టి పెరిగింది బొంబాయిలోని ఇచ్చాపోరియా  అగ్ని దేవాలయ ప్రాంతం. చదువు ఆగిపోవడంతో బొంబాయి వీధులన్నీ లక్ష్యం లేకుండా, జులాయిగా తిరిగాడు. డూంగర్‌ వాడీ బురుజుల దగ్గర ఖాంథియాగా నుసెస్సెల్లార్‌ పని చేస్తూ జీవితం గడుపుతాడు.

ఫిరోజ్‌ నాన్న ఫ్రాంరోజ్‌ పార్శీ పూజారి. ఇచ్చాపోరియా గుడి వెనక నివసించే ఫ్రాంరోజ్‌ కుటుంబానికి చాలా గౌరవప్రదమైన స్థానం ఉంటుంది పార్శీ సమాజంలో. ఫ్రాంరోజ్‌ నాన్న మొదటి భార్య కూతురు రుదాబె. ఆమె ఫ్రాంరోజ్‌ కు సోదరి కిందే లెక్క. కానీ రుదాబెతో ఫ్రాంరోజ్‌ లైంగికాసక్తిని కనబరచడంతో వారి తండ్రి తీవ్రంగా మందలిస్తాడు. రుదాబె చెడు తిరుగుళ్ళతో బొంబాయి వీధుల వెంట కనబడుతుంది. అలాంటి తిరుగుడులలో భాగంగా తెమూరస్‌ తో కలుస్తుంది, పెళ్ళాడుతుంది. అలా తెమూకు ఫ్రాంరోజ్‌ కు వైరం ఏర్పడుతుంది. వారికి సెపిడె అనే కూతురు పుడుతుంది. వారిది శవాలను మోసే వృత్తి. డూంగర్‌ వాడీలో ఉంటారు.

అగ్ని దేవాలయం దగ్గర ఉంటున్న ఫ్రాంరోజ్‌ కు ఇద్దరు కొడుకులు, విస్ఫీ, ఫిరోజ్‌. విస్ఫీ చదువులో ఆసక్తి చూపిస్తాడు కానీ, ఫిరోజ్‌ ఫేలై జులాయిగా తిరుగుతాడు. బొంబాయి అంతా తిరిగి చెడు అలవాట్లన్నీ నేర్చుకుంటాడు. తల్లి హిల్లాతో కలిసి డూంగర్‌ వాడీలో ఒక బంధువు అంత్యక్రియలకు వెళ్ళినప్పుడు సెపిడెను చూసి ప్రేమలో పడతాడు. ఇక అప్పడినుండి డూంగర్‌ వాడీకి వెళ్ళి సెపిడెతో తిరుగుతాడు. సెపిడెను పెళ్ళాడడానికి ఖాంథియాగా మారాలన్న షరతుకు తల ఒగ్గుతాడు. అమ్మానాన్నలను ఎదిరించి పెళ్ళాడి శవాలను మోస్తూ బతుకుతుంటాడు. ఫరీదా అనే కూతురు పుట్టాక సెపిడె పాము కరిచి చనిపోతుంది. శవవాహకులు అంతా తాగి శవాలను మోస్తూ ఉంటారు. ఫిరోజ్‌ ఒకరోజు శవాన్ని మోస్తూ బోర్లా పడేస్తాడు. ట్రస్టీలు మెమో ఇస్తారు. ట్రేడ్‌ యూనియన్‌ పెట్టడంతో తగ్గుతారు.

బొంబాయిలో పార్శీ ప్రముఖుడు నారిమన్‌ మొదటి భార్య కొడుకు వ్యాధితో బాధపడుతూ పార్శీగా చనిపోవాలనుకుంటాడు. అందుకు అతని తమ్ముడైన రోహింటన్‌, ఫిరోజ్‌ ను అతని తండ్రిని ధర్మ సలహాకు ఒప్పించమంటాడు. ఫిరోజ్‌ కోరికను తిరస్కరించిన తండ్రి, నారిమన్‌ డబ్బుతో ట్రస్టీలను ఒప్పించి పార్శీ పద్ధతిలోనే కొడుకు అంత్యక్రియలను జరిపిస్తాడని అంచనా వేస్తాడు. అతని అంచనా ప్రకారం ట్రస్టీలు నారిమన్‌ కొడుకు జోసెఫ్‌ శవాన్ని పార్శి పద్ధతిలో రాబందులకు పెట్టడానికి ఒప్పుకుంటారు. కానీ, ఇది పార్శీమతం పట్ల విఘాతమని బుఖియా, జోసెఫ్‌ శవాన్ని రాత్రికి రాత్రి దొంగిలించి క్రిస్టియన్‌ స్మశానవాటికలో రహస్యంగా అంత్యక్రియలు జరిపేస్తాడు.

ఫ్రాంరోజ్‌ మరణించడంతో ఆయన పెద్ద కుమారుడు విస్ఫీ, తమ్ముడు ఫిరోజ్‌ సహాయంతో ఇల్లు ఇతర ప్రాంతానికి మార్చడంతో కథ ముగుస్తుంది.

ఖాంథియాల దైన్య జీవితానికి తిరుగులేదని చెప్పే ఒక గొప్ప ధర్మపన్నాగం మతంలో ఉంది. ‘నిజానికి నుసెసెల్లార్లు శవాల కుళ్ళు తాలూకు దుష్ప్రభావాన్ని పీల్చుకొని సమాజాన్ని కాపాడుతారు. ఈ ఉదాత్తమైన పనికి ప్రతిఫలంగా వారి ఆత్మ మళ్ళీ పుట్టదని మా మతగ్రంథాలు వాగ్దానం చేస్తున్నాయి. నిష్టతో శ్రద్ధతో ఆ పనిని నిర్వర్తించే శవ సంరక్షకుడు దేహం శిథిలం కావడం, మరణం, పునర్జన్మల నుండి విముక్తి పొందుతాడు’ అని ఫిరోజ్‌ చెప్పుకొస్తాడు. అతనే ‘అయితే, ఈ జన్మలో ప్రజలు అతన్ని మకింలాగా, మలంలాగా, అస్పృశ్యునిగా చూస్తారనే విషయాన్ని మత గ్రంథాలు రాయలేదు’ అని కూడా అంటాడు.

ఏమీ చేయలేని అశక్తులు యజమాని లేని సమయంలో ఎంత కోపంగా మాట్లాడుకుంటారో మామూలుగా యజమానులు ఊహించలేరు. ఫిరోజ్‌ పని ఒత్తిడి వల్ల ఒకసారి కళ్ళు తిరిగి శవాన్ని పడవేస్తాడు. అప్పుడు యాజమాన్యం వాళ్ళకు మెమోలు ఇచ్చి శవాలను మోసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించకూడదని హెచ్చరిస్తుంది. అప్పుడు నుసెసెల్లారు యాజమాన్యాన్ని బూతులు తిడతారు. వాడీ పని చేస్తే తెలిసేది అని కూడా ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తారు.

ఖాంథియాలలో భరించలేనంత పేదరికం ఉంటుంది. పూట గడవడం కోసం మగవాళ్ళు శవాలను మోస్తే కొందరిండ్లల్లో స్త్రీలు వ్యభిచారం చేయడం కూడా తప్పనిసరవడం ఈ నవలలో చిత్రించాడు రచయిత. తెమూరస్‌ భార్య రుదాబె దాదాపు ప్రతిరోజు రాత్రి అలంకరించుకొని పోవడం భర్తకు తెలుసు. ఇంకోరకంగా ఆయన అనుమతి కూడా ఉంటుంది. చిన్న పాపను భర్తను ఇంట్లో వదిలేసి వెళ్ళి రుదెబా తీవ్రమైన లైంగిక వేధింపులకు గురై చనిపోతుంది. కానీ దోషి దొరకడు. ఎవరికీ ఏ శిక్షా పడని, పడడానికి పట్టుబట్టలేని స్థితి ఖాంథియాలది.

మతం పట్ల మనుషుల పట్టుదల ఎంత కఠినంగా ఉంటుందో ఈ నవల అడుగడుగునా గమనించవచ్చు. నిజానికి ధర్మం పేరు మీద మతం విధించిన కట్టుబాట్లు మనుష్యుల్ని ఎంతో బాధకు గురి చేస్తుంటాయి. అయినా వాటిని సడలించరాదన్నంత స్థిరంగా మనుష్యుల అంతరంగంలో అవి గూడు కట్టేట్లు చేయడంలో అన్ని మతాల మతపెద్దలు విజయమే సాధించారన్నది శవాలు మోసేవాడి కథలో గమనించవచ్చు. జోసెఫ్‌ నారిమన్‌ కొడుకే అయినప్పటికీ ఆయన క్రిష్టియన్‌ భార్యకు పుట్టిన కొడుకు. అతను ఇంగ్లండులో మతాల ధార్మికత మీద పరిశోధన చేసి పార్శీ మతమే అన్ని మతాలలో గొప్పదని భావించి తను చనిపోయాక పార్శీ మతం పద్ధతిలో అంత్యక్రియలు జరగాలని భావించి బొంబాయి వస్తాడు. జోసెఫ్‌ తమ్ముడు రోహింటన్‌, ఫిరోజ్‌ తో తనకున్న స్నేహాన్ని ఆధారం చేసుకొని ఫిరోజ్‌ తండ్రి ఫ్రాంరోజ్‌ తో పార్సీ ట్రస్టీలకు సిఫారసు చేయించుకొని అన్నకు పార్సీ పద్ధతిలో అంత్యక్రియలు జరిపించాలనుకుంటాడు. ఫ్రాంరోజ్‌ అందుకు తప్పుబట్టడమే కాకుండా నుసెసెల్లార్‌ అయిన ఫిరోజ్‌ కూడా దానికి వ్యతిరేకించాలంటాడు. చివరికి నారిమన్‌ తన పలుకుబడితో పార్సీ ట్రస్టీలను ఒప్పించగలుగుతాడు. కానీ ఆ ధర్మ వ్యతిరేక కార్యానికి బుఖియా గండికొట్టి ఆ శవాన్ని క్రిస్టియన్‌ సిమెటరీలోనే ఖననం చేస్తాడు. ఇక్కడ గమనించదగ్గ మరో విషయమేమిటంటే క్రిస్టియన్‌ సిమెటరీ నిర్వాహకుడు గోమ్స్‌ శవపేటిక లేకుండా ఖననం చేయడం తప్పని, అంతటి రాత్రిలోనూ ఏ ప్రలోభాలకు లొంగకుండా పేటిక తెప్పించాకే ఖననం చేయనిస్తాడు.

శవాలను మోసేవాడి కథలో కొన్ని అలవోకగా వేసినట్లనిపించే ప్రశ్నలలో గొప్ప జీవన తాత్వికత పొడసూపుతుంది. సెపీడె తన జీవిత కాలమంతా జంతువులకు, పకక్షులకు, పురుగు పుట్రకు ప్రేమతో ఆహారం పెడుతుంది. చివరకు ఆమె పాముకాటుకు చనిపోయిందని కూతురు ఫరీదాకు చెప్పినప్పుడు ఆమె వేసిన అస్పష్టమైన ప్రశ్నలో ఈ ప్రకృతిలో ఏ నీతీ, ధర్మం లేనే లేదా అనే అర్థం ఇమిడి ఉన్నట్లు ఫిరోజ్‌ కు అనిపిస్తుంది. ఫిరోజ్‌ నుసెసెలార్‌ గా మారడానికి చెప్పుకున్న కారణం తాత్వికంగా ఆలోచనా త్మకంగా ఉంటుంది. అతడు ఇలా అనుకుంటాడు :

”నా విధి తాలూకు భవిష్య దర్శనం నన్ను ఆ అంతిమ విశ్రాంతి స్థలాలవైపు లాగిందా? ఆ ప్రదేశాల నుండి ఇంటికి తిరిగి వచ్చింతర్వాత ఒక్కసారి కూడా నేను కాళ్ళు చేతులు కడుక్కోలేదు. రాత్రివేళ మా దేవాలయంలోకి పోయే ముందు స్నానం చేసే ఆచారాన్ని ఎన్నడూ పాటించలేదు. నేను చేసిన నీచమైన మురికి పనుల గురించి తెలిస్తే నాన్న చాలా భయపడేవాడు. ఒకవేళ మనుష్యులకు పునర్జన్మ అనేది ఉంటే, ఇప్పుడు సైతం అప్పటి నా రహస్య కార్యకలాపాల గురించి తెలిస్తే ఆయన నన్ను క్షమిస్తాడనుకోను”.

మనుషుల ప్రవర్తనలోని డొల్లతనాన్ని రచయిత అనేక సందర్భాలలో వ్యక్తపరుస్తాడు. ఒక తల్లి శవాన్ని తీసుకుపోతున్నప్పుడు ఆమె కుమారుడు వీళ్ళేదని అడ్డం పడతాడు. పెద్దవాళ్ళు సర్దిచెప్పి నప్పుడు పాడెలో తనూ పడుకునే ప్రయత్నం చేస్తాడు. ఇది వాస్తవమైన ఫీలింగా, లేక ప్రదర్శనా అనే అనుమానాలు పాఠకులకు రావాలని రాసినట్లనిపిస్తుంది. ఆ శవం పోతే బతకలేమన్నట్లు ఏడ్చినవాళ్ళు శవాన్ని లేపడంలో కొద్దిగ కూడా సహాయం చేయరు. ఎంతో కష్టంగా ఖాంథియాలు శవాన్ని అతి కష్టం మీద మోస్తే కంటి తుడుపుగా ఇరవై రూపాయల టిప్పుతో సరిపెడతారు.

ఖాంథియాల వృత్తి దైన్యం, తద్వారా విస్తరించే కుటుంబ దైన్యం, మత పెద్దలు, ట్రస్టీల చర్యలలోని డొల్లతనం విస్తృతంగా చర్చించిన నవల ”శవాలను మోసేవాడి కథ”. పట్టణీకరణ విపరీతంగా పెరిగిన ఇలాంటి రోజుల్లో శవాలను తినే పకక్షులు జంతువులు రావడం లేదనే వాదనకు ఆస్కారం కలిగించే రెండు మూడు సంఘటనల్ని కూడా ఉదహరించారు రచయిత. విలువైన భూముల ఆక్రమణ కోసం శవాలను తినే జీవరాశి రావడం లేదనే వాదనను పుట్టించారనే ఇంకో వర్గపు అభిప్రాయానికి కూడా అవకాశం కల్పించాడీ నవలా రచయిత.

ఇది ఒక మౌలికమైన విషయాన్ని అద్భుతంగా చర్చకు పెట్టిన నవల. తెలుగులో రాయబడ్డ నవలేనా అన్నంత సహజంగా అనువదించారు అనువాదకులు ఎలనాగ.

You may also like

Leave a Comment