శ్రీ త్యాగరాజ గానసభలో రసజ్ఞులతో కిటకిటలాడుతున్న సంగీత కచేరీలో రామాచార్యులుగారి సంగీత గాత్రం బహు రసవత్తరంగా సాగిపోతోంది. కానీ ఇంతలో కొంతమంది పొగరుబోతు యువతరం సరాసరి సభా వేదిక పైకి వచ్చి రామాచార్యులుగారు పాడుతున్న త్యాగరాజ కృతిని అవహేళన చేశారు. అంతటితో ఊరుకోక ఇదే కీర్తనను మోడరన్ శైలియైన ఫ్యూజన్‌లో పాడమని అహంకార ధోరణిలో ఆదేశించారు.
సభావేదికపైకి వచ్చిన పోకిరీ మూకను అదుపు చేయటానికి సెక్యూరిటీ గార్డులు కూడా వేదికపైకి వచ్చి వారిని అదుపు చేయటానికి లాఠీచార్జ్ చేశారు. ప్రక్క వాయిద్యాలైన ఫిడేలు, మృదంగం మరియు కంజీరా, తాళములు ఒక్కసారిగా ఆగిపోయాయి. రామాచార్యులుగారు ఈ అనూహ్యమైన సంఘటన చూచి తీవ్ర ఆవేదనకు లోనై కోపంతో ఆయన ముఖమంతా కందగడ్డలా తయారయ్యింది.
అయినా పొగరుబోతు యువకులు మాత్రం ‘‘రామాచార్యులుగారు మీరు మోడరన్ స్టైల్‌లో, ఫ్యూజన్‌లో ఇదే కీర్తను పాడి తీరాలి’’. అప్పుడే మీరు నిజమైన సంగీత సామ్రాట్ అంటూ రెచ్చగొట్టే ధోరణిలో నినాదాలిచ్చారు.
రామాచార్యులుగారు తన రాగి పాత్రలోని మంచినీళ్ళను గడగడా త్రాగి అదే త్యాగరాజ కీర్తనను మోడరన్ స్టైల్‌లో, ఫ్యూజన్ శైలిలో అద్భుతంగా ఆలాపించారు. ఆయనకు మధుర గానానికి మంత్ర ముగ్ధులైన ఆబాలగోపాలం పరవశించిపోయారు. తప్పట్లతో రామాచార్యులుగారిని అభినందించారు. తదనంతరం ప్రేక్షకులంతా నిలబడి ఆయనకు ‘‘స్టాండిరగ్ ఒవేషన్’’ను గౌరవ సూచకంగా తెలియజేశారు.
కళాకారులందరికీ సన్మాన కార్యక్రమం అయిన తరువాత ఆయన ప్రసంగిస్తూ ‘‘కళాకారులకు ముఖ్యంగా గాయకులకు శాస్త్రీయ సంగీతమైనా లేక ఆధునిక డిస్కో, ఫ్యూజన్ సంగీతమైనా ఒక్కటే. కానీ మాయొక్క బృందానికి ముందుగా మీరు తెలియజేస్తే మేము కచేరీకి కావలసినంత రిహార్సల్స్ చేసుకుంటాము. అలాగని సంగీత కళాకారులంతా ఇలాంటి ప్రకియలు, జుగల్ బందీలు అప్పటికప్పుడే పాడలేరు. కానీ నాకూ, నా బృందానికీ ఇలాంటి సమస్యలు, అభ్యర్థనలు ఎదురవుతాయన్న ధోరణిలో మేము ఫ్యూజన్ సంగీతాన్నికూడా సాధనచేయటం, తద్వారా మీ అభినందనలు పొందటం మా అదృష్టంగా భావిస్తున్నాను.
రామాచార్యులుగారు ప్రసంగిస్తూ… ముఖ్యంగా ఈనాటి కార్యక్రమంలోని పాల్గొన్న యువతరానికి ప్రత్యేక కృతజ్ఞతలు అని చెప్పటంతో పోకిరీ మూక యొక్క అహం దెబ్బతింది. వెంటనే ఆ ప్రక్కగా ఉన్న పూలకుండీలను తీసుకొని ఆయనపైన విసిరేసి, వేగంగా అక్కడ నుండీ పారిపోయారు.
ఆయన తలకు తీవ్రగాయం అవటంతో హుటాహుటిన ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అక్కడ ఆయనకు రెండు రోజులు వైద్యం చేశారు డాక్టర్లు.
* * *
క్లాస్ ఫస్ట్ మోక్ష. అంతేకాకుండా మిగతా ఐచ్ఛిక విషయాలలోను, పోటీలలోను కూడా ఎన్నో ఉత్తమ బహుమతులను అందుకొంది రామాచార్యులుగారి పెద్దమ్మాయి మోక్ష. విరామ సమయంలో తోటి విద్యార్థులందరూ కాఫిటేరియాకెళ్లి హాయిగా బాతాఖానీ కొడుతున్నారు. కానీ మోక్ష మటుకూ తరగతి గదిలోనే కూర్చుని పాఠ్యాంశాలు చదువుతూ, వ్రాసుకుంటోంది. అదే అదనుగా తీసుకున్న అజయ్ కుమార్ మోక్ష దగ్గరకు ఏదో పుస్తకం కావాలనే ఒంకతో రావటం మొదలుపెట్టాడు.
అజయ్ కుమార్ నిజంగానే చదువుతాడేమోనని నమ్మి తన పుస్తకాలను అతనికిచ్చింది. అదే అదనుగా చేసుకొని ఆ పుస్తకాలలో ప్రేమ లేఖలను వ్రాసి మోక్ష కిచ్చాడు. ‘‘మోక్ష నా మాట విను, ఒక్కసారి నాతో అలా పార్క్ కి రా హాయిగా మనసు విప్పి మాట్లాడుకుందాం’’ అంటూ ఏవేవో మాయ మాటలు చెప్పేవాడు.
ఒక రోజు మోక్ష అజయ్ కుమార్ మాట్లాడుతుండగా ప్రిన్స్‌పాల్ తరగతి గదిలోకి వచ్చాడు. ఏం చేస్తున్నారిక్కడ మీరిద్దరు? అంటూ కోపంతో ప్రశ్నించాడు. సార్! మోక్ష రమ్మంటేనే నేను వచ్చాను. ఇవిగో మోక్ష నా కిచ్చిన పుస్తకాలు చూడండి. అంతేకాదు సార్! నన్ను ప్రేమిస్తున్నట్లు ప్రేమ లేఖ కూడా రాసింది సార్! అని ఆమె పుస్తకంలో నుండీ ఒక ఉత్తరాన్ని ప్రిన్స్‌పాల్‌కి ఇచ్చాడు మాయామాటల పోకిరీ అజయ్‌కుమార్. ఈ సంఘటన జరుగుతున్న సమయానికి తోటి విద్యార్థులంతా తిరిగి తరగతి గదికి వచ్చి మోక్షని, అజయ్‌కుమార్‌లను దోషులుగా చూశారు.
కాలేజీ గోడలపై మోక్ష, అజయ్‌కుమార్లపై పిచ్చిరాతలు రాశారు ఆకతాయి విద్యార్థులు. మోక్ష తండ్రి రామాచార్యులు వచ్చి ప్రిన్స్‌పాల్‌తో మాట్లాడారు. అసలు మా అమ్మాయి ఎవరితోనూ మాట్లాడదండీ. తన చదువేదో తను చదువుకుంటుంది. మా అమ్మయాని మాత్రం నా మీద దయఉంచి డిబార్ చేయకండి అని ప్రాధేయపడటంతో ప్రిన్స్‌పాల్ శాంతించాడు.
‘‘రామాచార్యులుగారు మీ అమ్మాయి చాలా మంచిదని నాకు తెలుసు, ఈ కాలంలో కూడా ఇలా మెత్తగా ఉంటే మన నెత్తిమీద ఎక్కి నాట్యం చేస్తారందరూ’’ అని ఆయనకి ధైర్యాన్ని చెప్పటంతో సంతోషంతో ఇంటికి చేరుకున్నాడు ఆయన. అయినా ఆ రోజు సభలో మీరు ఫ్యూజన్ సంగీతం పాడకుండా ఉంటే బాగుండేది. ఒకవేళ పాడేరే అనుకోండి! అనవసర ప్రసంగం ఇవ్వకుండా ఊరుకోవచ్చుగా! అంటూ భార్య శ్యామలాదేవి దీర్ఘాలు, అభాండరాగాలు తీసింది. ‘‘దీన్నే మూలిగే నక్కపైన తాటిపండు పడటం అంటే’’ అని కోపంతో చిరాకు పడ్డాడు రామాచార్యులు.
ఆ రోజు ఇంట్లో ఎవరూ భోజనాలు చేయలేదు. దాదాపు వారం రోజుల వరకూ మోక్ష కాలేజీకి వెళ్ళలేదు. అక్కా నీవు ఇలా డిగ్రీ స్థాయికి వచ్చి కూడా గట్టి పడకపోతే ఈ సమాజంలో నీవు బ్రతకటం చాలా కష్టం. అందుకే నాలాగా మాటకు మాట రఫ్ గా జవాబు చెప్పటం నేర్చుకో. ఇలాంటి పొగరుబోతు మూకలున్నారనే కదా నేను కరాటే కూడా నేర్చుకుంటున్నానని అక్కను ఓదార్చింది చెల్లాయ్ దీక్ష.
మోక్ష డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉంది. దీక్ష సెకండ్ ఇయర్ చదువుతోంది. నాన్నా! నాకు డిగ్రీ చదవటం ఇష్టం లేదు. నీకు లాగానే మన శాస్త్రీయ సంగీతం, నాట్యం నేర్చుకుంటానని చిన్నమ్మాయి దీక్ష అడగడంతో సంగీతంతోపాటు మన కూచిపూడి నాట్యం కూడా నేర్పిస్తూ చిన్న కుమార్తెను ప్రోత్సహిస్తున్నాడు పెద్ద మనసున్న రామాచార్యులు.
కాలక్రమేణా పరిస్థితులు చక్కబడుతున్నాయని తలచిన మోక్ష తిరిగి కాలేజీ కెళ్ళటం ప్రారంభించింది. కానీ మోక్ష మనసులో ఏదో భయంగానే ఉంది. అంతేకాకుండా ఏదో తప్పుచేసిన దానిలా బాధపడుతోంది. దారిలో అమ్మవారి గుడికెళ్ళదామని అటుగా నడుస్తుండగా, అతివేగంగా వచ్చిన ఇన్నోవా కారులో పొగరుబోతు మూకతో రింగ్ లీడర్ అజయ్ కుమార్ వచ్చి మోక్షని కిడ్నాప్ చేసి వేగంగా తీసుకుపోవటం మెరుపు మెరిసినట్లు క్షణాల్లో జరిగిపోయింది. ఊరి పొలిమేర్లకు ఆమెను తీసుకుపోయారు. పొగరుబోతు మూకలందరూ మోక్షని పైశాచికంగా పాడుచేసి, తమ మృగ కామ వాంఛను తీర్చుకున్నారు. ఆ తరువాత కాళ్లు చేతులూ కట్టేసి నదిలోకి విసిరేశారు. కేకలు వేయటానికి నోరు కట్టేసి ఉంది. నీళ్ళు త్రాగి త్రాగి ఊపిరాడక కట్లు విడిపించుకోవటానికి విశ్వం ప్రయత్నం చేసి విఫలమైపోయింది పాపం. మోక్షకి మోక్షం వచ్చేసింది.
* * *
డిగ్రీలు పూర్తి చేసిన తరువాత తన ఇద్దరు కుమార్తెలకూ వివాహాలు చేద్దాం అనుకున్నారు రామాచార్యులు దంపతులు. కానీ విధి ఆడిన భయంకర నాటకంతో ఇలా దారి తప్పిపోయింది జీవితం అని ప్రతిక్షణం కుమిలిపోతున్నారు.
పొగరుబోతు అజయ్ కుమార్ స్నేహితులతో కలసి మోక్షను బలాత్కారం చేసి, హత్యచేసినా న్యాయస్థానాలకు వాటికి సంబంధించిన సరైన ఆధారాలు దొరకలేదు. దొరకకుండా చేశాడు అజయ్‌కుమార్ తండ్రి. ధన మదంతో చట్టాన్ని మాయచేసి కేసును కొట్టేయించిన కలియుగ రాక్షసుడు.
చిన్నమ్మాయి దీక్ష తండ్రివలే తను కూడా సంగీత కచేరీలు ఇస్తోంది. దీక్ష నాట్యంలో ప్రవీణతను సాధించి కూచిపూడి మరియు ఇతర రంగస్థల ప్రదర్శనలు ఇస్తోంది. అందుకే దీక్షకు సినిమా అవకాశాలు కూడా రావటం మొదలయ్యాయి.
ఒకరోజు నాటకోత్సవంలో ‘‘మహిషాసుర మర్థిని’’ నాటకం వేస్తున్నారు. అందులో మహిషాసుర మర్థినిగా దీక్ష నటిస్తోంది. కానీ ఆ రోజు నిత్యం తమ బృందంతో వచ్చే మహిషాసుర పాత్ర వేసే కళాకారుడు ఆ రోజు రాలేదు. గ్రీన్‌రూమ్‌లో మేకప్ వేసుకుంటోంది దీక్ష. ఇంకొక కొత్త కళాకారుణ్ణి తీసుకొచ్చి వేషం వేయించి నాటకానికి సిద్ధం చేయించాడు మేనేజర్ మాణిక్యాలరావు.
మహిషాసురమర్ధిని నాటకం మొదలయ్యింది. నాటకంలోని ప్రతి సన్నివేశం రక్తి కట్టడంతో ఆహుతులు కరతాళ ధ్వనులు చేస్తూ ఈలలు, అరుపులు, కేకల మధ్య నాటకం మంచి రసవత్తరంగా సాగుతోంది.
ఓరీ మహిషాసురా! భక్తులనూ, బలహీనులను దేవతలను సైతం అరాచకంగా హింసిస్తున్నావు కదరా! నీకు ఈనాటితో ఆయువు మూడిరది. నీ అకృత్యాలన్నీ అంతమయ్యే కాలం దగ్గరపడిరది! అని భయంకరంగా విజయవికట్టాహాసం చేసింది విజయదుర్గ.
అయిగిరినందిని విశ్వవినోదిని…. అనే స్తోత్రాన్ని ఆలపిస్తూ మహిషాసురుని మీదకు ఒక్కొక్క అస్త్రాన్నీ ప్రయోగించింది. విజయదుర్గ, కాళీమాత మరియూ అపరచండీ దీక్ష. ఆమె ప్రయోగించే అస్త్రాల నుండీ తనను తాను కాపాడుకుంటున్నాడు మహిషాసురుడు.
ఆ మహిషాసురుని వేషంలో ఉన్న వ్యక్తిని ఎక్కడో చూచినట్లుంది అపరచండి దుర్గjైున విజయ దుర్గ దీక్షకు. అతడే అజయ్‌కుమార్ అని గుర్తించింది. వెంటనే ఆమెకు పూనకం వచ్చి రౌద్ర దుర్గగా మారింది. అతనిని అంతం చేయటానికి ఇదే అదునైన సమయం అని సంకల్పించింది దీక్ష. ఆమె మనసులో అమాయకురాలైన అక్క మోక్ష రూపం కదలాడుతోంది. ఇదే సరైన సమయమని పళ్లు గట్టిగా బిగించి కాళికాదేవిని ప్రార్థించింది. దీక్ష నాటభైరవి రాగాన్ని దిక్కులు పెక్కటిల్లేలాగా ఆలపిస్తూ, అవని కృంగిపోయే లాగా నాట్యం చేస్తోంది.
దీక్ష వెనకాల ఇంకా 8మంది అమ్మవార్లు వేషధారులై ఆయుధాలు ధరించి వున్నారు. అదే సమయంలో భారీ ఎత్తున భూకంపం సంభవించింది. అనుకోకుండా శరవేగంతో అమ్మవారి చేతినుండి త్రిశూలం జారి మహిషాసురుని (అజయ్‌కుమార్ కుక్షిలో దిగబడిరది) రక్తం కక్కుకుంటూ మహిషాసురుడు ఆర్తనాదాలు చేస్తూ మరణించాడు. సైకో శాడిస్టు అజయ్‌కుమార్ అంతరించిపోయాడు. దుష్టసంహారిణి విజయదుర్గ.