Home వ్యాసాలు నాంధో గృహిణులు

నాంధో గృహిణులు

ప్రబంధాల ముఖ్య లక్షణం అష్టాదశ వర్ణనలు.అందులో ఋతు వర్ణన ప్రముఖమైనది.శ్రీకృష్ణ దేవరాయలవారు తమ ఆముక్తమాల్యద లో ప్రకృతిని అనేక కోణాలలో దర్శించి, మనకి దర్శింపజేసారు.

పూర్వకాలం మనిషి జీవితం ప్రకృతితో మమేకమైనది.భారతీయ జీవన విధానంలో అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది.తినే తిండి,వేసుకునే బట్ట,చేసే పనులు,జరుపుకునే పండుగలు, ఇలా వ్యక్తిగత జీవితం మొదలుకొని సాంఘిక వ్యవహారాల వరకూ అన్నీ ప్రకృతిపై ఆధారపడినవే.వివిధ ఋతువర్ణనలలో రాయల వారు వాటిని మన కళ్ళకు కట్టిస్తారు.అలాంటి ఒక సజీవదృశ్యం ఈ పద్యం:

సీ. ఇల్లిల్లు దిరుగ నొక్కింతబ్బు శిఖి యబ్బె
నేనింటిలో బూరి యిడి విసరక
రాజదు రాజిన రవులుకోల్ వాసాల
గాని కల్గదు మఱి దాన గలిగె
నేని కూడగుట మందైన
బెన్పొగ సుఖ
భుక్తి సేకూర దా భుక్తి కిడిన
బ్రాగ్భో క్తలకె తీఱు బహుజనాన్నము దీఱ
నారుల కొదవు బునఃప్రయత్న

తే. మాజ్యపటముఖ్య లయ మొన్న రాలయాంగ
దారు లయ మెన్నరంతిక కారజనిక
పచన నాంధోగృహిణి రామి బడక మరుడు
వెడవెడనే యార్ప నొగిలి రజ్జడిని గృహులు

వాక్యాలు ఒక పాదంలోంచి ఇంకో పాదంలోకి ఇలా చొచ్చుకుపోయే సీసాన్ని గునుగు సీసంఅంటారు.వాటిని విడగొట్టుకున్నాక కొంత అర్థం అవడం మొదలుపెడుతుంది.కానీ,
రవులుకోల్,మందు,ప్రాగ్భోక్తలు-మొదలైన పదాలు ముందుకు సాగకుండా అడ్డుపడుతుంటాయి.
వీటన్నింటినీ దాటుకువెళ్లినా ఎత్తుగీతి కొరుకుడు పడడం చాలా కష్టం.అందులో ఉన్నవన్నీ చాలా వరకూ తెలుగు పదాలే. అయినా ఇది నారికేళపాకం! దానికి కారణం రాయల వారికే ప్రత్యేకమైన పదాల పోహళింపు, వాక్య నిర్మాణం.బహుశా ఇది సంస్కృత వాక్య నిర్మాణ ప్రభావంతో అదే తరహాలో తెలుగు వాక్యాలను చేర్చడం వలన కలిగిన అన్వయ క్లిష్టత.
సంజీవని అనే పేర వేదం వెంకటరాయశాస్త్రి గారు,సౌందర్య లహరి* అనే పేర తుమ్మపూడి కోటేశ్వరరావు గారు ఆముక్తమాల్యదకు వ్యాఖ్యానాలు రచించారు.

వానాకాలంలో ఇల్లాళ్లకు పొద్దుననుండీ రాత్రిదాకా వంటపనితోనే సరిపోయేది.వారి అవస్థ ఏమిటో వివరంగా చెప్పారీ పద్యంలో.ఇల్లిల్లు తిరిగితే కానీ కాస్తంత నిప్పు దొరకదు.ఒకవేళ దొరికినా, ఆ నిప్పుని మంటగా రాజెయ్యాలంటే గడ్డి పెట్టి విసరాలి.అదెక్కడినుండి వస్తుంది?ఇంటికప్పునుంచి (పూరి గుడిసెలే కాబట్టి).దానివల్ల కొద్దిగా నిప్పు రాజుకుంటుంది కానీ,అది వంటంతా అయ్యేంత రగులుకోవాలి.(రవులుకొను అనే క్రియకి నామరూపం రవులుకోల్) అంటే గడ్డి సరిపోదు.కట్టెలు కావాలి.అవి కూడా పాపం ఇంటి వాసాలనుంచే. అలా వాసాలు పీకి వంట చేయడం మొదలెట్టినా, కూడు పూర్తిగా(అన్నం,కూరలు వగైరా) అవ్వడం చాలా కష్టం(మందు అంటే దుర్లభం అని అర్థం).
ఒకవేళ ఏదో అయింది తిందామన్నా,తినడం కుదరదు.సరే, అలాగే తినడానికి వడ్డించినా,చాలామందికని వండిన అన్నం(బహుజనాన్నము),
మొదటి పంక్తిలో కూర్చున్నవారికే(ప్రాక్ భోక్తలకే) అయిపోతుంది.దానితో,
ఆడవాళ్లకి(నారులకు) వంట ప్రయత్నం మళ్లీ మొదలౌతుంది! అంతిక అంటే పొయ్యి. పొయ్యి మళ్లీ రాజెయ్యాలి.ఆజ్యపటము అంటే నేతిలో తడిపిన వస్త్రం.ఆలయ అంగదారులు అంటే ఇంటిలో భాగమైన కట్టెలు(వాసాలు).అలా ఆరజనిక అంటే రాత్రయినా కూడా, వంట(పచన) చేస్తూ, చేస్తూ,ఆ గృహిణులు వంటపనులతో తీరిక లేక, నాంధస్(అన్నము లేని) గృహిణులుగా మిగిలిపోతారు.

ఇలా పద్యమంతా వానాకాలంలో గృహిణుల ఇక్కట్లను వర్ణించి,కొసమెరుపుగా ఆఖరి పాదంలో ఒక అనుకోని ముక్తాయింపునిచ్చారు.
పద్యానికి అసలు బిగింపు దాని ముగింపులో వేసారన్నమాట !

ఒకపక్క వంట పనులతో, తిండి కూడా తినకుండా గృహిణులు సతమతమవుతుంటే,
మరోపక్క భార్య ఇంకా పడకగదిలోకి రాదేమని మగరాయుళ్లు మన్మథ బాధతో వేదన పడుతుంటారట!

ఇలాంటి ఊహించని ముగింపు పద్యానికి పరిపుష్టతను చేకూర్చింది.

You may also like

Leave a Comment