Home కవితలు నాన్నా.. నాక్కొంచెం ధైర్యం యివ్వు

నాన్నా.. నాక్కొంచెం ధైర్యం యివ్వు

by Madhu Jella

నీ చూపులనే
గొడుగగా పట్టి
నా వెంటే నీవున్నపుడు

ఆ గొడుగు నీడలో
నా నడకలు సాగుతున్నపుడు
ఏ భయమూ లేదు
నీవుంటే
నా వెంటే ధైర్యం

నీ తోడుగా…
నాకు తెలియని
లోకాలెన్నో చూసాను
నా రెక్కల గుర్రం నీవే

నా ఎదుగుదలకు
ఉప్పొంగి పోయి
లోకమంతా చాటింపు వేసావు
గర్వంతో..
నా ఉన్నతి
ఉచిత ప్రచారకర్తవు నీవే

మంచి చెడుల మధ్య ఉన్న
చిన్నని గీత ఆనవాలేమిటో
లోకుల తత్వమేమిటో
విశ్లేషించుకొనే
శక్తినిచ్చావు
నీవో మనస్తత్వ నిపుణుడివి గదా..

ఉన్నపుడు పొంగిపోకుండా
లేనినాడు కుంగిపోకుండా
బతకడం నేర్పించావు
బతుకుదారిలో…
నా తోడొచ్చే బాటసారివి నీవే కదా

కఠినంగా… అనిపించినా
నవనీతమువంటి
సున్నితత్వము నీవు

బతుకుబండిని లాగడానికి
ఎన్నెన్ని కష్టాలు పడ్డావో
ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నావో…

చిన్నప్పుడు నీతో ఉన్న ఙ్ఞాపకాలు
అంతగా గుర్తులేదుగానీ
ఊహ తెలిసిన నాటి ఙ్ఞాపకాలు
మదిపుటలలో
పదిలంగానే ఉన్నాయి

నేస్తంగా..
ఎన్నో ముచ్చట్లు చెప్పేవాడివో
గురువుగా ఎంత ఙ్ఞానము
పంచావో
ఏమీ తెలియని అనామకునిలా
అమాయకుడిలా
లోకానికి తెలిసిన నీవు
అన్నీ తెలిసిన
ఓ మహాఙ్ఞానివి
మహాయోగివి
నిరాడంబర నిష్కామ యోగివి
నేనెరిగిన సత్యమిదే

నీవు..
యిప్పుడు నా చెంత లేవు
నా కష్టసుఖాలను చూసే..
వినే
ఆప్తులూ.. లేరు
చింత తీర్చే నేస్తాలూ..లేరు

నా ఆనందాలను ఆస్వాదించేవారూ
నా దుఃఖాలకు
ఓదార్పునిచ్చేవారు కరువు
‘నాన్నా’… మరలి రావూ…
నాకు ధైర్యంగా నిలువు
నా బాధ్యతలు..బంధాలలో
తోడై నడువు

నాన్ననైన నేను
నా బిడ్డల తోడుగా
నడిచే
ధైర్యం యివ్వు

You may also like

Leave a Comment