Home కథలు నిర్ణయం

నిర్ణయం

by Madhu Jella

ఆదివారం.. పిల్లలు..ఆయనా బయటికెళ్ళారు.పనులన్నీ తీరినాక టీవీ ఆన్ చేసి సీరియల్ చూస్తూ కూర్చున్నా. అంతలో ఫోన్ మ్రోగింది..ఆయనదే.ఇంట్లోనే మరిచిపోయినట్లున్నాడు.పట్టించుకోలేదు.
నాలుగైదుసార్లు అదే పనిగా ఫోన్ రింగవుతూంటే .. నేనే వెళ్ళి లిఫ్ట్ చేసా. “హలో సార్..’ ఓ స్వీట్ వాయిస్ పలకరించింది. ‘హెలో..ఎవరు’ అన్నాను.’సార్ .. సార్ లేరా అండీ’ అంది. ‘లేరు.. ఫోన్ ఇంట్లోనే పెట్టి బయటికెళ్ళారు’.ముక్తసరిగా అనేసరికి కాల్ కట్ చేసింది. కొద్దిసేపటికి
మళ్ళీ అదే నంబరు నుండి కాల్.కట్ చేసా. మళ్ళీ కాల్ చేస్తున్నారెందుకో..చిరాకేసింది.
మళ్ళీ కాల్ వస్తోంది.ఇప్పుడు.. కాల్ లిఫ్ట్ చేయగానే ‘హలో..’ అదే గొంతు.తీయగా పలకరిస్తోంది.’ఎవరు?’ .. కొద్దిగా గట్టిగా అనగానే కాల్ కట్ చేసింది.
బయటికెళ్ళి ఇంకా ఈయన రానేలేదు. ఈ ఫోన్ల గోలొకటీ..వెంటతీస్కెళ్ళొచ్చుగా..
ఉన్నట్టుండి ఏదో ఆలోచన మనసులో మెదిలి కళుక్కుమంది. ఏదో అనుమానపు తెర మనస్సును కమ్మేయబోతుంది .ఆ ఊహే భయం కలుగజేసింది.. ఎంత కంట్రోల్ చేసుకున్న..ఆ ఫోన్ కాల్.. తీయని గొంతు.. గుర్తుకొస్తున్నాయి..ఈయనేమైనా….అంతటితో బలవంతంగా ఆ ఆలోచనను మానుకుందామని ప్రయత్నిస్తున్నా..
ఇంతలో అదే నెంబరు నుండి మళ్ళీ కాల్ వస్తోంది.
కాల్ లిఫ్ట్ చేసి ‘హలో..ఎవరు మీరు. కాల్ లిఫ్ట్ చేస్తే మాట్లాడకుండా కట్ చేస్తున్నారు.విషయం ఏమిటో చెప్పండి ‘ గట్టిగా అన్నాను. ‘హలో.. అమ్మ..సార్ లేరా?.. ఇప్పుడు మధ్య వయస్సు ఆవిడ మాట్లాడుతోంది.’అమ్మా.. సార్ గారికి చాలా థాంక్సమ్మా.. నిన్న సార్ గనుక సాయం చేయకుంటే నా కొడుకు ప్రాణాలతో బయటపడేవాడే కాదు. మా చిన్నబ్బాయి నిన్న బైక్ ఆక్సిడెంట్ అయి పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూంటే అక్కడే ఉన్న సార్ హుటాహుటిన దగ్గరలో ఉన్న హాస్పిటల్ లో జాయిన్ చేసి అవసరమైన సాయం చేసాడు.మా వాడి ఫోను,పర్సులో ఉన్న అడ్రస్ తో మాకు సమాచారమిచ్చాడు తల్లి. గాబరాగా..అందరం షాక్ తోనే హాస్పిటల్ కి వెళ్ళాం.మమ్మల్ని సారే గుర్తించి మా అబ్బాయిని ఉంచిన వార్డు కు తీసికెళ్ళాడు.డాక్టర్లతో మాట్లాడించి, మాకు ధైర్యం చెప్పాడు. ఇంతకు ముందు కాల్ చేసింది మా అమ్మాయేనమ్మా..ఆ సార్ కి ఫోన్ చేయమని నేనే చెప్పాను. బాధలో,కంగారులో సార్ పేరు కూడా కనుక్కోలేదు. సార్, మాకు ఫోన్ చేసిన నెంబరు గుర్తించి ఫోన్ చేస్తున్నాము తల్లీ.. దేవుడిలా వచ్చి నా కొడుకుని రక్షించాడమ్మా.. అందరిలా ఆయనా వదిలేసి వెళ్ళుంటే..”’ ఆమే గొంతు గద్గదమైంది.వెక్కి ఏడుస్తోంది..తనే ‘ నా కొడుకు ప్రాణాలు నిలబెట్టాడు.. ఆయనకు చాలా ఋణపడి ఉంటామమ్మా.. సార్.. మీరందరూ చల్లగా ఉండాలి తల్లి.. సార్ తో చెప్పమ్మా..మా వాడు బాగానే ఉన్నాడు..” కృతజ్ఞతతో నిండిన గొంతుతో చెబుతూ ఆమె ఫోన్ పెట్టేసింది.
కొద్ది సేపు నన్ను మౌనం ఆవహించింది. చాలా గిల్టీగా అనిపించింది. క్షణంలో మనసు చేసిన మాయలోపడి మా ఆయనని అపార్థం చేసుకొనే స్థాయికి వెళ్ళినందుకు. ఇప్పుడు మనసు తేలికైంది.ఆ పెద్దావిడ మాటల్లో వినిపించిన కృతజ్ఞతాభావం నాలో మా ఆయనపట్ల ఉన్న ప్రేమా, నమ్మకమూ మరింత బలపడ్డాయి.. తాత్కాలికంగా నా మనసును ముసిరిన అనుమానం మబ్బు తెరలు ఒక్కసారిగా తొలగిపోయాయి. అపోహపడినందుకు మనసులోనే క్షమాపణలు కోరుకున్నా. ఎవరూ కూడా పూర్తిగా విషయం తెలుసుకోకుండానే ఎవరినీ.. మనవారినీ..అయినవారినీ అపార్థం చేసుకోవద్దని నిర్ణయించుకున్నా. అలికిడైతే ఈ లోకంలోకొచ్చి..గేటుతీసుకుని ఇంట్లోకి వస్తున్న మా ఆయనవైపు కన్నార్పకుండా ఆరాధనభావంతో చూస్తున్నా…
– మధు జెల్లా
30/12/22.
ఇది నా స్వీయ రచన.. మధు జెల్లా

You may also like

Leave a Comment