———————–
ప్రవహించిన నది
పూర్తిగా కప్పేసింది నేలని
ఉప్పొంగిన నది స్థిరమై
కొండని కోనని ముంచేసింది
నది చుట్టూ వర్థిల్లిన మనుగడ ను మట్టెట్టింది
గూగుల్ కి అందని గూడేలని సైతం గుటుక్కు మింగింది
నదిని ఆసరాగా చేసుకుని తీరాన ఆవాసాలు
ఒండ్రు మట్టి నేల ఆసరాగా ఆలంబన
తమదైన సంస్కృతి విరాజిల్లిన నేల
జంతు సావాసం లో ఎదిగిన మనిషి
మునిగిన గుడిసెలో గతాన్ని నెమరు వేసుకుంటూ రేపటి కోసం ఆలోచనలో
ఎన్ని గుడిసెల్లోనో ఎన్ని బతుకుల్లోనో శోకాన్ని నింపిన నది
ఆవేశం ఆక్రోశం చల్లారి అడ్డుకట్టని సుతారంగా తాకుతుంది
వెనుకకు తిరిగి చూసుకుంటే తాను చేసిన విధ్వంసం తాలూకు మచ్చలు కానవస్తాయి
ఒక్కో చెట్టు ఎన్నేళ్ళ ప్రాయమో
యవ్వన దశలోని చెట్లు సైతం ఆయుస్సు గూడి గూడేల తో పాటు జల సమాధి
చెట్టు తో పాటు మీది గూడు మునిగితే తల్లడిల్లిన పిట్ట ప్రాణం
తమతో పాటు తమ కోసం పారిన నది నట్టేట ముంచుతుందని ఊహించని జీవ రాశులు
ఎంతటి మిత్ర ద్రోహం! మహా విషాదం!!
మనిషి అంతే.. తన సమూహంతో
ఓ తెగ ఓ జాతి వలస
అన్నీ కోల్పోయి ఇంకా ఎత్తైన కొండ మీదికి అదే చోటు
మైదానం రుచించదు
అవే విల్లులు అవే బాణాలు అదే వేట
ఆ అడవి లో దొరికేవే ఆహారం
ఇంకో చెట్టు కి పుట్ట కి మొక్కు
తనదైన బతుకు ఎవ్వరికీ హాని కలిగించక
అక్షరం లేక పోయినా తన తరపున గొంతులు విప్పారవని ఎరుగు
వెనుక ముంచి ముందుకు సాగేకాలువల్లో
కమురు వాసన పసి గట్టలేరు
ఆనవాళ్ళు లేని ఇళ్ళు వెనుక
గుమ్ములు నిండే ఇళ్ళు ముందు
రెంటి మధ్య నవ నాగరికుల పోలవరం
ఎవరికి వరం!! ఎవరికి శాపం!!!
– గిరి ప్రసాద్ చెలమల్లు
9493388201
201 క్లాసిక్ అవెన్యూ మియాపూర్ హైదరాబాద్ 500049