Home వ్యాసాలు నీలి మేఘం. నిరంతర యజ్ఞం..!

నీలి మేఘం. నిరంతర యజ్ఞం..!

by ShailajaMitra

మనిషి జీవితం నుండి వేదన పుడుతుంది. కవి జీవితం నుండి ఆవేదనకు, ఆవేశానికి అన్నింటికీ కవిత్వం పుడుతుంది. ఈ రెండు పార్శ్వాలనుండే కవి స్పందిస్తాడు. జీవితం నుండి ఎప్పుడైతే కవిత్వం వచ్చిందో దానికి సజీవకత, శాశ్వతత్వ్వం ఏర్పడుతుంది. కవితా ప్రపంచం ఇంతగా విస్తరించినా ఇప్పటికీ కొందరు స్త్రీలు తమ ఆవేదనను నిశ్శంకోచకంగా పంచుకోలేరనే అనిపిస్తుంది. స్త్రీకి అన్యాయం ఆదినుండి జరుగుతూనే ఉంది. కానీ ఆ అన్యాయం ఎక్కడనుండి అనలేము. కొందరికి పుట్టుకనుండే జరుగుతుంది. కొందరికి మెట్టినింటి నుండి ప్రారంభమవుతుంది. పుట్టుక అనేది మన చేతిలో లేదు. ఎక్కడ ఎందుకు పుడతామో తెలియదు. కానీ వివాహం అనేది స్త్రీ అయినా, పురుషుడైనా తమకు ఇష్టానుసారం జరగాలనేదే ప్రయత్నం. కనీసం నీకిష్టమేనా అని అడగకుండానే వివాహాలు కొన్ని లక్షలు జరిగాయి. వివాహం ఇష్టమైతేనే పిల్లలు జన్మిస్తారు అనేది వుండివుంటే ఈ జనాభా ఇంత పెరిగేది కాదేమో! అనుకుంటుంటాను అప్పుడప్పుడూ… ఎప్పుడైతే స్త్రీ శరీరం వాడుకునే వస్తువులా మారిందో ఒక చేతిరుమాలును ఉపయోగించినట్లుగా, ఒక తువ్వాలును ఉపయోగించినట్లుగా ప్రతి ఒక్కరూ వాడుకోవడానికే ప్రయత్నించారు. ఇప్పటికీ ఇంకా ఇంకా ప్రయత్నిస్తూనే వున్నారు. అలా ఎవరు పడితే వారు, ఎక్కడ పడితే అక్కడ స్త్రీ ప్రయేయమే లేకుండా వాడుతూ పోతున్నారో. జీవితం పట్ల విరక్తి కలిగిన క్షణాల్ని మోసుకుంటూ అనేకమంది స్త్రీలు బతికేసారు. ఇంకా బతుకుతున్నారు కూడా. అత్యాధునిక యుగమైనా ఇప్పటికీ ఏదయినా ఒక మెచ్చుకోలు, లేదా ప్రశంస, ఎప్పుడో ఒక్కసారైనా ఇష్టం, ఎప్పుడైనా ఒక్కసారైనా చూపే ప్రేమ అనే పదం దొరుకుతుందేమో అని ఆశగా చూస్తున్న స్త్రీ జీవితాలన్నో…

సరే! ఇలా ఎంతకాలం? స్త్రీ పుట్టుక వున్నంతవరకూ ఇంతేనా? ఆధునికత పెరుగుతన్న కొద్దీ స్త్రీ పట్ల మరింతగా పెరిగిపోతున్న ఈ ఘోరాలు, అత్యాచారాలు, అన్యాయాలు, చులకన చూపులు, వెకిలి చేస్టలకు అంతం ఏదీ? వంటి అనేక స్త్రీ సమస్యల తాలూకు ప్రశ్నలన్నింటినీ ఒక్క ‘‘నీలి మేఘాలు’’ గ్రంథంతో సమాధానం వచ్చింది అని చెప్పకున్నా. స్త్రీ సమస్యలకు కూడా సమాధానం వుంటుంది అనిపించేలా కనిపించింది. స్త్రీ మాట్లాడటమే కాదు నిలదీసి ప్రశ్నించవచ్చు అనే ధైర్యం వచ్చింది. ‘‘నీలిమేఘాలు’’ గ్రంథం ప్రచురితమై ఇప్పటికి దాదాపు 30 ఏళ్ళు గడిచింది. అంటే దాదాపు రెండు తరాల ముందు అన్నమాట. అందులోని ప్రశ్నల తాలూకు తడి ఆరలేదు. బహుశా స్త్రీ జాతి వున్నంతవరకు వుంటుందేమో! అనిపించేలా రచించారు. ఆవేదన అనేది మనిషిని గొప్పగా మార్చే ఒక ఆయుధం. ఆవేదన నుండే ఆవేశం వస్తుంది. ఒక విధమైన తెగింపు వస్తుంది. అనడానికి ఈ గ్రంథం ఒక ఉదాహరణ. అలాగని కేవలం వేదనే వెలిబుచ్చారా అంటే కాదు. అందులో కావలసినంత కవిత్వం వుంది. శైలి వుంది. పదాల వాడకంలో అక్కడక్కడా కాస్తంత అభ్యంతరకరంగా అనిపించినా వాస్తవం వుంది. వాస్తవం ఎప్పుడూ చేదే కదా? మరి! కాకుంటే అంతకంటే ఆవేదన ఏమిటంటే ఈ గ్రంథం తర్వాత మరొక ఇలాంటి గ్రంథం రాలేదు. ఎందుకు? అనేది ఎవరికీ అర్థం కాదు. ఇకపై అడగాల్సింది ఏమీ లేదనుకున్నారా? ఇకపై ఇలా అడిగే ధైర్యం వున్నవారు లేరనుకున్నారా? ఇప్పటికి మూడు ముద్రణలు అయ్యాయంటున్నారు. నాల్గవ ముద్రణకూడా చేయాలి అని అనుకుంటున్నారు అంటున్నారు కానీ ఎవరైనా ఈ గ్రంథాన్ని గురించి అడిగితే కాపీలు రచించిన మా దగ్గరే లేవు అనే మాటలు పదే పదే వింటున్నాను. అంతలా ఇన్ని ముద్రణలు కూడా చేసాక కూడా ఒక్కరి దగ్గర కూడా ఈ గ్రంథం లేకపోవడం ఆశ్చర్యంగానే వుంది. ఏది ఏమయినా. ఎంత వెదికినా దొరకని గ్రంథాన్ని నేను సంపాదించాను. ఈ గ్రంథం గురించి వివరిస్తే నేనేదో గొప్పదాన్ని అయిపోతానని మాత్రం రాయటం లేదు. ఇప్పటివరకు నేను 750 గ్రంథాల సమీక్షలు, విశ్లేషణ వ్యాసాలు రచించాను. పత్రికలు అందించిన గ్రంథాలను కొన్ని తప్పనిసరిగా సమీక్షించాల్సివస్తుంది. అపుడప్పుడూ మనకు నచ్చిన గ్రంథం, సమాజానికి తెలియజేయాల్సిన గ్రంథాలు కూడా వుంటాయి కదా? అందుకే ఈ ప్రయత్నం. మరో తరం కూడా తెలుసుకుంటారని.. ఒక్కసారి ఇందులోని కవిత్వాన్ని పలకరిస్తే..

ఈ గ్రంథంలో కవయిత్రులు నలభైకి పైగా వున్నారు. వందకు పైగా కవితలున్నాయి. అంటే ఒక్కొక్కరు కనీసం మూడు లేదా నాలుగు కవితలు రచించారు. వీరిలో మనకు కొండేపూడి నిర్మల, ఓల్గా , విమల, ఘంటశాల నిర్మల మందరపు హైమావతి, మహెజబిన్‌, శిలాలోలిత, కుప్పిలి పద్మ గార్లు మనకు ఇప్పటికీ మనతోనే మనకు అపుడప్పుడూ ఎదురవుతూనే వున్నారు. కానీ మనకు కనిపించని వారు, వినిపించని వారు కూడా ఇందులో వున్నారు. వసంత కన్నభిరాన్‌, జయప్రభ, శివలెంక రాజేశ్వరీదేవి, కె.గీత, రజియాబేగం, పాటిబండ్ల రజని, రేవతీ దేవి, మొక్కపాటి సుమతి, ఊర్మిళ, సావిత్రి, అబ్బూరి ఛాయాదేవి,శ్రీమతి, ఏలూరి పార్వతి, అంజన, ఎస్‌.జయ, వాణీరంగారావు, కె. వరలక్ష్మి, పుట్ల హేమలత, వాణీ రంగారావు, కొండపల్లి కోటేశ్వరమ్మ, సుధ, శాంతి ప్రియ, బి. పద్మావతి, వకుళాభరణం లలిత, రావులపల్లి సునీత, వంటి వారు కూడా వున్నారు. ఈ పేర్లు ఎందుకు ఇక్కడ చెప్పానంటే మనలో చాలామంది కొందరి పేర్లు అసలు వినలేదు కనుక. ఆ పేర్లను కూడా అందరికీ వినిపించడానికి..

పూర్వకాలం నుంచీ ఒక ప్రక్క, స్త్రీని మాతృమూర్తిగా, ఇంటికి దీపంగా, త్యాగశీలిగా పరిగణిస్తూనే మరోపక్క బానిసగా, అసూర్యంపశ్యంగా, వ్యక్తిత్వం స్వేచ్ఛాలేని వ్యక్తిలా పరాధీనంలా చూసారు. కందుకూరినుండి స్త్రీ విముక్తికి మార్గం, చలం నుండి వివాహ స్వేచ్ఛ వారి రచనలద్వారా తెలియజేసారు. రంగనాయకమ్మ రచనల్లో ‘స్తీ స్వేచ్ఛ’ గురించిన ఆలోచనకి పునాది ఏర్పడిరది.అభ్యుదయ, విప్లవ కవిత్వాల్లో స్త్రీకి సముచితమైన స్థానం ఏర్పడిరది. కవయిత్రులు 1980 నుంచి స్త్రీవాద కవిత్వం విస్త్రృతంగా రావడం మొదలైంది. 1990లో త్రిపురనేని శ్రీనివాస్‌ ‘గురిచూసి పాడేపాట’ అనే సంకలనం ప్రచురించి ‘‘స్త్రీవాద కవితలు’’ అన్నారు. పురుషులకంటే స్త్రీలు రాస్తేనే స్త్రీవాద కవిత్వమవుతుందనీ, కవయిత్రులు మాత్రమే శక్తివంతంగా చెప్పగలరనీ పేర్కొన్నారు. ఈ సందర్భంలో ‘అస్మిత’ వారు 1993 అక్టోబరులో ‘‘నీలిమేఘాలు’’ అనే స్త్రీవాద కవితా సంకలనం వెలువరించారు. ఇందులో వసంత కన్నాభిరామ్‌ రాసిన ‘స్త్రీగా రాయడమంటే’ ఓల్గా రాసిన ‘సంకెళ్ళు తెగుతున్న సంగీతం’ అనే వ్యాసాలు స్త్రీవాద దృక్పథాన్ని సిద్థాంత పరిధిని వివరిస్తాయి.

నిజానికి పితృస్వామ్య సమాజంలో స్త్రీ అణచివేతకు గురవుతోంది, లైంగికత్వం, సంతానోత్పత్తి, ఇంటిచాకిరి అనేవి పురుషులు తమ ఆధిక్యతను చూపే పురుషాధిక్యత నశించాలి. స్త్రీ శరీరం, శరీర ధర్మాలు కూడా ఎప్పటికీ చర్చనీయాంశాలే. కానీ విశృంఖలత్వం కాదు. స్త్రీ శారీరక ఇబ్బందులకీ, ఆర్థిక ఇబ్బందులకీ వివాహబంధాలు, సమాజం కారణం. ఫ్యూడల్‌ పదబంధాలూ, ఆలోచనలూ వదిలి స్త్రీ సంఘర్షణనీ, ఆవేదన వ్యక్తం చేసే పదబంధాల్ని, శైలినీ నిర్భయంగా వాడవచ్చు. నైతిక ధర్మాల, మూఢాచారాల మత్తులో పడిపోకూడదు అనేదే స్త్రీవాదంలోని ముఖ్యాంశాలు. వీటిని ప్రతిఘటిస్తూ పురుషద్వేషం పనికిరాదు. స్త్రీ స్వేచ్ఛ పేరుతో కుటుంబ వ్యవస్థనీ, విచ్ఛిన్నం చేయకూడదని, అశ్లీల పదప్రయోగాలు చేయకూడదని ఎస్వీ సత్యనారాయణ తమ సంపాదకత్వంతో ఎస్‌. సూర్య ప్రకాశ్‌ సంకలనం చేయగా అభ్యుదయ రచయితల సంఘం 1997 మేలో ప్రకటించారు.

ముఖ్యంగా స్త్రీ వాదంలో 1972లోనే ఓల్గా ‘ప్రతి స్త్రీ నిర్మల కావాలి’ అనే స్త్రీవాద కవిత రాయడం విశేషం. అప్పటికే ఇంత తీవ్రంగా రాయడం వల్ల బహుశా మొదటి స్త్రీవాద కవితగా దీన్ని చెప్పాల్సివస్తుందేమో’ ‘‘అందమైన దోపిడీకి/ పవిత్రమైన హింసకూ/న్యాయమైన దాస్యానికి/ బలైపోయిన నేను / భారత స్త్రీని/ న్యాయమైన దాస్యానికి బలైపోయిన నేను భారతస్త్రీని’’ అనడంలో తిరుగుబాటు కనిపిస్తుంది.

1988 ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన కవయిత్రి జయప్రభ కవిత సంచలనం సృష్టించింది. . . అల్పాక్షరాలతో అనల్పార్థ రచన అన్నట్లు రచించిన వీరి కవిత గొప్ప స్త్రీవాద కవిత ఇది. పాతివ్రత్యమంటే రెండు భుజాలపైనుండి కొంగు కప్పుకోవడం కాదు అంటూ ‘‘ పైట కొంగును చూస్తే నాకెందుకో పాతివ్రత్యం గుర్తొస్తుంది. భుజాల నుంచి వేల్లాడే గుదిబండలా అదెప్పుడూ నా స్వేచ్చను హరిస్తూనే వుంటుంది./ నన్ను నిటారుగా నిలవనివ్వక పైట నా గుండెలపై తన అంచు చేతులాన్చి నన్ను వంగదీయాలని చూస్తుంది.. అంటూనే చివరిగా నేను నడిచే శవాన్ని కాకుండా వుండాలంటే ముందుగా పైటను తగలెయ్యాలి’’ అంటారు. పైట కొంగు స్త్రీ స్వేచ్ఛను హరిస్తోందనేది వీరి వాదన. తరతరాల స్త్రీకి ఆలవాలం అయిన పైట ఇంతగా స్వేచ్ఛను హరిస్తున్న తీరు ఆవేదన సామాన్యులకు కూడా అర్థమయ్యేలా వుంది. ‘‘వర్గశతృవు నా శ్రమనే దోచుకుంటాడు/ఈ దుష్ట శత్రువు నా బతుకే దోచుకుంటాడు/ వాడు నాకు కలనైనా కల్పిస్తాడు/ వీడు నా కలలన్నీ చెరిపేస్తాడు/ఆకాశంలో సగాన్ని చూపి మోసం చేస్తున్నాడు వాడు’’ అని మొక్కవాటి సుమతి అంటారు. వకుళాభరణం లలిత ‘‘అనాదినుంచి ప్రకృతి తో సహజీవనం నాది/ విధ్వంసం నీది/ పిల్లల కోసం నీకోసం/ కీకారణ్యాల్లో పడి వెతికి / దుంపలు మొక్కలూ ఏరి తెచ్చి పెడితే/ అవి తిని నువ్వు ఆయుధాలు తయారు చేసావు/ నన్ను ప్రకృతిగా మార్చుకున్నావు/ పశుపాలనతో నన్ను పశువును చేసి పసుపుతాడుతో కట్టాలని నేర్చుకున్నావు’’ ఉద్యమించి లేస్తున్నా కవితలో కనిపించిన స్త్రీ దుస్థితి, తుర్లపాటి రాజేశ్వరి ‘‘తాళికట్టిన మృగం’’ అని చూపే కోపంలో అన్ని దశల్లోనూ స్త్రీ అణచివేయడాన్ని కవిత్వంగా చెప్పారు. రావులపల్లి సునీత ‘‘ ఆత్మహత్య నా నిరసన’ అనే కవితలో ‘‘ పూరేకులాంటి నా మదిపై/ పుల్లలు పేర్చి రాజేసిన నా పతి లాలిత్యం మోయలేక/ నన్ను నేను తగలపెట్టుకున్నాను/ ఇపుడదే నా నిరసన.. నా మరణం మీ విలువల్ని గింగిరాలెత్తించాలని నేరాసిన మరణ వాగ్మూలం మీదాకా చేరిందా’’ అని ఒక స్త్రీ స్థితిని వర్ణించిన తీరు ఏ మనసునైనా కదిలిస్తుంది. ఈ గ్రంథంలో స్త్రీల జీవితాలు, అనుభవాలు, సమస్యలు, లైంగిక వేధింపులు, గృహ హింస, సమాజంలో వివక్ష వంటి భావాలు కవితా వస్తువులుగా ఉన్నాయి. ఈ సంకలనం స్త్రీవాద ఉద్యమానికి ఒక ముఖ్యమైన అడుగు, ఇది స్త్రీల సమస్యలను వెలుగులోకి తెచ్చింది మరియు స్త్రీల దృక్కోణాన్ని, అనుభవాలను సాహిత్యంలోకి తెచ్చింది.

ఇందులోని ప్రతి కవితలో ఒక స్త్రీ మనసు లోతుల్లోనివి మాట్లాడుతుంది. వాటి వెనుక శబ్దించేది ఆవేదన, ఆరాటం, ఆగ్రహం, ప్రశ్నలు ఇవన్నీ మౌనంగా ఎన్నో కాలాలుగా బిగుసుకుపోయిన మహిళా జీవితపు నిశ్శబ్ద సత్యాలు. ఈ సంకలనంలో కవయిత్రులు తమ వ్యక్తిగత అనుభవాల నుండి లౌకిక సాంఘిక విషయాల వరకు విస్తరించిన భావాలను కలగలిపి, స్త్రీ మనోవేదనను ఉప్పొంగించేలా అక్షరాలలో పరిపుష్టి చేశారు. ఈ కవిత్వంలో సంప్రదాయ లాలిత్యాన్ని తృణంగా వదిలేసి, నిజ జీవిత కఠినతను, నెరవేరని కోరికలను, అణచివేతను నిబద్ధతతో ప్రతిబింబించేలా రచించారు. తమలోని భయాలను, ఆశలను, శ్రమను, ప్రేమను, ప్రేమలోని ఓటమిని, నిరసనను అన్నింటినీ బలమైన పదాలతో వెలిబుచ్చుతారు. ఇది ఒక రకమైన కళాత్మక అర్థనాదం, సాంఘిక చైతన్యానికి మేలుకొలుపు.

‘‘నీలిమేఘాలు’’లో కనిపించే ప్రతీ కవితలో ఒక స్పష్టమైన వ్యక్తిత్వం ఉంటుంది. అవి వేదనతో పాటు విజ్ఞానాన్ని కూడా పంచుతాయి. స్త్రీలు ఎదుర్కొనే దినచర్య అణచివేతలు, మౌనంగా భరించాల్సిన బాధలు, తల్లిగా, భార్యగా, కుమార్తెగా, ఉద్యోగిగా ఎన్నో పాత్రల్లోనూ పోరాడాల్సిన పరిస్థితులను, ఈ కవిత్వం నిర్భయంగా వ్యక్తపరుస్తుంది. ఇక్కడ కవయిత్రులు ప్రేమను, దుఃఖాన్ని, కోపాన్ని, నిరాశను శక్తివంతమైన ప్రశ్నలుగా మలిచింది.

ఈ సంకలనం ద్వారా స్త్రీ తన చుట్టూ ఉన్న లోపాలను, తనకు విధించిన సంకెళ్ళను, అవమానాలను నిలదీస్తుంది. అయితే ఈ నిలదీత కోపంగా మాత్రమే కాకుండా, లోతైన చింతనతో కూడి ఉంటుంది. అది విమర్శ మాత్రమే కాదు, మార్పు కోసం గళమెత్తే ప్రయత్నం. ఈ సంకలనం మనం ఆదర్శంగా చెప్పుకునే సాంప్రదాయాన్ని ప్రశ్నిస్తుంది. స్త్రీ తన శరీరాన్ని, తన భావాల్ని, తన స్వరాన్ని తనది చేసుకునే ప్రయత్నాన్ని ప్రతిఫలిస్తుంది. మన చుట్టూ ఉన్న సామాజిక నిర్మాణాల్లోని లింగ అసమానతల్ని, మూఢనమ్మకాలను, పురుషాధిపత్య ధోరణులను నిలదీసే శక్తి ఈ రచనకు ఉంది. ఇది కేవలం పుస్తక పుటలకే పరిమితమై ఉండదు. చదివిన ప్రతి మనసులో ప్రశ్నలు రేపుతుంది. ఆ ప్రశ్నలు మార్పుకు మొదటి అడుగులు. ఈ సంకలనం స్త్రీల సమస్యలపై సామాజిక స్పృహను పెంచింది. ప్రజలు స్త్రీల సమస్యలను అర్థం చేసుకోవడానికి, వారి పట్ల సానుభూతి చూపించడానికి సహాయపడిరది.

అలాగే ఇవాళ ఈ శతాబ్దపు పూర్వార్ధ భాగంలో తెలుగు కవిత్వంలో జరిగిన మార్పుల్ని గ్రహించటానికీ, అనుభవించటానికి ఆధారభూతమైన ఏకైక కవితా సంపుటి ‘‘వైతాళికులు’’, అనాటి అనేక కవుల కవితా సంపుటులు ఈనాడు దొరకటం లేదు. చాలామంది కవితా ఖండికలు సంపుటాలుగా సంకలితం కానేలేదు. అయినా ‘వైతాళికులు తిరగేస్తుంటే ఆనాటి కవితా ధోరణులు మన అంతరంగాల్లో ఆహ్లాద తరంగాలను కదిలిస్తాయి. ఆ రోజుల్లో కూడా ఇప్పటిలాగే నవ్య కవిత్వాన్ని మనసారా ఆహ్వానించిన వాళ్ళతోపాటు వ్యతిరేకించినవాళ్లు కూడా గణనీయమైన సంఖ్యలో వున్నారు. కాకుంటే ఒకే ఒక తేడా వుంది. అప్పుడు వ్యతిరేకించినవారు దిగ్ధంతులైన పండితులు, అక్కిరాజు ఉమా కాంతంగారు, జయంతి రామయ్యగారు, అనంత పంతుల రామలింగస్వామి గారు ఇట్లాంటి గొప్ప గొప్ప పండితులు నవ్య కవిత్వ ధోరణులను నిరసించారు. తమ తర్క శక్తితో ఎదుర్కొన్నారు. అధిక్షేప కావ్యాలు రచించి హేళన చేశారు. ఎన్ని చేసినా కాలప్రవాహంలో అవి మరుగున పడిపోయాయి. దొరుకుతున్న కావ్య సంపుటాల ద్వారా దొరకని వారిని ‘వైతాళికులు’ సంకలనం ద్వారా ఈనాటికీ మనకు ఆనాటి జీవితం ఏ సూత్రాల ఆధారంగా చలనం సాగిస్తుందో చెప్పే సాహిత్యం కాలక్రమంలో జీవితాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. జీవితం, సాహిత్యం పేనిన తాడులాగా ముందుకు సాగుతున్నాయి. ప్రజల ఆలోచనలను చక్కదిద్ది, జీవనం సులభతరం చేసేందుకు సాహిత్యం ఓ ఉద్యమంలా కృషి చేస్తోంది.

తరాల తరబడి మగవాడి పక్కటెముక నుంచి పుట్టినట్టుగా స్త్రీని చిత్రించి మనిషి మనుగడలో కీలక భూమిక వహిస్తున్న మహళలను వంటింటి కుందేలుగా మార్చి పారేసారు. కొన్ని వందల ఏళ్లపాటు సుదీర్ఘ పోరాటం చేసిన మహిళ ఇప్పుడిప్పుడే స్వతంత్ర వ్యక్తిగా గుర్తింపు పొందుతోంది. తమ సమస్యలను, తమ బాధలను, తమ అనుభవాలను, తమ అనుభూతులను, తమ ఇష్టాఇష్టాలను, తమ దృష్టికోణాన్ని తమదైన శైలిలో తమకుతాము చెప్పుకోవడంతో మొదలైన స్త్రీవాద సాహిత్య ఉద్యమం మరే ఇతర ఉద్యమం కన్నా మంద్రంగా, గంభీరంగా, ఉరవడిగా సాగుతూ ప్రవహిస్తోంది. ‘‘కవిత్వం మనకు విలాసం కాదు. మనకు కవిత్వం సరదా పనికాదు. తమదైన శైలి, ఉద్యమస్పూర్తి గుండెలో పెట్టుకుని స్త్రీవాద ఉద్యమ స్పృహను అలవరచుకున్న తెలుగు కవయిత్రులు తమ భావాల పుష్పాలను ఒకచోట గుదిగుచ్చి అందించిన పుష్పహారం ‘‘నీలిమేఘాలు’’ ఒకప్పుడు ఎన్నో కువిమర్శలను, వ్యక్తిగత దాడులను నిబ్బరంగా ఎదుర్కొన్న ఫెమినిస్టు మూవ్‌ మెంట్‌ లో పురుషాహంకారం నిండిన రచయితల, విమర్శకుల విమర్శల్లో అశ్లీల సాహిత్యమంటూ నానా అగచాట్లు పడి. అయినా కొనసాగి, అందరి నోళ్లూ తన స్వచ్ఛమైన కవిత్వంతో మూయించగలిగింది. అంతకుమించి మరొక ముఖ్య లక్ష్యాన్ని సాధించగలిగింది. పితృస్వామ్యం, జండర్‌, అణచివేత, ఇంటి చాకిరీ స్వభావం, సంతానోత్పత్తి, స్త్రీలు వాడే భాషల గురించి ఎంతో చర్ఛకు తెరదీసింది. స్త్రీలలో కొత్త ఆలోచనలు రేపింది.

1990లలో వచ్చిన కొండేపూడి నిర్మల ‘లేబర్‌ రూమ్‌’ కవితలో వాడిన భాష, భావం రెంటిలోనూ తీవ్ర అలజడి సృష్టించింది. దీని గురించి వసంత కన్నాబిరామ్‌ ఇలా అంటారు: ‘‘ఆ కవితంతా నిరాశ, పరాయీకరణ ఉపమానాలతో నిండిపోయింది. పురుషులు పరోక్షంగా మాత్రమే ఉంటారు. బూటకపు కలలు, భ్రమలలో ఈ ప్రపంచమంతా తమ చుట్టే తిరుగుతుందనే విషయాన్ని ఎన్నడూ సందేహించని, ప్రశ్నించని పురుష పుంగవులకు, ఒక స్త్రీ పవిత్ర మాతృత్వ వ్యవస్థనిలా తీసిపారెయ్యటం నిజంగా చాలా భయాన్ని కలిగిస్తుంది. ఒక వ్యవస్థ చుట్టూ భ్రమలను, మిత్‌ లను ప్రశ్నించడమంటే దాని మీద దాడిచేయడమే‘‘ అన్నారు

ఇదే కవిత గురించి ఓల్గా చాలా శక్తిమంతంగా విశ్లేషిస్తారు. ‘‘పిల్లల్ని కనటం, మాతృత్వం ఒకటి కాదని స్త్రీలు తెలుసుకుంటున్నారు. ఈ రెండు వేరువేరు విషయాలని అర్థం చేసుకున్న స్త్రీలు, పిల్లల్ని కనటం మీ సామాజిక బాధ్యత అనటానికి సాహసించే వారికి వారి సామాజిక బాధ్యతల్ని గుర్తు చేస్తారు. పిల్లల్ని కనలా వద్దా అని ఎంచుకునే హక్కు స్త్రీకి ఉందని, అది మానవ హక్కుల్లో ఒకటనీ చెబుతారు‘‘. మానవ హక్కుల్లో ఒకటనీ చెబుతారు‘‘.

వంటచేయటమూ స్త్రీ శక్తిని దోపిడీ చేయడంగానూ, పురుషాధిక్య ప్రభావంగానూ చిత్రీకరిస్తూ విమల తన ‘‘వంటిల్లు’’ కవితలో ‘‘రకరకాల శవాలు నిండిన శ్మశానంలా మా వంటిల్లు/ భయం భయంగా నిశ్శబ్థంగా, నిరాశగా/ మా అమ్మొక ప్రేతంలా తేలుతూ వుంటుందక్కడ/ అసలు మా అమ్మే నడుస్తున్న వంటిల్లులా వుంది’ అనేది

‘‘పెద్దవ్వనీ చెప్తా’’ అనే కవితలో శ్రీమతి స్త్రీ, పురుష సమానత్వం గురించి చాటిచెప్తుంది. వరకట్నాల దృష్ట్యా ఆడపిల్లలు మైనస్సులు, మగ పిల్లలను ప్లస్సులుగా వ్యవహరించి వదిలేయం. అన్నింటిలోనూ లెక్కలు వేసి మరీ తక్కువ చేస్తాం. అందుకే ఎంతో ఆశావహ దృక్పథంతో కవయిత్రి ఇలా అంటారు. ‘‘కానీ ఇప్పుడు నేనేం చెయ్యగలను / పెద్దయ్యాక ఓ ప్రయత్నం చేస్తా / నాకు ఒకమ్మాయి పుట్టాక / అమ్మకు తన తెప్పేమిటో తెలిసేలా చేస్తా!’’ ఘంటశాల నిర్మల ‘‘జుగల్‌ బందీ’’, పాటిబండ్ల రజని ‘‘క్షుద్రానందం’’, ‘‘ఇక్కడ జీవితం గాయపరచిన పక్షులన్నీ/ పేదరికం మూటకట్టుకుని వాలతాయి/ బాధలు గాధళు సమానత్వం పాటిస్తాయి/ బతుకు కోసం పాడే ఏకగ్రీవ జావళిలో జార్చిన కొంగులూ, పరచిన పైటలు నేపథ్య సంగీతమై భాసిల్లుతాయి’’ అంటూ మెహందీ శిధిల శకలాల సరిహద్ధు రేఖల్ని గీసే మహెజబిన్‌ ‘‘సరిహద్దు రేఖలు’’ కవితలు కొందరు పురుషాహంకార పూరిత ప్రేలాపనలకు తొంబైవ దశకంలో స్త్రీవాదులు ఘాటుగా చెప్పిన జవాబులు.

అక్షరాలను తూటాల్లా, తూనికరాళ్లలా, నూతన పదకోశంలా వాడడమంటే ఇదేననాలి. ప్రముఖ రచయిత రాచకొండ విశ్వనాధశాస్త్రి ఒకసారిచ్చిన ఇంటర్వ్యూలో ఫెమినిష్టులను గయ్యాళులంటారు. అది జస్ట్‌ ఒక ఫ్రాయిడియన్‌ స్లిప్‌ ఆఫ్‌ టంగ్‌ అని అనుకోవడానికి వీలులేకుండా ‘‘సోకాల్డ్‌ మధ్య తరగతి స్త్రీలకు వేరే పనీపాటా లేక చేసే అల్లర్లుగా’ఫెమినిస్టుల కృషిని నీరు గార్చేస్తారు. అధోజగత్తు సహోదరుల గురించి మార్క్సిస్టు అవగాహనతో దోపిడీతత్వపు విశ్వరూపాన్ని గొప్ప ప్రతిభావంతంగా చిత్రించిన మహారచయిత కూడా అంత అవగాహన రాహిత్యంతో మాట్లాడడం తెలుగు స్త్రీవాద కవయిత్రులు అప్పట్లోనే కాదు ఇప్పటికీ జీర్ణించుకోలేరు. ‘‘ఔను మేం గయ్యాళులమే’ అంటూ ఓల్గా పెలుసుగా జవాబిస్తారు. ‘‘నూరేళ్ల క్రితం మధురవాణి మందలింపులు / మీ దళసరి చర్మాలకు ఆననప్పుడు / మేము ఈటెల్లాంటి మాటలతోనే పొడుస్తాం / మా గుండెలమీద కూర్చున్నది / పురుషాహంకారపు పెద్దపులి అని తెలిశాక కూడా / సుతిమెత్తగా ప్రేమ పలుకులు పలుకుతామా? / మేం గయ్యాళులమే కాదు భయంకర కాహళులం’అంటూ హెచ్చరిస్తారు. స్త్రీవాదులు వాడిన భాష విషయంలో రేగిన అలజడి ఉద్యమం దశాబ్దాలు దాటిన తర్వాత సద్దుమణిగింది. అంటే కొంతకాలానికి సోకాల్డ్‌ జనాలకు మింగుడుపడిరదన్న మాట!

రజియాబేగం రాసిన ‘‘అలాగే అన్నారు’ అనే మినీ కవితలో ఎలాంటి సంక్లిష్ట పదజాలమూ వాడకుండా, పురుషస్వామిక వ్యవస్థపట్ల విసుగునూ, తమ అసహనాన్ని, ఆందోళనను ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి. ‘‘బాల్యంలో / ‘చిన్న పిల్లవి నీకేం తెల్సు కూర్చో’అన్నారు / యవ్వనంలో / ‘ఉడుకురక్తం మంచిచెడూ తెలీదు కూర్చో’ అన్నారు / వృద్ధ్యాప్యంలో / ‘ముసల్దానివి ఇంకేం చేస్తావ్‌ కూర్చో’అన్నారు / అవకాశం రానందుకు కోపంగా లేదు నాకు / కూర్చొని, కూర్చొని బద్దకం వచ్చినందుకే బాధగా ఉంది. పురుష ప్రపంచం అంతా ఈ కవితలు చదివి అవగతం చేసుకుని, తమ జీవితంలో ఆ విలువలు ప్రతిష్టించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

అయితే ఈ సంకలనంలో స్త్రీవాద సానుభూతిపరమైన పురుష దృక్కోణానికి చోటులేకపోవడం పెద్ద లోటు. ఇవన్నీ రచించిన స్త్రీల అనుభూతులని చెప్పటానికి వీల్లేదు. ఎందుకంటే ఒక గృహిణి మనసులోకి, వర్కింగ్‌ వుమెన్‌ మనసులోకి, మెహందీల మనసులోకి, కాల్‌ గాళ్స్‌ మనసుల్లోకి స్త్రీ చొచ్చుకుపోగా లేనిది, పురుషుల పట్ల కినుక దేనికి? నడుస్తున్న వంట గదిలో ఉప గదులు మాత్రమే అనుభవించి అనుభూతించి, తాము మాత్రమే రాయగలిగే భావాలకు అక్షర రూపమిచ్చారు. కవయిత్రులుగా కొత్త ప్రపంచపు తలుపులు తెరిచారు. పితృస్వామ్య వ్యవస్థను ధిక్కరిస్తూ తమ కవిత్వపు కొరడా దెబ్బలు రaుళిపించారు. అక్షరాలను అగ్ని కేతనాలుగా ఎగుర వేశారు. పిడుగులు కురిపించారు. తుఫానులా విజృంభించారు.

స్త్రీ వాద కవిత్వంలో తొలి తెలుగు కవయిత్రి రేవతీ దేవి. తన అనుగార దగ్థ హృదయ జ్వాల సెగలతో తెలుగు కవితా ప్రపంచాన్ని జ్వలింపచేశారు. ‘నేనెవరినో మీ కెవరికీ తెలియదు. ఆర్తి సెగతో ఎర్రగా జ్వలించే నీలం నిప్పు పువ్వును. ఆ కళ్ళు అనురాగం కళ్ళు. లోకమంతట్లోనూ నన్నే చూసేది ఆ అనురాగపుటందమైన కళ్ళు. యుగ యుగాల సమస్త ప్రాణకోటి అనురాగాన్ని. నా పైన అవిరళంగా వర్షించే అనురాగ మేఘాలు ఆ కళ్ళు. ఈ హృదయం రసజ్వలిత దాహంతో వెచ్చగా విచ్చుకొన్న నెత్తురు పువ్వు’. స్త్రీలంటే కేవలం శరీరాలే తప్ప హృదయాలు గుర్తుకు రాని ప్రపంచంలో రవంత అనురాగ సుగంధం కోసం, కాసింత వలపు పరిమళం కోసం తపించి, జ్వలించి తన హృదయ పుష్పాన్ని నిస్పంకోచంగా రేకులు రేకులుగా విప్పి పరచింది రేవతీ దేవి. అవయవాలకే తప్ప ఆత్మలకు తావు లేని స్త్రీ జీవితంలో మొట్టమొదట ‘అనురాగం’ అనే నాలుగు అక్షరాల పదాన్ని ప్రయోగించిన తొలి కవయిత్రి రేవతీ దేవి..తన కలల గాలిపటాన్ని నిర్భయంగా ఎరుగవేసి, తన కాంక్షల చిత్తరువులపై పరదాలు తొలగించి తన అంతరంగ వర్ణాలను ప్రదర్శించిన భావుకురాలు రేవతీదేవి. కోపం, ద్వేషం, కోరిక మొదలైన రంగు రంగుల ఇంద్ర ధనుస్సుల సౌందర్యాలను పాఠకుల హృదయ వేదికలపై ఆరబోసిన రేవతీ దేవి రచించిన మరో కవిత ‘దిగులు’. ‘దిగులు/ దిగులు దిగులుగా దిగులు/ ఎందుకా/ ఎందుకో చెప్పే వీలుంటే/ దిగులెందుకు’ అని చెప్పలేని దిగులును గురించి అద్భుతంగా వ్యక్తీకరిస్తారు. స్త్రీవాద కవిత్వంలో అనితర సాధ్యమైన శైలి రేవతీ దేవిది.

నేడు భార్య కన్నా భార్య తెచ్చే జీతాన్నే ప్రేమించే భర్తలు ఎక్కువయ్యారు. ఆనందానుభూతితో పరవశించవలసిన భర్త పరిష్వంగం భార్య పాలిటి సర్ప పరిష్వంగ మెలా అయ్యిందో మందరపు హైమవతి తన సర్ప పరిష్వంగం కవితలో ‘అంతా బాగానే ఉంటుంది/ అప్పటి వరకు/ కామంతో నైతే నేమి/ మోహంతో అయితే నేమి/ ఇరువురి తనువులొకటైనాక/ అద్వైత స్థితి పొందినాక/ ఈ లోకాన్నే మరచిపోయిన/ అమృత ఘడియలలో/ అక్షయ తూణీరం నుంచి/ ఒక ప్రశ్నల బాణం సంధిస్తావు/ జీత మెప్పుడిస్తారు’ అని. ఈ లోకాన్నే మరచిపోయిన అద్వెట్కత స్థితిలో కూడా భర్త భార్యని జీతం గురించే అడుగుతాడు. అప్పుడామె ఒక్కసారిగా ‘వేయి రాక్షస బల్లులు/ మీద పాకినట్టు/ మనస్సు రaడుసుకొన్న ఆ క్షణంలో/ నా జీవితం నుంచి/ దూరంగా సుదూరంగా విదిలించి వేయాలనుకుంటాను నిన్ను!’ అని భర్తని వదలి వెయ్యాలనుకుంటుంది గానీ- భారత స్త్రీ నైనందుకు/ సంప్రదాయాల సజీవ సమాధిలో/ ఊపిరాడక గిల గిల కొట్టుకుంటూ/ వివాహం ఊబిలో/ కూరుకుపోతున్నప్పుడు/ జీవితం నుంచి కాదు కదా/ శరీరం నుంచైనా కించిత్తుకూడా/ దూరమవడం నా చేతుల్లో లేని పని’ అంటుంది. ఇక్కడ ఆలు మగల అనురాగ పూరితమైన పరిష్వంగం ఆర్ధిక కారణాల వలన, భార్యని బదులు డబ్బును ప్రేమించడం వలన ఆ పరిష్వంగం అత్యంత జుగుప్సాకరమైన సర్ప పరిష్వంగంగా మారిపోయింది. ఆధునిక యుగంలో సర్వత్రా కనిపించేవి ఇలాంటి సర్ప పరిష్వంగాలే. పతియే ప్రత్యక్ష దైవమైన వ్యవస్థలో ఆ పతి పరిష్వంగాన్ని అత్యంత జుగుప్సాకరమైన సర్ప పరిష్వంగంగా భావించడమే ఒక ధిక్కారం, ఒక సాహసం. .

సాహిత్యం అంతా పురుషుల దృష్టితోనే రాయడం వల్ల, వారి కాముక దృష్టికి స్త్రీలు కేవలం అవయవాల ప్రదర్శన శాలలు గానే కనిపిస్తారు. వారి దృష్టిలో స్త్రీలంటే రెండు వక్షోజాలు, రెండు జఘనాలు మాత్రమే. వారి చూపులు స్త్రీల నెలా ఇబ్బంది పెడతాయో కేవలం స్త్రీలు మాత్రమే రాయగలిగిన కవిత ‘చూపులు’. స్కూలుకు వెళ్ళే విద్యార్ధినులను, ఉద్యోగాలు చేసే స్త్రీలను, రోడ్డు మీద నడిచే మహిళలను మగవారు చూసే చూపులు, ఆకలి చూపులు, కామపూరితమైన వికృతమైన చూపుల గురించి- ‘రెండు కళ్ళనుంచి/ చూపులు/ సూదుల్లా వచ్చి/ మాంసపు ముద్దలపై/ విచ్చల విడిగా తిరుగుతూ ఉంటాయి’ అని జయప్రభ వర్ణిస్తారు. బడికి వెళ్తున్నా, గుడికి వెళ్తున్నా, ఇంటికి వెళ్తున్నా, ఆఫీసుకు వెళ్తున్నా చూపులు ఆడవాళ్ళ శరీరాల మీద గాయాలు చేస్తూనే ఉంటాయి. ‘బస్సులోను/ క్లాసు లోనూ/ వేసే ప్రతి అడుగు వెనకా/ శరీరంలోని ఏదో ఒక భాగాన్ని/ గాయం చేస్తూ/ విషపు చూపులు గుచ్చుకుంటూనే ఉంటాయి’ అంటూ పురుషుల చూపులు పడతుల హృదయాలనెలా ముక్కలు చేస్తాయో వర్ణించిన కవిత ఇది. అలాంటి చూపులను సహించలేని స్త్రీలు అలాంటి పురుషులను ప్రతిఘటించాలనుకుంటారు. అందుకే ఈ కవయిత్రి ‘ఈ దేశంలోని ఆడదానికి/ వళ్ళంతా ముళ్ళుండే రోజు/ ఎప్పుడొస్తుందా అని’ ఎదురు చూస్తుంది. పిల్లల్ని కనే ప్రక్రియ ఎంత నరకమో ఆ స్థితిలో ఆమె పరిస్థితి ఎంత భయంకరమో కొండేపూడి నిర్మల ‘లేబర్‌ రూం’ కవితలో ‘ప్రపంచంలోని నరకమో/ నరకంలోని ప్రపంచమో/ త్రీడీలో చూస్తున్నట్టే ఉంటుంది’ అంటూ పరాకాష్ఠకు చేరిన బాధను వర్ణించిన తీరు వర్ణనాతీతం. తప్పనిసరి పరిస్థితిలో పిల్లలు వద్దనుకొని అబార్షను చేయించుకొని పరితపించే కొందరి తల్లుల మానసిక బాధను అబార్షను స్టేట్మెంట్లో పాటిబండ్ల రజని ‘నీకు పంచేందుకు రక్తం లేకనే కదా/ నిన్ను పెంచేందుకు తీరిక లేకనే కదా/ నీ అక్కకు ఇంకా పాకడమైనా రాలేదనే గదా, నేన్నిన్ను వద్దనుకొన్నది/ నా టెంపరరీ ఉద్యోగమూ, ఆరోగ్యము, నీకు మరణశిక్షను ఖాయం చేస్తే/ తల్లడిల్లిన తల్లి మనసు అయ్యో/ పాలింకిపోవడానికికున్నట్టు/ మనసింకిపోవడానికి/ మాత్రలుంటే ఎంత బావుండు’ అని ఆక్రోశిస్తారు.

స్త్రీవాద కవితల్లో మరో ప్రముఖ కవిత వంటిల్లు. సమాజంలో వంటిల్లు స్త్రీలకు, ముందు గది పురుషులకు కేటాయించారు. మంచి స్త్రీకి కితాబు ఏమిటంటే మంచి మంచి వంటలు బాగా చేసి ఇంట్లో వాళ్ళను మెప్పించడము. ఏ కాలమైనా ఈ లక్షణం మాత్రం మారదు. ప్రవరుడు తీర్థయాత్రలు చేసి హిమాలయ సౌందర్యాలను ఆస్వాదిస్తే అతని భార్య మాత్రం అరుణాస్పద పురంలోనే ఉండి ‘వండ నలయదు వేవురు వచ్చిరేని’ అని వంటింటికే అంకితమవుతుంది. నల భీమ పాకమని మగవారి వంటలు ప్రశస్తికి వచ్చినా ఆ నల భీముల పాకశాస్త్ర ప్రావీణ్యం కొన్ని సందర్భాలకు మాత్రమే పరిమితం. ‘అసలు మా అమ్మే నడుస్తున్న వంట గదిలా ఉంటుంది’ అంటూ వంటింటి రహస్యాల్ని విప్పి చెప్తారు విమల. ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే మహారాణి/ అయినా చివరికి వంటింటి గిన్నె లన్నిటిపైనా/ మా నాన్న పేరే’ అని పచ్చి నిజాన్ని చెప్తారు. వంట చెయ్యడం, వడ్డించడంలోనే రోజులో చాలా సమయం గడిచిపోతుంది స్త్రీలకు. చదవడానికే, రాయడానికీ దేనికీ సమయముండదు. అందుకే ‘ఎంత అమానుషమైందీ వంటగది? మన రక్తం పీల్చేసి మన ఆశల్నీ, కలల్నీ కాజేసి/ కొద్ది కొద్దిగా జీవితాంతం పీక్కు తింటున్న రాకాసి గద్ద ఈ వంటిల్లు’ అని వంటిల్లు ఎలా స్త్రీల శక్తుల్ని ధ్వంసం చేస్తుందో చెప్తారు. మనం ఏమైనా మన అంతిమ కర్తవ్యం/ గరిట తిప్పటంగా చేసిన ఈ వంటిళ్ళను ధ్వంసం చేద్దాం రండి’ అంటూ వంటిళ్ళలోనే జీవితమంతా అంకితమైపోయిన స్త్రీల గురించి ఘాటైన చురకలు వేస్తారు. లావుగా ఉన్నవాళ్ళు సన్నగా మారాలని, నల్లటివాళ్ళు తెల్లగా మారాలనే నేపథ్యంలో ఎంత హింసను అనుభవిస్తున్నారో ‘సౌందర్యాత్మక హింస’లో ‘మన మంటే 34, 24, 35 కొలతలమైన చోట, మొటిమలు మొలవడం, జుట్టు రాలడం/ నడుం సన్నగా లేకపోవడమే/ మన నిరంతరాందోళలైన చోట/ దైహిక సౌందర్య పిపాస యే/ మన సమస్త జీవిత లక్ష్యాన్ని చేసిన చోట/ ఎంత హింసని అనుభవిస్తున్నామో కదా!’ అని సకల స్త్రీల బాధల గురించి విమల వ్యాఖ్యానిస్తారు.

స్త్రీవాద రచయిత్రులు చాలా మంది వివాహ వ్యవస్థలోని అసమానతల గురించి, ఎంత సేపూ భార్యలు మాత్రమే సర్దుకు పోవడం గురించి, దాంపత్యంలోని బోలుతనం గురించి ఎన్నో కవితల్లో విప్పి చెప్పారు. ‘సర్దుకుపో ఈ నాలుగక్షరాలే/ స్త్రీని అగ్నికాహుతి చేసే సాధనాలు’ అని ఈ సర్దుకు పోవడం స్త్రీలకే ఎందుకు పరిమితం కావాలని ప్రశ్నిస్తూ ‘నీటిలోనే జీవిస్తుంది చేప/ కాసేపు నేలపైన ఉండమంటే/ నశిస్తుంది మరుక్షణమే/ నింగిలో విహరించే పక్షిని/ కాసేపు సర్దుకో నేలపైనే ఎగురు’ అంటే ఎంత అసహజమో ఈ సర్దుకు పోవడం కూడా అంతకష్టమైనదే అని మందరపు హైమవతి తన ‘సర్దుకుపో’ కవితలో వాస్తవ స్థితిని వివరిస్తారు. పురుషాధిక్య సమాజంలో స్త్రీలు ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో తెలిపే సిలబస్‌ను గూడ పురుషులే రూపొందించారు. స్త్రీలను ప్రాణ పరిమళంతో అణువణువు స్పందించే మనుషులుగా గాక ఒక బానిసగానో, ఒక ఆటబొమ్మగానో, ఒక విలాసవస్తువుగానో చూసే సంఘం గుండెల్లో ప్రశ్నల బాణాలు సంధిస్తూ ‘ఎన్నాళ్ళు ఈ పూర్వకాలపు పాఠాలు/మనసును గుర్తించలేని పాతకాలపు భావాలు’ అని నిలదీస్తుంది మందరపు హైమవతి. ‘అలా పగలబడి నవ్వడం తప్పు గదూ/ అధరాలపై చిరు దరహాసమే సుందరం/ అలా భర్త మాటను ఎదిరిస్తావెందుకు/ సహనం స్త్రీకి ఆభరణం/ గృహిణికి శాంతమే భూషణం’ ఇలాంటి పాఠాలనీ సిలబస్‌నీ అందరం కలిసి మార్చలేమా అని ప్రశ్నిస్తారు. స్త్రీల దైహిక బాధల గురించి, మానసిక వేదనల గురించి, తరతరాలుగా యుగ యుగాలుగా పురుషులు చేసిన గాయాలనుంచి, అనేకానేక అనుభూతుల గురించి మనసులో గుచ్చుకునేటట్టు కవితలు అనేకంటే సంచలనాలను రచించారంటే బావుంటుంది.

స్త్రీవాద సాహిత్య ఉద్యమం మూడు దశాబ్దాలు దాటిన సందర్భంలో సమాజంలో ఎన్నో విజయాలు సాధించింది. సంఘంలో మార్పుని వేగంగా తీసుకువచ్చింది. అధికారులకైనా, మామూలు ప్రజలకైనా స్త్రీ అంటే ఉన్న చులకన భావం పోయింది. సభల్లో నైనా, నిజ జీవితంలోనైనా స్త్రీల గురించి ఎడా పెడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి జంకుతున్నారు. ఆధునిక పురుషులు చాలా మంది ఇళ్ళల్లో భార్యలకి సాయం చేస్తున్నారు. పిల్లల పెంపకంలో పాలు పంచుకుంటున్నారు. నేడు మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు, బస్సుల్లోనూ, రైళ్ళలోనూ, సినిమాల్లోనూ చంటిపిల్లల్ని మగవాళ్ళు ఎత్తుకున్న దృశ్యాలే కనిపిస్తాయి. స్త్రీవాదం తెలుగు కవిత్వంలో ఎంత సంచలనం కలిగించినా ఆ తర్వాత ఉద్యమంలో ఎన్నో మార్పులు వచ్చాయి. స్త్రీలందరూ ఒకటి గాదు. ధనవంతులు, అగ్రవర్ణాల స్త్రీలతో బాటు దళిత స్త్రీలు, అణగారిన వర్గాల స్త్రీలున్నారని, వాళ్ళ సమస్యలు వేరని ఆ స్త్రీల సమస్యల్ని ప్రతిబింబిస్తూ దళిత వాద సాహిత్యం వచ్చింది. ఆ తర్వాత ముస్లిం వాద సాహిత్యం వచ్చింది. నీలి మేఘాలు, గురి చూసి పాడే పాట సంకలనాలు కాకుండా ‘నల్ల పొద్దు’ మొదలైన సంకలనాలు వచ్చాయి. దేనికైనా బలమైన పునాది స్త్రీవాద సాహిత్యమే. సమాజంలో నేడు శ్రామిక స్త్రీలు అధికంగా ఉన్నారు. ఇళ్ళలో పనిచేసేవారు, ఫేక్టరీలలో, షాపుల్లో, ఇళ్ళ నిర్మాణాల్లో, పొలాల్లో, తోటల్లో శారీరక శ్రమ చేసేవాళ్ళు ఎంతమందో నుంచి ఉన్నారు. వారి సమస్యలను చిత్రీకరిస్తూ, ఇంకా అట్టడుగు ప్రజల జీవనాల్లోకి వెళ్ళినప్పుడే స్త్రీవాద సాహిత్యం బలోపేతమవుతుంది.

1993 అక్టోబర్‌ 3న రావు బాల సరస్వతి గారు ప్రథమ నేపథ్య గాయని ‘‘కలలన్ని కల్లలై కరిగిపోయే వేళ/ దారి చూపే పెద్ద వెలుగా రావే/ దారి వెలిగించ రావే!’’ అని పాడుతూ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కవితా సంకలనం తర్వాత స్త్రీ వాద కవిత్వం ఒక సామాజిక ఆమోదాన్ని పొందింది. స్త్రీ వాద కవిత్వాన్ని అర్థం చేసుకోవటమెలాగో చెప్పిన ‘నీలి మేఘాలు’ ఒక చరిత్ర. స్త్రీల సామూహిక స్వరం ఎంత బలమైందో, స్పష్టమైందో చెప్పిన కవితా సంకలనం ఇది. స్త్రీలపై అనేక ప్రాంతాలలో,అనేక రూపాలలో జరిగే హింసను నీలిమేఘాలు గర్జించి చెప్పి ఇంత కాలమైనా హింస మరింత దారుణంగా, నగ్నంగా జరుగుతూనే ఉంది. ‘‘బోస్నియానో,ఎల్‌ సాల్విడాలో చలకుర్తో, త్రిలోక్‌ పురీ వీధులో దండకారణ్యమో, ఎక్కడైతేనేం మనల్ని వివస్త్రల్ని చేయటం వాళ్ళ వినోద క్రీడయింది’’ – అన్న విమల కవిత గుజరాత్‌ గుండా మణిపూర్‌ వరకూ, కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ నేడు విస్తరించింది. వినోద క్రీడ మహిళా క్రీడాకారుల శరీరాలతో వినోదిస్తోంది. సందర్భాలు మారాయి గానీ సంవేదనలు మారలేదు. ఒకవైపు మహిళలకు రాజకీయ భాగస్వామ్యం ‘దానం’ చేస్తూ మరో వైపు స్త్రీలను అదృశ్య హింసా రూపాలతో అష్ట దిగ్బంధనం చేస్తూ, రాజ్యం, పితృస్వామ్యం కలిసి ఆడుతున్న వినోద క్రీడల గురించి ఈ తరం కవయిత్రులు మాట్లాడాల్సిన, గొంతు విప్పి అరచి, ప్రతిఘటించాల్సిన అవసరం ఇంకా ఇంకా అవసరమని నిత్యం మనం ఎదురుచూసే సంఘటనల దృష్ట్యా అనిపిస్తోంది. .

తెలుగు సాహిత్యంలో ద్వేషాన్ని ప్రతిఘటిస్తూ, హింసను ఖండిస్తూ, వివక్షను ప్రశ్నిస్తూ చేసిన రచనా సంప్రదాయం వెయ్యేళ్ళకు పైగా ఉంది. తిక్కన, ధూర్జటి, అన్నమయ్య, మొల్ల… మొదలుకొని ఆ ప్రతిఘటనా గళాలు అనేక ఉద్యమాల మీదుగా ప్రయాణిస్తూ వస్తున్నాయి. అనేకమంది కవులు, కవయిత్రులూ ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు. అవే మన ఆశాగీతికలు. అవే మన రాబోయే వెలుగుల ఉదయాలు.

ప్రముఖ స్త్రీ వాద కవయిత్రి, రచయిత్రి అయిన శాంతి ప్రియ రచించిన ‘‘క్షతగాత్రులు’’ కవిత్వంలో ‘‘ఆకాశమంతా ఒలికిపోయన మా అనంత వేదనా హృదయం/ కమిలి గడ్డకట్టుకుపోయి/ నిజంగా నీలినీలిగా వుంది/ మా శరీరంపై మనసుపై/ జీవితంపై చివరకు మానవత్వంపైనే/ మగదురహంకారంతో నీవు చేసిన సముద్రమంత గాయం/ నిరంతరం రక్తాన్ని స్రవిస్తూ రక్తస్రావపు చరిత్ర మాత్రమే మాకు మిగిల్చింది’’ అంటూ సంకలనంలో 1988 సంపపలో మెహందీ స్త్రీలపై జరిగిన సంఘటనకు స్పందిస్తూ కవితను రాశారు. ‘‘ ఓ మగ మద మృగాల్లారా! మీరు మీ ఇళ్ళల్లోనే చావండి/ మీ భార్యల ఒళ్ళల్లో చావండి/ మీరు చావడానికి దేశంలో పరమ పవిత్ర స్థలాలెన్నో వున్నాయి/ మీ గృహ స్వర్గసీమలూ/ మీ మమతాలయాలూ/ మీ పవిత్రబంధాల పొదరిళ్ళూ వున్నాయి’’ అంటూ చనిపోవాలనుకున్నవారు వారి ఇళ్ళలోనో, భార్యలవద్దనో, తల్లుల దగ్గరో ఎక్కడైనా దేశంలో స్థలాలెన్నో వున్నాయి. మెహందీ స్త్రీలకు బతికించడం సుఖపెట్టడమే తెలుసునని చావడానికి తమ వద్దకు రావొద్దని వేడుకుంటారు. ఆడపిల్లగా పుట్టిన వెంటనే గుడివెనక విషమిచ్చి చంపే రాజస్థాన్‌ గ్రామాల్లోని దుష్టాచారం విని శ్రీమతి గారు ‘నిషిద్ధ స్వప్నం’ అనే కవితలో ’’అక్కడ భగవంతుడు కూడా నా మరణానికి మౌనంగా సిగ్నలిచ్చేస్తున్నాడు నే పుట్టినట్టు అమ్మ కలగన్న పాపానికి తిండిలేకుండా కృశింప చేసినప్పుడు అమ్మ మౌనంగా కుళ్ళిపోయినప్పుడు నేననుకున్నా.. నేనొక నిషిద్ధ జీవినే కాదు నిషిద్ధ స్వప్నాన్ని కాదు.’’ అంటూ పుట్టబోయేది ఆడపిల్లని తెలియగానే వారి మరణానికి భగవంతుడు కూడా సిగ్నలిచ్చేస్తున్నాడు. తల్లి తనను కోరుకుంటుంటే తండ్రి తనను నిషిద్ధజీవిగా చూడడం జరుగుతుంది. పుట్టే పాపను గూర్చి కలలుగనే స్వేచ్ఛ తల్లికి లేదని నిషిద్ధ స్వప్నాన్ని అయ్యానని ఆడపిల్లగా పుట్టడం వల్ల ఎదురయ్యే కష్టనష్టాల్ని గూర్చి ఇందులో వ్యక్తీకరించారు. బోస్నియా హెర్జిగోచినాలోని ముస్లిం క్రోషియన్‌ జాతుల్ని నిర్మూలించి తమ ఆధిపత్యాన్ని నెలకొల్పడం కోసం సెర్బ్లు వేలాదిమంది స్త్రీలను చిత్రహింసలు పెట్టి నిర్భంద మాతృమూర్తులుగా మార్చారు.

ఈ సంఘటనకు స్పందిస్తూ కొండేపూడి నిర్మలగారు ‘బాధాశప్తనది’ అనే కవితలో ’’మానానికి సంబంధించినదంతా అవమానాల భాషే అయిన చోట చెప్పుకున్నకొద్దీ చొప్పకట్టలా ఎటో కొట్టుకుపోయే మారోదన ’’ అంటూ తల్లులు తమ బిడ్డల్ని రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. తిరస్కరించిన తల్లుల్ని నిర్భంద మాతృమూర్తులుగా చేయడంతో ఆ తల్లుల ఆత్మఘోష అతికఠోరంగా వుంటుంది. తన బిడ్డల మృదు చరణాల్ని పుట్టుకతోనే చంపడంతో జాతుల్ని నిర్మూలించడం జరుగుతుంది. ఆడదాన్ని అవమానించడానికి కారణాలెన్ని తీసినా, చిత్తశుద్ధిలేని విచారణలెన్ని జరిగినా అంతిమ తీర్పు ఏమి వస్తుందని నిర్భంద మాతృమూర్తులు అడగడాన్ని ఈ కవితలో వివరించారు. దాదర్‌ ఎక్స్ప్రెస్లో ఓ బాలిక అత్యాచారానికి గురైన సంఘటనకు స్పందనగా బి. పద్మావతిగారు ‘గాయపడ్డ పనిముట్టు’ అనే కవితలో ’’తల్లీ, పనిముట్టూ/ పిల్లల్ని కనే పడక ఎక్కే పనిముట్టూ/ కొత్తగా గాయపడ్డావా పనిముట్టూ’’ అంటూ అని ఆడదంటే పడక ఎక్కే పనిముట్టుగా, పిల్లల్నికనే యంత్రంగా భావించడం జరుగుతుంది. తెలిసీ తెలియని పసిపిల్లల్ని, యౌవనుల్ని కొందరు రాక్షసులు తమ ప్రవర్తనతో ఒళ్ళు తెలీని మత్తులో అమానుషంగా అనుభవిస్తుంటారు. ఇలాంటి అభాగ్యుల జీవన స్థితిగతుల్ని ఈ కవితలో వ్యక్తీకరించారు.

‘నీలి మేఘాలు కేవలం స్త్రీల భావోద్వేగాలను ఆవిష్కరించడమే కాక, భారతీయ, ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో మహిళా ఉద్యమానికి శక్తివంతమైన బాహ్యరూపం. ఇందులోని ప్రతి కవిత ఒక అక్షర యుద్ధంగా, ఒక వేదన పిలుపుగా, ఒక ప్రతిఘటన జ్వాలగా నిలుస్తుంది. సంపాదకులు అన్నెమ్మ రాజయ్య నేతృత్వంలో రూపొందిన ఈ సంకలనం, 1993లో విడుదలై, అప్పుడు పేరొందిన ఆరభిందుకాలం స్త్రీవాద ఉద్యమానికి గొప్ప వేదికగా మారింది. ఇందులోని రచయిత్రులు సమాజం నిషేధించిన విషయాలను భయపడకుండా కలానికి తెచ్చారు. వేశ్యావృత్తిలో ఉన్న స్త్రీల అనుభవాలు, శారీరక-మానసిక హింసలు, సామాజిక వలయాల్లోని వంచనలు, లైంగిక బాధలు, అణచివేతలు మొదలైనవి బహిర్గతమయ్యాయి. ఎటువంటి బంధనాలకూ భయపడకుండా, అనేక సంఘ సంస్కరణా అంశాలను ఇందులో స్థిరపరచారు. కవిత్వం ద్వారా ఒక సామూహిక కూత ఇచ్చే ప్రయత్నమే ఇది. సంప్రదాయ సాహిత్యంలో కనిపించని అసలు శబ్దాలు, గాఢమైన భావాలు, రుచి మార్చే రక్తరంజిత వాక్యాలు ఇందులో ఉన్నాయి.

ఈ సంకలనం వ్యతిరేకతను ఎదుర్కొంది, విమర్శలూ ఎదుర్కొంది. ఎందుకంటే ఇది అసౌకర్యాన్ని కలిగించేది, ఎదురుచూడనితనాన్ని ఆవిష్కరించింది. పసిగట్టిన బాధను బలంగా వినిపించేది. కానీ అదే దాని శక్తి. ఇది కవిత్వానికి ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది‘అందం’కు భిన్నంగా ‘అవశేషాన్ని’ శోధించడమే కళ అని ప్రతిపాదించింది. ‘నీలి మేఘాలు’ లోని కవయిత్రులు స్వీయ అనుభవాలను రచనలుగా మలిచిన సందర్భాలు ఎంతో మానవీయంగా, రాజకీయంగా నిలిచాయి. ఇది వ్యక్తిగతాన్ని రాజకీయంగా మలిచిన ప్రబల ప్రకటన. ఇది లింగవివక్షతో కూడిన సమాజంపై ఒక నిరంతర ప్రశ్న. ఇది అణచివేత పై ఎదురు నిలబడే శబ్దం. ఈ సంకలనం కేవలం పాఠ్యంగా కాదు. ఇది ఉద్యమానికి మౌలిక గ్రంథంగా మారింది. ఇది చదువరుని కేవలం మనసులోనే కాదు, ఆలోచనల్లోనూ కదిలించగలదు.

సరే..స్త్రీ స్వేచ్ఛ కోసం స్త్రీవాదులే కాదు స్త్రీ జాతి మొత్తం కోరుకోవడం జరుగుతోంది. అందుకు ఈ గ్రంథంలో రచించిన కవయిత్రులు కాస్తంత ఊతం అయ్యారు. ఒక స్త్రీ స్వరం బయటకు వినిపించడానికి కూడా ఆలోచించే రోజుల్లో ధైర్యంగా వినిపించడం ఈ గ్రంథం మనకు చూపింది. తదనంతరం కాలంలో స్త్రీ జీవితాలలో అనేక మార్పులు వచ్చాయి. కోరుకున్నంత కాకున్నా స్వేచ్ఛగా జీవిస్తున్నారు. అదీ కాకుండా వంటిల్లు దాదాపుగా మూతపడ్డాయి. ఎప్పుడో సరదాగా ఒండుకోవడం తప్ప వంట పదం దాదాపుగా దూరమైందనే చెప్పాలి. ఉద్యోగం పురుష లక్షణం కాస్త స్త్రీ లక్షణం గా కూడా మారింది. సంపాదనలు పెరిగాయి. ఉన్నతి పెరిగింది. స్త్రీ పురుషులు ఒకరినొకరు ఇంట్లో కూడా పనిని పంచుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం అయితే ఒకప్పుడు స్త్రీల వివాహం సమస్యగా వుండేది కాస్త పురుషుల వివాహం జరగడమే సమస్యగా మారింది. అసలు పెళ్లే వద్దు కలిసి బతుకుదాం అంటూ స్త్రీలే అంటున్నారు కదా?. ఈ ఒక్కటే కాదు తాము అనుకున్నది సాధించడానికి ఎంత దూరమైనా ప్రయాణం చేస్తున్నారు.

ఇదీ కాక పెళ్ళిదాకా వచ్చి ప్రేమించినవారితో పారిపోవడం, పెళ్ళిపీటల మీద తాళి మరొకరితో కట్టించుకోవడం, ప్రతి చిన్న కారణానికి విడాకులు తీసుకోవడం అనేది చాలా సులువును చేసింది కూడా ఈ స్వేచ్ఛే కదా? అసలు వివాహం అనే పదానికే పురుషులు భయపడుతున్న దాఖలాలు ఎక్కడో లేవు. ప్రతి ఒక్కరి గుమ్మందాకా వచ్చేసాయి. అలాగని స్త్రీలు తమకిష్టమైన వారినైనా వివాహం చేసుకుంటున్నారా అంటే అదీ లేదు. వివాహమే వద్దనే స్థాయికి స్వేచ్ఛ వచ్చిందంటే ఆలోచించాల్సిందే. ఈ స్వేచ్ఛలో వివాహ వ్యవస్థ, మరోవైపు కుటుంబ వ్యవస్థ రెండూ ఆకృతిని కోల్పోయాయి కదా? ఒకవేళ ఒక స్త్రీ వివాహానికి సిద్దపడినా ఆ ఆమ్మాయి తల్లి అడ్డుపెడుతూ విధిస్తున్న ఆంక్షల మూలంగా తన కూతురు జీవితాన్ని కూడా అర్థం లేకుండా చేస్తోంది కదా? ఇపుడీ పరిస్థితి పట్ల స్త్రీవాదం ఏమంటోంది? ‘‘నీలిమేఘాలు’’ లో స్వేచ్ఛ లేని స్త్రీల జీవితాలను ఆవిష్కరణ చేసారు. అది ఆ కాలానికి తలమానికమైంది. మరి విచ్చలవిడితనంతో జీవితాల్ని తలకిందులు చేసుకుంటున్న జీవితాల పట్ల ఏమంటారు? ఈ అంశం పట్ల తప్పనిసరిగా స్త్రీవాదం కలాన్ని కదిలించాలి. ఎప్పటికప్పుడు ఉనికినే కోల్పోతున్న స్త్రీ సమాజం పట్ల స్త్రీవాదపు స్పందన వుండాలి కదా?..

You may also like

1 comment

Jocelyn882 September 18, 2025 - 4:54 pm Reply

Leave a Reply to Jocelyn882 Cancel Reply