(స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా నా కవిత.)
వెలుగును పంచుతూ బతుకును బలిఇచ్చే-
కొవ్వత్తిని కాను…..
కాసేపు మెరిసినా కళ్ళ కద్దుకునేలా బతుకును సాగించే –
కర్పూరాన్ని కాను…..
తాను అరిగిపోతూ కూడా సుగంధ పరిమళాన్ని అందిస్తూ మురిసే –
గంధపుచెక్క ను కాను…..
అంధకారం అలుముకున్న బతుకుల్లో అజ్ఞానాన్ని తొలగించే –
అక్షరం ముక్కను కాను…..
నీడ నిస్తూ,పూలనిస్తూ,ఫలాలనిస్తూ, ప్రాణవాయువు నందిస్తూ –
రకరకాల గృహోపకరణాల రూపంలో సేవలందిస్తూ –
సస్యశ్యామలంగా నా దేశాన్ని నిలుపుతూ –
మొడై పండు ముదుసలిలా చిక్కి శల్యమై ఎండుకట్టేలా మారినా –
కడకు కాలుతూ కూడా పరులకు పనికొచ్చే –
తరువును అసలే కాను…..
అందుకే ఎందుకు ఈ బతుకు అనుకున్నా –
మనిషినై ఈ మట్టిలో పుట్టినందుకు –
నా జన్మభూమి కి ఒక్క మంచి పనైనా చేయాలనుకున్నా –
అవసరమైతే – దేశంకోసం
నా దేహాన్ని – అర్పించాలనుకున్నా!!