అమ్మానాన్నల
చెమట చుక్కల కష్టం
వారి రక్త మాంసాల
సారం నా రూపం
కన్న కలల ఫలితం
ఈ దేహం
కష్టములు ఎన్నో దాటి
కడుపు తీపి తోటి ఊహల వులితో తన బిడ్డ రూపం
ఊహించుకుని చక్కని శిల్పం చెక్కుకుంటూ
కనులు మూసుకుని
కొన్ని కలలు
కన్నులు తెరిచి మరికొన్ని కలలు అన్ని ఇన్ని
కావు కన్న కలలన్నీ
లెక్క తేలని
చుక్కల లెక్కల
ఊపిరి బిగబట్టి
పురిటి నొప్పులు ఎన్నో
భరించి
ప్రసవ వేదనను అనుభవించి నన్ను ప్రసవించి
దేహం లేని ఆత్మ ఉన్నట్టు రూపంలేని
పదార్థం ఉన్నట్టు
రూపానికి రాని ఆకారాన్ని ఆశతో ఆశయంతో
శంశయం వీడి సకల ప్రయత్నములు చేస్తూ పరాయిండ్ల మాటల బాణాలకు
గాయం కానీ చోటు లేదు దేహంలో
రాగం కానీ బాధల నాదం లేదు
ఇల్లు ఇల్లు తిరిగే
పిల్లి నై ఇహలోకమంతా
నా ఇల్లు అనుకుని
ఇండ్లు
ఎన్ని తిరిగిన
ఇల్లు ఒకటి కచ్చితంగా కావాలని
కాలాన్ని విశ్వసించి కదులుతున్న
కలిసి వచ్చినది
ఒక అవకాశం
ఏదో ఒక లోపం లేకపోతే మరేదో రూపం
రానే రాదు కదా
మాట ఒకటి దూసుకొచ్చి మస్తీస్కాన్ని తాకింది మనసున్న పడ్డ మాట
మదిని మదించి
పాలసంద్రం చిలికిన
సురలు దానవుల వలె చిలికినట్టు
ఒక రూపం కోసం
పలు దిక్కుల పైనుంచి క్షయణించ
సుఖనిద్ర సుకలలకై
సమతల గుండె లయలకై
మట్టి ఇటుకల
కలయిక
కంకర
ఇసుక సిమెంటుల
కలబోత పుట్టింగులై
బీములై పిల్లర్ లై స్లాబై ఇటుకలై మేస్త్రీ రెక్కలై కార్మికుల
చెమట చుక్కల
తడికి తడిసి
అల్లుకొని గోడలై
పలువురు చేతుల సహకారమై మనుషులు జీవించే నీడై
పద పద మంటూ
పసిడి కలలు నిజమై
సుదూర సుసప్నం నిజమై కవిత నిలయమై
నా దేహమే ఇప్పుడు
ఒక ఇల్లు.