నేను నదినై పారుతున్నప్పుడు
ఎన్ని ఎత్తైన కోరికల శిఖరాల మీద నుండి పరుగెడుతూ,
పడి నలుగుతూ, నడుస్తూ, నెత్తురోడుతున్న దేహపు వ్రణాలతో మూలుగుతూ,
నీ దాహం తీర్చానో కదా!
నేను నదినై పారుతూన్నప్పుడు
బాధల గులకరాళ్ళ అలజడి శబ్దాలేవో
హోరులోంచి
ఆవేదనగా
వినిపించాయి.
నేను అనుభవాల వాగుల మిళితమై
ప్రవహించినప్పుడు
కొత్త నెత్తురు లేవో
నాలో నిండినట్లు, కొత్త బంధాలేవో పెనవేసుకున్నట్లు
ఉత్సాహంతో ఉరకలు వేశాను.
మొదట్లో
నన్నందరూ పరిహసించిన వాళ్ళే.
దోసెడు ధార
దాహార్తినెలా తీర్చగలదని
నవ్విన వాళ్ళే.
ఇప్పుడు
చూసి నవ్విన
నాప చేన్లన్నీ
పండించానా లేదా?
నెర్రెలు వారిన
ఎడారి ముఖాలను ముద్దాడుతూ,
నవనవోన్మత్తమై
నేలకు హరితాన్ని
పులిమానా లేదా?
పడుతూనో,లేస్తూనో,
వడివడిగానో, తడబడుతూనో,
వక్రం గానో,
సరళంగానో
నడిచానా లేదా?
నేల గుండెల ఆవేదనని చల్లారుస్తూ,
నాగరికతల రహస్యాల్ని గర్భంలో దాచుకుని, సజలమై పారే
అశ్రు దుఃఖాన్ని అమృతంలా చిలకరించానా లేదా?
యవ్వనంలో గంభీరంగా శబ్దించినా
వృద్ధాప్యంలో భారాన్ని మోయలేక
కూడబెట్టిన బంధాల
ఇసుక మేటల్ని విడవలేక, భరించలేక
చిక్కి శల్యమై
నెమ్మదిగా గతాన్ని నెమరేసుకుంటూ,
తియ్యని కన్నీటి అనుభూతుల్ని,
స్థబ్దమై ఉప్పబారిన దుఃఖ సంద్రంలో
కలిపానా లేదా?
నేనో నదినై మీ తడారిన గుండెల అర్ద్రత
నింపానా లేదా?