Home కవితలు పంజరమే అతడి లోకం 

పంజరమే అతడి లోకం 

by swathi sripada
సరిహద్దులూ రహదారులూ లేవు
నీదీ నాదన్న భ్రమలూ విభ్రమలూ రావు
విప్పిన రెక్కలు కదలించి ఎగిరినంత మేరా
మనదే కదా , మనసు మెచ్చిన కొమ్మకొమ్మంతా మనదే కదా.
పచ్చని చిలకలతో పరిహాసాలాడుతూ
ఆకుఆకునా అలముకున్న హరితపవనాలు
దారిపొడుగునా రాగఝరులు విసురుతూ
ఇక్కడ నల్లకోయిల అయితేనేం
మరెక్కడో మరో పేరున్న తీపిస్వరం అయితేనేం
స్వర విహాయసాన విహంగాలమే కదా
ఎన్ని సార్లు ఆకాశపు రహదారుల్లో
ఎన్ని మంతనాలు సాగాయి
రంగూ రూపూ ఏ మాత్రం పొంతన కుదరని మన మధ్యన
రెక్కలు మొలుస్తూనే మొదలు కదా దూరాలను కొలవడం
నింగి నీలిమతో ముచ్చట్లు పెట్టడం
కాస్త ముందుకు వంగిన మబ్బులతో మంతనాలూ
తాకాలని తహతహలుపొయే హరివిల్లుతో సరసాలూ
ఏ ఇంటి గుమ్మం ముందు కంకులు వేళ్ళాడినా
చుక్కలు నేలకు దిగివచ్చినట్టు ఎన్ని రంగుల కువకువలు
వేడికీ వెన్నెలకూ మధ్య ఎన్ని యుగాంతర సీమలు
ఆనందాలు కలబోసుకుంటూ ఎగురుతూనే పోతాం కదా

ఆశ్చర్యం ఈ మనిషికి ఒక్కరోజైనా
పక్షి నవుదామనిపించదా
అవునులే
జాతీ మతం కులాలతీగలతో పంజరం పోతపోసుకున్నాక
ఎగిరే రెక్కలు ఎక్కడ రుచిస్తాయి
పక్షి మాంసం రుచిమరిగాక
స్వేచ్చ ఎక్కడ బులిపిస్తుంది.
పాపం పంజరమే అతడి లోకం

You may also like

3 comments

కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి October 29, 2021 - 6:03 am

ముగింపులో స్వాతి గారి కవిహృదయం దర్శనమిచ్చింది. అభినందనలు.

Reply
TRV Rao November 29, 2021 - 2:00 am

అవును కదా కుల మతాల శ్లేష్మం లో చిక్కిన భ్రమరం వోలె అతడి జీవితం లో కొట్టుమిట్టాడుతుంది స్వేచ్చా పక్షి ని చూసి వాడు దిగులు చెందవలే

Reply
TRV Rao November 29, 2021 - 2:03 am

అవును కదా! కుల మతాల శ్లేష్మం లో చిక్కిన భ్రమరం వోలె, అతడి జీవితం కొట్టుమిట్టాడుతుంది. స్వేచ్చా పక్షి ని చూసి వాడు దిగులు చెందవలే

Reply

Leave a Comment