ఎగిరే పతంగమా
ఎందాకా నీ పయనం
ఆకాశం అందుకోవాలన్న ఆశ
కానీ దారం తోడు లేక
గాలి సహాయం లేక
ఎత్తు ఎగరలేక
ఎగిరించే వాళ్ళు లేక
వ్యర్థమే కదా నీవు!!
పెద్దవి చిన్నవి
సప్తవర్ణ శోభితం
పూలు,జంతువులు,ఆకులు,చెట్లు
ఎన్నెన్ని బొమ్మలో నీ ఒంటిలో
హనుమంతుడిలా అందమైన తోక
ఆనందంగా ఎగిరిపోతావ్ గాలిలో
ఏదైనా తగిలినా
ఎవరైనా కోసినా
ఎక్కడ వచ్చి పడతావో
ఎన్ని ముక్కలవుతావో!!
సంక్రాంతి వేళలో
పిల్లా పెద్దా అందరూ నీ తోటే ఆట
తిండి తిప్పలు మరచి
డాబాల మీద గ్రౌండ్ లలో
పోటాపోటీగా పతంగులను
మాంజ కట్టి ఎగురేసి
మజా చేసుడే!!
వెనకముందు చూడక
ఆవేశంతో ఆహ్లాదంతో
ఎగురేసి కిందపడి పోవుడో
దెబ్బల రుచి చూసుడో!!
ఏది ఏమైనా ఎవరిమీద ఆశపడక
నీ కాళ్ళ మీద నీవు నిలబడు మనిషి
యుక్తి శక్తి తోడు
గాలి వాటంతో పోయే గాలిపటం ఎగిరితే పడిపోక తప్పదు
తోడులేని గాలిపటం
తోకతెగిన పక్షి!!!
ఎన్నో ఒడిదుడుకులతో ఎదిగే మనిషి
నేర్పుతుంది పాఠం గాలిపటం
కష్టం లేక పోలేవు ముందుకు
ముళ్ల చెట్టు మీద పడ్డ వచ్చును చేటు
జాగ్రత్తగా పైకి వెళితే గాలిలో ఆనంద సంచారం
పవనం లేకుంటే పతనమే
గాలిపటం లాంటి జీవితం
జాగ్రత్త జర భద్రం మనిషి!!