Home వ్యాసాలు పదకవితాపితామహుడు – తాళ్ళ పాక అన్నమాచార్యులు

పదకవితాపితామహుడు – తాళ్ళ పాక అన్నమాచార్యులు

by Padmasri Chennojwala

అన్నమయ్య క్రీస్తుశకం 1408 వ సంవత్సరము మే తొమ్మిదవ తేదీన ,కడప జిల్లాలోని    రాజంపేట మండలం, తాళ్లపాక గ్రామంలో, వైశాఖ పౌర్ణమి దినమున నారాయణ సూరి లక్కమాంబ అను దంపతులకు జన్మించిరి. వీరు నందవరీక వంశానికి ,భరద్వాజస గోత్రానికి చెందినవారు .  నారాయణ సూరి లక్కమాంబ దంపతులకు చాలా కాలం వరకు సంతానం లేక బాధపడుతూ ఒకసారి తిరుమలకు వెళ్లి స్వామిని దర్శించుకుని , ధ్వజస్తంభం వద్ద ప్రణామాలు సమర్పించుకుంటూ ఉండగా ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని , శ్రీనివాసుడు తాను ధరించే బిరుదు గజ్జియల  ముప్పిడి కటారాన్ని వారికి అందజేశాడని, అలా పుట్టిన శిశువే అన్నమయ్య అని చాలామంది నమ్మకం . సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో జన్మించాడని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో కూడా ఇదే నమ్మకం.

“ఇందరికి నభయంబు లిచ్చు చేయి ”  అంటూ వేదములను అందించడానన్ని గురించి తెలియజేసినా,  “వలనైన కొనగోళ్ళ వాడి చేయి ” అంటూ కొనగోట హిరణ్యకాశిపుని చీల్చిన విధానాన్ని , అటు స్వామి అభయహస్తాన్ని ఇటు దుష్ట సంహారాన్ని చేయగలిగిన  చేతి వైభవాన్ని వర్ణించినా,  “అరసి నన్ను గాచిన ఆతనికి శరణు ”  అంటూ  బ్రహ్మాండాలన్నిటా చైతన్య స్వరూపమై నిండిన స్వామిని శరణు వేడినా ,  “అమ్మమ్మ ఏమమ్మా అలమేలుమంగా నాంచారమ్మ తమ్మి ఇంట నలరు కొమ్మా ”  అంటూ అలివేలు మంగమ్మను అలుక వీడి స్వామిని మురిపించమని వేడుకున్నా ,  “ఈడగు పెండ్లి ఇద్దరి జేసేము చెడేలాల ఇది చెప్పరుగా”  అంటూ అమ్మవారి సౌందర్యానికి మోహితుడై శ్రీనివాసుడు ఆమెను పరిణయమాడిన వైనాన్ని వర్ణించినా అది అన్నమయ్యకే చెల్లింది.

అన్నమయ్య తల్లికి సంగీతంలో మంచి నైపుణ్యం ఉంది .తండ్రి గొప్ప పండితుడు . ఎనిమిదవ ఏట ఘనవిష్ణువు వద్ద వైష్ణవ దీక్ష స్వీకరించిన అనంతరం వీరి విద్యాభ్యాసం తల్లిదండ్రుల పర్యవేక్షణలోని జరిగిందని తెలిస్తోంది. అన్నమయ్యకు 16వ ఏట శ్రీవేంకటేశ్వరుని దర్శనభాగ్యం     కలుగడంతో అప్పటినుండి అద్భుతమైన కీర్తనలు రచించడం ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఏక సంతాగ్రాహి అవడంవల్ల చాలా చిన్న వయసులోనే సంగీత సాహిత్యాలపై అపార పాండిత్యాన్ని గడించారు . అన్నమయ్య మనవడైన తాళ్లపాక చిన్నన్న రచించిన ‘అన్నమాచార్య చరితము ‘ అనే ద్విపద కావ్యంలో అన్నమయ్య జీవిత చరిత్రను వ్రాశాడు.   1948 లో లభ్యమైన ఈ గ్రంథమే అన్నమయ్య జీవితం గురించిన వివరాలు ప్రజలకు తెలియడానికి ఆధారం అయింది .

ఒకనాడు పశువుల మేతకై గడ్డి కోసేటప్పుడు చిటికెన వేలుకు గాయమవుతుంది. అప్పటినుండి అన్నిటిపై విరక్తి చెంది స్వామి సేవే పరమావధిగా శ్రీ వేంకటేశ్వరుని దర్శనార్థియై తిరుమలకు బయలుదేరి యాత్రలో భాగంగా పలు దైవాలను దర్శిస్తూ , మోకాళ్ల పర్వతానికిచేరి అలసటతో ఒక వెదురు పొదలో నిద్రించగా అలివేలు మంగమ్మ కలలో దర్శనమిచ్చి పరమాన్నాన్ని ప్రసాదంగా పెట్టి, పాదరక్షలు లేకుండా పర్వతాన్ని ఎక్కితే అలసట తెలియదని చెప్పడంతో మెలకువ వచ్చి పరమానందంతో కలలో కనిపించినది సాక్షాత్తు అలివేలు మంగమ్మ అని తెలుసుకొని ఆశువుగా ఒక శతకాన్ని చెప్పిరి . తరువాత సునాయాసంగా కొండనెక్కి తిరుమల గిరులపై ఉన్న అన్ని దేవాలయాలు,పుష్కరిణి,  ఆకాశగంగ, కుమారధార,  పాపవినాశం,  విరజానది , యా గశాల,  ఆనంద నిలయం ,కళ్యాణ మండపం , బంగారు గరుడ శేషవాహనం, శ్రీభండారం, బంగారు      హుండీని దర్శించి తన పంచె చెంగున ముడి వేసుకున్న బంగారు కాసును సమర్పించాడు.  వంట ఇంటిలో వకుళాదేవికి నమస్కరించి , బంగారు వాకిలి చెంతకు చేరి దివ్యపాదాలతో, కటి వరద హస్తాలతో సకలాభరణ భూషితుడైన దివ్యమంగళమూర్తిని దర్శించి ,తీర్థప్రసాదాలు స్వీకరించి ,  స్వామి ఆశీర్వచనం పొంది ఆ రాత్రి ఒక మండపంలో నిద్రించాడు. ఆదివరాహ స్వామిని దర్శించి , పుష్కరిణిపై ,గరుడకదంబంపై ,విశ్వక్సేనునిపై పలు సంకీర్తనలను ఆశువుగా చెప్పిరి.

 శ్రీవేంకటేశ్వరుని దర్శనానికి వెళ్ళగా గుడి ద్వారము యొక్క తలుపులకు తాళం వేసి ఉండుటవలన చింతిస్తూ భక్తితో శ్రీ వేంకటేశ్వరుని స్తుతించగా వాటంతటావే తాళములు , తలుపులు తెరుచుకొనబడినవి . శంఖ చక్రములతో వైభవముగా వెలుగొందే ఆ స్వామిని చూసిన అన్నమయ్య పరమానందముతో ఒక శతకమును చెప్పెను . అంతలో స్వామి మెడలో ఉన్న ముత్యాల హారము పాదములపై పడిందట. ఘన విష్ణువు  అని పేరు గల ముని శ్రీ వేంకటేశ్వరుని ఆజ్ఞానుసారంగా అన్నమయ్యను పిలిచి పంచ ముద్రలు వేసి వైష్ణవ దీక్షను ఇచ్చిరి .అప్పటినుండి అన్నమయ్య అన్నమాచార్యుడు అని పిలవబడి , సర్వ విద్యలను , అనగా వైష్ణవ తత్వాలను తెలుసుకుంటూ ,  ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ, వేంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే జీవితం గడపసాగారు .

వెంకటాచలానికి సమీపంలో ఉన్న ‘మరలుంకు ‘ అనే అగ్రహారంలో నివసించేవారు. ఆ సమయంలో రాజ్యంలో చెలరేగిన కల్లోలాలతో విరక్తి చెందిన అతను హరి సంకీర్తనలే సర్వస్వంగా  జీవితం గడపసాగారు .అతని కీర్తనలలోని ఆశీర్వచనానికి ఆకర్షితులైన జనులు తండోపతండాలుగా వచ్చేవారు .

అన్నమయ్య పదకవితాపితామహుడు , సంకీర్తనాచార్యుడు, పంచమాగమ సార్వభౌముడు, ద్రవిడాగమ సార్వభౌముడు అని బిరుదులు పొందిరి .

శ్రీనివాసుని నాయకునిగా తనను తాను నాయికగా భావించుకొని మధుర భక్తితో కూడిన  శృంగార కీర్తనలు రచించిరి.అన్నమయ్య కీర్తనలలో విష్ణుభక్తి మాత్రమే కాకుండా సమాజ సంక్షేమానికి , చైతన్యానికి సంబంధించిన పలు అంశాలు ఉన్నాయి .

అన్నమయ్యకు యుక్త వయసు రాగానే తల్లిదండ్రులు అతనికి తిమ్మక్క అక్కమ్మ అనే ఇరువురు స్త్రీలతో వివాహం జరిపించిరి. వీరికి ఇద్దరు కుమారులు కూడా కలిగారు . ఒకసారి అన్నమయ్య తన భార్యలతో తిరుమల సందర్శించి ఆ సమయంలోనే శ్రీ వేంకటేశ్వరునిపై రోజుకు ఒక్క కీర్తన వినిపించాలని సంకల్పించింరి. అప్పటినుండి పుంఖానుపుంఖాలుగా కీర్తనలు రచించడం మొదలుపెట్టారు . అతని శిష్యులు వీటిని గానం చేస్తూ, తాళపత్రాలలో లిఖించడం ప్రారంభించారు . తర్వాత అన్నమయ్య మనవడైన చిన తిరుమలాచార్యుడు వీటిని రాగిరేకులపై చెక్కించడంతో అవి నేడు తిరుమల భాషకారుల సన్నిధిలో భద్రపరచబడి ఉన్నవి.

సాల్వ నరసింహారాయలు అనే రాజు తనపై కీర్తన రచించమని ఆజ్ఞాపించగా , “నరహరి నుతించిన జిహ్వ పరుల నుతింపగా నొప్పదు “అని నిరాకరించిరి. అందులకు కోపించిన రాజు అన్నమయ్యను చెరసాలలో బంధించమని ఆజ్ఞాపించగా , అన్నమయ్య “సంకెలలిడు వేళ” అను కీర్తనను గానం చేయుటతో వెంటనే ఆ సంకెళ్లు విడిపోయినవట. అప్పుడు రాజు ఆశ్చర్యపడి అన్నమయ్యను శరణు వేడుకొనిరట.

వీరి కీర్తనలలో ఆ కాలము నాటి సాంఘిక , సామాజిక ఆచారములు ,సామెతలు ,అలంకారములు అన్నియు గోచరిస్తాయి.  వీరి రచనలు ఆధ్యాత్మిక సంకీర్తనలు ,శృంగార సంకీర్తనలు అని రెండు రకములుగా విభజింపబడినవి.

తెలుగు భాషలో మొట్టమొదటగా రచనలు చేసిన వాగ్గేయకారుడు అన్నమయ్య. కీర్తన అను ప్రక్రియను ప్రారంభించినది కూడా అన్నమాచార్యులే. పల్లవి ,అనుపల్లవి ,చరణములు మొదలగు వానికి రూపకర్త కూడా అన్నమాచార్యులే. వీరి రచనలలో ‘శృంగార మంజరి ‘ , ‘వెంకటాచల మహత్యము’ ,’సంకీర్తన లక్షణము’ , ‘ద్విపద రామాయణము’  12 శతకములు మొదలైనవి. ఇవి వీరు శ్రీవేంకటేశ్వరుని చరణాలకు అంకితమిచ్చిరి .

వీరు సంస్కృతంలో రచించిన ‘సంకీర్తన లక్షణము ‘ ను వీరి  మనవడైన చినతిరు మలాచార్యుడు తెలుగులోనికి అనువదించిరి .

15వ శతాబ్దానికి చెందిన కాలంలోనే వీరిలో పలు అభ్యుదయ భావాలు ఉన్నట్లుగా వీరి రచనల ద్వారా మనము   కనుగొనవచ్చు .కులమత భేదాలను తూలనాడడం , అంటరానితనాన్ని నిరసించడం , కులవృత్తులను గౌరవించడం వీరి రచనల్లో ఉన్న  వైభవం .

“ఉన్నతి పతిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి  చాంగుభళా “అంటూ అలివేలు మంగమ్మ శ్రీనివాసుల అనురాగాన్ని వర్ణించినా , పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభపేరు గుచ్చ సిగ్గుపడి పెండ్లి కూతురు “అంటూ అలివేలు మంగమ్మను పెళ్లికూతురుగా , ఆమెలోని బిడియాని అందంగా వర్ణించినా, “మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరిభూమి ఒకటే ”  అంటూ కులమతాల అడ్డుగోడలని ఛేదించినా, ” ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్టనిండా పాలు పోయరే ” అంటూ బాలకృష్ణుడిని ముద్దుగా ముద్దుమాటలాడినా అది ఆయన కీర్తనలలోని భక్తి  భావపు పలు కోణాలగా మనము గమనించవచ్చు .

సంగీత సాహిత్యాలలో ఈతని కుటుంబ సభ్యులు ఆరితేరినట్లుగా  మనము గమనించవచ్చు .ఇతని తల్లి చక్కని సంగీతవేత్త .తండ్రి పండితుడు . భార్య అయిన తిమ్మక్క తొలి తెలుగు కవయిత్రి. ఈమె’  సుభద్రా కళ్యాణం ‘ ,  ‘మంజరి  ‘ అనే ద్విపద కావ్యం రచించింది . తిమ్మక్క కుమారుడైన చిన్నన్న సంగీత సాహిత్యాలలో పండితుడు .

 శ్రీ వేంకటేశ్వరున్ని  కీర్తనల ద్వారా స్తుతించడంలోనే జీవితానందాన్ని పొందిన అన్నమయ్య   క్రీస్తు శకము 1503 వ సంవత్సరము ఫిబ్రవరి 23వ తేదీన దుందుభి నామ సంవత్సరం ఫాల్గుణ బహుళ ద్వాదశి దినమున స్వామిలో ఐక్యం అయ్యారు.

” కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు ” అంటూ ఇరుదేవేరుల నడుమ అలరారే స్వామి రూపాన్ని వర్ణించినా , “కట్టెదుర వైకుంఠము కాణాచైన కొండ తెట్టేలాయె మహిమలే తిరుమల కొండ “అంటూ తిరుమలగిరి శిఖరాల సోయగాలను వర్ణించినా,  “సకల లోకేశ్వరులు సరస చేకొ నువాడు అకలంకముగ పుష్పయాగంబు ” అంటూ స్వామి పుష్పయాగ సుగంధా లను (వైభవాన్ని) వర్ణించినా, ఉన్నతి  పతిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగు బలా” అంటూ అమ్మవారికి స్వామివారిపై ఉన్న అనురాగాన్ని వర్ణించినా ” జో అచ్యుతానంద జోజో ముకుందా ” అంటూ స్వామిని నిద్రపుచ్చినా అది అన్నమయ్య  కీర్తనలలోని  మాధుర్యంగా మనం గమనించాలి . ఒకవైపు శ్రీనివాసునిపై భక్తి ప్రధాన కీర్తనలు అల్లుతూ , మరోవైపు సమాజంలోని దురాచారాలను నిరసిస్తూ రచించిన వీరి కీర్తనలు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆబాల గోపాలాన్ని అలరిస్తూనే ఉంటాయి అనడంలో సందేహం లేదు .        

You may also like

Leave a Comment