చెమటను చిందించిన చేతులు
భవనాన్ని నిర్మిస్తే బతుకుపోరంటావు
నువు మాత్రం అవుటర్ రింగ్ రోడ్డో
అందమైన గెస్ట్ హౌసో రూపకల్పన చేసి
ఇది మేధోమధనమంటావు
అనాదిగా కష్టించే కార్మికులు
ఈ దేశంలో రెండవ తరగతి పౌరులే
ఆశ్చర్యం పడాల్సిందేమీలేదు
సామూహికంగా అలవాటుచేసుకున్న
సానుభూతి చాటున
నీ విసుగు వినయాన్ని ప్రదర్శిస్తోంది
వారిని తలుచుకో ఒక్కసారి…
పునాదులు తీస్తారు
ఇటుకపై ఇటుక పేరుస్తారు
అంతస్తుపై అంతస్తుకట్టి
తథాస్తు దేవతల్లా దీవిస్తారు
ఓటుబ్యాంకు కాదుకాబట్టి
మరోమజిలీకి మారిపోతుంటారు
అద్దె గర్భాన్ని మోసిన తల్లుల్లా
కన్నీటితో వీడ్కోలు పలుకుతారా
పోనీ జ్ఞాపకాలను కన్నీటిని చేస్తారా అనుకుంటే
వారి గాంభీర్యం అన్నింటిని కప్పేస్తుంది ఆకలితోసహా…!
కట్టినవాడు హక్కుదారుడు కాదు
హుష్ కాకి అంటే ఎగిరిపోయినట్టు
మరో చోటును
వెతుక్కుంటూ అలుపెరగని బాటసారుల్లా సాగిపోతారు అన్న నిజం తెలిసిన ధనికస్వామ్యవర్గం
విలాసంగా నవ్వుకుంటుంటుంది !
భారంమోసే భూమిలా బలహీనులెప్పుడూ
బాధ్యతతో సాగే నిశ్శబ్ద యాత్రికులే
వారు పరాయికరణ చెందలేదు
శతాబ్దాలుగా వారు పరాయివారిగానే
మిగిలిపోయారు.. కాదు కాదు
పరాయివాళ్ళని చేసేశాం
మనమే పరాయికరణ చెందాం
(ఏహక్కూలేని కొంతమంది వలస కార్మికులను చూసినప్పుడు)