Home ఇంట‌ర్వ్యూలు పరిణత — పాళీ

పరిణత — పాళీ

చక్కటి నగిషీలు చెక్కిన అలమరలలో… అంతే చక్కని విలువైన పుస్తకాల నిలయంలో ఆమెను చూస్తే నిరాడంబరంగా కనిపిస్తున్న చదువుల తల్లిని పలకరించాం!

ఇంతలోనే మంచి పలకరింపుతో సుభద్రాదేవి గారి కూతురు మాకు మంచినీరు అందించిన వైనం మహాద్భుతం ఎందుకంటున్నానంటే…? అందంగా అలంకరించిన మట్టిపిడతలతో మంచి నీరు ఇచ్చారు… కాలుష్యాన్ని దూరంగా తరిమేయాలని బద్ధకంకణురాలైన పౌరురాలిగా తన వంతు కర్తవ్యాన్ని ప్లాస్టిక్ వాడకూడదనే నినాదాన్ని ఆచరణలో పెడుతున్నట్టుగా మాకనిపించింది.
కేవలం తమ రచనలలో అక్షరాలతో చెప్పడంకాదు! అక్షరాలా ఆచరించి చూపడం అభినందించతగిన విషయం.
అడుగడుగునా ఆ ఇంట్లో అందమైన పెయింటింగ్ చేసిన చిత్రాలు మన రచయిత్రి శీలా సుభద్ర గారి భర్త శీలా వీర్రాజు గారు స్వహస్తాలతో చిత్రించిన చిత్రాలతో అలంకరించిన ఆ ఇల్లు, ఓ చిత్ర ప్రదర్శన శాల వలె, ఓ గ్రంథాలయం వలె, ఆమె సాక్షాత్తూ సాహితీ మూర్తి వలె కనిపించి ఆనందం కలిగించింది మరెవరో కాదు! కథలు రాసే కథా రచయిత్రీ ; కవితలల్లే కవయిత్రి ; వ్యాస నిర్మాణ శీలి…. ఆమె పరిణత– పాళీ శీలా సుభద్రాదేవి గారు… ఈ రోజు మన తరుణి అతిథి!
వారిని పలుకరించి, వారి ద్వారానే మరెన్నో విషయాలు తెలుసుకుందాం!

రంగరాజు పద్మజ :– నమస్కారమండీ సుభద్రాదేవిగారూ!

శీలా సుభద్రాదేవి :— నమస్కారం పద్మజగారూ!

పద్మజ:– మీ నేపధ్యం తరుణి పాఠకులకు తెలుపుతారా?

సుభద్ర ;— ఆధునిక కథకు చిరునామా అయిన విజయనగరంలో 1949లో జన్మించాను. మానాన్నగారు కలెక్టర్ ఆఫీసులో పనిచేసేవారు. నాకు ఇద్దరు అక్కలు ,ఇద్దరు అన్నయ్యలు. మా పెద్దక్క పి.సరళాదేవి రచయిత్రి.పి.శ్రీదేవి, రంగనాయకమ్మ మొదలగువారి సమకాలీనురాలు. పెద్దన్నయ్య కొడవంటి లీలా మోహనరావు తొలిరోజుల్లో కథలూ, వ్యాసాలూ రాసేవాడు. నాకవితలు ఆంగ్లంలోకి అనువదించాడు. రెండో అన్నయ్య కొడవంటి కాశీపతిరావు వందకు పైగా కథలురాసాడు.
కాలేజీ రోజుల్లో శీలా వీర్రాజుగారి కథల్నీ, నవలనీ చదివి వుత్తరం రాయాలనిపించి KS దేవి పేరుతో, స్నేహితురాలి అడ్రస్ తో కొన్నినెలలు సాహిత్య చర్చలతో కలం స్నేహం నడిచాక ఓ సందర్భంలో నేను మేనమామ కూతురునని తెలిసి వివాహం చేసుకోడానికి ప్రపోజ్ చేయటంతో బహుభాషా పండితుడు రోణంకి అప్పలస్వామి గారి అధ్వర్యంలో సభా వివాహం జరిగింది.

పద్మజ :—- మీ విద్యా – ఉద్యోగ ప్రస్థానాలు వివరిస్తారా?

సుభద్రా దేవి : — విద్య – ఉద్యోగం – అభిరుచులు చెప్పాలంటే విజయనగరంలో మహారాజ మహిళా కళాశాలలో BSc డిగ్రీ చేసాను.
1971లో వివాహానంతరం హైదరాబాద్ వచ్చేయడం జరిగింది. పదేళ్ళ తరువాత MA(తెలుగు),BEd,మరో పదేళ్ళ తరువాత MSc(maths) పట్టాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి అందుకున్నాను..
ఆర్టీసీ హైస్కూల్ లో గణితోపాధ్యాయినిగా, ప్రధానోపాధ్యాయినిగా ఉద్యోగం చేసి పదవి విరమణ చేసాను..
చిన్నప్పటినుండి పత్రికలోని బాపూ చిత్రాలు చూసి ఇష్టంగా చిత్రాలు వేసేదాన్ని. విజయనగరం సంగీతం కళాశాలలో ఓ మూడేళ్ళు గాత్రం నేర్చుకున్నాను. కానీ నాకు లలితసంగీతమంటే మహా ఇష్టం. ఫేబ్రిక్ పెయింటింగ్స్, ఎంబ్రాయిడరీ వర్క్ ఒకప్పుడు ఇష్టంగా చేసేదాన్ని. సాహిత్యంలోకి వచ్చాక అవన్నీ వెనకబడ్డాయి.

పద్మజ :—- మీ రచనా వ్యాసంగం ఎప్పుడు ప్రారంభించారు?

సుభద్రాదేవి :—- హైస్కూల్ లో చదువుతున్నప్పుడు మా తెలుగు మాస్టారు రామకృష్ణమాచార్యులు గారు ఛందస్సు నేర్పించినప్పుడు విరివిగా పద్యాలు రాసాను. మా మాష్టారు స్కూల్ కోసం లిఖిత పత్రిక నడిపేవారు అందులో పద్యాలు, గేయాలూ రాసే దాన్ని. కాలేజీ మాగజైన్ లో రాసాను. కానీ అవన్నీ పెద్దగా చెప్పుకోను.
అయితే ప్రత్యేకంగా చెప్పుకునేది మాత్రం 1970లో పొలికేకలో ప్రచురితమైన నా మొదటి కథ” పరాజిత” తో సాహిత్య రంగంలోకి రచయిత్రిగా అడుగు పెట్టాను.

పద్మజ :—- మీ రచనలలోని దేవుడు బండ కథా నేపథ్యం చెప్పండి!

సుభద్రా దేవి :— 1987 లో విపుల మాసపత్రిక నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందిన కథ ‘ దేవుడు బండ’. రాతిరోళ్ళు తయారు చేసి అమ్మే వలసజీవుల జీవన విధ్వంసాన్ని తెలంగాణా మాండలికంలో రాసినకథ. ఇందులో చదువుకోవాలని తపనపడే పేదపిల్లాడి వేదనవుంది. యాంత్రిక యుగపరిణామంలో రోళ్ళకు బదులు యంత్రాలు వంటిళ్ళలోనికి వచ్చేస్తుంటే అమ్ముడుగాని రాళ్ళ బరువు మోస్తున్నవారి జీవన వ్యథ, పాడైపోయిన పొత్రాలు యాదృచ్ఛికంగా గ్రామదేవతగా రూపొందే వ్యంగ్యంతో ముగిసిన కథ. ఇది నాకు బాగా నచ్చిన కథలలో ఒకటి. నేను స్కూల్ కి వెళ్ళటానికి మలక్ పేట బస్టాప్ లో నిలబడినప్పుడు బస్టాప్ వెనుక కాపురం ఉన్న రోళ్ళు తయారుచేసే కుటుంబాల్ని పరిశీలించి రాసిన కథ ఇది. ఈ కథ కేంద్ర సాహిత్య అకాడమీ వారి సంకలనంలో చేర్చారు. నా మొదటి కథలసంపుటి దేవుడు బండ పేరుతో 1990లో వెలువడింది.

పద్మజ :—- రచయిత్రుల కథలపై వ్యాసాలు రాసారు కదా! దాని గురించి, అవి ఎందుకు రాయాల్సి వచ్చింది, వివరించండి.

సుభద్రా దేవి :— 2010లో వందేళ్ళ కథాప్రస్థానం సందర్భంగా తెలుగు రాష్ట్రంలోనే కాక బయటున్న తెలుగు కథకులందరితో ఎన్నో సమావేశాలూ, ఎన్నో ఇంటర్వ్యూలూ, వ్యాసాలూ, అభిప్రాయాలు వెలువడ్డాయి. మొదటి కథారచయిత్రిగా భండారు అచ్చమాంబను పేర్కొని, ఆపైన 1980 తర్వాత రాసిన రచయిత్రులనే అనేకమంది పేర్కొన్నారు.
వందేళ్ల కథకు వందనాలు’ పేరిట హెచ్ఎంటీవీ లో 2012 లో గొల్లపూడి మారుతీ రావు ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ధారావాహికంగా నిర్వహించారు. 118 మంది కథకుల కథలను పరిచయం చేసిన గొల్లపూడి మారుతీరావు కేవలం పన్నెండు మంది రచయిత్రుల కథలనే పరిచయానికి స్వీకరించటంకూడా గమనించాల్సిన విషయమే.
అవన్నీ గమనించిన తరువాత 1910కి-1980కి మధ్య ఒకరిద్దరు తప్ప కథారచయిత్రులు లేరా! అనే ఆశ్చర్యం కలిగింది. అరవయ్యో దశకంలో పత్రిక లన్నింటిలో ప్రభంజనం సృష్టించిన రచయిత్రులంతా ఏమయ్యారు? వారు నవల తప్ప చెప్పుకోదగిన కథలేమీ రాయలేదా? రాసినా విమర్శకులు, చాలామంది పేర్కొన్నట్లు, ప్రేమలూ-పెళ్ళిళ్ళూ, కుటుంబాలూ, అపార్థాలూ, కలహాలతో నిండి, వంటింటి సాహిత్యమేనా? – ఇలా అనేక సందేహాలు నన్ను చుట్టుముట్టాయి. ఆ సంఘర్షణ లోనే నా ముందుతరం 1950 నాటి 24 మంది రచయిత్రుల గురించి పరిశోధనాత్మక వ్యాసాలు రాసాను. పుస్తకంగా వెలువరించాను.

పద్మజ :—- ముద్ర సంపుటి వెలువరించారు కదా! ఏ సందర్భంలో ?

సుభద్రా దేవి :—- 2001 లో డా.పి.భార్గవీరావు గారూ, నేనూ కలిసి మొల్ల దగ్గర నుంచి ప్రారంభించి అప్పటివరకూ వున్న వంద మంది కవయిత్రుల కవితా సంకలనంగా ” ముద్ర”ను తీసుకువచ్చాము.

పద్మజ :— మీరు పొందిన పురస్కారాలు – ఆయా సందర్భాలు తరుణి పాఠకులకు చెప్పండి!

సుభద్రా దేవి :—- పురస్కారాలు:
తెలుగు విశ్వవిద్యాలయం నుండి 1997లో సృజనాత్మక సాహిత్యానికి *పట్టాభిరామిరెడ్డి ఎండోమెంట్ అవార్డ్
లేఖిని సాహిత్య సంస్థ నుండి వచ్చే కవిత్వానికి *కుసుమా రామారావు పురస్కారం.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి 1999లో *ఉత్తమ రచయిత్రి అవార్డు
కవిత స్మారక సాంస్కృతిక సంస్థ, కడప నుండి 2011లో ‘రెక్కలచూపు’ కథాసంపుటికి *గురజాడ అవార్డు
ఆవంత్స సోమసుందర్ గారి నుండి 2011లో దీర్ఘ కవిత్వానికి దేవులపల్లి రాజహంస *కృష్ణశాస్త్రి పురస్కారం.
2018లో ఉమ్మడిసెట్టి రాధేయ త్రిదశాబ్ది *ప్రతిభా పురస్కారం.
2018లో కవిత్వానికి అమృతలత *అపురూప పురస్కారం.
2018లో “నా ఆకాశం నాదే” కవితా సంపుటికి గంగిశెట్టి లక్ష్మినారాయణ గారి *మాతృపురస్కారం
2022లో సుశీలానారాయణరెడ్డి పురస్కారం.
2022లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి *మాతృ పురస్కారం.
,శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి పురస్కారం.
గుత్తికొండ రామరత్నం జీవన సాఫల్య పురస్కారం,
నీడల చెట్టు నవలకు విశాలాక్షి విశిష్ట పురస్కారం
మొదలైన పురస్కారాలు పొందాను.

పద్మజ :—- మీరు చిత్రకారిణి అని విన్నాను! ఆ చిత్రాలు ఏమైనా వున్నాయా? మా ప్రేక్షకులకు చూపించుదామా?

సుభద్ర దేవి :- నేను 1970లలో బాపూ బొమ్మలను చూసి కొన్ని చిత్రాలు వేసినవి.

పద్మజ :— ఇంటి బాధ్యత, ఉద్యోగ బాధ్యతలతో పాటూ రచనా వ్యాసంగం ఎలా సమన్వయం చేసుకున్నారు?

సుభద్రా దేవి :— వివాహానికి ముందే కథారచన ప్రారంభించినా, వివాహానంతరం ఉమ్మడి కుటుంబం,పిల్లలూ, రోగాలూ, రొష్టులుతో కొంత విరామం వచ్చి, మనసులోనే పదాలు అల్లుకొని సమయం దొరికినప్పుడు పేపరు మీద పెట్టే సౌలభ్యం వలన కవిత్వంలోకి వచ్చాను. తర్వాత ఉద్యోగం బాధ్యత కలిసింది. అందుకే పదకొండు కవితా సంపుటాలు ప్రచురించుకోగలిగాను కానీ మూడే కథల పుస్తకాలను ప్రచురించాను. పదవీవిరమణ అనంతరం విమర్శలో కూడా కృషిచేసి ఒక వ్యాస సంపుటి, రెండు మోనోగ్రాఫ్ లు రాసాను. మరో మూడు వ్యాస సంపుటాలను తీసుకు రావాల్సి వుంది.ఏపాటి సమయం దొరికినా సాహిత్యపఠనం ఆపలేదు,రాయటమూ ఆపలేదు. చిన్ననాటి నుండీ నా జీవితంలో ఎదుర్కొన్న అనేకానేక ఎదురుదెబ్బలూ, ఆటుపోట్లలో నేను ఇలా నిలదొక్కుకొని నిలబడగలిగానంటే సాహిత్యమే నా వూపిరి, సాహిత్యమే నాకు టానిక్.

పద్మజ :—-స్త్రీ వాద ఉద్యమం కవితలు రాయటానికి గల కారణాలు ఏమిటంటారు ?

సుభద్రా దేవి :—- చిన్నప్పటినుండి నేను చదివిన రావిశాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావు, రంగనాయకమ్మ మొదలైన వారి రచనలు సమాజంలోని జరిగే అనేకానేక విధ్వంసాల్ని, అణచివేతల్ని పరికించే దృక్పధాన్ని నాకు అలవడేలా చేసాయి. నిజానికి నేను కథలు రాసినా, కవితలు రాసినా స్త్రీ ప్రాధాన్య ఇతివృత్తాల్నీ, అంశాల్నే కాక సామాజికపరమైన ఇతర సమస్యలన్ని తీసుకుని రాయటానికే ప్రయత్నించాను. స్త్రీలపై ఆర్థిక సామాజిక సంక్షోభాలు ఏవిధమైన ఒత్తిడిని వివక్షల్నీ ప్రదర్శిస్తాయో ప్రధానంగా నా రచనలలో కన్పిస్తాయి.
ఒకవైపు స్త్రీగా జెండర్ వివక్షే కాకుండా సమాజంలో కుల పరమైన వెనకబాటు తనం కూడా బాధిస్తే రెండు పడగల నీడక్రింద స్త్రీ అస్తిత్వరాగాలాపనలే నా రచనలు.

పద్మజ ::— యుద్ధం ఒక గుండె కోత గురించి తెలియజేయండి!

సుభద్రా దేవి :—- 2001లో అమెరికాలో జంటటవర్లు కూల్చిన దుర్ఘటన అనంతరం, అమెరికా ఆఫ్ఘన్ యుద్ధ నేపథ్యంలో రాసిన 56 పేజీలు దీర్ఘకవిత ‘యుద్ధం ఒక గుండె కోత! రచయిత్రుల కలంనుండి వెలువడిన మొట్టమొదటి దీర్ఘ కవిత్వకావ్యంగా విమర్శకులు పేర్కొన్నారు. ప్రపంచమంతా కమ్ముకున్న యుద్ధ మేఘాలు, బాంబులు కురిపించటంతో కలచిన హృదయ వేదన, చిన్నిదేశాలపై అగ్రరాజ్య దురహంకారంపై ఆగ్రహం, జరుగుతున్న అనేకానేక సంఘటనల వెనక నలుగుతున్న స్త్రీల కనిపించని ఆర్తనాదాలు, ఏ యుద్ధమైనా మొట్టమొదట గాయం చేసేది తల్లి గర్భం పైనే అన్న అంతర్గత ఆలోచనలతో మాతృహృదయ ఆవేదనగా రాసినది ఈ కావ్యం. అప్పటికి కవులు కొందరు మాత్రమే దీర్ఘకవితలు రాసారు. అందులోనూ యుద్ధనేపథ్యంగా దీర్ఘకవిత్వం రాసిన వారూ లేరు. అప్పట్లోనే డా.పి భార్గవీరావు , డా. పి. జయలక్ష్మిగారలు కలసి “WAR, A Hearts’ Ravage” పేరిట ఆంగ్లంలోనూ,”యుద్ధ్ ఏక్ దిల్ కి వ్యథ” పేరిట నిర్మలానంద వాత్సాయన్ గారు హిందీ లోకి , రాజేశ్వరీ కోదండంగారు “ఉళ్ళక్ కుమురల్ ” పేరుతో తమిళంలోకి అనువదించారు.

పద్మజ :—- మీ రచనలపై పరిశోధనలు వచ్చాయా?

సుభద్రా దేవి : — ఇప్పటి వరకూ నా రచనలపై వివిధ విశ్వవిద్యాలయాల్లో మూడు MPhil పరిశోధనలూ,రెండు PHD పరిశోధనలూ జరిగాయి.

పద్మజ :—- మీ శ్రీవారు చిత్రకారులు కదా! మీ రచనా వ్యాసంగానికి వారి తోడ్పాటు ఎలా వుండేది?

పద్మజ :— మీకు నాభర్త శీలా వీర్రాజుగారు రచయిత కూడా అని తెలియదనుకుంటాను. ఇంటర్మీడియేట్ చదువుతోన్న రోజుల్లోనే 1956 లో మొదటి నవలతో మొదలుపెట్టి నాలుగు నవలలూ, తొమ్మిది కథలసంపుటాలు, ఎనిమిది కవితా సంపుటాలు, ఒక వ్యాస సంపుటి వీర్రాజుగారి సాహిత్య ఖాతాలో వున్నాయి. అందుచేత మొదటినుంచీ వారి ప్రోత్సాహం వుంది. నా పుస్తకాల ప్రచురణకు పూర్తి తోడ్పాటు వుంది.

పద్మజ :—- కాత్యాయనీ విద్మహే మీ పుస్తకానికి చక్కని పీఠిక రాసారు – ఆ సందర్భం ఎలా తారస పడింది?

సుభద్రా దేవి :— 2009 లో అప్పటి వరకూ వచ్చిన ఎనిమిది సంపుటాలను కలిపి “శీలా సుభద్రాదేవి కవిత్వం” పేరిట వీర్రాజుగారు నా అరవయ్యేళ్ళ జన్మదిన సందర్భంగా ప్రచురించారు. ఆ పుస్తకానికి కాత్యాయనీ విద్మహే చాలా వివరంగా సుమారు పదహారు పేజీల పీఠిక రాసారు.

పద్మజ :— రెక్కల చూపు. రెండవ కథా సంపుటి గురించి వివరించండి !

సుభద్రా దేవి :—- రెక్కల చూపు నా రెండవ కథలసంపుటి. ఇందులోని గోవుమాలచ్చిమి కథకి ఆంగ్లానువాదం కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించిన సంపుటిలో చేరింది.”మార్పు వెనుక మనిషి కథ ” తిరుపతి SV విశ్వవిద్యాలయం మొదటి సంవత్సరం డిగ్రీ తెలుగు సిలబస్ లో పాఠ్యాంశంగా చేర్చారు. చాలా కథలు సంకలనాలలో చేరాయి.

పద్మజ :– ఇస్కూలు కతలు పేరు ఆశ్చర్యంగా ఉంది! దీని నేపథ్యం చెప్పండి !

సుభద్రా దేవి :— ఇస్కూలు కతలు తెలుగు విద్యార్థి మాసపత్రికలో రెండున్నరేళ్ల ఏళ్ళ పాటూ ధారావాహికంగా ప్రచురితమయ్యాయి. తర్వాత అదే పేరుతో గ్రంథస్థం చేసాను. ఇందులోని కథ మహారాష్ట్ర ప్రభుత్వపాఠశాల తెలుగు ద్వితీయ భాషగా చదివే ఏడవ తరగతి తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా పదేళ్ళుగా చేర్చారు. ఇటీవల డా.గణేష్ రామ్ గారు హిందీలోకి అనువదించిన ఇస్కూలు కతలు పుస్తకం
గా వెలువడింది.

పద్మజ :—– కొన్ని సంకలనాలకు సంపాదకత్వం వహించారు కదా? ఆ వివరాలు ?

సుభద్రాదేవి :—. ముద్ర (వనితల కవితల సంకలనం – భార్గవీ రావుతో సంపాదకత్వం, 2001)

  1. వాళ్ళు పాడిన భూపాలరాగం (డా. పి. శ్రీదేవి కథలు, 2022)
  2. యాభై ఏళ్ళ ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు (2022)
  3. మధుకలశమ్ (డా.పి. శ్రీదేవి కవిత్వం(2023)
  4. నది ప్రయాణం (శీలానవీ స్మరణికలు)(2023)
  5. శీలావీ శిల్పరేఖలు (2024)
    7.ఒక చిత్రకారుడు -కొన్ని అవలోకనాలు ( 2025 శీలా వీర్రాజు చిత్రలేఖనంపై ప్రముఖులు రాసిన వ్యాసాలు)
    8.శీలాక్షరాలు కవితా సంకలనం (2025 శీలావీఫాంట్ తో కూర్చిన 250 మంది కవుల కవితలు)
    ఇవి ఇంతవరకూ నా సంపాదకత్వంలో వచ్చిన పుస్తకాలు.

రంగరాజు పద్మజ :- మీ సాహిత్య పయనం చూస్తే చాలా సంతోషమైందండీ !

పద్మజ :— తరుణి పత్రిక గురించి మీ అభిప్రాయం చెప్పండి !

సుభద్రా దేవి : —- ఒకప్పటి కన్నా ఇప్పుడు మహిళలు సంపాదకత్వంలో వస్తున్న పత్రికలు, అందులోనూ అంతర్జాల పత్రికలు ఎక్కువగానే వున్నాయి. అది సంతోషించదగిన విషయం. కొండపల్లి నీహారిణి ఒకేసారి రెండు పత్రికలు తీసుకుని రావటం ముదావహం.

పద్మజ :— పత్రిక పాఠకుల ఆదరణ పొందాలంటే ఇంకా ఏమి చేయాలో సూచనలు చేయండి!

సుభద్రా దేవి :—- ఇప్పుడు అంతర్జాల పత్రికలు ఎక్కువగానే వున్నాయి. వాటిలో వస్తున్న శీర్షికలు, కథనాలూ పరిశీలించాలి. వాటికన్నా విభిన్నమైన రీతిలో పత్రిక ఉండటానికి ఎటువంటి మార్పులు, చేర్పులూ వుండాలో ఏడాదికొక సారైనా సమీక్షించుకొని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వుండాలి.
సామాజిక జీవితాల పట్ల చక్కగా చలించే హృదయమున్న రచయిత్రి శీలా సుభద్రాదేవి గారి సాహిత్యం స్పష్టతతో పాటు ఎవరైతే బాధించబడే వర్గం ఉంటుందో వారి పట్ల దయాగుణం చూపిస్తూ… ఆ దయాగుణం అందరికీ .. ఉండాలంటూ… అక్షరీకరిస్తారు సుభద్రా దేవి గారు!

నిజమే కదా! సమాజం పట్ల బాధ్యత ఉన్న ఎవరికైనా ఆ గుణం ఉండాలి! అందుకే ఆ బాధా తప్తుల కోసం ఓదార్పు వంటి రచనలు చేసి, వారిలో ఆలోచనలు రేకెత్తించే భావాలతో నింపి, సాహతీ సేవ చేస్తున్న శీలా సుభద్రా దేవి గారు ఆ తాడిత- పీడిత ప్రజలకే కాదు! ఇలాంటి రచనలు చేయాలని ఆలోచన కలిగించి, రచయిత్రులకూ మార్గదర్శకురాలే! వారి నుండి మరిన్ని ఇటువంటి రచనలు కోరుతూ వారికి పత్రికాముఖంగా ధన్యవాదాలు అందిస్తూ సెలవు తీసుకుంటున్నది…

You may also like

26 comments

Trevor4529 July 31, 2025 - 4:36 pm Reply
Earl1481 July 31, 2025 - 5:11 pm Reply
Jessie1795 July 31, 2025 - 5:39 pm Reply
Theodore1842 July 31, 2025 - 7:20 pm Reply
Hayden627 July 31, 2025 - 10:42 pm Reply
Britney1850 August 1, 2025 - 6:06 am Reply
Marc2569 August 1, 2025 - 7:09 am Reply
Shirley552 August 1, 2025 - 10:12 am Reply
Dennis2365 August 1, 2025 - 1:07 pm Reply
Ella4736 August 1, 2025 - 2:46 pm Reply
Alissa4479 August 1, 2025 - 11:57 pm Reply
Francis174 August 2, 2025 - 1:33 pm Reply
Manuel4212 August 3, 2025 - 6:07 am Reply
Julie3545 August 3, 2025 - 9:52 am Reply
Ethan3838 August 3, 2025 - 1:20 pm Reply
Theo4175 August 4, 2025 - 3:28 am Reply
Tracy3315 August 4, 2025 - 7:55 am Reply
Alexandra2627 August 4, 2025 - 7:59 am Reply
Pat4201 August 7, 2025 - 8:16 am Reply
Lauryn926 August 10, 2025 - 3:37 pm Reply
Lucy3521 August 12, 2025 - 6:19 am Reply
Elena3191 August 12, 2025 - 6:27 am Reply
Josh4942 August 20, 2025 - 12:34 am Reply
Alex2957 September 6, 2025 - 10:28 am Reply
Pearl818 September 12, 2025 - 12:14 pm Reply

Leave a Reply to Elena3191 Cancel Reply