పురుళ్లు వోసుకున్న జాగ
పుట్టుకూసాలు తొడుక్కున్న తలం
బొడ్డుపేగులు తెగిపడ్డ పురిటిగడ్డ
మాయి ముంతలు పాతిపెట్టిన పొలిగుంటలు
కూరాడు నీరాడులను నిలుపుకొన్న నిట్టాడు
బువ్వ కుండలను పొందిచ్చుకున్న సుట్టకుదుర్ల తోడు
సరప్పట్టెలకు ఉయ్యాలలోలే యాళ్లాడే ఉట్లు
ఉగ్గాలు ఊగులాడవడ్డ పాలు పెరుగు బుడ్లు
ఒత్తుకుండ పొయ్యి వొంపిన ఉడుకు నీళ్లు
పాలగోకును పంచిన దాలిల కాగిన పాలు
గడుకతిని గంజినీళ్ళు తాగిన తావు
నిండు జీవునాలను నిలిపిన రేవు
తలపెయ్యికి వొయ్యందే అడుగు తర్రవెట్టని దేవునర్ర
సామాన్లను వొచ్చోరకు వెట్టిన సాయమానర్ర
ఇసిరెలు పసిరెలను యిగురంగ మోసిన చిటుకు
కాయితపు కత్పలను కడుపుల దాచుకున్న తనాబ్బీ
ఇల్లు పొడుగూత ముగ్గులు మొల్సిన అరుగు
కుదురుగ కుదిరిచ్చిన కుమ్మరిగూన కప్పుటిల్లు
ముంగట నీడకు నిలవడ్డ గడ్డి గుడిసె
జమిలి సూరు దారలను మోసే రేకుల దోని
పదిమంది పండిబొర్రేంత ఎల్లుడంగ పెద్దర్వాజ
ఇరుగుపొరుగును మందలిచ్చు యింటెనుక పనుగడ
ఎర్రలుకు పూసి లప్పతొక్కిన మట్టి గోడల పడారి
జాజు పూతల్ల సున్నపు తీనెల వన్నెసిన్నెలు
చీమలకు శెక్కర వోసిన పున్నెవంతుడు
మా తాత చెట్మడిపి నిలవెట్టిన పాయిరంగల్ల యిల్లు
పాములకు సుతా పాలువోసిన బోళ్లకోరిది
మా అవ్వవ్వ బోనం కుండోలే పుదిచ్చిన గూనపెంకిల్లు
ఆయిటి పూనిన వాసనకు
ఓటికోటీ పోటీవడ్డట్టూ యిగిలిచ్చిన
సూరు కింద సోల్పుగ యేనుకొని యెదిగిన
ఉద్దరాసి గోరంట చాబంతి మొల్కల సాళ్ల సొగసు
కసువూడ్చి కల్లాపిసల్ల యాస్టకుదెచ్చే వాకిలి
నవ్వులపువ్వులతో ముర్సిన ఆటల లోగిలి
వాయిలి పొర్క తడ్కలను తొడుక్కున్న జీవాలదొడ్డి
కంకబద్దల ద్యాగర కమ్ముకున్న గొర్రెబొక్కులు
కొట్టంల కొలువైన యెడ్లూబర్ల అరుపులు
గంపలు బోర్లేసిన పిల్లల కోళ్ల పిలుపులు
ఇంటెనుక పబ్బులకు అల్లుక పారిన పచ్చదనం
బీర కాకర చిక్కుడు తీగెల ల్యాతాకుల పరువం
శాదబాయిల యెగిరే పిట్టల ఒయ్యారం
సితపతాల్లంకెళ్లే శాతాడు బొక్కెనల సోయగం
పెయ్యిల మైలలూడదీసే గదిల తానాలు
నిండు శూలాలోలే నిగనిగలాడే నీళ్లకుండలు
పాకురునుగీకి పడుకున్నట్టు గోలెంల కశికలు
కడుపుల తలవెట్టి కాళ్లకు నీళ్లిచ్చే అంపులు
కడుగులంట్లతో నిండిన కుడిది గోలెపుకడుపు
సట్టంబెట్టి మెత్తేసిన వడ్లు దినుసుల గుమ్ములు
పటువ బొత్తల బూడిదతో ఇత్తునంగట్టిన ఇగురం
అటుకు నిండార్గ మెలిగిన పొయ్యిలకట్టెల మండెలు
కుండ మీద కుండలు కూసున్న దొంతుల వర్సలు
సిక్కుడుకు చెక్కిన సువరాకలూ జాబులు
గొంగళ్లను పర్సుకొన్న నులుక మంచాలు
సుక్కలతో ముచ్చట వెట్టించిన గడెంచలు
శాత్రాలూ సంబురాలు కతలూ యెతలు
సుట్టాలూ పక్కాల కట్టనిట్టూరాల కలబోతలు
అచ్చేగాళ్లు బిచ్చగాళ్ల దీవెనార్తులు
ఏగిలేత్తే సేనుశెల్కల్ల మెదిలిన పనిమంతులు
మన్ను బుక్కి మన్ను కక్కిన మట్టిమనుషులు
తాతమ్మల బొక్కలు బొత్తిగ తెల్లవడంగ
మట్టి బొమ్మల మీద మన్సువడంగ
కట్టిన యిల్లూ పెట్టిన పొయ్యీ
ఇయ్యాల వచ్చెలువచ్చెలుగ యిచ్చకపోవచ్చు!
ఆ ఆత్మగల్ల దంట పేరైతే మాసిపోలేదు
గాల్ల సత్తువగల్ల యిత్తునం
కొడుకులూ కొమ్మలూ బిడ్డలూ బాందవులు
చెట్టంత నిండు బలగమయ్యింది
శెల్కంత పసిరిక సేనయ్యింది
గా పాయిరంగల్ల గూనపెంకల యిల్లు
కన్ను మలుగంగనే కలల కనవడుతంది
క్యాలికి రాంగనే కండ్లల్ల మెరుస్తంది.