ప్రమీల కథావాహిని యధార్థమైన కథ
అర్థరాత్రి దాటుతున్న సమయం.
డోరుమీద లాఠీ దెబ్బలు…. నేను అప్పటికే గాఢ నిద్రలో ఉన్నాను. నా అర్థాంగి ప్రమీల అకస్మాత్తుగా లేచి డోరు తీసిఁది. కళ్ళముందు ఎర్రటోపీలు. ఎందుకొచ్చారని ప్రశ్నించింది ధైర్యంగా. అందుకు వారి సమాధానం భయం కలిగించేదిగా కాక వినయపూర్వకంగా వెలువడడం విశేషం. బహుశా ప్రమీల ఆకారాన్ని చూసి నమ్రతను ప్రదర్శించారని చెప్పవచ్చును.
“ఓయూలో రైడింగ్ జరుగుతోంది. హాస్టళ్ళలో నాన్ బోర్డర్లు ఎక్కువయ్యారు. మా నుంచి తప్పించుకుని ఒక బోర్డరు మీ ఇంట్లోకి ప్రవేశించినట్టు అనుమానం. అతడు ఒకవేళ ఇంట్లో ప్రవేశిస్తే మాకు అప్పజెప్పండి.”
“అబ్బే… ఏ విద్యార్థీ మా ఇంట్లోకి రాలేదు. మీరు వెళ్ళొచ్చు!” తలుపులు మూసి గదిలోకి వచ్చి నా పక్కన చేరింది. ఏదో అలికిడి అయి నేను నిద్రలేచాను. తన నోటి నుంచి “ఏమండి! మీకు తెలుసా?” అని ఏదో చెప్పబోయింది. భయంతో లేచి కూర్చున్నాను. ఆమె పాఠం బట్టీ పట్టిన పిల్లవాడిలా విషయాన్ని అప్పజెప్పింది.
మీరు ఈటూ (E2) హాస్టల్ కు వార్డెన్ గా ఉన్నారు కదా…. దానిమీద ఈ రోజు రైడింగ్ జరిగింది. నాన్ బోర్డర్లు తప్పించుకుని చెల్లా చెదురయ్యారు. పోలీసులు మాత్రం వెంటాడి కొందరిని పట్టుకున్నారు. అందులో విష్ణు అనే అబ్బాయి వాళ్ళ నుండి తప్పించుకున్నాడు.”
“అవును… నల్లగా, పొట్టిగా, అమ్మవారి మాన్చలతో చూడడానికి వికారంగా ఉండే విద్యార్థి విష్ణమూర్తి. అతడు ఏదో ప్రయివేటు కాలేజీలో ఎంబీఏ చేస్తున్నాడు. నగరంలో ఎక్కడా వసతి లేకపోవడంవల్లా, పేదరికంవలా్ల చాలామంది విద్యార్థుల్లాగే ఈటూ హాస్టల్ లోని ఒక గదిలో నాన్ బోర్డర్ గా ఉన్న విషయం నాకప్పటికి గుర్తుకు వచ్చింది.
“ఆ విష్ణమూర్తి ఇక్కడికి వచ్చాడా?”
“అవును…! అతడిప్పుడు మిద్దెమీద పడుకున్నాడు. అసలేం జరిగిందో వినండి. పోలీసులు రావడానికి ఒక అరగంట ముందు ఒక అబ్బాయి తలుపు తట్టాడు. మీ పేరు చెప్పాడు. పోలీసులు తరుముతున్నారని, ఇంట్లోకి రానివ్వండని కన్నీటి పర్యంతమయ్యాడు. వెంటనే నేను తలుపు తీసి గడియ వేశాను. “ఏమైనా తిన్నావా” అని అడిగాను. తిన్లేదన్నాడు. కొద్దిగా అన్నం ఉంటే పెట్టాను. చల్లతో భోజనం ముగించాడు. వెళ్ళిపోతావా అని అడిగాను. అమ్మా… చాప ఇస్తే మిద్దెమీద పడుకుంటానన్నాడు. ఇది నేను పోలీసులు రావడానికి ముందు చేసిన పని అని వివరించింది.
నా అర్థాంగి ధైర్యానికి నేనెంతో మురిసిపోయాను.
ఫలశ్రుతి: ఇప్పుడా విష్ణమూర్తి సెంట్రల్ గవర్నమెంటులో పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు. ఇది జరిగి ఇరవయ్యేళ్ళు కావస్తోంది. ఇప్పటికీ విష్ణమూర్తి ప్రతీ పండగకీ ఫోన్ చేస్తాడు. “అమ్మ బాగుందా” అని అడుగుతాడు. ఇరవయ్యేళ్ళుగా నా ఆరోగ్యాన్ని, ప్రమీల ఆరోగ్యాన్ని తెలుసుకుంటూ ఉంటాడు. మొన్న మే లో కూడా అతడు ఫోన్ చేసి అమ్మ బాగుందా అని అడిగాడు. అతని ఫోన్ కాల్ కు ముందే ప్రమీల పరలోకానికి చేరింది. విష్ణమూర్తి మరొక మాట మాట్లాడలేదు. మర్నాడు నా ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడో పంజాబ్ లో పనిచేస్తున్నవాడు ప్రమీల మరణవార్తను విని జీర్ణించుకోలేకపోయాడు. ఉన్నపాటున రైలెక్కి, మా ఇంటికి వచ్చాడు. అతనికి ఇంట్లో గోడమీద వేలాడుతున్న ప్రమీల ఫోటో నవ్వుతూ కనిపించింది. కానీ అతడు మాత్రం దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు.